శ్రీ వెంపటి నాగభూషణం -4(చివరి భాగం )
కృష్ణుడు రాధకు సర్వస్వం .కృష్ణుని చిన్న భార్యకనుక ఇళను సర్వస్వంగా పెంచి తగిన ఇల్లాలుగా చేసింది తన అనుభవమంతా వినియోగించి .శృంగారించి గదిలోకి పంపింది .ఇక అక్కడనుంచి ఆమె ప్రవృత్తి సాఫుగా మారిపోతుంది .అంతకు ముందు ఇళ తన శిష్యురాలు .నవ్వులాటకు సవతి అనిపరిహాసం చేసినా ,మనసులో బాధపడలేదు వ్యధ ప్రత్యక్షానుభూతి కానందున .పడకటింటి గది తలుపు పడగానే రాధ గుండెల్లో రాయి పడ్డది దంపతులు ఏకాంతాన అనుభవించే సుఖం తలచుకున్నకొద్దీ మతిపోతోంది .తనకు లేదని ఒకమూల చింత ,తనవాడు మరొక దానితో ఇళ యే అయినా తనకు కాని భోగాలు పొందుతున్నాడని అంతకు మించి వేదన .తెల్లవార్లూ ఎలా వేగిందో ?పొద్దు పొడవకముందే ఇక నిల్వ లేక తలుపు తట్టి ,లోపలి చొరబడి ‘’కసి ససి’’గా తీర్చుకొన్నది .
కు౦భకుడు కూతుర్నీ అల్లుడిని తీసుకు పోవటానికి వచ్చినప్పుడు రాధను కూడా సమ్మతి అడిగాడు .అత్తా –అల్లుడి పరిచయం అందరికి తెలిసిందేకదా .కానీ ఆమె ఎలా పంపగలదు ?పంపక తప్పదు .కనకు మనసులోని భావాలు పైకి తొణకకుండా చాలా సరదాగా మాట్లాడి సరే అని ఒప్పుకొన్నది .ఇక తరవాత ఆమె అవస్థ .కృష్ణుడు మిధిల నుంచి బెదురుతూనే వచ్చాడు .విడిచి వెళ్లినందుకు రాధ ఎంతగా దండిస్తుందో అనుకొని .
ఆమె సరసన రాటు దేలినవాడుకనుక ,అనునయించ లేకపోతానా అనుకొని భారోసాలో ఉన్నాడు .అయినా ఏమవుతుందో అన్న భయం వెంటాడింది కన్నయ్యను .క౦ట బడగానే ఎన్ని నిష్టూరాలడింది ?ఎన్ని రకాల దెప్పి పొడిచింది ?ఎంతకోపం తెచ్చుకొని బుసకోట్టింది ?అయినా లయతప్పకుండా మూర్చనలో తొట్రుపాటు గమకించే గొప్ప గాయకుడిగీతాలాపన లాగా,వెల్లివిరిసిన అనురాగం ,ఆపేక్ష అంతర్వాహినిగా ద్యోతకమౌతున్న నాధుని అలయించి అనునయించటం కులపాలికల సామాన్య శృంగార ధర్మమే అయినా ,ఇన్నిపోకడలు ఎత్తులు వాళ్లకు చేతనౌతాయా ?తులనానుభావ యోగ్యతా ఉన్న సరస నాయికకు తప్ప .మరొకరైతే కథా రసపోషణం ఇంట ప్రౌఢిమ తొ చేయ నేర్పు గలవారయ్యేవారా ?
ముద్దుపళని వారా౦గన అని ఆమెను కృత్రిమ౦గా ఈర్షి౦ఛ వచ్చు , కానీ ముద్దుపళని మహారాజ రసిక సమ్మానిత కాకపోయినట్లయితే తెలుగులో రాధికా సాంత్వనం వెలువడి ఉండేది కాదు .శృంగార వర్ణనం గర్హ్యమనే వైదికులకు జవాబు అనవసరము .అనభిజ్ఞు లకు విద్యాదానం చేయటం వ్యర్ధం .హేయ జుగుప్సా కలుషితం కాని శృంగార స్థాయి లేనిది ప్రకృతి స్థితికే మోసం .
రాదికాసా౦త్వనం నిస్సందేహంగా సత్ప్రబంధం .నాయిక లేని బ్రహ్మ చారికూటమి కనుక విశాఖ దత్తుని కృతి అసత్కావ్య ములజాబితాలో చేర్చారు పూర్వ లాక్షణికులు అని వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథసూరి స్వారస్య సిద్ధాంతం.గొప్ప కవిత్వ ధోరణులు లేవు కానీ చదివినకొద్దీ చవులూరి౦చి ,ఆలోచనలలో ముంచి .ఆనంద పారవశ్యం ఆవహింప జేసేరసవత్కావ్య చిత్రం ‘’రాధికా సాంత్వనము ‘’.
రాధ ఎవరు ?చైతన్య సంప్రదాయ వైష్ణవ సిద్ధాంతానికి వివరణకు ,వేదా౦తానికీ యేమికానీ ,నందగోపుడికి రాధ అనే చెల్లెలు ఉందని ,ఆమెకు మేనల్లునితో తగులాటమయ్యిందని మొదట ఎవరు కల్పించారో ? జయదేవుడు మాత్రం నమ్మాడు .సంసారాన్నీ ,చేసుకొన్నమొగుణ్ణీ తోసేసి కృష్ణుని పెన వేసుకొని పోయిన ఈ రాధకు శృంగార సంచారం లో మన గణన ప్రకారం అది భగవద్విషయమైనా వ్యభిచార దోషముంది .మరి ఆకందులోనూ ఏదో స్వారస్యం ఉండటం చేత ఇంతవరకు ప్రపంచమంతా పాకిపోయింది .తెలుగులో రాధామాధవుల శృంగారలీలకు ప్రతిభాసిత ఉపోద్ఘాతం –సరసభావులకు ఏకైక అవలంబన.’’కరివేల్పు శతకం .’’ఎవరి కావ్యాత్మ ఆ రచనలో పునీతమైందో నిశ్చయించ వీలూ ఆధారం లేవుకానీ ఇంతవరకు రంగాజీ ,ముద్దుపళని పృధక్తయా –ఆ అప్రతిష్టను పంచుకొంటున్నారు .
ఇంకొక రాధ ఉన్నది వృషభాను కూతురు .కన్య,స్వీయ . కృష్ణుని ధర్మపత్ని .రూప గోస్వామి ‘’విదగ్ధ మాధవం ‘’లోనూ ,మధురాదాసు ‘’వృషభానుజ ‘’లోనూ ఈ రాధ వివాహ గాధను రూపక వస్తువుగా తీసుకొన్నారు. పరిణయ పరిణితికి –యోగిని నాయికానాయకులకు రాయబారాలు నడిపింది .అంతేకాని వృషభానుజ రాధ పరకీయ కాదు .ఏది ఎలా ఉన్నా ,మన్మధ మన్మధునికి సరిపోలిన నాయిక రాధ .ఆమె పరకీయ అయినందు వల్లనే దాంపత్య శృంగారం అప్రాకృత ధోరణిలో పల్లవించి ,వివిధ రత్నా లంబన భావ శబలితమైనది .
రాధ ప్రేమ వాహిని .తెలుగు కావ్య కేదార ప్రాంతాలలో పరవళ్ళు సోలించిన ముద్దుపళని ఉత్తమ –ధన్య . అని ముద్దుముద్దు పలుకులతో రాధికా సా౦త్వనానికి మర్యాదా పూర్వక అద్భుత భాష్యం రాసి,తెలుగు రసిక జనుల ను ఆనందాబ్దిలో తెల్చిముంచారు శ్రీ వెంపటి నాగ భూషణం .వీరిని పరిచయం చేసే అదృష్టం నాకు కలిగింది .వారి సంతకం ఈ క్రింద ఉంది చూడండి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-8-23-ఉయ్యూరు .

