తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త.బాల వాజ్మయ బ్రహ్మ ,,తెలంగాణ భీష్మ –శ్రీ ఆదిరాజు వీరభద్రరావు

తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త.బాల వాజ్మయ బ్రహ్మ ,,తెలంగాణ భీష్మ –శ్రీ ఆదిరాజు వీరభద్రరావు

జననం – విద్యాభ్యాస౦
ఇతను 1890 నవంబరు 16న ఖమ్మం జిల్లా, మధిర మండలం, దెందుకూరు గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి లింగయ్య మరణించాడు. తల్లి వెంకమాంబ ఇతన్ని మంచి చదువు చదివించాలని తలచి దూరపు బంధువైన రావిచెట్టు రంగారావు ను ఆశ్రయించింది. రావిచెట్టు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలనుండి విద్యనభ్యసించి, రావిచెట్టు రంగారావు ఇంట్లో నెలకొల్పిన శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడిగా ఆదిరాజు వీరభద్రరావు నియమితులైనాడు.[1]

రచనా ప్రస్థానం

1908లో కొమర్రాజు లక్ష్మణరావు యొక్క విజ్ఞాన చంద్రికా మండలి హైదరాబాదు నుండి మద్రాసుకు తరలి వెళ్ళవలసి వచ్చిన తరుణంలో, లక్ష్మణరావు విజ్ఞప్తి మేరకు వీరభద్రరావు కూడా మండలిలో పనిచేయటానికి మద్రాసు వెళ్ళాడు. మండలిలో పనిచేస్తున్న సమయంలో అనేక ప్రసిద్ధ రచయితలు, కవులు, పండితులు, పరిశోధకులతో పరిచయం ఏర్పడింది. లక్ష్మణరావుచే ప్రభావితుడై, ఆయన మార్గదర్శకత్వంలో చక్కని పరిశోధకునిగాను, బాధ్యతాయుత రచయితగాను శిక్షణ పొందాడు. 1914లో హైదరాబాదుకు తిరిగివచ్చి మహబూబ్ కళాశాలలో తెలుగు ఆచార్యునిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత ఛాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలోనూ, నారాయణగూడలోని బాలికోన్నత పాఠశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేశాడు. మర్రి చెన్నారెడ్డి ఇతని శిష్యులలో ప్రముఖుడు.[2]

1921లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికై ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించినప్పుడు దానికి కార్యదర్శిగా ఆదిరాజు పనిచేశాడు. ఆ సంస్థ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రదేశాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించి “తెలంగాణ శాసనాలు” పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించుటలో ఆదిరాజు కృషి నిరుపమానమైనది. కాకతీయ రాజ్య పతనానంతరం ఓరుగల్లును ఏలిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెలువరించాడు. తెలంగాణ 9 జిల్లాల చరిత్రను, భాగ్యనగరం గ్రంథాలను కూడా రచించాడు.

సారస్వత, గ్రంథాలయ సేవ

ఇతడు శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంలో లైబ్రేరియన్‌గా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశాడు. విజ్ఞానచంద్రిగా గ్రంథమాల కార్యాలయ ప్రముఖుడిగా, ఆంధ్ర జనసంఘ కార్యవర్గ సభ్యుడిగా, లక్ష్మణరాయ పరిశోధకమండలి కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వతపరిషత్తు స్థాపక సభ్యుడిగా, ఆంధ్ర చంద్రికా గ్రంథమాల ప్రధాన సంపాదకుడిగా, విజ్ఞానవర్ధినీ పరిషత్తు సభ్యుడిగా, సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ ప్రధాన సంగ్రాహకుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యునిగా ఇతడు తన సేవలను అందించాడు.

అలనాటి దక్కన్ రేడియోలో తెలుగులో మొట్టమొదటి ప్రసంగం చేసిన ఘనత ఇతనికే దక్కింది.

మరణం- 1973, సెప్టెంబరు 28

బాలవాజ్ఞ్మయ బ్రహ్మ ఆదిరాజు వీరభద్రరావు

 పందొమ్మిదో శతాబ్ది మద్యకాలంలో హైదరాబాద్‌లో ఏ సాహిత్య సమావేశం జరిగినా, గ్రంథాలయ సభ జరిగినా, అక్కడ ఒక పొడవాటి, బక్కపలచని, నిరాడంబరమైన వ్యక్తి తాపీగా పాన్‌ నములుతూ కనిపించేవాడని, తెరిచిన పుస్తం లాంటి ఆయన తెలుగు సాహిత్యంలో పరిశోధన మొదలు పరిష్కరణ వరకు, కవిత్వం మొదలు జీవిత చరిత్రల వరకు చేపట్టి సుసంపన్నం చేయని ప్రక్రియ లేదంటారు ప్రముఖ పాత్రికేయులు టి.ఉడయవర్లు. ఆయన మహా పండితులు పండిత ఆదిరాజు వీరభద్రరావు పంతులు.

 1880వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా మధిర తాలూకాలోని దెందుకూరులో పుట్టారు. తండ్రి ఆదిరాజు లింగయ్య పంతులు, తల్లి వేంకమాంబ. బాల్యం నుంచే తెలుగు భాష పట్ల ఆదిరాజుకు అపారమైన మక్కువ ఉండేది.

తెలుగు భాషాభివృద్ది కోసం హైదరాబాద్‌లో ఏర్పాటైన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి రావిచెట్టు రంగా రావు కోరికపై కొంత కాలం గ్రంథాలయాధికా రిగా పనిచేశారు ఆదిరాజు. తరువాత 1908లో మద్రాసు చేరి విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలితో ఉన్నారు. ఈ సమయంలోనే ‘రమేశచంద్ర దత్తు’ ‘ఉమేశ చంద్ర బెనర్జీ’, ‘రావిచెట్టు రంగారావు జీవిత చరిత్ర’ లను ‘జీవిత చరితావళి’ పేరుతో ప్రచురించాడు. తిరిగి హైదరాబాద్‌కు మకాం మార్చి 1914-21 మధ్య మహబూబ్‌ కాలేజీలో, 1921 నుండి 1948 వరకు చాదర్‌ఘాట్‌ పాఠశాలలో, ఉద్యోగ విరమణానంతరం కూడా 1953 వరకు నారాయణగూడ బాలికోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.
గ్రంథాలయోద్యమం, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర పరిశోధక మండలి, లక్ష్మణరాయ పరిశోధక మండలి, విజ్ఞానవర్ధనీ పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర చంద్రికా గ్రంథమాల, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి వంటి అనేక సంస్థలకు సన్నిహితునిగా, స్థాపక సభ్యునిగా, వివిధ పధవుల్లో సేవలందించారు. ‘చిత్రశాకున్తలము’, ‘చారిత్రక పరిశోధక వ్యాసములు’, ‘ప్రాచీనాంధ్ర నగరములు’, ‘తెలంగాణము’, ‘మన తెలంగాణము’, ‘గ్రీకు పురాణ గాథలు’ వీరి రచనల్లో కొన్ని.
భాషా సాహిత్య సేవకునిగా, పరిశోధకునిగా అనేక ప్రామాణిక గ్రంథాలు రాసిన ఆదిరాజు వీరభద్రరావు బాలబాలికల మనోప్రవృత్తిని దృష్టిలో ఉంచుకుని 1920 ప్రాంతంలోనే బాలల కోసం రచనలు చేసినా బాల సాహిత్య చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు. పిల్లలకు విజ్ఞానం, వినోదం కలిగించే రచనలు, వీరగాథలు, చారిత్రక పౌరాణిక గాథలు, కల్పనా కథలను పేమ, ఉత్తమ శౌశీల్యం పెంపొందే దిశగా పిల్లల కోసం అందించాలన్నది వీరి తపన. వీరి బాల సాహిత్యంలో ‘చైతన్యము’, ‘లలిత కథావళి’, ‘రత్న ప్రభ’, ‘నవ్వుల పువ్వులు’, ‘జీవిత చరిత్రలు’, ‘మిఠాయి చెట్టు’ వంటివి ప్రముఖమైనవి.
వీరి బాల సాహిత్యంలో అన్ని పేరుపొందినా ‘మిఠాయిచెట్టు’ పేరుతో వచ్చిన కథల సంపుటి ఎక్కువగా ఖ్యాతి చెందింది. ఇది మూడు కథల సంపుటి. ఇందులో ‘మిఠాయిచెట్టు’, ‘తామర కొలను’, ‘నలుగురు పాటకులు’ అనే వినోదాత్మక కథలున్నాయి. మిఠాయి చెట్టు కథ అనేక కథా సంకలనాల్లోనూ, పాఠ్యపుస్తకం లోనూ చేర్చబడింది. ‘చైతన్యము’ పిల్లల కోసం రాయబడిన రచన. ఇందులో చైతన్య ప్రభువు, యులిస్సీజ్‌, మధుకైటభులు, జేమ్స్‌ రాల్ఫీల్డ్‌ మొదలగు మహనీయుల గురించి రాయబడింది. ‘లలిత కథావళి’ ఇది చరిత్ర, కళలకు సంబంధించిన అజంతా ఎల్లోరా, రమేశ్‌చంద్ర దత్తు, పెరుస్యుస్‌, శ్రావణి వంటి వ్యాసాలు పిల్లలకు ఆయా విషయాలపట్ల అవగాహన కలిగించేందుకు రాయడం జరిగింది. పాఠ్య పుస్తకాల్లో వీరి అనేక రచనలు చేర్చబడ్డాయి.
ఆదిరాజు బాలల రచనల్లో చేసిన గొప్పపని కూడా ఉంది. అరేబియన్‌ నైట్స్‌ వంటి కథలను అలాగే రాస్తే ఇక్కడి పిల్లలకు అది ఎలా చేరుతుందని భావించి ‘అల్లావుద్దీన్‌ విచిత్ర దీపం’ కథకు తెలుగుపేర్లు పెట్టి, తెలుగు వాతావరణాన్ని చేర్చి ‘రత్నప్రభ’ పేరుతో రచించాడు. ఇంగ్లీష్‌లో వివిధ విషయాలను ‘టిట్‌బిట్స్‌’గా రాయడం మనకు తెలుసు. అదే కోవలో తెలుగులో అలా రాస్తే ఎలా ఉంటుందని ఆలోచించి కొన్ని ఆంగ్ల సంఘటనలకు తెలుగువేషం కట్టి వాటిని ‘నవ్వుల పువ్వులు’ పేరుతో పిల్లలకు అందేట్టు కూర్చారు. మరో మంచి గ్రంథం ‘జీవిత చరిత్రలు’, దీనిని పిల్లలకు ఉత్తమ సారస్వతం అందించాలన్న ప్రభుత్వంవారి ఆదేశానన్ననుసరించి సారస్వత పరిషత్తు ప్రచురించింది. ఇందులో శ్రీకృష్ణ దేవరాయలు, మార్కొపోలో, మీరాబాయి, శ్రీహర్షుని జీవత కథలున్నాయి. వీరి బాల సాహిత్యాన్నంతా నేటి ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ (తెలంగాణ సారస్వత పరిషత్తు) బాల సారస్వతం శీర్షికన ప్రచురించడం విశేషం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో సారస్వత పరిషత్తు బాల సాహిత్యానికి చేసిన కృషి ఎక్కడా నమోదు కాక పోవడం బాధాకరం. మహా పండితుడు, తెలంగాణ బాల వాజ్ఞయబ్రహ్మ ఆదిరాజు వీరభద్రరావు పంతులు సెప్టెంబర్‌ 29, 1973న కన్ను మూశారు.

  • డా|| పత్తిపాక మోహన్‌,

తెలంగాణ భీష్ముడు ఆదిరాజు వీరభద్రరావు: —.జాధవ్ పుండలిక్ రావు పాటిల్–9441333315,భైంసా,నిర్మల్ జిల్లా
నవంబర్ 06, 2020 • T. VEDANTA SURY

ఆదిరాజు వీరభద్రరావు ప్రముఖ చరిత్ర ,సాహిత్య పరిశోధకులు.ఖమ్మం జిల్లా మధిరి తాలూకాలోని వెందుకూరు గ్రామంలో ని బ్రాహ్మణ కుటుంబలో 1890 నవంబర్ 16 న లింగయ్య వెంకమాంబ దంపతులకు జన్మించారు.వీరభద్రరావు చిన్నప్పుడే తండ్రి ని కోల్పోయాడు. తల్లి తన కుమారుని ఉన్నత విద్యాభ్యాసం చేయించింది.చదువు పూర్తి చేసిన వీరభద్రరావు హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ హైస్కూల్ ప్రధాన తెలుగు పండితుడుగా పనిచేశారు.హైదరాబాద్లోనే స్థిరపడ్డారు.హైదరాబాద్ ఆకాశవాణిలో తొలి ప్రసంగం చేశారు.లక్ష్మణరాయ పరోశోధక మండలి కార్యదర్శిగా వ్యవహరించారు. చరిత్ర రచనాకళలో ప్రామాణిక స్థాయిని అందుకున్నారు.ప్రాచీనాంధ్ర నగరములు ,లలిత కథావళి ,రత్నప్రభ ,జీవిత చరితావళి ,జీవిత చరిత్రలు ,నవ్వుల పువ్వులు ,మిఠాయి చెట్టు ,షితాబ్ ఖాన్ వంటి అనేక రచనలు చేశారు.గ్రీకు పురాణకథలు వ్రాశారు.సంగ్రహాంధ్ర విజ్ఞానకోశంలో యాభై వ్యాసాలు రాశారు.ఆయన తన పాండిత్య ,పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరం పొంది 1973 సెప్టెంబర్ 28 న తనను చా‌లించారు.
మనవి -ఇవాళ మధ్యాహ్నం శ్రీ యామిజాల ఆనంద్ గారు ఫోన్ చేసి శ్రీ ఆదిరాజు వీరభద్రరావు గారి గురించి రాశారా మీ సరసభారతిలో అని అడిగారు లేదని చెప్పి రాస్తాను అన్నాను .వెతికి చాలాక్స్టపడి రాశాను .ఎక్కడ నోక్కానో అంతా డిలీట్ అయిపొయింది .సరే అని వీకీపీడియా ,తెలుగు వెలుగులు లో ఉన్న విషయం యదా ప్రకారం కాపీ చేసి పెట్టాను .అంతటి వాజ్మయ మూర్తి గురించి ఇప్పటిదాయా రాయనందుకు సిగ్గు పడుతున్నాను శ్రీ ఆనంద్ గారు గుర్తు చేసి రాయిన్చినందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-10-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.