భక్తకవి పోతనామాత్యుని ‘’నారాయణ శతకం’’.
ఈ శతకాన్ని 1919 లో పిఠాపురం కు చెందిన ఆంధ్ర పరిశోధక మహా మండలి తరఫున శ్రీ వంగూరి సుబ్బారావు గారు ముద్రించారు .పీఠిక లో వంగూరి వారు- ‘’ఈ శతకం పోతనామాత్యుడు రచించాడు .శైలి భాగవతంతో సరిపోతోంది .పెద్దాపురం నుంచి ఒక తాళపత్ర గ్రంధాన్ని వేరొక చోటు నుంచి కాగితపు ప్రతి రాజమండ్రి వారు సంపాదించారు .మరోప్రతిని ఈ పరిషత్ వారు సంపాదించారు .నేనుమాత్రం రాజమండ్రి వారి ప్రతిని ఆధారంగా ఒక్క రోజులో ఈ నారాయణ శతకం ముద్రించాను .ఆరోగ్యం బాగు లేకపోవటం వలన, భక్తపోతన పై ఉన్న గౌరవం వలన అంత తొందరగా ప్రచురించాను .పరిశీలననికి వాసు కవి అదే శ్రీ వడ్డాది సుబ్బారాయ కవిగారు నాకు చాలా తోడ్పడ్డారు .చిన్నతనం లోనే పోతన్నగారు మంచి ధారతో ,గొప్ప కవితా శక్తితో ,శ్రుత పాండిత్యంతో ఈ శతకం రాసి ,క్రమంగా మహా పండితుడై వేదవ్యాస మహర్షి సంస్కృత భాగవతాన్ని తెలుగు లోకి మందార మకరంద తుల్య౦గా అనువదించారు .పద్యాల నడక ,భావాలు బాగానే ఉన్నా ,భాషా దోషాలు శతకం లో ఎక్కువగా ఉన్నాయి .యధా మాతృకంగా నారాయణ శతకం ను ముద్రించాను ‘’అనిచెప్పారు .శార్దూల మత్తేభాలపై స్వారి చేసిన పోతనగారి భక్తి శతకం ఇది .వెల తెలుపలేదు .శతక మకుటం –‘’నారాయణా ‘’.
మొదటి శార్దూల పద్యం –‘’శ్రీ రామా మణి పాణి పంకజ మృదు శ్రీ తాజ్ఞ పాదాబ్జ శ్రుం –గారాకార శరీర ,చారు కరుణా గంభీర సద్భక్త మం-దారా౦ భోరుహ పత్ర లోచన ,కళాధారోరు సంపత్సుధా-పారావార విహార ,నా దురితముల్ భంజింపు నారాయణా ‘’.అన్నారు .తర్వాత నేను నీ దాసుడ నీవు నాపతివిఅని ,ఎన్నో చదివినా మనసులో నిన్ను తలచలేకపోయాను మన్నించు అని ,తర్వాత కలశ పాధోదధిమధనం వివరించి , దశావ తారాలు వర్ణించి ‘’పద్మ భవాండ భాండ చయం ‘’కుక్షిలో కాపాడుతున్నావని .’’సర్వంబు వసియించు నీ తనువునన్ సర్వంబు నదు దగన్ నువ్వే ఉంటావు ‘’అని ,నీనామం పరమ౦బై,పరతత్వమై సకల సంపత్సారమై ,భవ్యమైనది అంటూ ,నీది శ్రీకి మందిరమైన వక్షం అని ధూపం వేసి ,వ్రేపల్లెలో గోగోపగోపీ జనాలతో విహరించే నల్లనయ్యను వర్ణించి ,’’వేణు రంథ్రాలిన్ రాగ రసంబు నిండ,విలసద్రాగంబు సంధించి గోపాల వ్రాతము గండు కోయిలలుగా ‘’వర్ణించారు పోతన అన్నగారు .’’మా పాలన్ గడు క్రొవ్వి ,మాపాలంబలే వచ్చి ,మాపాలలో ఉండు ,మీమా పాలైన సుఖాత్మ అని గొల్లలు ‘’మాపాలం గల వేల్పు ‘’నువ్వే అని భావిస్తారు అంటూ ‘’’’పాలా’’భి షేకం చేశారు .
పూతకి ప్రాణాలను పాలిండ్ల నుంచి వెళ్ళగొట్టావు, దుగ్ధాబ్ధి తరంగ డోలికల్లో వైకు౦ఠంలో, అయోధ్యలో మధుర వ్రేపల్లెలలో ,ద్వారకలో ఆడిన విధంగా నా మనసులో ఆడు విహరించు నన్ను తరి౦పచేయి .శరీరంలో జీవుడు ఏకమైన తర్వాత ,ధర్మక్రియలతో ,ఎప్పుడూ తనను ఎరుగకుండా మాయలో పడి ,తనుతత్వాదులు వియోగమైన తర్వాత ననే నీ దర్శనం పొందుతాడు .కులగోత్రాలతో పనే లెదు .నిన్ను శుద్ధాత్మతో ధ్యానిస్తే ముక్తినిస్తావు .ఎన్ని చదివినా నీ నామస్మరణ ధ్యానం లేకపోతె మోక్షం లెదు .’’నీలగ్రీవుడు చేతిలోని పుర్రెను మీ భార్య పెట్టిన భోజనంతో తృప్తిపడి వదిలేశాడు .నీ నామ జపంతో తరించాడు .నువ్వే తల్లీ తండ్రీ .నువ్వే జగన్నాథుడవు ,నువ్వే నిశ్చల బంధవుడవు నువ్వే శంకర మూలమంత్రం నువ్వే జగత్కర్తవు .99వ మత్తేభం లో –‘’నరసింహాచ్యుత వాసుదేవ వికసన్నాలీక పత్రేక్ష్ణ భూధర గోవింద ముకుంద కేశవ జగత్రాతా ,అంబుజోదర ,దామోదర ,తార్క్ష్య వాహన ,,మహాదైత్యారి వైకు౦ఠ మురారీ ‘’అని నారాయణ నామ స్మరణ చేశారు .వందవ చివరి మత్తేభం లో –‘’కడకంట౦ గనలేని సంపద లోగిం గావింపు లక్ష్మీశ ,పా-ల్కడలిన్ బన్నగ శాయివై భువనముల్ గల్పించు సత్పుత్రునిన్ –బోడమం జేసిన నాభి పంకజ ,జగత్పుణ్యాత్మ భాగీరధీ –పడతి గన్న పదారవింద,మిము నే భావింతు నారాయణ ‘’అని ముగించారు .
తర్వాత గద్యంలో –ఇది శ్రీ పరమేశ్వర కరుణా కలిత ,కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర ,సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన నారాయణ శతకంబు సర్వంబును సంపూర్ణము ‘’అని మంగళం పాడారు భక్తకవిపోతన . పద్యాలు ధారా బాగానే ఉన్నా సం ధింగ్ మిస్సింగ్ అని పిస్తుంది .అదే మందార మకరందం ,జుంటి తేనే ,ద్రాక్షారసం లేవే అని బాధ కలుగుతుంది .ఇది స్టేప్పింగ్ స్టోన్ శతకం కనుక అవి లేకపోయి ఉండవచ్చు లేకపోయినా భక్తికి ,అంకితభావానికి తక్కువేమీ లెదు .జనం మర్చిపోయిన సహజ కవి పోతనామాత్యుని నారాయణ శతకం పరిచయం చేసే మహాదదృస్టం నాకు కలిగిందని పరమ సంతోషంగా ఉంది.
రేపు మాతృ భాషా దినోత్సవ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-23-ఉయ్యూరు

