శ్రీ శ్రీనివాస శతకం -1
శ్రీ నారాయణం రామానుజా చార్యులు శ్రీ శ్రీనివాస శతకం ను రేపల్లె విక్టరి ప్రెస్ లో 1946లో ముద్రించారు . వెల పన్నెండు అణాలు .కవిగారు శృంగార రస రంజిత౦ గా,విచిత్ర ఇతి వృత్త౦తొ ‘’సుచంద్ర ‘’ వీర రసాలంకారంగా’’వీర బభ్రువాహన ‘’ నాటకాలు ,క్షీరాబ్ది కుమారీ శతకం రాశారు .కవిగారిది రేపల్లెదగ్గర ఉల్లిపాలెం .గ్రంథ ముద్రణకు కవిగారి బాల్యమిత్రులు శ్రీ పాలపర్తి రామయ్య ,శ్రీ సబ్బినేని చిన వీరయ్య ,శ్రీ వల్లభనేని పరంధామయ్య గార్లు ద్రవ్య సాయం చేశారు .పండితాభిప్రాయం గా పొన్నూరు సంస్కృత దేవస్థానం కలాశాలపండితులు శతావధాని చతుర్విధ కవితా ధురీణ ,శ్రీ రామ దాసాది దివ్యాంధ్ర ప్రబంధ నిర్మాత బ్రహ్మశ్రీ చల్లా పిచ్చయ్య శాస్త్రిగారు –‘’శతకంలో శైలీ రమ్యత ,వృత్తి కల్పనా ,శయ్య, వ్యుత్పత్తి శక్తి ,మహోదయభావం ,అలంకార పాక ఔచిత్యం రసపారవశ్యం కలిగి ‘’ఈ కైత పదపూజనీరేజ లక్ష్మియై ,నుద్యానవనమున దూగు టూయలయి ,గళమున హారమై ,,కయి దల్కు టద్దమై , కందామర బచ్చ గప్పురమై శ్రీనివాస శతకం రంజిల్ల జేసింది ‘’అన్నారు .రేపల్లె వాసి,విద్వాన్ ప్రౌఢకవి ,మధురకవి బిరుదాంకిత ,అఖండ మహా లక్ష్మీ సంపన్నులు, ఉత్తర వల్లూరు రాజావారి ఆస్థాన పండితులు ,అష్టావధాని ,శ్రీ కృష్ణ తులాభారం వంటి ప్రబంధ నిర్మాత ,ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ పంచాంగం వేంకట రామానుజా చార్యులు –‘’గంభీర వాగ్గు౦భనమ్ గా ,ని౦దాస్తవంలాగా ,పొలయల్కలకు కొత్తపొలుపుతో ,’’పసధ రాకామినీ కిలికి౦చితంగా ,వలపులొలయ సరస మాధుర్య ప్రసాదతా రీతులతో ‘’ఉన్నదన్నారు .పిఠాపురం మహారాజాస్థాన పండితులు తర్క వేదాంత విద్వాన్ బ్రహ్మశ్రీ పసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు –‘కవిత్వం పోతన ధూర్జటి స్థాయిలో భావోద్రిక్తతతో ,ద్రాక్షాపాక విలసితంగా ,ధారావాహిని ‘’గా ఉందన్నారు.అసలు కవిత్వం లోకి రేపు ప్రవేసిద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-8-23-ఉయ్యూరు

