సత్యవ్రతి శతకం -2వ భాగం (చివరిభాగం )
అతిరాత్ర ,మహారాత్ర క్రతువులు అతి భక్తితో చేస్తే సత్యవ్రతుడు సంతోషిస్తాడు .పరస్త్రీలపై వ్యామోహం లేకుండా ఉండేఅతి ధైర్యవంతుడు ,కపి వీరులను బ్రతికించటానికి సంజీవి తెచ్చిన ఆంజనేయుడు ,సత్యం శాంతి ఉన్నవారు మొహరహితులు,సన్యాసులవలన గీతాసారాన్ని గ్రహించినవాడు ,నిత్యానిత్య వస్తు వివేచనం చేసేవాడు సత్యవ్రతునికి సంతోషం కలిగిస్తాడు ..’’ఋతమును దప్పక యుండిన –అత డెంతయు నాకలోక హర్మ్యాంతర భూ –ర్గతుడై సుఖి౦చును ‘’.దానయోగాభ్యాసాలు సత్యానికి సాటిరావు .’’సత్యవతీ సుతుని –నిగమ సదృశ మహిత సూక్తుల నత్యా-యత సూక్ష్మ దృష్టి నెరిగిన వారు ‘’సత్యవ్రతునికి ప్రీతి కల్గిస్తారు .అంతే వేద వ్యాసుని పురాణ ఉక్తులు గ్రహిస్తే పరమపదం .అతిదేశం అపవాదం అతి నైపుణ్యంతో తెలిసికొంటే ,వాటిని కాలోచిత౦ గా అవలంబిస్తే సత్యవ్రతికి సంతోషం .సత్యం ధర్మజనకం కనుక ధర్మ విరోధం లేకుండా సత్యాన్నే పలకాలి .ప్రతి వస్తువులో అమృతం విషం ఉంటాయి .బుద్ధిబలంతో తెలుసుకొని ప్రవర్తించాలి .వెర్రికుక్కను పెంచితే అది పెంచిన వారినికూడా తెగ కొరికి బాధీంచి నట్లు దుర్జనులను దూరం పెట్టకపోతే మొదటికే మోసం .
ఏకాక్షర కందంగా –‘’ రుత తిత ఊత్తు త్తీతా-తతేతి తాతేత తాత తత్టై తత్తా-తత తుత్తాతతిత్తుత్తిన్’’అంతే పదార్ధ పరిశోధన కలిగిన జ్ఞానం చేత ,ఈశ్వరానుగ్రహంతో సంసార దుఃఖాలను తొలగించుకోవాలి దానికి సత్యమే మూలం .తర్వాత షోడశ దళ పద్మ క౦దం రాశారు-‘’రుతపూత పూతజాతవి-తతోత గీత శ్రుత స్రుతరతఘ్రాత –వ్రతజిత కృత కేతరతన్ ‘’-అంటే –సత్యం చేత పవిత్రంగా పట్టుకొన్న కర్మేంద్రియ,జ్ఞానేన్ద్రియజ్ఞానాల యదార్ధం చేత సంతోషం కలుగుతుంది .96వ కందంలో –మనోహరమైన సంస్కృత ఆంధ్ర భాషాద్వయం చేత ప్రబంధాలలో ఉండే రసాన్ని తెలిసిన శ్రీ ఆనంద గజపతి ప్రభువుకావ్యలి౦గాలంకారంలో ఇచ్చిన సమస్యను తాణు ధ్వనిప్రదానంగా శతకంగా రాశానని కవి చెప్పారు .101వ పద్యం లో –‘’శ్రుత లక్ష్మీ నారాయణ –కృత సత్యవ్రతిశతక సుకృతికా –నంద క్షితి పాలాగ్రణికిన్మది –సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్ ‘’అంటూ టిప్పణితో సహా శతకం ముగించారు కవి . కవిగారి పాండిత్య గరిమ ప్రతి పద్యంలో జ్యోతకమైంది .ఆయనకున్న అపార ఆధ్యాత్మిక జ్ఞానం అచ్చెరువు కలిగిస్తోంది. శబ్దప్రయోగం పరమాద్భుతం .కవితాధార కూడా నాగావళీ ప్రవాహం గా ఉంది.ఛందస్సుపై సాధికారమున్నవారు కవి .ఆనందగజపతి మహారాజు ఇచ్చిన సమస్యను మనకవి శ్రీ భాగవతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు సకాలం లో పూర్తి చేసి అందివ్వక పోవటం ఆయన దురదృష్టం .దాన్ని వెతికి వారి వారు నలభై ఏళ్ళ తర్వాతనైనా ప్రచురించటం మన అదృష్టం. మంచి గొప్ప శతకం మనం చూడగలిగాం .అందరూ అభినందనీయులే .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-23-ఉయ్యూరు

