నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం -3
రైతు బాంధవుడు ,కాకినాడ లిటరరీ ట్రస్ట్ సెక్రెటరి ,జిల్లాబోర్డ్ వైస్ ప్రెసిడెంట్ ,మద్రాస్ శాసన సభ్యులు , వితరణ శీలి ,లాయర్ ,మన పట్టాభి గారి మామగారు -శ్రీ గంజాం వేంకట రత్నం పంతులుగారు
ఆంధ్ర దేశం లో శ్రీ న్యాపతి సుబ్బారావు గారు ,మోచర్ల రామచంద్రరావు గారు శ్రీ గంజాం వెంకటరత్నం పంతులుగారు గురుస్థానం లో ఉన్నారు .వీరిలో స్వయం కృషి సామర్ధ్యం ,స్వార్జిత జ్ఞానం చేత గంజాం పంతులు గారు పరిస్థితులకు ఎదురీది ప్రాముఖ్యాన్ని పొందిన మహా పురుషులు .
పూర్వకాపు మెట్రిక్ మాత్రమె పాసై ,,పాశ్చాత్యులైన మెకాలే ,ఎడిసన్ ,గోల్డ్ స్మిత్ ల వ్యాసాలూ క్షుణ్ణంగా చదివి ,జీవం కళ శైలి,సలక్షణమైన భాషా పాటవంతో ,తన కలాన్ని ఎలాపడితే అలీ తిప్పు గొప్ప రచనలు చేసిన అసాధారణ రచయిత.సామాన్య కుటుంబం లో పుట్టి ఆ తరగతి వారు అనుభవించే అష్ట కష్టాలన్నీ అనుభవించి ,అత్యున్నత పదవి అధిష్టించి మార్గ దర్శి అయ్యారు ..తూర్పు గోదావరి జిల్లా నరసాపురం లో చదివి ఆజిల్లా కేంద్రమైన ,అక్కడ ఉత్తరాలను గూళ్ళలో వేసే అంతే సార్టింగ్ ఉద్యోగం లో చేరారు ..మనసులో మాత్రం కోరిక తహసీల్దార్ ,ప్లీడర్ ఉద్యోగాలపై ఉండేది .
అదృష్టం అకస్మాత్తుగా తలుపుతట్టినట్లు ఈయన ముత్యాలకోవ వంటి దస్తూరి నిబద్ధత గల వృత్తీ జీవనం గమనించి విశాఖ కలెక్టర్ ‘’కోరాపుట్టిలో డిప్యూటీ తహసీల్ పని ఇస్తాను వెడతావా ?’’అని అడిగితె ,,సరే అని తలూపి ,మూటా ముల్లె సర్దుకొని బయల్దేర బోతుంటే ప్రభుత్వం ఆయనకు ‘’మొదటి తరగతి ప్లీడర్ సనదు ‘’ .మంజూరు చేసినట్లు శుభ వార్త వచ్చింది .బాక్ టు పెవిలియన్ అన్నట్లు వెనక్కి మళ్లి, కాకినాడ చేరి ,నల్లకోటు ,తలగుడ్డ కొనుక్కొని ఇంటికి ప్లీదరి బోర్డ్ తగిలించి ,న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి కొద్దికాలం లోనే పేరు మోసిన వకీలు అయ్యారు .బాగానే సంపాదించే వారు .
అయన దృష్టి ప్రజా సంక్షేమం ,దేశం మీదనే ఉండేది .ఆరోజుల్లో బాగా వ్యాప్తిలో ఉన్న బాల సంఘాలు ,,లిటరరీ సొసైటీలు,స్ట్రీ పునర్వివాహాలు ,సముద్ర యానాలపై చర్చలు పెద్ద ఎత్తున జరుగు తుండగా బాగా ఆకర్షింప బడి ,నెమ్మదిగా కాకినాడ లిటరరీ సొసైటీలో చేరి కార్య దర్శిగాఎదిగి ‘’వారం హేస్టింగ్స్ గొప్పవాడా ,కారన్ వాలీసు ‘’గొప్పవాడా?అనే శుష్క వాదాలతో తృప్తి చెందక ,ప్రజల కస్ట నష్టాలను అవగాహన చేసుకొని ,ఆ విషయాలను మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వానికి ,స్థానిక కాకినాడ కలెక్టర్ కు ఇంగ్లీష్ లో రాస్తూ ,మంచి రచయితగా పేరు తెచ్చుకొన్నారు .ఒకానొక సందర్భంలో మద్రాస్ అసెంబ్లి ఆనరబుల్ వెబ్ స్టార్ కాకినాడ లిటరరీ సొసైటీ నుంచి వస్తున్న వ్రాతల శైలిని హేతువాదాన్నీ అసెంబ్లి లో మెచ్చుకోవటం తొ గంజాం వేంకట రత్నం పంతులు గారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా మారు మోగింది .
గంజాం పంతులు గారు క్రమంగా తన శక్తి సామర్ధ్యాలకు ,సేవాభి లాషకు తగిన పదవి లో ఎదుగుతూ 1887లో కాకినాడ జూబిలీ కమిటీ కార్యదర్శి యై ,ప్రజల ,ప్రభుత్వ మన్ననలు విశేషంగా పొందారు .కాకినాడలోని పిఠాపురం మహారాజా వారి కాలేజిలో మేనేజర్ అయి ,కాలేజి కౌన్సిల్ ను రిజిస్టర్ చేయించి ,పై తరగతులు శాంక్షన్ చేయించి కొత్త కోర్సులు ప్రవేశ పెట్టించి విద్యా వ్యాప్తికి అవిరళ కృషిచేశారు .గంజాం పంతులు గారంటే సేవా విద్యా వ్యాప్తి అనే పేరు బాగా వ్యాపించి ఆనాటి కలెక్టర్ ‘’బ్రాడీ దొర ‘’కన్ను పంతులు గారిపై పడి,జిల్లా బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ పదవి నిచ్చారు .బ్రాడీ అంటేసమర్ధత సుపరిపాలన అన్న పేరు ఉండేది .ప్రజా హృదయాలను జూరగొన్న సమర్ధ మండలాధికారి .1995-96 ,1997-98 తన రిపోర్ట్ లో వైస్ ప్రెసిడెంట్ గంజాం పంతుల గారి గురించి ఇలా రాశాడు రీడ్ దొర –‘’పంతులుగారు జిల్లాబోర్డ్ పనులను అంకిత భావంతో సమర్ధంగా సంతృప్తి కరంగా నిర్వహించి ప్రజా దృష్టి నాకర్షిం చారు .వారి సహాయ సహకారాలు సలహాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందించేవారు .నా అధికారాలుచాలాభాగం పంతులు గారికే ఇచ్చేశాను .ఇతర శాఖలకు సంస్థలకు ఉన్న పనులన్నీ పంతులుగారికే అప్ప గించాను ఆయన సామర్ధ్యం మీద నాకు అపార నమ్మకం ..ఈ బోర్డ్ లో ఆయన లాగా ఎవ్వరూ అంత గొప్పగా కృషి చేయలేదు ‘’అని రాశాడు రీడ్ దొర.
1889లో గంజాం పంతులుగారు ఉత్తర ప్రాంత మున్సిపాలిటీలు జిల్లా బోర్డు పక్షాన శాసన సభకు పోటీ చేశారు .ఆయన్ను అఖండమైన మెజారిటీ తొ గెలిపించి మద్రాస్ అసెంబ్లి సభ్యులను చేశారు ఆప్రాంత ప్రజలు .శాసన సభలో రైతుల కస్టాలు ,గ్రామాల స్థితిగతులు ప్రస్తావిస్తూ సాయం కోసం ప్రాభుత్వ దృష్టికి తెచ్చి అవసరమైన సహకారం అంది౦ప జేశారు .మండల సభలలో, దేశీయ మహా సభలలో ,శాసన సభలో రైతుల పక్షాన నిలబడి రైతు వాణి వినిపిస్తూ వారిని చైతన్యవంతులను చేసిన మహాను భావులాయన .భూమి శిస్తు ,లోకల్ బోర్డ్ యాక్ట్ ,ఇమ్మిగ్రేషన్ బిల్ ,లపై పత్రికలలో గణాంక వివరాలతో విపులమైన వ్యాసాలూ రాసే వారు .అవన్నీ సాధికారమైన వే .అత్యంత ప్రమాణాలతో రాసినవే .
జిల్లా రైతు సంఘాలు పెట్టి ,వారి గోడు ప్రభుతావ్నికి వినిపించే వారు .రైతులకు విద్యా వంతులకు సత్సంబంధాలు కల్గించారు .విద్యా వంతుడు ,కాంగ్రెస్ నాయకుడు ఆర్ధిక వేత్త బెంగాలీ నాయకుడు రమేష్ చంద్ర దత్ ను’’ఆరట్ల కట్ట ‘’కు ఆహ్వానించి తమతోట లో చెట్ల నీడ న ఇద్దరూ కూర్చుని చక్రకేళీలు ,బత్తాయిలు ఆస్వాదిస్తూ డెల్టా సమస్యలు చర్చిస్తూ ,ఆయన అభిప్రాయాలతో తన అభిప్రాయాలకు సాన బడుతూ పంతులుగారు రైతు లోకానికి అపారసేవ చేశారు ..ఆయనతో ఆతరం అంతరించింది .పంతులుగారి శిష్యుఅలైన పెన్మత్స సుబ్బరాజు ,కాళ్ళకూరి నరసింహం గార్లు ఆయన కృషిని కొంతవరకు కొనసాగించారు .
న్యాయవాదిగా శాసన సభ్యునిగా ,రైతు శ్రేయోభిలాషిగా గంజాం పంతులుగారు ,తాను శ్రమించి సంపాదించిన ధనాన్ని చాలాభాగం ప్రజోపకార కార్యాలకే ఖర్చు చేసిన త్యాగమూర్తి .
సంఘ సంస్కరణ పై అభిలాష ఉన్న పంతులుగారు వీరేశలింగం ,హావలాక్ దొర గార్ల పేర్ల మీద స్థాపించిన విద్యార్ధి వేతనాలు ,దాదాభాయ్ నౌరోజీ గారిపేరు మీద ఉన్న స్వర్ణపతకం లకు పెద్ద ఆర్ధక సాయం అందించి సద్వినియోగం చేశారు .దేశీయ మహా సభలకు, కాకినాడ పుర మందిరానికి విశేషంగా విరాళాలు అందించారు .భూమిశిస్తుపై ఇంగ్లాండ్ లో ఆందోళన చేసిన వారికి ఆర్దిక సాయమందించారు .కత్తిరించిన మీస కట్టు ,నల్లటి పూర్వకాలపు కోటు ,వదులుగా ఉండే తలపాగా ,నల్లంచు ఉత్తరీయం ,చిరునవ్వు పంతులుగారి మూర్తి మత్వం .ఈపంతులు గారి కుమార్తెయే మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి భార్య శ్రీమతి రాజేశ్వరమ్మ .
ఇంతకంటే ఎక్కువ విషయాలు లభించలేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-11-23-ఉయ్యూరు ,

