మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -5(శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )
శ్రీ ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు స్కూల్ మాస్టారి ఉద్యోగంలో ఉన్నా ,హెడ్ మాస్టార్ గా ఉన్నా ,ఆయన నాటక ప్రదర్శన నిర్వహిస్తూనే ఉన్నారు .ఎక్కడ ఉన్నా నాటక శాలయే ఆయన ఇల్లు అని ,నటులే ఆప్తులని అదే వారిఆనందానికి కారణమని ఆయన హృదయం తెలిసిన చిలకమర్తి వారన్నారు .అమలాపురానికి చెందిన శ్రీ చిలుకూరి లక్ష్మీ నరసింహారావు గారు రాజమండ్రి వచ్చి వీరి సమాజం లో చేరి మేనేజర్ గా ఉన్నారు అప్పుడు నటులందరికీ బొబ్బట్లు చేయించి విందు చేశారు అప్పటి నుంచి ఆయనను ‘’బొబ్బట్ల మేనేజర్ ‘’అని పిలిచేవారట .కవికూడా అవటం తొ ‘’ద్రౌపదీ వస్త్రాపహరణం’’,’’సౌగంధికా హరణం ‘’నాటకాలు కూడా రాశారట .మొదటి దానిని వీరి సమాజం ప్రదర్శించింది .ఈ సమాజానికి కోపిస్టి వంట బ్రాహ్మణుడు ఒకాయన ఉండేవాడు .పచ్చళ్ళు చేస్తే తన పిప్పి గోళ్ళు పుచ్చుగోళ్ళు నెప్పి పుడతాయని చేసేవాడుకాడు .రాగానే పచ్చి అటుకులు పెరుగులో వేసుకొని తినేవాడు .ఒక రోజు పెరుగు లేదని అలిగి వంట చేయకుండా వెళ్ళిపోయాడు .1891 సంక్రాంతి నాడు ఇలాగె ఏదో సాకుతో కోపంతో వంట చేయకుండా పరారయ్యాడు .పండగ రోజు పస్తులు ఉండలేక నటులే తంటాలుపడి మధ్యాహ్నం మూడింటికి ఇంత చారు అన్నం వండుకొని తిన్నారట . పండగనాడు పిండివంటలు లేవు పప్పాలు లేవు పప్పూలేదు కూర పచ్చడి కూడాలేవు పాపం .
అమలాపురానికి చెందిన శ్రీ మంత్రిప్రగడ కవులట్లయ్య గారు వీరి నాటకాలు చూసి మిత్రులై ,ఒక రోజు రాత్రి చిలకమర్తి వారిని ‘’అష్టావధానం ‘’చేయమని కోరితే ,ఉన్న బసలోనే నటుల ఎదుట చేశానని చిలకమర్తి గారు రాశారు .ఎనిమది మందికి వారు అడిగిన విషయాలపై ,వారుకోరిన వృత్తాలలో పద్యాలు చెప్పారు .అందరూ ఆనందించారు పుష్పగణనం ,పురాణం ,చీట్లపేక అందులో లేవు ,ఒకసారి రాత్రి హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తూ ఉంటే ముగ్గురు ధవలేశ్వరపు ఇంజనీర్లు వచ్చి ,చూసి ,మర్నాడు ఉదయం నాయుడు గారిని కలిసి మెచ్చి తాము నాటకం ఫోటోలు తీయలేకపోయామని అప్పుడు ప్రదర్శిస్తే తీసుకొంటామని చెప్పగా ,నాయుడు గారు తనమాటకు ఎవరూ అడ్డు చెప్పరనే ధైర్యంతో ఒప్పుకోగా ,ప్రియ శిష్యుడు ప్రకాశం గారు ‘’రెడ్డొచ్చె మొదలాడు ‘’అన్నట్లు గా ఉందికనుకపగలు తాను వేషం వేయనని భీష్మించారు .గురువు ఎంత బతిమిలాడినా శిష్యుడు ససేమిరా అన్నాడు .ప్రకాశం మొదట్నుంచి స్వతంత్రుడు తనకు నచ్చిన పనే చేస్తారు మొహమాటం లేడు .దొరలముందు తన పరువు పోతుందని నాయుడుగారు భయపడ్డారు .మిగిలిన నటులు ఆశ్చర్యపోయారు .అప్పుడు గత్యంతరం లేక యరగర్ల సత్యరాజు ,నెప్పల్లి బుల్లి కృష్ణ య్య స్ట్రీ వేషాలు వేయగా ఇమానేని కాంతారావు నాయుడు ,అయిన వోలు తాతయ్య గార్లు మగ వేషాలు వేయగా దొరల ఎదుట నాటకం ఆడి పరువు దక్కించుకొన్నారు నాయుడు జీ .దొరలు ఫోటోలు తీసుకొని యోగ్యతా సర్టిఫికేట్ ఇచ్చి వెళ్లారు సంతోషంగా .
ఒకసారి గయోపాఖ్యానం ఆడుతుంటే కృష్ణ బలరామ పాత్రధారులు పోట్లాడుకొనగా వెంటనే బలరామ వేషం వేసే శ్రీ దుర్గి గోపాల కృష్ణారావు కృష్ణుడుగా వేయగా, బలరామ పాత్రకు ఎవరూ లేకపోతె చిలకమర్తి వారే వేయటానికి సిద్ధపడితే ,అప్పుడు అనుకోకుండా బలరామ పాత్రధారి వచ్చి నటించి రసాభాస కాకుండా కాపాడాడు అన్నారు కవిగారు. కవి గారిని మనం నటుడు గా చూసే అవకాశం కోల్పోయామన్న మాట .దుర్గి గారు ఆతర్వాత కృష్ణ పాత్ర దరిస్తూ మంచి పేరు తెచ్చుకొన్నారు .ఒకసారి కాకినాడలో నాటకం ఆడాలని సంకల్పించి నాయుడు గారు కాకినాడ వెళ్ళి ఉప్పుటేటి ఒడ్డున సింగితపు అబ్బాయి గారు అనే వస్తాదు,వైద్యుడు ,అక్కడి నాటకకంపేని మేనేజర్ అయిన , మధ్వ బ్రాహ్మణుడి సాయ౦ తొ పాక వేయించి ,1892 జనవరిలో పారిజాతాపహరణం నాటకం ప్రదర్శించారు .ప్రకాశం గారి నటనా ప్రకాశంతో నాటకం బాగా రక్తి కట్టింది .సమాజానికి మంచి పేరొచ్చింది .ప్రకాశం గారు ఎక్కడ ఏ వేషం వేసినా నట ప్రకాశమే .అప్పుడు బిఏ చదువుతున్న ఒరియా విద్యార్ధి శ్యామ సుందర రాజగురువు వీరి నాటకాలు తరచుగా చూసి,మెచ్చి టంగుటూరి ప్రకాశం గారికి ‘’రంగ నక్షత్ర ‘’(స్టార్ ఆఫ్ ది స్టేజ్’’)అనే బిరుదును ప్రేక్షకుల కరతాల ధ్వనుల మధ్య అందజేసి సత్కరించాడు .ఈ విషయం కూడా మనలో చాలామందికి తెలియదు అనుకొంటాను
కాకినాడ అబ్బాయి గారికి రాజమండ్రి నాయుడు గారికి మధ్య స్నేహం పెరగలేదు కాని వైరం వృద్ధి అయింది .చాడీలు విని అబ్బాయి నిజంగానే అబ్బాయిలా ప్రవర్తించేవాడు .అతని చుట్టూ రౌడీగాంగ్ ఉండేది .నాటకాలకు ఫ్రీగా టికెట్లు ఇమ్మని నాయుడుగారిని ఆబాచ్ బెదిరించేది .ఒకసారి రాత్రి వీరి నటుడు కోపల్లె శేషగిరి రావును బుర్రపై దుడ్డు కర్రలతో బాది పారిపోయారు .రక్తం కారుతుంటే మిగిలిన వారు బసకు తీసుకువెళ్ళి కట్టుకట్టించారు .ఆ బాచ్ చేసిన అల్లరి అంతైన్తాకదన్నారు చిలకమర్తి .అబ్బాయికూడా వచ్చి బసపై దాడి చేసి రాళ్ళు రువ్వాడు .అబ్బాయి గూండా ఇజాన్ని చుట్టుపక్కల వారెవరూ చూసి నివారించలేకపోయారు .అతడంటే అంత టెర్రర్ ..ఆతర్వాత వీరికీ వారికి తరచూ’’ కర్రాటలు ‘’జరుగుతూ పరిస్థితి భీకరంగా ఉండేది .సంక్రాంతి నాదు అక్కడ గొప్ప ఉత్సవాలు జరుతుంటే నాయుడుగారు రాజమండ్రి వెళ్లగా ,కవి గారు వద్దని చెబుతున్నా ఒకరాత్రి ప్రకాశంగారు పిళ్ళారి శెట్టి తాతయ్య గోపాలక్రిష్ణారావు నటులు ఉత్సవం చూడటానికి వెళ్లారు .రాత్రి పదింటికి అబ్బాయి మనుష్యులు దుడ్డు కర్రలతో గోపాలకృష్ణయ్య బుర్ర పగలగొట్టారు .వెళ్ళిన అరగంటలోనే రక్తం కారుతూ తిరిగి వచ్చాడు .మిగిలిన ముగ్గురు ఏమయ్యారో అని కవిగారికి కంగారు .పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు .రాత్రంతా నిద్రలేదు నాలుగు గంటలయ్యాక ‘’ఆత్రయం’’ తిరిగి వచ్చి జరిగిన సంగతులు కధలు గాధలుగా చెప్పారు .ప్రకాశం గారు తనను తరుముతున్న వాడి నుంచి తప్పించుకోవటానికి ఒక మార్వాడి దుకాణం లో దూరే ప్రయత్నం చేస్తే కొట్టు వాళ్ళు అడ్డుపడితే బలిస్టుడు కనుక తోసుకొని లోపలి వెళ్ళి ,తలుపు బిగించి కిటికీ దగ్గర నిలబడితే కొండయ్య అనే వాడు కర్రతో పొడవగా గుర్తుపట్టారు .
ఈ సంఘటన జరిగాకకూడా ఫిబ్రవరి దాకా నాటకాలు ఆడి,రాజమండ్రి చేరారు . .కాకినాడ వారిపై ప్రకాశం పగబట్టి వీలుదోరికి నప్పుడు తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారు .ఒకసారి కొండయ్య రాజమండ్రి వీధుల్లో తిరుగుతుంటే ప్రకాశంగారు చూసి కర్రలతో వెంటబడి ఆయనా చలపతిరావు బుర్ర పగలకొట్టి దెబ్బకు దెబ్బతీశారు .కాకినాడ ముఠా వారు కోర్టులకు వెళ్లారు కొండయ్యకు సాక్ష్యం చెప్పే వారు దొరకలేదు ఆవిషయం మేజిస్ట్రేట్ ముందు ఒప్పుకోని వేసిన కేసు వాపసు తీసుకొన్నాడు .అదీ ప్రకాశంగారి మగటిమ .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-11-23-ఉయ్యూరు
