మనకు తెలిసీ ,తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు (చిలమర్తి వారి స్వీయ చరిత్ర ఆధారంగా )
వెలమ కులస్తులైన శ్రీ ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు1887లో ఒంగోలు నుంచి రాజమండ్రి వస్తూ తనతో శ్రీ టంగుటూరి ప్రకాశం గారిని కూడా తీసుకు వచ్చారు .ఒక రోజు నాయుడుగారు చిలక మర్తి వారిని కలిసి ,తాము ఒక నాటక సమాజం స్థాపించి నాటకాలు ఆడుతున్నామని ,శ్రీ తోలేటి సుబ్బారావు గారు హరిశ్చంద్ర నాటకం రాసిచ్చారు మీరు ‘’కీచక వధ ‘’నాటకం రాసి స్తే ఆడుతాము అన్నారు .చిలకమర్తి వారు శ్రీ సుసర్ల అనంతరావు గారురాసిన ‘’పాండవ అజ్ఞాత వాసచరిత్ర ‘’నాటకం లో కీచక వధ ఉందికదా అది ఆడమన్నారు.నాయుడుగారు అందులో చాలా పద్యాలున్నాయి మా నటులు అవి చదవలేరు .తోలేటి వారు హరిశ్చంద్ర నాటకం వచనం గానే రాసిచ్చారు .మీరు అలాగే కీచక వధ రాసివ్వండి అని కోరారు .అప్పటిదాకా నాటక రచన దృష్టి లేని చిలకమర్తి సరే రాసిస్తాను అని పంపేశారు .
చిలకమర్తి వారు భారత కీచకవధ ,సుసర్లవారి అజ్ఞాత వాసం చదివించుకొని కీచక వధ నాటకం రాయటానికి పూనుకొన్నారు .అప్పటికి ఆయన చూపు బాగానే ఉంది .మొత్తం నాటకం ఆయనే స్వదస్తూరితో రెండు అంకాలు రాసేసి 1836ఫిబ్రవరిలో నాయుడు గారికిచ్చారు .మొదటి అంకం లో కఠిపదాలు రాసినా ,ద్రౌపది కీచక సంభాషణ అంతా శృంగార రసప్రధానంగా సులభ శైలిలో రాశారు .దీనిపై కఠిన పదాలున్న భాగం ఆయన మేనమామ శ్రీ పురాణ పండ మల్లయ్య శాస్త్రి గారు మిగిలింది చిలకమర్తి వారు రాసి ఉంటారని ఒక దురభిప్రాయం ఏర్పడింది .అప్పటికి చిలకమర్తి వారికి ‘’అంత దృశ్యం ‘’లేదనుకొన్నారు పాపం.. తానె అంతా రాశానని చిలకమర్తి వారు చెప్పుకోవాల్సి వచ్చింది నాయుడు గారు వోలేటి వారిది చిలకమర్తి వారిదీ నాటకాలు చదివి ,ముందుగా ఆడవారి అభిప్రాయం ఎలా ఉందొ తెలుసుకోవాలని సామినేని బుచ్చబ్బాయి అనే ‘’యహళ సింగర రావు నాయుడు’’ గారి విశాలమైన సావడిలో రెండు నాటకాలు నాయుడు గారి ‘’ రాజమహేంద్రవర హిందూ నాటక సమాజం ‘’వేసవికాలం లో ప్రదర్శించారు .తర్వాత టౌన్ హాల్ పక్క దొడ్డిలో తాటాకు పాక వేసి అక్కడ ఆడారు.ఆ సమాజంలో ప్రకాశం గారు కూడా నటిస్తూఉండేవారు ఆయన పూటకూళ్ళమ్మ ఇంట్లో మొదట భోజనం చేసేవారు తర్వాత ,అమ్మమ్మ ను తీసుకు వచ్చి వేరే కాపురం పెట్టి వండించుకొని తింటూ స్కూల్ లో చదువుకొనేవారు .నాయుడుగారికి ప్రకాశం గారిపై పుత్ర ప్రేమ ఉండేది .అందం స్పురద్రూప తెలివి తేటలు ప్రకాశం గారి సొమ్ము .నాయుడుగారు ఇక్కడ ఉపాధ్యాయుడుగా పని చేసేవారు .నాటక సమాజం స్థాపించింది ఆయనే అయినా మేనేజర్ గా సెంట్రల్ జైలు గుమాస్తా శ్రీ పిళ్ళారి శెట్టి త్రియ౦ బక రావు నాయుడు ను చేశారు .జూన్ ఎనిమిది న వోలేటి వారి నాటకం ,జూన్ 15 చిలకమర్తి వారి నాటకం తాటాకు పాకలో ప్రదర్శించారు .సమాజం వారికోరికపై చిలకమర్తి వారు కూడా వెళ్ళి చూశారు .అందరూ నాటకం బాగుందని మెచ్చారు .హనుమంతరావు నాయుడు గారు భీమ పాత్ర ,ప్రకాశంగారు ద్రౌపది పాత్ర ,ధరించి అద్భుతంగా నటించిమెప్పించారు .రిటైర్ద్ జడ్జి శ్రీ పిళ్ళారి శెట్టి నారాయణరావు నాయుడు గారు ,రిటైర్ద్ సబ్ జడ్జి శ్రీ కోకా సాంబశివరావు నాయుడు ,పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పని చేసి రిటైరైన శ్రీ కోకా వెంకటరెడ్డి నాయుడు గార్లు మిగిలిన పాత్రలు పోషించారు .దక్షిణ దేశ సాతాని రామానుజయ్యర్ సూత్రధారి .బాగా పాడే వాడు. ఆయన గానాన్ని వినటానికే జనం బాగా వచ్చేవారట బందరులో పోలీ స్ ఇన్స్పెక్టర్ గా రిటైరైన శ్రీ వల్లూరి సూర్యప్రకాశరావు హాస్యం చెప్పేవారు .ప్రకాశంగారు యే రసాన్నైనా అద్భుతంగా రక్తి కట్టించేవారు .ముఖ్యంగా కరుణ ,వీరరసాలకు ‘’బ్రాండ్ అంబాసడర్ ‘’.కీచకవధ నాటకం చూడటానికి శ్రీ న్యాపతి సుబ్బారావు ,నెర్రమిల్లి వెంకటరావు పంతులు మొదలైన ప్రముఖులు వచ్చారు .రెండో సారి కీచక వధ ప్రదర్శించినప్పుడు ,చిలకమర్తి వారు ప్రేక్షకులుగా కుర్చీ లో కూర్చున్నారు .నాయుడుగారి భీమపాత్రకు మెచ్చి జిల్లాకోర్ట్ సిరస్తదారుగా ఉన్న బయ్యపునీడి జోగయ్యగారు హుషారుగా చప్పట్లు కొట్టి ,శిరసుపై పుష్పాలు చల్లి ఉత్సాహపరచారట .ప్రేక్షకులు కూడా మైమరచి పోయారట .సమాజ నటులంతా నాయుళ్ళు అవటం చేతీ సమాజాన్ని ‘’నాయుళ్ళ సమాజం ‘’అనే వారట సరదాగా .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-23-ఉయ్యూరు

