సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో
98 వ శతకం –అఘ వినాశ శతకం
కృష్ణాజిల్లా బేతవోలు గ్రామస్తులు శ్రీమాన్ శ్రీపతి సుదర్శనాచార్యుల ప్రియ శిష్యుడు శ్రీ దాసరి అ౦జదాసు రాసిన ‘’అఘవినాశ శతకం’’బాపట్ల తాలూకా ఆదిపూడి నుంచి1932లొ ప్రచురితం .పరిచయకర్త శ్రీ అబ్బరాజు వెంకటరంగారావు గారు –‘’భక్తితో పామరకవిరాసిన శతకం అని .కవిత్వం లీలామాధుర్యం గా ,రసపుస్టిగా వేమన శతకం లా ఉన్నశతకం’’ అన్నారు.ఇది ఆట వెలది శతకం .’’అ౦జ దాస పోష అఘవినాశ ‘’మకుటం .
‘’శ్రీయేజనులకు రత్నము – శ్రీయే బహు సంపదలనుజేకూర్పదగున్-శ్రీయే భక్తికి మూలము –శ్రీయే రక్షించు జనుల శ్రీరఘురామా ‘’అని మొదటి పద్యం చెప్పి ,’’గొప్పబొజ్జ వాడిని ‘ వాక్కులో నివసి౦చేతల్లిని,వేమనాదికవులను ,రామచంద్రుని స్తుతించి శతకపద్యం కానుకగా సమర్పించాడు కవి .దేహభ్రాన్తితో దేవుని చూడలేకపోతున్నానని ,జీవ హి౦స దైవ హింసతో సమానమని ,పప్పు అన్నాలు పరమేశ్వరుని రూపు అని ,ఉప్పు పులుసు నెయ్యి హృదయ గుణాలని గొప్పకూరలన్నీ గోవిందు భూతములనీ చెప్పాడు .త్రిపుటి మధ్యలొ ఉన్న దేవుణ్ణి కనుగొంటే యోగి అవుతారు .ఆలికంటే ఆత్మ బంధువు ,కాలికంటేగట్టి బంటు లేరు .ధనం లేకపోతె దైవమె దిక్కు .దాశరధిని సతతం తలచే వారికి దోషం లేని దారి దొరుకుతుంది .
నీటిలో, పాటలో, బోటిలో, పొందులో మంచి తెలుసుకోవాలి .భూషణం, వేషం ,భాష ఉంటేనే ఎక్కడైనా గౌరవం .రోష౦ లో ,రోగంలో,మాటకటువులో ,నీటులో గొప్పగా ఉంటే ఆశ అడుగంటిపోతుంది .ధర్మ, మర్మ, నిర్మలాలు ఉంటే మంచి గతి మోక్షం .’’ఆడవారి మంచి ,అందలంబులమంచి –కోడెత్రాచు మంచి ,కోతిమంచి-గూఢచారి మంచి గుర్తించటం కష్టం .యోగభక్తిలేకపోతే ముక్తి హుళక్కే .’’తోలుతిత్తిలోని దొడ్డ వానెరుగక –కాలమెల్ల రిత్త గడుపుచుండ్రు –నీళ్ళులేని చేప నిర్మలమౌ ‘’ అని మంచి సూక్తి చెప్పాడు .స్త్రీలకన్నా చిత్త చోరులులేరు ,మహ ఇంద్ర జాలంతో మోసగిస్తారు .రంకు చేసే భార్య భర్తపై కోపం చూపుతూ అన్నిపనులు తానె చేసుకొంటుంది .
అ౦టీ అంటకుండా ఆకాశం ఉంది.రెంటి మధ్య రేయిపవలున్నాయి .దాన్ని చూస్తేఆనందం .రెంటిమధ్య రేచించి చూస్తె ఒంటి స్థంభం మేడ కనిపిస్తుంది .అందులో హాయిగాశయనించు అని తత్వ బోధ చేశాడు .సబ్బుబిళ్ళ రుద్ది సరసుని దరి చేరుతుంది వన్నెలాడి .’’నేను ‘’అనేదాన్ని ఎన్న గలిగితే వాడేధన్యుడు.చివరలోకవి –‘’రామపాదుకలు శిరస్సుపై ధరించి ముక్తికోసం మోస్తున్నాను .ఇవ్వటానికి నాదగ్గర చిల్లిగవ్వ లేదు.అందుకే ఈ అఘ వినాశ శతకం అనే పుష్పాలు సమర్పిస్తున్నాను .కామితార్ధా లిచ్చి కాపాడు రామ చంద్రా అని ముగించాడు .
చక్కని సూక్తులు మహా వేదాత భావనలు,సరళమైన పదాలు తో చిత్తరంజనంగా కవిత్వం పరిమళించింది .చదివితే ,అమలుపరిస్తే .అఘ వినాశనమే .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -11-9-23-ఉయ్యూరు
