సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో
శత(100) శతకం
100 వ శతకం-శ్రీ వట్టి మాయ శతకం
గుంటూరు జిల్లా సంతగుడిపాటి పురవాసి శ్రీ గంగులనారాయణ రెడ్ది గారు రచించి ,శ్రీ గోపాలుని హనుమంతరాయ శాస్త్రి గారిచే పరిష్కరిమ్పజేసిన’’ శ్రీ వట్టి మాయ శతకం’’ కీశే శ్రీ గంగుల మల్లికార్జున రెడ్ది సతీమణి శ్రీమతి రామ లక్ష్మమ్మ గారి ద్రవ్య సహాయంతో నరసరావు పేట రాజ్యరమా ముద్రాక్షర శాలలో 1932లొ ముద్రింపబడింది .కవి గారి గురించి పీఠికలోవినుకొండతాలూకా ముప్పాళ్ళ గ్రామవాసి హనుమంతరాయ శాస్త్రిగారు –‘’ఇది తత్వ శతకం .సంస్కృతంలో నిష్ణాతులైన వారికే రాయటం సాధ్యం .శాస్త్రవాసన కవితా వాసన లేని రెడ్డిగారు ధైర్యంతో రాసిన శతకం నన్ను పరిష్కరించమని కోరగా ఆపని చేశాను .ఆదరించండి ‘’అన్నారు .సంతగుడిపాడు కు చెందిన శ్రీ తోక చిచ్చు వెంకట అప్పలరాజు ‘’ఇందులో ప్రాస పద్యాలుకీర్తనలుగా మంగళహారతులుగా చదువుకోవటానికి వీలుగా ఉన్నాయిఅని కితాబిచ్చారు .అన్నవరం కు చెందిన శ్రీ వాలిచర్ల హనుమయ్య పద్యాలలో –‘’వట్టి మాయ శతకం కన్నా విన్నా కర్మజాలం వదలి మోక్షం కలుగుతుంది ‘’అని అభయమిచ్చారు .ఇది సీస పద్య శతకం .’’బట్టబయలోక్కటే తప్ప వట్టి మాయ ‘’అనేది శతక మకుటం.పుస్తకం వెల చెప్పలేదు బహుశా అమూల్యమేమో!
మొదటి సీసంలో ‘’పలుకు పలికున తప్పు పట్టవద్దని ,అర్ధాన్ని మాత్రమె తెలుసుకోమని కోరారుకవి .తరువాత అంతా వేదాంతం నీతి నింపారు .జగతికి ఆధారం సత్యం జ్ఞానమే ధనం దయ చాలాఅవసరం ,ఓర్మి ఉత్తమ గుణం అన్నారు .శివుడు గొప్ప అని ఒకరంటే విష్ణువే గొప్ప అని వేరొకర౦ టారు .శక్తియే చిచ్చక్తి అంటారు కొందరు .దేవుడు ఎక్కాడా లేడు నీలోనే ఉన్నాడు .అన్నిమతాలు’’ సమ్మతి మంచిది’’ అన్నాయి .సత్తు నుంచి సృష్టి సాగింది అంటుంది ఒక ఉపనిషత్తు .అదికానిది వేరేదీ లేదు అంది మరొకఉపనిషత్తు .సృష్టికి మూలం సృష్టి అన్నది మరొకటి .చివరికి భగవంతుడు ఒక్కడే అన్నారు .
ఆధార చక్రమైన గుదం లొ గణపతి ఉంటాడు స్వాధిస్టానంలో బ్రహ్మ ,మణిపూరకం లొ నారాయణుడు హృదయస్థానమైన అనాహతంలో ఈశ్వరుడు ఉంటారు .ఖేచరిని చూస్తె కేశవుడు కనిపిస్తాడు ,భూచరిని చూస్తె హరి ,శాంభవిని చూస్తేశంభుడు షణ్ముఖి చూస్తె ముక్తిదారి కనిపిస్తాయి .కంటిలో ఎర్రగా కనిపించేదే బ్రహ్మ .నల్లగ్రుడ్డు చుట్టూ విష్ణువు . వర్నాలన్నీ ఉమా నాధుడే ఎక్కడికో పోయి వెతకక్కర్లేదు .ఆకాశానికి వాయువు దానికి అగ్ని దానికి జలం ,దానికి భూమి ,దానికి కర్మేంద్రియాలు ,ఆదిలో జలాలకు కర్మేంద్రియాలు ,అగ్నికి జ్ఞానేంద్రియాలుఉద్భవించాయి అని అద్భుత వేదాన్తరహస్యం బట్టబయలు చేశారు చక్కని తేటతెలుగు మాటలలో .
తర్వాత ఆడవారు మగవారు ఎలా మసలుకోవాలో చెప్పి చేయెత్తి దానం చేసినవారిదే బ్రతుకు సర్వం తానె అనే సమ బుద్ధి ఉన్నవాడిదే బ్రతుకు .కామాదులకు దూరంగా ఉన్నవాడిదే,సాదు సాంగత్యం ఉన్నవాడిదే ,పాపాలు చేయనివాడిదే బ్రతుకుఅని బ్రతుకు సార్ధకత తెలియజేశారు .కనకం ఘనమైనది అనుకొంటే తప్పులో కాలేసినట్లే .కనపడిన రాయి దేవుడేకాదు.తర్వాత పిండం ఏర్పడటం వృద్ధి చెందటం వివరించారు .పుట్టటం ఏమిటి అనే మతి లేకుండా సంచరిస్తున్నారుజనం .భర్తయే దేవుడుఅనుకొంటే ఆనందం .ఆకాశ గంగను భూమికి దింపిన భగీరధుడు ,పాకశత్రువు వచ్చి ప్రార్ధిస్తే ఆశ్వాన్నిచ్చిన దిలీపుడు ,ఉదయాద్రి అస్తాద్రి ఒక్కగట్టున ఉంచిన మాంధాత ,కొడుకు యవ్వనం తీసుకొన్న యయాతి ,ఏకాదశి వ్రతాన్ని పాటించిన మహానుభావుడు అంబరీషుడు కలకాలం బ్రతికి ఉన్నారా ?బతుకు శాశ్వత౦ కాదు .బతుకు సార్ధకం చేసుకోవాలి .వాడి సూది మొనపై ఉంచటం అసాధ్యం .నాది నీది అనే విషయం కానే కాదు .చివర 101వ సీసంలో –‘’కోట్లు సంపాదించి కొంప పెద్దగ జేసి మరలబోయేదడి దొర మంగళ౦బు –మాటమాటకు నోకమాట ను గల్పించు మారాజ నీకిదే మంగళ౦బు –పెంటి ,పోతువు గాక బెంటి పోతువునై మహిమ నేలేడిప్రభూ మంగళ౦బు –కోటలగోటల గోనంకి వెలసిన మాయయ్య నీ కిదే మంగళ౦బు –
మంచి సుఖ మిడు నీశ్వరా మంగళ౦బు –మదిని దయజూడు పరమేశ మంగళంబు –మరచిపోజాల నినున్ స్వామి మంగళంబు-బట్టబయలోక్క తప్ప వట్టి మాట ‘’అని శతకం ముగించారు .
వట్టి మాటల శతకం కాదు ఇది చాలా విలువైన గట్టిమాటల పునాదిపై నిర్మించబడిన శతకం .వీనుల విందుగా ,హృదయానికి పరమానందంగా బుద్ధికి జీవనంగా సాగిన శతకం .సార్ధక శతకం .మనమేమిటో మనకు ఎరుక కలిగించిన జ్ఞాన శతకం .కవి నారాయణ రెడ్ది గారికి శతాధిక అభినందన మందారాలు .’’శత శతకంగా’’ దీన్ని పరిచయం చేయటం నా భాగ్యం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-9-23-ఉయ్యూరు
