శ్రీ గనముక్కల నాగయ్య విరచిత’’ శ్రీ సోమేశ్వర శతకం ‘’
ను మహారాజ రాజశ్రీ సోము పాళ్యం కనుకొండ కోటిరెడ్డి ,మదనపల్లి బోర్డ్ హైస్కూల్ తెలుగు పండితులు బ్రహ్మశ్రీ వెంకటరామ శాస్త్రి గార్లచే పరిష్కరి౦పబడి మదనపల్లె బ్రిటానియా ముద్రాక్షర శాలలో 1926లో ప్రచురింపబడింది .వెల –అణన్నర.తండ్రిగారికి ఈ శతకం అంకితమిచ్చారు కవి .ఈ సీసపద్య శతకం మకుటం అంతా గీతపద్యం నాలుగు పాదాలు ఉండటం విశేషం – ‘’కన్నెమడుగు పురీవాస ,కర్నసాలె –కులజు లిలువేలుపువని పేరుగొన్న దేవ -శీలుడగు గనముక్కల శిద్దయార్య –చిత్త సుమవాస సోమేశ చిద్విలాస ‘’ .
మొదటి సీసం లో –‘’శ్రీ గిరిజా వర శ్రితజన మందార-సోమజటాధర శూలధార –కాయజ సంహార కారుణ్య సాగర –వాతాశిధార మిన్వాకధార –హస్తి చర్మాంబర యాగమనోగోచర పాప సంహార కపాల ధార-బలగర్వ రిపుహర ప్రణుతి శుభాకర –ఫాలలోచన ధారభయవిదార
గీ-కన్నెమడుగు పురీవాస ,కర్నసాలె –కులజు లిలువేలుపువని పెరుగొన్న దేవ –శీలుడగు గనుముక్కల శిద్దయార్య –చిత్త సుమవాస సోమేశ చిద్విలాస ‘’.అని భక్తిపూర్వకంగా సంనుతిచారుకవి . సోమ దేవ మంత్రం నిత్యం ఉచ్చరిస్తే రోగాలురావు ,పాదపద్మాలు సేవిస్తే పాపాలు దూరం .చరిత్ర స్మరిస్తే దుఖాలు పోతాయి .ప్రాపు చేరితే శ్రీకైవల్యమే .నిన్ను హరుడు అందునా దిగంబరుడు అందునా ,భవ ,శివ, ఉమాధవ, అజ, వృషధ్వజ, భీమ, బలోద్దామా అనాలా అర్ధం కావటం లేదు అని శివనామాలు పల్కారు .నీపద సేవ చేయని చేయి కొయ్యగరిట,కీర్తించని నోరు నీటికోర ,కధలు వినని చెవులు పెద్దకవులు ,సాష్టాంగం చేయని దేహం పోలాల లోని దిష్టిబొమ్మ .కరులున్నా నౌకరులున్నా నీ స్మరణ లేకపోతె వ్యర్ధం .ధనమున్నా సందనమున్నా నీపూజలేకపోతే ,ఆలున్నా నేల మైడాలున్నా ,నీపాలన లేకపోతె ,సుతులున్నా స్నేహితులున్నా నీకధలు వినకపోతే అవి వ్యర్ధం అని చక్కని నుడికారంతో చెప్పారు .
సదానంద ,సకలాఘత బృంద ,దూరీకృతైక పదారవింద , వామ దేవ అమరవందిత ,విశ్వేశ శ్యామలామల చిత్త ,సకలలోకాధార,మకరాంక మదహర ప్రకటిత బలశూర ,భయవిదార ,నిశిత శూలాయుధ నీరజా సననుత భాసిత సంమోదిత ,భవ్యచరిత అంటూ శివనామాలు పలికారు కొత్తతరహాలో .తల్లీతండ్రీ గురువు దైవం నీవే నీనామ మంత్రం నీచ తాపత్రయ భంజనం ,భక్తులకు కర్ణాభరణం ,నిగమ భూషణ కలాపూరణం మహాపాప విదారణం ,నిఖిల పిశాచ బాధకం ,సాధు సాధకం .చింతామణి ,కల్పవృక్షం ,కామధేనువు లకంటే నీనామం శ్రేష్టం . నీదయ ఉంటే జలధి లంఘించవచ్చు,పర్వతాన్ని ఎత్తవచ్చు ,అగ్నిలో దూకవచ్చు, ‘’మిసిమివోలె విషంబు మ్రింగవచ్చు ‘’నాతప్పులు మన్నించి నన్ను కాచి నీలో కలుపుకోసోమేశ .నాగురించిపార్వతి గణపతి కుమారస్వామి నీకు చెప్పలేదా అని ఫిటింగ్ పెట్టారు .ప్రణవ స్వరూపుడవైన నిన్ను ,భావించి మనసులో పదిలపరచి ,నీరూపు చిత్తం లో నిలిపి పంచ పూజలతో తృప్తి పరచి భక్తి చందనం ,రక్తి అక్షతలు శాంతి సుమాలు క్షాన్తిపూజ చేస్తాను .చివరి వందవ సీసం లో –‘’మంగళ౦బురగేంద్ర మండన భవదీయ-పావన చరణరాజీవములకు – నిత్యమంగళము నీ నిర్మల కరునైక వీక్షిత నేత్రారవిన్దములకు –శుభమంగళము సర్వ శుభములొస గెడి –నీనామ మంత్ర నిధానమునకు –జయమంగలంబెల్లజగములు నిత్యంబు –పూజించు నీ దివ్య తేజమునకు’’అని శుభమంగళ౦ తో శతక సమాప్తి చేశారు .
ధారాశుద్ధి భావ పరిశుద్ధి భక్తిపరిపాకం ఉన్నసోమేశ్వర శతకం రాశారు కవి గనముక్కల నాగులయ్య.గణాలకోసం ప్రాకులాట లేదు .నాగాభారణునిపై నిశ్చల భక్తీ ,సోమేశ్వరునిపై అచంచల ఆరాధన తప్ప నాగులయ్యకు .మంచి శతకం. ఒక రకంగా కవి ఆత్మనివేదన ఈ శతకం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-23-ఉయ్యూరు . ,

