సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో
101వ శతకం –రాఘవేశ్వర శతకం
బాలకవి ,తగరంపూడి వాసి సామవేదుల వేంకట శాస్త్రి రచించిన రాఘవేశ్వర శతకం ఖాసీం కోటకు చెందినఉభయభాషాప్రవీణ అష్టావధాని శ్రీ వడ్డాది సీతారామాంజనేయులు పరిశోధీంచగా ,అనకాపల్లి బలరామ కృష్ణా ముద్రణాలయం లొ 1937లొ ముద్రితం వెల –రెండు అణాలు .అనకాపల్లి కి చెందిన సత్యావాణి సంపాదకులు శ్రీ గ్రంధి వెంకటరమణయ్య తొలిపలుకులు పలుకుతూ ‘’ఉత్సాహం ఉన్నవిద్యార్ధి ఈ బాలకవి తెలుగుపై మక్కువతో రాసిన శతకం .శైలి సులభం .అర్ధం మాత్రం గాంభీర్యం ‘’అని మెచ్చారు .ఇది ఉత్పల ,చంకలాలతో కూర్చిన శతకం.’’రాఘవేశ్వరా ‘’అనేది శతక మకుటం .
మొదటి ఉత్పలమాలలో –‘’శ్రీ జనకాత్మజా హృదయ సింధు సుధాకర రామచంద్ర ,ని-ర్వ్యాజ కృపా కటాక్ష పరిపాలిత సంశ్రితలోలక వి-భ్రాజిత రావణాద్యసుర వారవినాశక మౌనిమానసా౦-భోజనివాస వాసవ విభిత్వ సముజ్జ్వల ‘’రాఘవేశ్వరా ‘’అని నమస్సులు పలికి ,పూర్వం వాల్మీకి మహర్షి నీ దివ్యగాధ గానం చేశాడు ,పోతరాజు మధుమదురంగా నీ లీలలు వర్ణించాడు ,తురుష్కకవి కబీరు ‘’వీడు నా వాడు ‘’అని కీర్తించాడు ,గోపయ్య కబీరు చే రామ మంత్రోపదేశం పొంది భక్తరామదాసయ్యాడు,హనుమాన్ నీనామ గానం చేసి పరవశం కలిగించాడు .తులసీదాసు పురాణంగా నిన్ను గురించి రాసి పునీతుడయ్యాడు .కాకరపర్తి వాసి వేదుల రామ శాస్త్రి భక్తితో రచనలు చేశాడు .వేద సంతలు వ్యాకరణ పాండిత్యం తర్కచర్చలతో ఫలితంలేదు నిన్నువర్నించి నీ గురించి చదివి వినకపోతే .
శ్రీ రఘురామ అని చిత్తం లొ తలపోస్తే యముడు భయపడుతాడు .యోగి హృదయాలలో నిరంతర వాసం చేస్తావు .’’నీనామము అన్ని వేళల అడ్డూ ఆపులేకుండా భక్తజనం పలుకుతూ ఆనందాన్ని పొందాలి .లోకంలో ధర్మ సంస్థాపనకోసం రాఘవుడ వై జన్మించావు .కౌసల్యకు వీరమాత అనే యశస్సుకల్పించావు.గాధి సుతుడు చేసే యజ్ఞాన్ని రాక్షస విఘ్నం లేకుండా కాపాడి ప్రియ శిష్యుడవై అన్ని శస్త్రాస్త్రాలు పొందిన భాగ్యశాలివి .’’భీముని విల్లు త్రుంచి భూసుత మెడలో తాళిలికట్టావు .భరద్వాజ విందు పొంది శుభం చేకూర్చావు .జటాయువుకు మోక్షప్రాప్తి కల్గిచావు .’’గబా గబచిన్ని రాఘవు లెకాయకి నన్ గనగా వచ్చు చుండి రంట’’అంటూ పట్టపగ్గాలులేని పరమభక్తితో ముసలి శబరి ‘’దబదబ తీపిపండ్లను ఏరి తెచ్చి సమర్పించి జన్మసార్ధకం చేసుకొన్నది .
రామాయణ ఘట్టాలన్నీ సుందర కవితా బంధురంగా శతకం లొ పొందుపరచాడు మన బాలకవి అలనాటి లవకుశుల్లాగా .చివరలో తాను వేదులపార్వతీశం వెంకట రట్నంల పెద్ద కుమారుడనని ,నీసేవ నిత్యం చేసే వెంకట శాస్త్రి ని అని ప్రవర చెప్పుకొన్నాడు ‘’జయజయ జానకీ హృదయ సారస పూషణ సాధుపోషణా’’అంటూ చంపకలో ,చివరగా ఉత్పలమాలలో ‘’మంగళమయ్య నీకు శుభ మంగళమయ్య మహీ తనూజకున్ ‘’అని మంగళం పాడి సమాప్తి చేశారు .
102- బలరామ శతకం
పూర్వకవి శ్రీ సాతులూరి సుభద్రాచార్య విరచిత బలరామ శతకంను తణుకు బోర్డు ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ సాతులూరి వేంకట నరసింహా చార్యులుగారు తణుకులో డివి శ్యామలరావు గారి శ్యామలా ఆర్ట్ ప్రేస్ లొ1931లొ ముద్రించారు .వెల-రెండు అణాలు .విజ్ఞప్తిలో నరసింహా చార్యులు గారు- ‘’ మా ప్రపితామహులు 1779లొ జన్మించి పోలవరం జమీందార్ శ్రీ కొచ్చెర్లకోట జగన్నాధరావు గారి ఆస్థానం లొ పండితులుగా ఉండి’’రమణక్క పేట ‘’అగ్రహారాన్ని గౌరవార్ధంగా పొందారు .వారు గారుడా శైలశతకం నృసిమ్హశతకం వైజంతీ స్తవం (సంస్కృతం ),ఎనుబది రెండు వార్తలుఅ నే పదహారు సీసపద్యాలు రచించారు.ఈ సీసపద్యాలు నేను ముద్రించి ధన్యుడనయ్యాను .ఈ శతకాన్ని ముద్రించటానికి జమీందారుగారు, తణుకు తాలూకాబోర్డ్ ప్రెసిడెంట్ సారస్వతలోలురు శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు చౌదరిగార్లు ఆర్ధిక సాయ౦ అందించారు .అని కృతజ్ఞతలు ప్రకటించారు .కపిల మల్లెశ్వరానికి చెందిన శ్రీ వ. రాధా మనోహర శర్మ –‘’కవిగారు భక్తిరస ప్రాధాన్యంగా శయ్యాచాతుర్యంగా ని౦దాగర్భిత స్తవంగా అసమాన సాహిత్యగారిమగా ,పారవశ్యంగా రచించిన శతకం ఇది ‘’అని గొప్పగా చెప్పారు .ఇది సీస పద్య శతకం –‘’రేవతీకామ బలరామ రిపు విరామ ‘’శతకం మకుటం .
మొదటి సీసం –‘’శ్రీకోరుకొండ నృసింహు ల సేవించి-భద్రాద్రిరాముల బ్రస్తుతించి –శ్రీరంగనాయక శ్రీపాదములకు మొక్కి –కంచి వరద రాజ కద దలంచి –రామానుజాచార్య రమ్యా౦ మ్ఘ్రులను బట్టి-భక్తి నడాధూరు వరదుగొలిచి- సకల భగవాంఘ్రిసలిలంబు జేకొని –శ్రీ రామపాదాబ్జ సేవ జేసి
గీ-వీర శ్రు౦గార రసదధునీ విషాద సీస –పద్య శతకంబు నీపాద పద్మ మందు –జేర్చి పూజింతునన్ను రక్షిమ్పుమయ్య –రేవతీ కామ బలరామ రిపు విరామ ‘’అంటూ సకల విశ్వ క్షేత్ర దర్శనం చేయించారు .గౌతమ ,కయ్యట జైమిని కపిల మహర్షులను స్మరించి ,ప్రతివాది భీకర రాఘవ గురునికి మొక్కి ,ఆ గురు దేవుని వలననే తర్కవేదాన్తాది సర్వశాస్త్ర నిష్ణాతుడనయ్యానని ,గీర్వాణకవితా మనోహరత్వం అబ్బిన భారద్వాజ గోత్రీకుడను క్షేమ సుభద్రాచార్య నామ ధేయుడిని ,ఉత్ప్రేక్షాది అలంకారాలతో సీస పద్యశతకం కూరుస్తున్నాను అన్నారు .కామిన్యలంక్రియా కాలసుందర ,నిజముఖపద్మ దర్శన౦గా ఉండే నీ మోము చూచినకొద్దీ మనోహరం .’’మారు నల్లని గల్వకతారులంగా సోగలౌ నీ కన్గవసొగసు చూసి గోపకాంతలు నిన్ను గూడాలని చేరారు .
స్వామి శరీరంలోని ప్రతి అంగాన్ని మహా కవిత్వ సౌందర్యంతో తనివి తీర వర్ణించి శతక ప్రబంధమా అని పించారు కవీశ్వరులు .ధగధగాద్ధగిత దేహ ఛాయ గంగాప్రవాహమే. తళతళలాడే తరుణ వలులు విలసత్తరంగాలి. ఘర్మబిండువులు ముత్యాల సోంపు .నాభి గంగాయమునా సంగమమే .రమణీయ పీతాంబరం తమ్ముడికిచ్చి నువ్వుమాత్రం నీలామ్బరాలు కట్టావు .రధాలు తమ్ముడికిచ్చి నువ్వు నాగలిపట్టావు .ఖడ్గం తమ్ముడికిచ్చి రోకలి చేతబట్టావు .గోపికా బృందాన్ని తమ్మయ్యకిచ్చి నువ్వు ఏకపత్నీ వ్రతం దాల్చావు .దొరతనం భోగభాగ్యాలు కన్నయ్యకిచ్చి నువ్వు దేశాటనంతో తృప్తి పొందావు .
కుబ్జ తమ్ముడి ఆధరం కోరిందికాని బలభద్రుని జోలికిరాలేదు .రేవతి ఎన్ని నోములు నోచి తపస్సు చేసిందో నిన్నుపెళ్ళాడటానికి .తమ్ముడు మాయలోడు .నువ్వు ముక్కు సూటి మనిషి పొగడ్తల అగడ్తలో పడి పోతావు కొంప కొల్లేరు అవుతే తమ్ముడే వచ్చి కాపాడాలి .ముస్టి కాసుర సంహారం నీ వల్లనే జరిగింది .రోహిణికి పుట్టి జరాసంధుని మదం అణగించి ,రణరంగ కౌశలంతో దిక్కులు జయించావు .చివరి పద్యంలో గజేంద్ర మోక్షం కథ వివరించి ముగించారు .
మనసుకు హృదయానికి బుద్ధికి విందు చేసే శతకరాజం ఇది .ఆచార్యుల వారి సర్వతోముఖ పాండిత్యానికి అశేష శాస్త్ర పరిచయానికి నిలువెత్తు దర్పణం .వారి కవితా మహత్తు తెలియజేయాలంటే ప్రతి పద్యమూ ఉదాహరించాల్సిందే .అద్భుతమైన ప్రబంధ సమానమైన పద్య శతకం .కవి శ్రీ సుభద్రా చార్యుల గారికి మనస్పూర్తిగా వందన శతం అందజేస్తున్నాను .ఈ శతక పరిచయం నా అదృష్టం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-9-23-ఉయ్యూరు —

