మనకు తెలిసీ ,తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు (చిలకమర్తి వారి స్వీయ చరిత్ర ఆధారంగా )-2

gabbita prasad5:13 PM (1 hour ago)
to sahitibandhu@googlegroups.com, Andukuri, Vuppaladhadiyam, Narasimha, Gopala, Krishna, గోదావరి, Sastri, mrvs, GITANJALI

మనకు తెలిసీ ,తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు (చిలకమర్తి వారి స్వీయ చరిత్ర ఆధారంగా )-2

కీచక వధ నాటకం విజయ వంతంగా ప్రదర్శింప బదినతర్వాత హనుమంతరావు నాయుడు గారు  చిలకమర్తి వారిని మరో నాటకం రాయమనికోరితే అయిదు అంకాల ‘’ద్రౌపదీ పరిణయం ‘’రాశారు .ఎక్కడో కొద్దిపద్యాలున్నా ,ఇదికూడా వచన నాటకమే .దీన్నికూడా చిలకమర్తి వారు స్వహస్తాలతో నె చాలాభాగం రాసి ,త్వరగా ముగించాలని నాయుడుగారు ,దుర్గి గోపాలక్రిష్ణారావు అనే నటుడు నరసింహం గారు చెబుతూనే రాసి పూర్తి చేశారు .నాయుడు గారు ఈ నాటకాన్ని సెప్టెంబర్ –అక్టోబర్ లలో ప్రదర్శించారు .నాయుడుగారు భీమ పాత్ర ,ప్రకాశం గారు అర్జునపాత్ర ధరించారు వీరరసాన్ని ప్రకాశంగారు మహాద్భుతంగా పండించారు .ఇందులోని నాలుగు అంకాలు వీరరస ప్రదానాలే .ప్రకాశం గారి అత్యున్నత నటన కు పరాకాష్టంగా అభినయించి సెబాసు అనిపించుకొన్నారు .విద్యార్ధి మద్దూరి నాగ భూషణం ద్రుపద పాత్ర ధరించాడు .పద్యాలు దారాశుద్ధిగా చదివి ప్రేక్షకుల మన్నన పొందాడు నాయుడు గారు ,ప్రకాశం గారు పద్యాలు చదవ లేరు కనుక వారికి వచనమే రాశారు చిలకమర్తి.దుర్గి గోపాలక్రిష్ణారావు దుర్యోధనుడు .యువకుడు నెప్పల్లి బుల్లి కృష్ణయ్య ద్రౌపది .హిడింబా సుర ,బకాసుర పాత్రలు మాంచి శరీర దారుఢ్యం ఉన్న మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడు గారి తమ్ముడు చలపతి రావు వేశాడు .చిలకమర్తి వారు నటించకపోయినా ఆనాటక సమాజంలో సభ్యులే .ఈ నాటకం కూడా బాగా ఆకర్షించి అందరికి మంచి పేరు వచ్చింది .

   గయోపాఖ్యాన నాటకం రాయమని హనుమంతరావు నాయుడు గారుకోరగా  చిలకమర్తి వారు వెంటనే1889లో  రాయటం ప్రారంభించారు .పూర్వం రామకవి దీన్ని పద్యకావ్యంగా రాశాడు .దాన్ని తెప్పించి ,చదివించుకొని ,’’చిత్ర భారతం ‘’అనే ప్రబంధంలో ఉన్న కధనూ చదివించుకొని .ఇందులో గయుని ఉమ్మి కృష్ణుని చేతిలోకాక గాలవ మహర్షి అర్ఘ్యం ఇస్తుండగా చేతిలో పడగా కృష్ణుడికి ఫిర్యాదు చేయగా ,ఆయన గయుడిని శిక్షిస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు ఉంది. అది ఉచితంగా లేదని మనకవి రామరాయకవి పద్ధతినే అనుసరించి కృష్ణుని అర్ఘ్యం లోనే పడి నట్లు రాశారు .కృష్ణ పాత్రకు పద్యాలు రాశారు .డిసెంబర్ 20 నాటికి నాలుగు అంకాలు పూర్తి చేసి నాయుడు గారికిచ్చారు .రామజననం అనే ఎవరో రాసిన నాటకం చాలా చోట్ల ప్రదర్శన జరిగి జనరంజకం అవటం చేత నాయుడు గారు చిలకమర్తి వారిని వెంటనే ‘’శ్రీరామ జననం ‘’నాటకం రాసిమ్మని ఒత్తిడి చేశారు . రాత్రీ పగలు కష్టపడి రాసి డిసెంబర్ 31కి పూర్తి చేసి నాయుడు గారిచ్చారు. అంటే పది రోజుల్లోనే రాసేశారన్నమాట .పగలు చిలకమర్తి వారు రాస్తే ,రాత్రి ఆయనకు చూపు కనపడడుకనుక నాయుడుగారో ఇంకో నటుడో ఈయన చెబుతుంటే రాసేవారు .ఇది అయిదు అ౦కాల నాటకం .నాలుగవ అంకం లో అప్సరసలు ఋష్యశృంగ మునిని శృంగారం తో మైమరపించి వలలో వేసుకొని ఆశ్రమానికి తీసుకు వచ్చే కధలో సంభాషణలు చాలా చమత్కారంగా ,రసభరితంగా కుదిరాయి ప్రేక్షకులు విశేషంగా ఆకర్షింపబడ్డారు .ఇదీ వచన నాటకమే .1890జనవరిలో స్వగ్రామం  వీరవాసరం వెళ్ళి,అయిదవ అంకం అక్కడే రాసి పోస్ట్ లో  నాయుడుగారికి పంపారు .జనవరి చివర్లో నాటక ప్రదర్శన జరిగింది .టంగుటూరి ప్రకాశంగారు దశరధ పాత్ర ,రావణపాత్ర నాయుడుగారు , వేశారు పది తలలుగల లక్క కిరీటం ధరించి ,రెండుపక్కల పల్చని ఇనుపబద్దీలు  దానికి అమర్చి రంగస్థలంపై అడుగుపెడితే మహా భయంకరంగా కనిపించేవారు.పిల్లలు ఝడుసుకొని అమ్మో నాయనో అని అరిచేవారు .కౌసల్య గర్భం లో ఉన్న రాముడు రావణుడి దుస్చేస్టలను రోసి ఆగ్రహ ఆవేశాలను తల్లి కౌసల్య నీటితో పలికించటం మహా భయంకరంగా ఉండేదని కవి గారే చెప్పారు .ఈ సీను కూడా బాగా పండింది .మొదటి ప్రదర్శనలో దశరధుడు వేసిన ప్రకాశంగారు రెండవ ప్రదర్శనలో కౌసల్యగా నటించి ,ఆవేశాన్ని చాలా గొప్పగా ప్రదర్శించి యే పాత్రనైనా ఒప్పించగలరు అని పేరు పొందారు .శ్రీ వల్లూరి సూర్య ప్రకాశరావు హాస్యం చెబుతూ నాటకాన్ని ఎవరు రాశారు అని అడిగించుకొని ‘’ఇంకెవరు ?parrot banyan tree riches manly lion ‘’అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం అని సరదాగా చెప్పేవారట .

గయోపాఖ్యాన నాటకం ఏప్రిల్ –మె నెలలలో ప్రదర్శించారు హనుమంతరావు నాయుడుగారు గయుడు వేస్తె ,శిష్యుడు ప్రకాశంగారు చిత్ర రేఖ పాత్ర వేసి ఒప్పించారు  .అయిదవ అంకం లో అర్జునుడు కూడా ప్రకాశం గారే .అర్జునపాత్ర కన్నులకు వైకుంఠంగా  ఉండేదని ప్రకాశంగారి నటప్రతిభను మెచ్చారు చిలకమర్తి వారు .ఐనవోలు తాతయ్య కౌశికుడు .హాస్య౦ బాగా మెప్పించేవాడు ప్రకాశంగారు అర్జున పాత్రలో వీర రసాన్ని మహా గొప్పగా ఆవిష్కరించేవారని చిలకమర్తి మురిసి పోయారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-11-23—ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.