సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో
99 వ శతకం-శ్రీ జనార్దన శతకం-1వ భాగం .
విజయనగర అష్టావధాని శ్రీ బులుసు వేంకటరామమూర్తి గారు రాసిన శ్రీ జనార్దన శతకం ఏలూరు శ్రీ ఆంజనేయ పవర్ ప్రెస్ లొ 1957లొ ముద్రించారు .వెల- అర్ధరూపాయి.తొలిపలుకు లలో కవి –‘’బాలుడిని కవితా ప్రతిభలేకపోయినా ,శ్రీశారదాంబ వర ప్రసాదంతో ఈశతక రచన చేశాను .కవి శేఖర పండిత పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి శ్రీ చింతలపూడి సన్యాసి రావు ,శ్రీ ఆకుండి వెంకటశాస్త్రి మున్నగు పెద్దలు చేసిన ధనసాయం .ఏలూరు లొ వెంకటరామా అండ్ కో అధినేత ,రసజ్ఞులు శ్రీఈదర వెంకటరామయ్య గారు ముద్రణా వ్యయం భరించి శతక ముద్రణ చేశారు .ఏలూరులో సాహితీ పెద్దలను పరిచయం చేసిన సాహిత్యమండలి అధ్యక్షులు డా.శంకర రామారావు గారికి ,ముద్రణలోపాలు సరిచేసిన కవిమిత్రులు శ్రీ అద్దేపల్లి కుటుంబరావు గారికి కృతజ్ఞతలు ‘’అన్నారు .పరిచయ వాక్యాలు పలికిన కవితాభూషణ విద్వాన్ శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు –‘’కవి ఆశువుగా చెప్పినా, కవిత్వం ఆలోచనాత్మకంగా,లలితపద మంజులం గా ఉంది’’అనగా విశ్రాంత కళాశాల ఆంధ్ర పండితులు విద్వత్కవి శ్రీ ఆకుండి వెంకట శాస్త్రి పద్యాలలో ఆశీస్సులు పలుకుతూ –‘’ కవి అమితప్రజ్ఞ చూపాడు .మృదుపాకం రుచిగా ఉంది బాలకవికి ఆశీస్సులు ‘’అనగా ,మహారాజ సంస్కృత కళాశాల ఆంధ్ర పండితులు సాహిత్య విద్యాప్రవీణ ,ఉభయ భాషా ప్రవీణ కవిశేఖర శ్రీ పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి పద్య ఆశీర్వాణి లొ ‘’జనుల నర్ది౦చుటను జనార్దన శతకం అయింది .గుణభావ రసప్రసస్తి తో రాశాడు’’అన్నారు .మహారాజ ఆంగ్ల కళాశాల విశ్రాంత పండితులు కవిశేఖర శ్రీ అడిద౦ రామారావు పంతులుగారు ‘’బాలకవి త్వరలో ప్రౌఢకవి ఆయె లక్షణాలున్నాయి .కవిసార్వభౌమ శ్రీ పాదకృష్ణమూర్తి శాస్త్రిగారి ఆశీస్సులు పుష్కలంగా అందుకొన్న బాలకవి ఇతడు .కౌముదీ పరిషత్ కార్యదర్శి కవితాకోవిద శ్రీ చింతలపూడి సన్యాసిరావు ‘’మనోజ్ఞ భావనా కలిత కవిత్వ మాధురి ఉన్న శతకం ‘’అన్నారు పద్యాలలో .పార్వతీపురం బోర్డ్ హై స్కూల్ బిఎడ్ ఉపాధ్యాయలు సాహిత్యకోవిద శ్రీ క్రొవ్విడి రామం –‘’వర్ధమానకవి ప్రసాద గుణ భరితంగా రాసిన శతకం .విజయనగరం B.P.M.M.హైస్కూల్ సంస్కృత పండితులు కవిభూషణ ,,పౌరాణిక కోకిల ,కాలక్షేప కంఠీరవ భాషాప్రవీణ ,శిరోమణి శ్రీమాన్ అద్దంకి వేంకట రంగాచార్యులు –జాతిరత్నాలలాంటి చ౦పకాదులతో ,బహుళార్ధ పటిమతో ,భక్తి ఘనతతో కూర్చిన శతకం .మందారమకరంద నవ్య కవిత్వ ధార ప్రవహించింది’’అని పద్యాశీస్సు పలికారు .భీముని పట్నవాసి హరిదాస భూషణ శ్రీ మరింగంటి లక్ష్మనాచార్య భాగవతార్ –‘’ప్రతిపద్యం రసస్థానం పొందింది .కవితాధార దివ్య గంగాతరంగాలతో చెలిమి చేసింది .వీరి అవధానం ఆంధ్రలో విజయధ్వజం ఎత్తింది .శబ్దాడంబరం కంటే అర్దాడంబరం ఎక్కువ ‘’అన్నారు .ముంగండ వాసి విద్వత్కవి సార్వభౌమ ,అభినవ పండితరాజ విద్యావాచస్పతిమొదలైన ‘’దశ ‘’బిరుదాంకితులు శ్రీ పుల్య ఉమా మహేశ్వర శాస్త్రి –‘’భక్తిరస కెరటాలలో తడిపెశారు. హృదయాకర్షంగా ఉంది ‘’అన్నారు .బిలాస్పూర్ నుంచి మధురకవి శ్రీమూలా పేరన్నగారు –‘’ ఈ కవిపు౦గవుని ఉజ్వలతర భావ సంపదలు ,కలిత మృదూక్తులు మనోజ్ఞ వాగ్వధూ గళానికి కఠ హారం చేశారు ‘’అన్నారు .ఇందరు మహామహుల ఆశీర్వాదాలు పొందిన బాలకవి శేఖరుని ప్రతిభ శతకం లోఎలా ప్రతిఫలించిందో తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -12-9-23-ఉయ్యూరు
