శ్రీ వెంపటి నాగభూషణం -3
ముద్దు పళని భరతాభినయం లో ప్రావీణ్యం సంపాదించుకొన్నది కులమర్యాద క్రమాన .వయసు కాడైన వైష్ణవ దేశికుడు ,తపః ఫల సారుడు వీర రాఘవుడు సాహిత్య నేపధ్యం శృంగారి౦చాడు .ఇక మహారాజు మనసు నచ్చటానికి కొదవేముంది ?రంగాజీ లాగా శాస్త్ర కాకలు దీరిన పాండిత్య ధీరకాదు ముద్దు .గొప్ప చక్కదనం ,అందుకువన్నే తెచ్చే భరతాభినయం ,వీటికి దీటైన సరస సాహిత్యం .అన్నిటికీ మించి మహారాజ భోగానుభవ యోగం .
శ్రీకృష్ణునికి సాన్త్వనోపాయాలు ,పదాఘాత బహూకృతులు వి౦తలుకావు .తిమ్మన్న ప్రసిద్ధ ఉత్పాద్య వస్తువులే .రాయలవారు కూడా గీర్వాణిలో ముఖరించారు .ప్రీణన కావ్యాలు ముద్దుపళని నాటికి కొత్తవికావు .ఆ కథా కలాపమంతా సత్యమీదనే నడిచింది .రాధికా సాంత్వనము ముద్దు రచించే సమయాన వీర రాఘవ దేశికుడు సలహా ఇచ్చి ,అపుడపుడు సహాయ పడి ఉండవచ్చు .కానీ అతడి పాండిత్యానికి ప్రతిభకు ఇందులో పెద్దగా పని తగలలేదు .రావిపాటి తిప్పన్న సంస్కృత ‘’ప్రేమాభి రామం ‘’వల్లభ రాయుడు అనుసరించినట్లు ,ముద్దుపళని కావ్యానికి ఎవరివో వొరవడులు ఉండవచ్చు.
కృష్ణుని యశోదా నందులు గారాబంగా పెంచుకొంటున్నారు వ్రేపల్లెలో . నందుని చెల్లెలు రాధ .పెంపక మూలనలో మరులు రేకెత్తి౦చి ,గోప సతులకేల్లా కుసుమ శరుడైన రాజగోపాల మూర్తి ని వశం చేసుకొని హరికి ప్రాణప్రియయై స్వైర విహారం చేస్తోంది .యశోద తోడబుట్టిన వాడు కుంభుడు .అతని కూతురు ఇళ ను కృష్ణునికిచ్చి పెళ్ళి చేశారు .పిల్ల మేనత్త వద్ద చనువుతో వ్రేపల్లెలోనే ఉంటోంది .ఆమె పోషణ కూడా రాధదే .
ఈడేరిన తర్వాత ఇళకు మాధవునికి ఔపోసన కార్యం జరిగింది .రాధ శుశ్రూష తొ గడదేరిన ఇళ పసిబాల అయినా ,ప్రౌఢమర్యాదలచవులెరిగినమాధవుడిని అనురక్తం చేసుకొన్నది .కొన్నాళ్ళకు రాధతో కృష్ణుడు అత్తారింటికి వెడతాడు .మొదట్లో రాధ ఇళ తొ కృష్ణుడు దా౦పత్య౦ చేస్తున్న శృంగార భావనే ,తర్వాత సవతి మత్సరమై సహించలేక పోయింది ఇళ పై ఎంత ప్రేమ ఉన్నకానీ .అతడు కంటికి కూడా దూరమైతే ఆమె వేదన వర్ణించ తరమా ?విప్రలంభం భరించలేక చిలుక రాయబారం పంపింది .అది మిధిలకు వెళ్ళి ,అక్కడి విలాసాలన్నీ అతిశయంగా వర్ణించే సరికి రాధ తూలిపోయింది .
కృష్ణుడు కూడా రాధా విరహం భరించలేక తిరిగి వస్తాడు .అతడిని చూడగానే ఉక్రోషం తొ తాచుపామై లేస్తుంది .ఇష్టం వచ్చినట్లు మాటలు అంటుంది .క్షమించమని పాదాలపై పడితే తన్నేసి వలవలా ఏడ్చేసి చివరికిఅతడి కౌగిలిలోఆకులో పిందే లాగా గువ్వ పిట్టవుతుంది ,పరవశించిపోతుంది .కథ కంచికి చేరుతుంది .
ప్రబంధం నాలుగు ఆశ్వాసాలు పెరగటం కోసం ముద్దుపళని రాధ చేత చంద్రోపాలంబనం మొదలైనవి చేయిస్తుంది వీటిలో ప్రత్యెక కల్పనా చమత్కారాలేవీ లేవు .కానీ రాధను చిత్రించటంలో శిల్ప సౌభాగ్యం అంతా వినియోగించింది .రాధ నందునికన్నా చాలా చిన్నదే .గేహేగేహే జంగమా హేమవల్లులు మెరసిపోయిన వ్రేపల్లె వాడలోనే ఆమెను మించిన అందాలరాశులు లేనందున గోప కిశోరునికి రాధ అన౦గ సర్వ స్వరూపం అయిపొయింది .వివాహిత కానీ మోట .గొల్లమగనితో కాపురం చేయకపోవటం నందాదులు హర్షించి ఊరుకొన్నారు. అంటే ,లోక దృష్టిలో కలంకమే అయినా ,అది వారి రసజ్ఞతను రెట్టిస్తూ ,లోకైక శృంగార వీర శేఖరుడైన కృష్ణుని పెంపుడు కులంగా ఉండదగిన తాహతకు ప్రతిపత్తి కల్పిస్తూ ఉంది.
అంటారు శ్రీ వెంపటి నాగభూషణం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-23-ఉయ్యూరు

