మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -6 వ చివరి భాగం . (శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )
నాయుడుగారి నాటక సమాజం రాజమండ్రి నుంచి అమలాపురం వెళ్ళేదాకా చిలకమర్తివారు ,ప్రకాశంగారు ఒకరినొకరు ‘’ఏమండీ ‘’అని పిలుచుకోనేవారు .ఆతర్వాత సాన్నిహిత్యం బాగా పెరగటం తొ ‘’ఒరేయ్ ‘’అనే పిలుచుకొనే వారుఅని కవిగారే చెప్పారు .ప్రకాశంగారు మెట్రిక్ పాసవగానే చిలకమర్తి రెండు రూపాయలు ఖర్చు చేసి ‘’చీనా మిఠాయి ‘’కొని అందరికి పంచి అందరికి ఆనందం కల్గించారు .ధవళేశ్వరంలో జనార్దన స్వామి తిరునాళ్ళకు నాయుడుగారు, ప్రకాశం గారు, కవి గారు కలిసి వెళ్ళినప్పుడు ప్రకాశం గారిపై చిలకమర్తి ఒక పద్యం రాసి వినిపించారు –
‘’సీ- ఈగ వ్రాలిన గాని వేగ జారెడు నట్లు –మువ్వంపు కురులను దువ్వినాడు –వర లలాటము నందు తిరు చూర్ణ రేఖను –ముద్దు గారేడు భంగి దిద్దినాడు –అరుణ పల్లవ మట్లు కరము రంజిల్లు చెం –గావి వస్త్రంబు గట్టినాడు –చార లంగరఖాను జక్కగా ధరియించి –వలెవాటు ఖండువ వైచినాడు
గీ-చెవుల సందున గిరజాలు చిందులాడ –మొగము మీదను జిరునవ్వు మొలకలెత్త –టంగుటూరి ప్రకాశము రంగు మెరయ –ధవళగిరి తీర్ధమున కు దరలి వచ్చే .
ఈ పద్యం మనకు ఎవరికీ తెలీదు .అచ్చం ఫోటో తీసినట్లు ప్రకాశంగారి మూర్తిని మన కనులముందు నిలిపారు కవి చిలకమర్తి .
ఒక సారి నాయుడు గారి సమాజం మద్రాస్ వెళ్ళినప్పుడుఆంధ్రనాటక పితామహ ధర్మవరం కృష్ణ మాచార్యుల వారిని కలిసి వారి నాటకాలు బాగున్నాయని చిలకమర్తి ప్రశంస౦చి,తమ వచన నాటకాలు ఆదరి౦ప బడతాయా అని అడగ్గా ‘’నాటకం లో అభినయం ముఖ్యం సంగీతం కాదు ‘’అని ధైర్యం చెప్పారు .వారికోర్కేపై వీరు రాసిన ‘’నల ‘’నాటకం ప్రదర్శించారు శ్రీ దుర్గి గోపాలక్రిష్ణారావునలుడుగా ,ప్రకాశంగారు దమయంతిగా నటించారు .ధర్మవరం వారి అబ్బాయి శ్రీనివాసాచార్యులు కూడా వారితో ఉన్నాడు. అతడూ గోప్పనటుడే .
చిలకమర్తి వారు క్రమంగా నవలలు రాయటం ప్రారంభించి శ్రీ న్యాపతి సుబ్బారావు గారు ఏర్పాటు చేసిన నవల రచన పోటీ లలో పాల్గొని పాల్గొన్న ప్రతి నవలకు మొదటి బహుమతి పొంది,నాటక ,నవలా సవ్యసాచి అయ్యారు .
శ్రీ వడ్డాది సుబ్బారాయుడు గారు ‘’వేణీ సంహారం ‘’నాటకం రాసి తాము స్థాపించిన ‘’హిందూ నాటకోజ్జీవ సమాజం ‘’ ద్వారా పలు ప్రదర్శనలిచ్చారు .వడ్డాది వారు ధర్మరాజు ,కనుపర్తి శ్రీరాములు అశ్వత్ధామ ,సుసర్ల శ్రీనివాసరావు ద్రౌపది ,సుసర్ల అనంతరావు దుర్యోధనుడు వేశారు. వడ్డాది వారు శాంతరసం,కరుణ రసం బాగా అభినయించి ధర్మరాజు పాత్ర పోషించారని నాటకం చూసిన చిలకమర్తి మెచ్చారు .ఒకసారి అశ్వత్ధామ పాత్ర కూడా వేసి వీర రౌద్ర రసాలను పరమాద్భుతంగా రక్తికట్టిచారని కవిగారు ఉవాచ .నాటకం చివర స్క్రిప్ట్ లో లేని ముక్కు తిమ్మన పారిజాతాతపహరణ కావ్యంలోని శ్రీ కృష్ణ స్తవం అనే దండకాన్ని అద్భుతంగా గానం చేశారని ,ఆయన పద్యాలు పాడే నేర్పు మహా గొప్పదని చిలకమర్తి శ్లాఘించారు .ఈనాటకం అంటే తనకు పరమప్రీతి అని మెచ్చుకున్నసహృదయులు చిలకమర్తి .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-23-ఉయ్యూరు

