శ్రీమతి వల్లివేడు కాదాటి గుండ్ల పల్లి నరసమ్మ గారిచే రచింపబడిన ‘’వరద రాజ శతకం ‘’-2(చివరిభాగం )

శ్రీమతి వల్లివేడు కాదాటి గుండ్ల పల్లి నరసమ్మ గారిచే రచింపబడిన ‘’వరద రాజ శతకం ‘’-2(చివరిభాగం )

పాఠకమహాశయులకు విజ్ఞప్తి –అంటూ కవయిత్రి నరసమ్మ గారు ‘’పన్నెండవ ఏట భర్త ,పదమూడవ ఏట తండ్రి మరణం సంభవించింది .మాతాపిత భతృ సేవలు చేసి తరించే అవకాశం పూర్తిగా లభించలేదు .పైతృక కార్యాలు దైవధ్యానం టో కాలం గడిపాను .పెద్దలవలన సద్గ్రంథ పఠనం అబ్బింది .జన్మ సంస్కారంతో భాషాజ్ఞానం అలవడింది .భర్త్రురూప దైవం పేర ఒక శతకం ,భక్తిరూప హరికీర్తనలు రాశాను .ముందుమాట రాసిన మాతమ్ముడు  వంటి కట్టమంచి రామ లింగారెడ్డికి , ,తప్పొప్పులు సవరించి ముద్రణకు సహకారం ఇచ్చిన శ్రీ పూతలపట్టు శ్రీరాములు రెడ్డిగారికి కృతజ్ఞతలు .మామరది చి నరసింహారెడ్డి తీసుకొన్న జాగ్రత్త వర్ణింప నలవి కానిది .దైవ రూపమైన నా భర్తగారికి ఈ శతకం నిండుమనసుతో అంకితమిస్తున్నాను ‘’అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పారు .ఇది సీస పద్య శతకం .మకుటం –‘’పుడమి శ్రీ వల్లివేడు సత్పురనివాస –వనిత నరసాంబ బ్రోవుమా వరద రాజ ‘’.

    వాసుదేవుడినికానీ  వర్ణించ నట్లుగా  వాణి తనకు వాక్కు నివ్వాలని ,ఇందిరాధిపుగాని యితరంబు జెందక హరుడ నాకొసగవే యాత్మబుద్ధి ,పద్మ లోచను గానిపఠియి౦పనట్లుగా బరమేష్టి బెట్టవే పాఠములను ,హరిపాదములనుగాని యన్యంబు నొల్లక లక్ష్మి నేర్పి౦పవే లక్ష్యములను ‘’అని అందర్నీ కొత్తతరహాలో కోరారు నరసమ్మగారు .తర్వాత పతితపావన ,కరుణాసాగర దీనపోషక అంటూ నామ జపం చేసి ,సిద్ధవరులను కాపాడటానికి శిలాపురం లో ఉన్నావు .ఆతర్వాత శ్రీరాముని ఆదర గుణాలు వర్ణించి ,కొన్నినీతులు –కోపం పాపం , పాత్రమెరిగి దానం చేయాలి ,అల్పులకు చేసినమేలు అడవిగాచిన వెన్నెలే ,మదగజాలెన్నిఉన్నా ఒక కొదమ సింహం చాలు ,సారంగాలపై శార్దూలం చాలు ,మార్జాలలపై సారమేయం ఒకటి చాలు అలాగే అసహాయ శూరునికి ఎవరి సాయం అక్కర్లేదు .వానరాలకు వజ్రకిరీటం ,చెవిటికి సంగీతం ,గార్ధభానికి కళ్ళెం ,సంగతమతికి మోక్షసుఖం,అంధునికి సొగసు ,ఖలుడికి సద్ధర్మం ,మార్జాలానికి మాఘపురాణ౦  శుద్ధ దండగ అని చెప్పారు .

   ఆపిమ్మట వివిధ  రాగాలలో దేవ దేవీ కీర్తనలు రాశారు .కంచి శ్రీరంగం కుంభ కోణం ,, రామేశ్వరం  ఎక్కడ చూసినా నీ దివ్యరూపమే ముచ్చట గోల్పుతుంది .నీకు రత్నహారాలు పట్టు పీతాంబరాలు సమర్పించలేను తులసి దళం మాత్రమె అర్పించగలను .తర్వాత మరాకతాది సురత్నమణి కిరీటదారికి ,శాఖు  చక్ర ధారికి శ్రీ కౌస్తుభ హారికి జగాలు రక్షించేజాహ్నవి కన్నతండ్రికి  మంగళం సమర్పించారు .ఆతర్వాత ‘’లాలిత మన్మధరూప ,లాలిత సత్కుల దీప ,లాలి వివాహ వినీలదేహ లాలిలోకాధార లాలి శుభాకార ,లాలి దయాశాలి అంటూ లాలిపాడారు .107వ చివరి సీసంలో –‘’యతి గణప్రాసలు తెలియకుండా భక్తితో సమకూర్చిన ఈ సీస మాలికను ప్రేమతో ఆలకించి ఆదరించి ,ఆయురారోగ్య వంశసౌభాగ్యాభి  వృద్ధి నివ్వమని ఆర్తిగా కోరుకొన్నారు కవయిత్రి నరసమ్మాజీ .

  ఈశతకం ,ఈ కవయిత్రి గురించి మనకెవ్వరికి తెలీదు .పరిచయం చేసిన అదృష్టం నాకు దక్కింది .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-9-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, ప్రవచనం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.