![]() ![]() | |||
![]() | |||
శ్రీ భగీరధీ శతకం
శ్రీ కొవ్వలి వెంకట సూర్య నారాయణ గారు రచించిన ‘’శ్రీ భగీరధీ శతకం ‘’లో’’ మంచి శైలి ఉంది,స్వానుభవ పద్యాలున్నాయి .కవిత్వ ప్రవాహం భాగీరధీ ప్రవాహమే .భక్తిలో నీతి ,రక్తి ముక్తి రంగరించి రాసిన శతకం .కవికున్న సంగీతరసానుభావమూ వ్యక్తమౌతుంది ‘’అంటూ పీఠిక లో పిఠాపురం కొత్తపల్లికి చెందినసంగీత సాహిత్య విద్వాన్ శ్రీ సత్యవోలు రాధామాధవరావు15-8-1932 చెప్పారు.కనుక ఈ శతకం 1932లో ప్రచురణ పొందింది .మిగిలిన విషయాలేమీ లేవు .సీసము ,తేటగీతి కందం లలో శతకముద్రణకు సాయం చేసిన శ్రీ అప్పల నరసింహ శ్రేష్టి గారి గురించి వారి వంశం గురించి వివరించారు .గీతా వలి లో శ్రేష్టిగారు కవిచే శతకం చదివి వినిపించుకోని ,సంతోషంతో ముద్రించారు .కవిగారి తండ్రిపేరు కొవ్వలి వెంకటరత్నం మంత్రి .తర్వాత శతక నిర్మాణానికి కారణాలు చెప్పారుకవి పద్యాలలోనే .స్వప్నంలో భగీరధి కన్పించి౦ది .మేలుకొని ఆమెకు ఆనందం కలిగేట్లు ఈ శతకం రాశారు .చంపక ఉత్పల మాలా శతకం ఇది .’’భగీరధీ ‘’అనేది శతక మకుటం .
మొదటి చంపకం లో –‘’సిరి నవలావిలోలుడు కృశించి నుతించిన యేన్గుగాచెనీ-ధరణిని రాయియైన ముని తల్లజుపత్ని నహల్య బ్రోచె,దు-ర్భరమగు మానహీనతను బాపి సురక్షిత జేసే ద్రౌపదిన్ –బరమ దయాళు నా భువన వంద్యు దలంతు హరిన్ భగీరధీ ‘’ .అని శ్రీరాముని స్తుతించి తర్వాత గణేశ ,సరస్వతి నిస్తుతించారు. తర్వాత సుద్దులు బోధించారు .ఆపిమ్మట భక్తి గరిమను వివరించారు .జ్ఞానం గురించి చెబుతూ ‘’కలిగినవాడు మైమరచి కామ సుఖాబ్ధి మునింగి తేలియ –క్కలి మి హుళక్కి యైన తరి గాలుల జాచు విధమ్ముగా మహీ –స్థలి కుజనుండు జీవుడనిశమ్ముహృదంతర ముండినప్డువి-హ్వలత విమోహ మగ్నుడయి ,యారడి చేసి చెడున్ భగీరధీ ‘’ .
వైరాగ్యం బోధిస్తూ –‘’ఎండలో నడిచిన వాడు మృగ తృష్ణ ను చూసిమోసపోయినట్లు స్త్రీ మోహంలో పడి చెడిపోతాడు మానవుడు .కోవిడుడైనా ,పుష్పశరుడైనా ,బంగారు ఊయలలో ఊగే సిరిగలవాడైనా ,బలవంతుడైనా చావును అతిక్రమించలేడు.తల్లి గర్భం లోనుంచి ఒక్కడే వస్తాడు చచ్చిపోయేప్పుడు ఒక్కడే వెళ్ళిపోతాడు .మధ్య అంతా తోలుబొమ్మలాట .తర్వాత కర్మ గురించి వివరించారు –‘’చక్కని చుక్క యైన గుణశాలిని కి౦దగు భర్త రాడుపెం-పెక్కిన వంశజు౦డును రతీశు డనన్ దగు వన్నె కానికి –దక్కదు భార్య ,భాగ్యుని నిధానము చేరును,పేదవానికిన్ –బెక్కురు పిల్లలుదురుఅవివేక పు సృష్టిగదే’’అన్నారు .ఇతర విషయాలు చాలా వివరించారు .తియ్యగాలేని నీరు కళ తేల్పనికూటమి ,మంచిమాట రాని నోరు,మంచి ఇల్లాలు లేనిఇల్లు ,జబ్బు తగ్గించని మందు ,లక్ష్య౦ లేని జపం ,బాగా పండని దానిమ్మ పండు వృధా .
తర్వాత నవ ఖండయోగం ,ప్రాణాయామం ,లంబికా యోగం లను వివరించి .తపస్సులో దివ్య దృష్టి ,యుగధర్మం ,జీవుని రాకపోకలు ,శివ దర్శనం మనోబలం వాక్పటుత్వం ,విద్యలలో నేర్పు సాధించినవాడే తాపసి .శా౦తం ,డాంతం లతో ఉన్న వాడు రాజర్షి .పదార్ధజ్ఞానమూ చెప్పారు .జన్మ సార్ధకం చేసుకోమని హితవుపల్కారు .ఆశ నిరాశనం కావాలి .బిడియాన్ని పోగొట్టి ,యే చత్తనైనా తినిపించి ,ఏదీ తోచనియ్యకుండా ,నిద్ర లేకుండా ,యదార్ధం చెప్పనీయకుండా చేస్తుంది దారిద్ర్యం .తర్వాత మత్సరాత్ములు ,చెలిమి చెప్పి తారకమంత్ర రహస్యం బోధించారు .మత్తేభ భామాలికా రాశారు .చివరికి సీసం లో –తమది కాశ్యప గోత్రమని ,కొవ్వలి వారి బిడ్డ అని ,వెంకటరత్న మంత్రి ,బాపమాంబ దంపతుల కు అనుంగు సుతుడనని.తనపేరు వెంకటసూర్యనారాయణ అని చెప్పి శతకం ముగించారు కవి .
ఏ పద్యం తీసుకొన్నా చక్కని కవితాధార గా రచించారు .ఏది బోధించినా అరటిపండు వొలిచి చేతికి అందించినట్లు వివరించారు .సుద్దులు నేర్పారు .హద్దులు చెప్పారు .లోకనీతిసారం తాగించారు .మహాత్ముల మనసు వివరించారు .అన్నీ భగీరధికి నివేదించి శాంతిపొందారుకవి .ఈ శతకం ,కవి గురించి మనవాళ్ళు ఎక్కడా చెప్పిన దాఖలాలేదు .నాకు పరిచయ భాగ్యం అబ్బింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-23-ఉయ్యూరు


