శ్రీ ఆత్మబోధ సిద్దేశ్వర శతకం
కలమళ్ళ హిందూ బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ కె.రామస్వామి శ్రీ ఆత్మబోధ సిద్దేశ్వర శతకం రచించి ,ప్రొద్దుటూరు శ్రీ జానకీ ముద్రాక్షర శాలలో 1930లో ముద్రించారు .వెల –కేవలం –నాలుగు అణాలు .కవిగారు పండితాభిప్రాయం సేకరించి పొందు పరచారు .శ్రీమద్రామాయణ ,,బ్రహ్మా౦డపురాణ,బ్రహ్మపురాణాది బహు గ్రంధ కర్తలు ,కావ్య స్మృతి తీర్ధ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ జనమంచి శేషాద్రి శర్మ (కడప )-‘’ఇది వేదాంత బోధక శతకం .పద్యాలు మధురాతి మధురం .’’అన్నారు .శతావధాని ,పంచానన కవి సింహ శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారు –‘’మానవునికి ప్రకృతి వివేచనతోపాటు పారమార్ధిక జిజ్ఞాసకూడా అవసరం .జనసామాన్యానికి అందుబాటులో ఈ శతకం రాసి వేదాంతం బోధించారుకవి ‘’అన్నారు .విద్వాన్ కావ్యపురాణ తీర్ధ శ్రీ జనమంచి వేంకట సుబ్రహ్మణ్య శర్మగారు –‘’లలిత పదజాలం తోపద్యాలున్నాయి .మోక్షమార్గానికి చక్కని రాజమార్గం .’’అన్నారు.ఉపోద్ఘాతం లో -శతావధాని పంచానన ,కవిసింహ శ్రీ దుర్భాక రాజ శేఖర శతావధాని –‘’తరుణ వయసులో గహన వేదాంత రహస్యాలను మంచి ఉపమానాలతో సుబోధకంగా రచించి సేహబాస్ అని పించాడు కవి .ఆశీస్సులు ‘’అన్నారు .ఇది సీస పద్య శతకం –‘’భవ్య సిద్ధేశకలమళ్ళ భవ వినాశ’’అనేది శతకం మకుటం .ప్రారంభంలో నారాయణ ,నలువ వశిష్ట శక్తి పరాశర వ్యాస శుకులను ,గౌడపాద గోవింద శంకర పద్మపాద హస్తామలక తోటకాచార్య మొదలైన బ్రహ్మ విద్యా ధురీణులను సీసం లో స్తుతించి ,ఒకరోజు ప్రశాంత వాతావరణంలో కూర్చుని ఉండగా నరునితో ఉన్న నారాయణులా నారాయణ గురువు తనవద్దకు వచ్చి ‘’త్రయ్యంత విద్యా విధాన భేదాలు బోధించగా ,ఆధ్యాత్మ విద్యా రహస్యాలు తెలిసి ‘’సిద్ధేశ శతకం ‘’రాయాలనే కోరిక జనించి పెడకంటి మైసూరు రెడ్డి రమా మూర్తి నాగమా౦బల కుమారుడు ఎర్రగుంట్ల పురంలో ఉన్న వితరణ శీలి సూరా రెడ్ది ఈ శతకాన్నిఅచ్చు వేయిస్తానని ముందుకు వచ్చి వేయించాడని ,ఇదంతా ఆది దేవుని ఘటన ‘’అన్నారు .
శతకం మొదటి సీస పద్యం లో కవి –‘’శ్రీకర౦బమల రత్నాకరం బానంద –శేఖర౦ బతుల సుశ్రేయ మగుచు –అద్వితీయాత్మకం బాద్య౦తవిద్య యౌ-వేదాంత సార సంవేద్యమగుచు –ధీసాక్షి విదితమై ,ధ్యేయ స్వరూపమై –సచ్చిదానంద విచారమగుచు –అందమై శ్రుతి లతాకందమై యలరారు –పరతత్వ రూపమై బ్రహ్మమగుచు-
తే.గీ- బుధజన వ్రాత సంప్రాప్త బోధ మగుచు-సంగరహితుల విమలాంతరంగమందు –భూరి యశమున విలసిల్లు భుజగభూష-భవ సిద్ధేశ కలమళ్ళభవ వినాశ ‘’ – అంటూ మాహా దూకుడుగా పద్యం దూకించారు ఊపిరి సలపనీయకుండా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-23-ఉయ్యూరు

