సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలలో
105 వ శతకం –భక్త సంరక్షక శతకం
ముప్పాళ్ళ పురవాసి శ్రీగోపాలునిహనుమంతరాయ శాస్త్రి గారు రచించిన భక్త సంరక్షక శతకం గుంటూరు కన్యకాముద్రాక్షార శాలలో శ్రీ పెండేల చక్రపాణి సోదరుల చే 1924లొ ముద్రితం .వెల –నాలుగు అణాలు అంటే పావలా .ఉపోద్ఘాతం లొ కవి గారు –‘’ఈ శతకాన్ని శ్రీమాన్ దూపాటి తిరుమల వేంకట రమణా చార్యుల వారిచే సవరింప జేసుకోన్నాను .’’అన్నారు .శతావధానులు శ్రీ శేషాద్రి రమణ కవులు కంద పద్యం లొ-‘’అలరారు తేనే మాటలలొ పులకండపు మూటలోఅమోఘ పదంబున్ – దిలకిమ్పజేయు బాటలో తెలియవు హనుమంతరాయ తీయని మాటల ల్’’అని ఆశీరభినందనలు అందించారు .ఇది శార్దూల ,మత్తేభ శతకం .’’భక్త సంరక్షకా ‘’అనేది శతక మకుటం .
మొదటిపద్యం –‘’శ్రీమద్వాస శుకాదిమౌని జన హృత్సీమాంతరాళ్ళోల్లస-ద్ధామానిస్తుల నిర్వికార పరమాత్మా సచ్చిదానంద రూ-పా మార్తాండ సహస్ర భాస ,తిజగద్వంద్యా పరాధీన ఈ-శామాయావ్యతిరేక భావ యుత దీక్షా ‘’భక్త సంరక్షకా ‘’అంటూ భక్తీ తత్పర ప్రవాహం తో మొదలుపెట్టి ,రెండవ పద్యంలో తన తండ్రి గురువు శ్రీ గోపాలుని శ్రీ రామాచార్యులను తలచి ,తనలో కవితాభిజ్ఞత కలిగించిన మహాకవులకు మోకరిల్లి శతకం రాస్తున్నాను అన్నారు .నేనే బ్రహ్మం అని తెలుసుకొంటే చాలు మోక్షమే .రామ కృష్ణ సూర్య చంద్ర పేరులన్నీ పరంధాముడవైన నీవే .మత్తేభంలో –‘’ధరణీ వ్యోమ తలా౦తర ప్రకట నిత్య స్తుత్య తేజస్వి ,సు౦-దర మాయా వరణా ను భాసి విపులా నందో బ్రహ్మ యన్ –స్థిర వాక్యాలకు ‘’ఆటపట్టు నీవే .సత్పద మహాద్వైతం సత్యం .శూన్యాభాసివైనా అవతారాలు పెక్కు దాల్చావు .ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏపని చేసినా చూసి దానికి తగిన ఫలితమిస్తావు .సత్కులం లోపుట్టిన రాజైనా విప్రుడైనా గుణ స్తోముడుకాకపోతే ‘’గుణ పంచముడు ‘’అనాలి .శరీరాలు శూన్యాలు అని చెప్పే గురుని వెతుక్కోవాలి
అణువులోనూ ,బ్రహ్మా౦డంలోనూ నిత్య సత్య నితాంత ఆశ్రయుడవు .ద్వంద్వాలకు ఆతీతుడైన వాడే తండ్రి తల్లి గురువు దైవం .గురు వాక్యం అనే నావ ఎక్కి ఆహమనే అగడ్త దాటి ,సోహం అనే సుధ గ్రోలి ,సంతోష ,ప్రమత్తతేజంతో శాంతి అనే శస్త్రాస్త్రాలతో జయించి మోక్షరమను పెండ్లాడాలి .ఆధారాలకు ఆధారం ‘’సదధ్యారో పవాదాస్పద ప్రాధాన్యం ,విరాట్స్వారాట్పర సుసంబంధంబు ,యోగాది విద్యా ధౌరేయం సర్వ దేవ నిచయ వ్యామోహ సర్వేశ్వరా .నీతులు చెప్పటం కాదు ఆచరించాలి .అహింస కంటే ధర్మ౦ లేదు.అన్యాయంగా హింస ఎవరికీ చేయరాదు .చివరలో ఫలస్తుతి చెప్పి తన గురించి గోపాలుని రామశాస్త్రి కుమారుడిని ‘’రసా దేవ కులుండ బండిత జనానందాన సంధాను ,తత్పరతా సక్తుడను మోక్షసాధన వచో ధన్యుడను హనుమంతరావు అనే భక్తుడను అని చెప్పుకొన్నారు .
గద్యంలో –వినుకొండ తాలూకా ముప్పాళ్ళ గ్రామ వాసి ,ఆరువేల నియోగి సంస్కృత ఆంధ్ర పండితుడు మౌద్గల్య గోత్ర సంభవుడు గోపాలుని శ్రీరామమూర్తి తనూజుడు హనుమంత రాయ శాస్త్రి రాసిన భక్త రక్షక శతకం అనే పేరున్న ‘’సుమనోల్లాసం ‘’సర్వం సంపూర్ణం అన్నారు .
కవిగారు మహా పండితులు బహు శాస్త్రవేది .అల్మకార శాస్త్ర౦ లోతు తరచినవారు .తత్వశాస్త్రం పుక్కిలించి ,వ్యాకరణం మధీంచి ’’అహం బ్రహ్మాస్మి ‘’ అర్ధం చేసుకొని రాసి తాను తరించి మనల్నీ తరి౦ప జేశారు .ప్రతి పద్యం రస బందురమే .శైలి గంగా ప్రవాహమే .భావాలు అమృతోపమానమే .మంచి కవిని గొప్ప శతకాన్ని పరిచయం చేసి ధన్యత చెందాను .
మనవి –శతాధిక శతకాలను పరిచయం చేసే అదృష్టం నాకు కలిగింది .ఈ 105 వ శతకం తో ప్రస్తుతానికి’’ కామా ‘’మాత్రమె పెడుతున్నాను .మళ్లీ మంచి శతకాలు లభ్యం అయితే పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకూ స్వల్ప విరామం .
ఈ శతక పరిచయాన్ని రేపు వినాయక చవితి సందర్భంగా ఆన్ లైన్లో ఆది దేవుడు శ్రీ విఘ్నేశ్వర స్వామికి అ౦కిత మిస్తోంది సరస భారతి .
రేపు వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-23-ఉయ్యూరు

