సరదాగా కాసేపు
ఉండ్రాజువారి ఉత్తేజామ్లం
దూరాన ఉన్న చర్చిలో దేవుడి కీర్తనలు మేము కూచున్న పానకుటీరం దాకా వినిపిస్తున్నాయి. సూతరాజుగారు శ్రుతి కలిపి మంద్రంగా పాడుతున్నారు. కాసేపలా కూనిరాగం తీసి ఇలా అన్నారు: “మీకు తెలుసో, లేదో గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఈరోజుల్లో చర్చి పాస్టర్లు ఎవరూ సన్నగా, రివటలా వుండటం లేదు, గమనించారా?”
“నిజమే. ఇప్పటి వాళ్ళంతా కండలు పెంచుకున్న వస్తాదుల్లా ఉంటున్నారు. సన్నగా, పీలగా ఉండే పాస్టర్లని ఈమధ్య నేనెప్పుడూ చూడలేదు,” ఒప్పుకున్నాను నేను.
“మా ఇంటి పక్కన ఉండే ఉండ్రాజు కృపానందంగారి అబ్బాయి ప్రేమ్ సాగర్ ని చూశారా ఎప్పుడన్నా?”
“లేదండీ.”
“అదేదో పాటలో వర్ణించినట్టే ఉంటాడతను. ప్రేమ్ సాగర్ సంగతి వినాలని మీకు కుతూహలంగా ఉన్నట్టుంది, చెపుతా వినండి.”
ఇది జరిగిన రోజుల్లో (సూతరాజుగారు కథకి ఉపక్రమించారు) ప్రేమ్ సాగర్ చిన్న కుగ్రామంలో వున్న చర్చి పాస్టర్ దగ్గిర అసిస్టెంటుగా ఉంటుండేవాడు. కుర్రాడే అయినా వయసుకి తగినంత చొరవ, ధైర్యమూ లేక పిరికివాడుగా చెలామణి అవుతుండేవాడు. కాలేజీ రోజుల్లో మాత్రం కొంత దూకుడుతనం కనిపించినా బహుశా థియోలాజికల్ కాలేజీ దశలో ఏదో క్రూరాత్మ అతన్ని ఆవహించి ఉండవచ్చు. అక్కడినించి బయటపడిన తరవాత పాపాత్ములకి సన్మార్గం చూపించే కార్యక్రమంలో రెవరెండ్ గొర్తి రాజారత్నంగారికి సాయపడుతూ ఆయన చర్చిలోనే ఉండేందుకు వచ్చాడు. ఆరోజుల్లో ప్రేమ్ సాగర్ చాలా సాత్వికంగా, అమాయకంగా ఉండేవాడు. నున్నటి జుట్టు, నీరసమైన ముఖంతో బలహీనంగా కనిపిస్తుండేవాడు.
బాగా కండరాలు తిరిగి, మంచి ఒడ్డూ పొడుగుతో నిండుగా ఉండే రెవరెండ్ గొర్తి రాజారత్నం పర్సనాలిటీ కూడా అతనికి ప్రాప్తించిన పిరికితనాన్ని, సంకోచాన్ని పోగొట్టలేకపోయింది. రెవరెండ్ రాజారత్నంకి పుష్కలమైన కండబలం ఒక్కటే కాదు – రోషం, ఆవేశం, మితిమీరిన కోపం కూడా ఆయన సొత్తు. ఎదుటివాళ్ళు మాడి, భస్మీపటలం అయ్యేలా ఉండే ఆయన చూపు ఎంతటి గట్టివాడినీ గజగజ వొణికేట్టు చేస్తుంది. కాలేజీ రోజుల్లో కుస్తీ పోటీల్లోను, బాక్సింగ్ లోనూ అయనకి చాలా మెడల్స్ వచ్చాయని చెబుతారు. ప్రేమ్ సాగర్ ప్రకారం – చర్చికి సంబంధించిన వాదోపవాదాలలో కూడా ఆ మెళకువల్నే ఎక్కువగా ప్రయోగించేవాడట ఆ రెవరెండ్ గారు. ఒకసారి ఈస్టర్ పండగ సందర్భంలో చర్చి అలంకరణ గురించి ఆయన చెప్పినదాన్ని వ్యతిరేకించినందుకు ఎత్తి కుదేసినంత పని చేశాడని ఆతను చెప్పడం నాకింకా గుర్తే. అసలు విషయానికి వస్తే జరిగింది చాలా చిన్నదట – తెల్లగా సున్నం వేసిన గోడల మీద దేవుడి వాక్యాలు ఎర్రటి పెయింటుతో రాయించాలా లేకపోతే నీలంరంగు పెయింటుతో రాయించాలా అన్న విషయం మీద నెత్తురు చిమ్మేంత రభస చేసినట్టు చెప్పాడు.
అదీ రెవరెండ్ గొర్తి రాజారత్నం గారి అసలు రూపం. అయినా, అంత భీకరంగా ఉండే ఆయన గారి కూతురు మీదనే ప్రేమ్ సాగర్ తన మనసు పారేసుకున్నాడు. కాముడి బాణాలకి మనమందరం హీరోలు అవుతామనేది పచ్చి నిజం.
కరుణ చాలా మంచి పిల్ల. ప్రేమ్ సాగర్ ఆమెని ఎంత అభిమానిస్తాడో ఆమె కూడా అతన్ని అంత అభిమానంతో ప్రేమించింది. ఐతే ఆ సంగతి రెవరెండుకి చెప్పేందుకు ధైర్యం చాలక మూడోకంట కనబడకుండా వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు చాటుమాటున కలుసుకుంటూ వుండేవాళ్ళు. ఐతే ఉండ్రాజువారి కుటుంబీకులందరిలా ప్రేమ్ సాగర్ కి కూడా అబద్ధాలంటే గిట్టదు, నిజం చెప్పడానికి ప్రాణం ఇస్తాడు. అందుచేత ఇలా మోసగిస్తూ కలిసే దానికన్నా నిజం చెప్పేస్తే మంచిదనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం సంధ్య వెలుగులో వాళ్ళిద్దరూ పెరట్లో మామిడిచెట్టు వెనకాల పచార్లు చేస్తున్నప్పుడు ప్రేమ్ సాగర్ దీనికి ఇంక స్వస్తి చెప్పాలనుకున్నాడు.
“కరుణా, ఇలా రహస్యంగా కలుస్తుండటం నావల్ల కాదు ఇంక. ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళి నిన్ను నాచేతుల్లో పెట్టమని మీ నాన్నగారిని అడిగొస్తా,” అన్నాడు ఆమెతో.
నాన్నగారి స్వభావం కరుణకి కొట్టినపిండి కనక చేతి సంగతి ఎలా వున్నా జవాబు మాత్రం బూటుకాలితో ఇస్తాడనే గ్రహింపు ఉంది. ముఖం పాలిపోయింది. అతను వెళ్ళకుండా ఆపుతూ గట్టిగా పట్టుకుంది.
“వద్దొద్దు. నామాట విను ప్రేమ్, వెళ్ళొద్దు.”
“ఇలా దాగుడుమూతలు ఆడకుండా తిన్నగా ఉండేందుకు మనకి అదొక్కటే మార్గం, డార్లింగ్.”
కానీ ఇవాళ మాత్రం వద్దు. నిన్ను బతిమాలుకుంటా, ఇవాళ వద్దు.
“ఏం, ఎందుకని?”
“ఆయన ఇవాళ చాలా కోపంగా ఉన్నారు. చర్చిలో మాస్ లోను, పండగలకీ ఆయన వేసుకునే అంగీకి చాలా ఆడంబరంగా లేసు పూలు, అల్లికలూ చేయించుకున్నడని, అది పద్ధతి కాదని, పాస్టరుకి అన్ని అలంకారాలు తగవనీ అభ్యంతరం తెలుపుతూ ఇంతకు ముందే బిషప్ బూషి శౌరయ్య గారినించి లెటరు వచ్చింది. దాంతో నాన్నగారు మండిపడుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే – తనూ, బిషప్ శౌరయ్యగారూ చిన్నప్పుడు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న సంగతి నాన్నగారు ఇంకా మరిచిపోలేదు. భోజనం చేస్తూ, ‘ఆ చట్టిముక్కు బూషి శౌరయ్యగాడు నామీద పెత్తనం చెలాయిద్దామని అనుకుంటున్నాడు కాబోలు, వాడికి నా తడాఖా చూపిస్తా’ అంటూ ఆయన మీద కారాలు మిరియాలు నూరారు.”
“జ్ఞానస్నానం జరిపించడానికి బిషప్ శౌరయ్యగారు రేపే ఇక్కడికి వస్తున్నారు మరి.”
సశేషం

