బాలికలకు సంగీతవిద్యాలయం స్థాపించి ,సంగీత కచేరీల ప్రవేశానికి మొట్ట మొదటిసారిగా టికెట్ప్రవేశపెట్టిన కిరాణా ఘరానా సామ్రాజ్ఞి ,’’తార్సా గానానికి హాల్ మార్క్’’ ,పద్మభూషణ్ –హీరాబాయ్ బరోడేకర్
బాలికలకు సంగీత విద్యాలయం స్థాపించి ,సంగీత కచేరీల ప్రవేశానికి మొట్ట మొదటిసారిగా టికెట్ ప్రవేశపెట్టిన కిరాణా ఘరానా సామ్రాజ్ఞి ,’’తార్సా గానానికి హాల్ మార్క్’’ ,పద్మ భూషణ్ –హీరాబాయ్ బరోడేకర్
కిరాణా ఘరానా మహావిద్వాంసుడు ఉస్తాద్ కరీం ఖాన్ ,తారాబాయ్ మానె దంపతులకు హీరాబాయ్ కుమార్తె .ఈమెతల్లి తారాబాయ్ బరోడా రాజమాత .19 వ శతాబ్దంలో చిన్నతనంలో తారాబాయి ఆ ఆస్థాన సంగీత విద్వాంసుడు కరీం ఖాన్ వద్ద సంగీతం నేర్చింది . క్రమంగా వారిద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడి పెళ్ళి దాకా వచ్చింది .ఇది తండ్రి బరోడా మహారాజ్ మారుతీరావు మానె దంపతులు ఇష్టం లేక ఒప్పుకోలేదు ..అప్పుడు వాళ్ళిద్దరూ ,ఖాన్ తమ్ముడు అబ్దుల్ హక్ ఖాన్ పారిపోయి బొంబాయి చేరారు .ఖాన్ తారాబాయ్ దంపతులకు ఇద్దరుకొడుకులు, ముగ్గురు కూతుళ్ళు పుట్టారు .పెద్దకూతురు చిన్నప్పుడు ముద్దుగా’’చంపాకాలి ‘’గా పిలువబడిన హీరాబాయ్ ..అందరూ పెద్దవారై గొప్ప పేరుప్రతిష్టలు పొందారు .వారిపేర్లు సురేష్ బాబు మానె ,కృష్ణారావు మానె ,హీరాబాయ్ బరోడే కర్,కమలాబాయ్ బరోడేకర్ ,సరస్వతి రానే .
హీరాబాయి బరోడేకర్ సంగీతంలో ప్రాధమిక శిక్షణ తన అన్న సురేష్ బాబు మానె వద్ద పొందింది .తర్వాత కిరాణా ఘరానా మహా విద్వాంసుడు ఉస్తాద్ అబ్దుల్ వహిద్ ఖాన్ అంటే తండ్రి కరీంఖాన్ తమ్ముడు వద్ద అభ్యసించింది .1922లో ఆమె తలిదండ్రులు విడిపోవటంతో ఆమె సంగీతం సరిగా కొనసాగలేదు .అప్పుడప్పుడు చెల్లెలు సరస్వతి మానె తోకలిసి కచ్చేరీలు చేసేది .
15 ఏళ్ళ వయసులో హీరాబాయ్ కేసర్బాయ్ కేర్కర్ ప్రోత్సాహంతో మొట్టమొదటి సంగీత కచేరి స్వయంగా చేసింది .ఖయాల్ తుమ్రి ,మరాటీ నాట్య సంగీత్ ,భజన్ లలో గొప్ప ప్రావీణ్యం సాధించింది .హిందూస్తాని శాస్త్రీయ సంగీతాన్ని సామాన్య జనులమధ్య గొప్పగా వ్యాపి౦పజేసిన కీర్తి ఆమెదే .మహిళా సంగీత విద్వాంసులకు హీరాబాయ్ మార్గదర్శి .భారతదేశం లో సంగీతకచేరీలకు డబ్బు పెట్టి టికెట్ కొని చూసే కొత్త విధానాన్ని మొట్టమొదట ప్రవేశ పెట్టి,రికార్డ్ సృష్టించింది హీరాబాయ్ .ఆమె ‘’తార్సా ‘’గానం చేసే విధానం పరమాద్భుతమని సంగీత విశ్లేషకులు అభినుతించారు .అది ఆమె ‘’హాల్ మార్క్ ‘’అంటారు .కిరాణా ఘరానాకు చాలా ప్రత్యేకం, ప్రాచుర్యం కల్పించింది .
హీరాబాయ్ ‘’సువర్ణ మందిర్ ,‘’ప్రతిభ ,మునిసిపాలిటి ,జానాబాయ్ ,వంటి సినిమాలలో కూడా నటించి,పాడి మెప్పించింది .’’నూతన్ సంగీత విద్యాలయ ‘’పేరిట ఒక సంగీత విద్యాలయం బాలికలకోసం ప్రత్యేకంగా నెలకొల్పి౦ది. ఆ స్కూల్ చాలా నాటక ప్రదర్శనలు నిర్వహించింది . రికార్డింగ్ ఆర్టిస్ట్ గా కూడా ప్రఖ్యాతమైనది హీరా .78 ఆర్ .పి .ఎం .రికార్డింగ్’’ లు ఇచ్చిన ఘనత ఆమెది .వీటిని ‘’క్లాసికల్ గోల్డ్ సిరీస్ ‘’అంటారు .
హీరాబాయ్ సంగీత ప్రతిభను గుర్తించి 1965లో సంగీత నాటక అకాడెమి పురస్కారం అందించింది .భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం 1970లో అందించి గౌరవించింది .నాటకరంగ సేవకు ‘’విష్ణుదాస్ అవార్డ్ ‘’పొందింది .1947 ఆగస్ట్ 15 మొదటి భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు హీరాబాయ్ కి ఎర్రకోట నుండి ‘’వందే మాతర౦ ’’గీతం గానం చేసే అరుదైన అదృష్టం లభించింది .1953లో భారత దేశ ప్రతినిధి బృందంతో చైనా ,తూర్పు ఆఫ్రికా దేశాల పర్యటనలో పాల్గొన్నది .నైటింగేల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సరోజినీ నాయుడు హీరాబాయ్ కి ‘’గానకోకిల ‘’బిరుదు ప్రదానం చేసింది .ఆమె శిష్యురాలు శ్రీమతి ప్రభా ఆత్రే 1992 నుంచి ప్రతిసంవత్సరం బొంబాయిలో ‘’సురేష్ బాబు –హీరాబాయ్ ‘’స్మృతి సంగీత సమారొహ్’’ నిర్వహిస్తున్నారు .భారత దీశం లో అత్యంత ముఖ్యమైన సంగీతకార్యక్రమాలలో ఇదొకటిగా గుర్తింపు పొందింది .
హీరాబాయ్ ‘’మాణిక్ రావు గాంధీ బరోడేకర్’’ ను వివాహం చేసుకొన్నది .ఈ దంపతుల మనవడు నిశికాంత్ బరోడేకర్ ప్రముఖ తబలా విద్వాంసుడు ,తబలా మాష్ట్రో జకీర్ హుసేన్ శిష్యుడు .84 వ నాల్గవ ఏట సంగీత సరస్వతి హీరాబాయ్ బరోడేకర్ 20-11-1989 న బొంబాయి లో మరణించి, సరస్వతీ సామ్రాజ్యం చేరింది .
హీరాబాయ్ సంగీతాన్ని మెచ్చి, ‘’నా స్మృతి పధం లో ‘’చేర్చిన శ్రీ ఆచంట జానకి రాం కు కృతజ్ఞతలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-23-ఉయ్యూరు

