శ్రీ భవానీ శంకరార్ధాస్టోత్తర శతకం
శ్రీ బాలకవి కూరపాటి వెంకటరత్నం రచించిన శ్రీ భవానీ శంకరార్ధాస్టోత్తర శతకం శ్రీ యార్లగెడ్డ కొండయ్య చౌదరి చేత కాకినాడ పట్టమట్ట వెంకటరంగారావు గారి రంగా అండ్ కొ ముద్రాక్షర శాలలో 1930 లో ముద్రితం . స్వర్గీయ యార్లగెడ్డ మాణిక్యాంబ కు అంకితం .వేళ౦గి కి చెందిన యార్లగెడ్డ కొండయ్య చౌదరి ‘’పీఠిక ‘’లో కవి తనకు బాల్యమిత్రుడని ,తానూ వయో వృద్ధు డనని కవి యువకుడని వారి స్నేహం అందరికీ ఆశ్చర్యంగా ఉండేదని ,కవిగారి కవితా నైపుణ్యమే తమ ఇద్దరినీ కలిపిందని ,తన భార్య కవిగారిని ఈ శతకం రాయమని కోరగా కర్ణ రసోపేయంగా రచించి తెచ్చారని ,తన ధర్మపత్ని అకస్మాత్తుగా మరణించటం చేత ఆమెకు అంకితంగా తాను ఈ శతకం ముద్రణ చేస్తున్నాననీ ‘’చెప్పారు .కవిగారు చౌదరి దంపతుల అన్యోన్యం వారి వితరణ ,ఆకుటు౦బ విశేషాలు ముందుగా సీసపద్యాలలో తెలియ జేశారు .ఇది ఉత్పల మాల శతకం .’’భవాని శంకరా ‘’శతక మకుటం .వెల తెలుపలేదు కనుక అమూల్యం కావచ్చు .
మొదటి పద్యం –‘’శ్రీమదగాత్మ జాత్యమల చిత్త సరోజ దివా కలత్రి ల-క్ష్మీమహిళా తనూభవ విజ్రు౦భిత గర్వ వనాగ్ని హోత్ర ,సు-త్రామ సరీ నృపాధిప మరాళరధాద్యమరేశపూజ్య గో-త్రామర వంశ చందన మహా వనపాల భవాని శంకరా ‘’.అని చక్కగా మొదలు పెట్టాడు బాలకవి .తర్వాత గంగకు మౌళి నిచ్చి ,భుజగాలకు భుజం ఇచ్చి ,మత్తమాతంగ కులేంద్ర చారు ముఖధారికి అంకము ఇచ్చి ,గౌరికి అర్ధాంగమిచ్చి , భ్రున్గికి పదాబ్జాలిచ్చి ,వేలంగి పురంలో ఉంటున్నాడు శివుడు .ఈ నగరికి ముందున్న తుల్యానదిలో దేవతలంతా మునిగారు ,ఇందులో మునిగి అందరూ కోరికలు తీర్చుకొన్నారు .నిన్ను కోరిన కాత్యాయని ఇక్కడి జనుల అభీష్టాలను నెరవేరుస్తోంది .అమ్మవారు అయ్యవారి కల్యాణానికి మిత్రుడు ఆహ్వానించి నాచేత పద్యాలు రాయించి మెచ్చి నాడు. అప్పుడు నాకు పందోనిమిదేళ్ళు. అందరితోపాటు నాకూ ఆశ్చర్యమే ఇది నీ కృపా కటాక్షమే.
తర్వాత ఈశ నగాత్మజేశ ,భువనేశ ,మహేశ ,ఖకేశ ,అంటూ మనస్సునిండా ధ్యానిస్తే సర్వపాపహరం .ప్రపంచం ఒక నాటకరంగం .జీవులు పాత్రధారులు .’’మాధవుడంచు వైష్ణవు లుమాధవుడంచుపురారి భక్తులు ‘’ఆరాధిస్తారు .’’హరియే హరుండు నీహరుడే యా హరి ‘’అన్నాడు.ఇలాంటి సద్గుణాకరుడైన ఈశ్వర పాదాలు పట్టుకొని భజించి ఈశతకం రాశానన్నాడు .తనను పుణ్య చరిత్రుని చేయమన్నాడు .
చివరి ఉత్పలమాలలో –‘’ఇమ్ముగ నీ మహత్వమెదనెంచి ,యఘాంతమైన నీదు నా-మమ్మున నే రచియించితిసుమా ,యిటు లేబది నాల్గుపద్దెముల్ –నమ్మగదయ్య నా మనము నన్గలనిశ్చల భక్తి నాదుపా –పమ్మెడ బాపు మయ్య భవ బంధ విముక్త భవాని శంకరా ‘’.
బాలకవి శరణ్యం లా కవిత జాల్వారింది .వేలంగి దగ్గరున్నతుల్యా నదీ వేగంతో అతులిత భక్తి భావ రస భంజకంగా ఈ శంకరార్థా స్టోత్తర శతకం బాలకవి శ్రీ కూరపాటి వెంకట రత్న కవి రచించి అటు అర్ధనారీశ్వర శివునికి ముదం చేకూర్చి, ఇటు బాల్య స్నేహితుని కోర్కె తీర్చి ఆయన అర్ధాంగి కి అంకితమిచ్చి మన హృదయాలనూ పావనం భక్తి రసభావనం చేసి బిరుదును సార్ధకం చేసుకొన్నాడు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-23-ఉయ్యూరు

