సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో
103 వ శతకం –రాజయోగి శతకం
కృష్ణా జిల్లా నూజివీడుకు చెందినశ్రీ కంతేటి వీరయ్యకవి ఈ రాజ యోగ శతకం రాశారు .రాజయోగులనుస్మరిస్తూ ఆట వెలదులలో రాసిన శతకం .దీనికి ముందు ఈ కవి ఆంజనేయ తారావళి ,హరినామ సుధాలహరి ,శ్రీమద్వయదోశషరహిత కన్దార్ధములు అనే నిజగురు పూజావిధానం ,మహాలక్ష్మమ్మ దండకం ,గజేంద్ర మోక్షరగడ రాసినట్లు ,ముద్రణలో నలోపాఖ్యాన రగడ ,మహాద్వైత భ్రమ నిరసనం ఉన్నట్లు చెప్పుకొన్నారు .’’రమ్యముగ దెల్పెదను విను రాజయోగి ‘’అనేది మకుటం .
మొదటి పద్యం –‘’శ్రీకరంబగు విజ్ఞాన సిద్ధికొరకు –సద్గురుస్వామి చరణా౦బుజముల దలచి –హరిహర హిరణ్యగర్భుల కాత్మ మ్రొక్కి –రమ్యముగ జెప్పెదను విను రాజయోగి ‘’.తర్వాత గురువే హరి బ్రహ్మ రుద్రుడు పరమాత్మ అని ,పరము పొందాలంటే గురు చరణాలు శరణ్యా లు అని చెప్పారు తర్వాత అంతా నీతులే బోధించారు .పిండమెరిగిన యోగి సద్విమలయోగి అండమెరిగిన యోగి శివుడే అన్నారు .పవనాన్ని అభ్యాసం చేస్తే మనసు నిర్మలమౌతుంది .జీవ శివులను కూరిస్తే ముక్తి .అస్టమదాలు భ్రస్టుల్ని చేస్తాయి .సాధన లేకపోతె తత్వార్ధ చింతన సాగదుడ .ఎరుకతో లోకాలన్నీ దర్శించవచ్చు .తత్వమసి మొదలైన మహా వాక్యాలు తరచి ప్రజ్ఞతో పరమపదం తెలుసుకోవాలి .పాలలో నీరుపోస్తే పాలు అవుతాయికాని పాలు మాత్రం నీరుకానేకాదు .
పరం అందుకోవటానికి రాజయోగం రాజమార్గం .దైవభావనకు హీనజన్మకు కర్మ కారణం .మాయతెలిస్తే అదే మాయమైపోతుంది .108 వా పద్యంలో ‘’మేటి తిరుమణి శెట్టి శ్రీ కోటయార్యు –కరుణ కంతేటి వీరయాఖ్య కవి సూరి –జనులకానంద సుధలొల్కగను రచించె –రమ్యముగ దెల్పెదను విను రాజయోగి ‘’అని ముగించారు .గద్యంలో –ఇదిశ్రీసీతారామ చంద్ర ప్రసాద లబ్ధ కవితా ధురీణ బాలకాన్వాయ సంజాత కంటేత్యుపనాయక లక్ష్మణాఖ్య పౌత్ర లక్ష్మీదేవి రామయాభిదాన గర్భ పయః పారావార రాకాసుధాకర సకల సుకవి సాధు జన విధేయ వీరయాభి ధేయ ప్రణీతంబైన శ్రీ రాజయోగి శతకం సర్వముసంపూర్ణము. శ్రీ కోటేశ్వరార్పణ మస్తు అని పూర్తి చేశారు .తతేలికపదాలతో గర్భితమైన రాజయోగాన్ని అందంగా ఆటవెలదులతో ఆడుకొంటూ కూర్చిన శతకం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-15-9-23-ఉయ్యూరు

