జాతిపిత వెలిగించిన సేవా జ్యోతితో హరిజన ,మహిళా సేవ చేసిన జాతీయోద్యమ నాయకురాలు,ఎనిమది నెలల గర్భం తో జైలుకెళ్ళిన –శ్రీమతి కాశీ భట్ల వెంకట రమణమ్మ
పశ్చిమ గోదావరి జిల్లా బోడపాడు అగ్రహారం లో శ్రీ చీమలకొండ సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి అన్నపూర్ణమ్మ దంపతులకు వెంకట రమణమ్మ 15-3-1911న మూడవ కుమార్తెగా పుట్టింది .పుట్టిన చోటనే ఎలి మెంటరిస్కూల్ లో,గణపవరం ప్రాచీన పాఠశాలలో రెండేళ్లు మాత్రమె చదివింది .1923 లో పన్నెండవ ఏట ఆమె వివాహం తూగోజి రాజమండ్రి కి చెందిన డాక్టర్ కాశీభట్ల లక్ష్మీ నరసింహా రావు తో జరిగింది .డాక్టర్ గారు చదువుకొనే రోజుల్లోనే జాతీయోద్యమం లో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన దేశ భక్తుడు . తర్వాత వైద్యునిగా ,రాజమండ్రి మునిసిపల్ కౌన్సిలర్ గా ,రాజ్య సభ సభ్యునిగా సేవలందించారు .వీరింటికి రాజమండ్రి లో గోదావరి తీరాన గౌతమీఆశ్రమం నెలకొల్పిన శ్రీ బ్రహ్మాజోశ్యు సుబ్రహ్మణ్యం ,భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య ,మహర్షి బులుసు సాంబమూర్తి వంటి అగ్రశ్రేణి నాయకులు వచ్చి రాజకీయ సమావేశాలు చర్చలు జరుపుతూ ఉండేవారు .విదేశీ వస్తు బహిష్కరణ ,హరిజన వాడలలో ప్రచారం ,హరిజన సేవ ,పికెటింగ్ లు ,మొదలైన ప్రణాలికలు వీరింటిలోనే రూపు దాల్చేవి .వీటిని స్త్రీలు చేబట్టితే మంచి ఫలితాలోస్తాయని 1930లో’’ దేశ బాంధవి’’ దువ్వూరి సుబ్బమ్మగారి నాయకత్వం లో శ్రీమతులు వెంకటరమణమ్మ ,,పెద్దాడ కామేశ్వరమ్మ , చల్లపల్లి సీతాదేవి మొదలైన ముప్ఫై మంది మహిళామణులు జాతీయోద్యమం లో అక్కడ మొదటి సారిగా ప్రవేశించారు .
ఆ కాలం లో పోలీసు జులుం విపరీతంగా ఉండేది .జాతీయోద్యమాలను అతి కఠినమైన చర్యలతో అణచి వేసే ప్రయత్నం చేసేవారు .అయినా ఈ బృందం ధైర్యం కోల్పోక ముందుకు సాగి ఉప్పు సత్యాగ్రహం చేశారు .వెంకటరమణమ్మ గారు కల్లు,సారా,విదేశీ వస్త్ర దుకాణాలవద్ద సత్యాగ్రహం చేసేవారు .అన్ని రకాలా శాసన ధిక్కారమూ చేశారు .పట్టు వదలక ఎనిమిది నెలలు ఇలా కార్యక్రమాలను చేసి ప్రభుత్వాన్ని చీకాకు పెట్టారు .ప్రభుత్వం ఇక గట్టిగా ఆపాలని నిర్ణయించి ఒకరోజు విదేశీ వస్త్ర దుకాణాల వద్ద సత్యాగ్రాహం చేస్తున్న వెంకటరమణమ్మ ,శివరాజు సుబ్బ లక్ష్మ ,ప్రసిద్ధ దేశభక్తుడు శ్రీ మద్దూరి అన్నపూర్నయ్యగారి భార్య రమణమ్మ గార్లను 1931జనవరి 26 న అరెస్ట్ చేసి ,ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఉంచి ,మర్నాడు జిల్లా కోర్టు లో విచారణ జరిపి ఆరునెలలు జైలు శిక్ష వేశారు .శ్రీమతి కాశీభొట్ల వెంకటరమణమ్మ గారు ఎనిమిది నెలల గర్భవతి కనుక ఆరువారాలు మాత్రమె శిక్ష వేసి రామచంద్రాపురం సబ్ జైలు కు పంపారు .అందరి తోపాటుకాకుండా తనకు తక్కువ శిక్ష పడటం ఆమెకు అవమానంగా,అన్యాయంగా తోచి అధికారులను నిలదీసింది . ఆమె గర్భావతికావటమే కారణం అని వారు చెప్పగా శాంతించింది .అదీ ఆమె దేశభక్తి .తక్కువ శిక్ష పడిందనే దిగులుతోనే మిగిలిన వారికి వీడ్కోలు చెప్పి రామ చంద్రాపురం సబ్ జైలుకు వెళ్ళింది .
తర్వాత ఆమె గాంధీ చెప్పిన నిర్మాణాత్మక కార్యక్రమాలో పాల్గొన్నది .1936లో 25 రాట్నాలతో నూలు వడికించటం నేర్పించింది. యాభై మంది స్త్రీలకు నూలు వదకటం లో పోటీలు పెట్టి బహుమతులిచ్చి ప్రోత్సహించింది .స్త్రీలకుఉచితంగా హిందీ నేర్పింది .1936లో 30మంది హరిజన విద్యార్దినులకోసం హాస్టల్ ఏర్పాటు చేసి వారి విద్యాభి వృద్ధికి దోహదం చేసింది .ఇవన్నీ తమ ఇంట్లోనే స్వంత ఖర్చుతో తమవారి సహాయ సహకారాలతో నిర్వహించటం విశేషం. బీహార్ భూకంపబాదితుల సహాయం కోసం ‘’సోదరసమిటి ‘’ఏర్పాటు చేసి తానె నాయకత్వం వహించి విరాళాలు,వస్తువులు సేకరించిబాధితులకు అంద జేసింది.
1962 చైనాతో యుద్ధం సందర్భంగా భారత సైన్యం సౌకర్యం, రక్షణ కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు విరివిగా సహకరించి దేశభక్తి చాటారు .వెంకటరమణమ్మ మహిళా సంఘాలు ఏర్పరచి వారిద్వారా విరాళాలు సేకరించి ,తానూ స్వయంగా ఉన్ని స్వెట్టర్లు అల్లి ప్రభుత్వానికి పంపి,సాయం అందించింది .
1956 తర్వాత ఆమె రాజమండ్రి పురపాలక సభ్యురాలుగా మూడు సార్లు ,జిల్లా పరిషత్ సభ్యు రాలు గా ఎన్నికై ప్రజా సేవ చేసింది .1930 డిసెంబర్ 26న మహాత్మా గాంధి హరిజన యాత్ర సందర్భంగా రాజమండ్రి ‘వచ్చినప్పుడు వెంకట రమణమ్మ టౌన్ కాంగ్రెస్ సెక్రెటరి గా వెయ్యి రూపాయల విరాళాలు ప్రజలనుంచి సేకరించి హరిజన నిధికి గాంధీకి సమర్పించింది .గాంధీ సరోజినీ నాయుడు మొదలైన వారు సీతానగరంలోని గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం లో విడిది చేశారు.అప్పుడు ఆమె రెండు రోజులు అక్కడే ఉండి మహాత్ముని సన్నిధాన భాగ్యం అనుభవించి పులకించింది .చివరి సారిగా గాంధీ 1946జనవరి 20న హిందీ ప్రచార రజతోత్సవాలకు మద్రాస్ వెడుతూ ఆయన స్పెషల్ ట్రెయిన్ రాజమండ్రి స్టేషన్ లో కాసేపు ఆగింది .వార్త తెలుసుకొన్న వేలాది జనం ఆనందోత్సవాలతో గాంధీని దర్శించి తృప్తి చెందారు .గాంధీ హరిజన నిధికి విరాళాలు కోరగా మహిళలు తమ నగలను సంతోషంగా ఇస్తే ,పురుషులు డబ్బు అందించారు .వీటిని సేకరించిన వెంకటరమణమ్మ గాంధీ ఉన్న కంపార్ట్ మెంట్ లోకి వెళ్ళి ఆయనకు సభక్తికంగా సమర్పించింది .ఆయన ఆమెను నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తున్నావా అని అడిగితె ఆమె మహిళా హిందీ ,ఖాది శిక్షణా శిబిరాలు ,హరిజన హాస్టల్ విషయాలు చెప్పగా బోసి నోటాయన నవ్వి సంతృప్తి చెంది ఆమె తల నిమిరి ,కార్యక్రమాలు విజయవంతంగా చేయండి అని ఆశీర్వదించాడు .
కాశీభట్ల రమణమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమారులు జన్మించారు.ఆమె ఎప్పుడు మరణి౦ చిందో తెలియలేదు .
రేపు 76వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ వ్యాసం భారత స్వాతంత్రోద్యమ మహిళలకు అంకితం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-23-ఉయ్యూరు

