అతి నవ్య కవిత్వానికి ఆద్యుడు ,కవిత్వ రౌడి అని పించుకొని ‘’నవమి చిలుక ‘’వంటి ఖండకావ్యాలతో ప్రసిద్ధుడైన ‘’డోంట్ కేర్’’కవి –శిష్ట్లా ఉమామహేశ్వర రావు .
‘’ శ్రీ శ్రీకవిత్వాన్ని ఎందుకు ఒప్పుకోరు ‘’?అని ప్రశ్నించిన శిష్ట్లా ఉమామహేశ్వరరావు 1912 లో గుంటూరు జిల్లా మంచాల బ్రాహ్మణ అగ్రహారం లో శిష్ట వైదిక కుటుంబం లో జన్మించాడు.బాల్యం లోనే పురాణ గాథలను ,జానపద సాహిత్యాన్ని అర్ధం చేసుకొన్నాడు .ఇంగ్లీస్ లిటరేచర్ లో ఎం. ఏ .చదివి పాసై ,ఆంగ్ల కవిత్వం లో నూతన ప్రస్తావనలన్నీ ఆకలి౦పు చేసుకొన్నాడు .కొంతకాలం దివ్యజ్ఞాన సమాజం లో ఉన్నాడు .మరికొన్నాళ్ళు ఒక యతీశ్వరుని వద్ద చేరి శుశ్రూషచేశాడు .జ్యోతిష శాస్త్రాన్నీ మధించాడు ,అధ్యాత్మ రామాయణ కీర్తనలు ,వాగ్గేయ కారుల కృతులు అంటే విపరీతమైన మక్కువ ఉండేది .లయలో, ఛందస్సులలో ,పద ప్రయోగాలలో తనురాసిన కవితల్లో నూతన ప్రయోగాలు చేస్తూ ‘’విష్ణు ధనువు ‘’,’’నవమి చిలుక ‘’అనే రెండు ఖండ కావ్య సంపుటులు రాసి,ఆనాటి తెలుగు కవితా జగత్తు ను దిగ్భ్రాంతిలో ముంచే శాడు .అచ్చు వేయటంలోనేకాక కాపీల సంఖ్యలోనూ అత్యంత నవ్యత ప్రదర్శించిన నవ్యకవి .
శిష్ట్లా కొంతకాలం ఒక కాలేజి లో ,ఆతర్వాత ఒక ఫరం లో పని చేశాడు .తర్వాత సైన్యం లో చేరి చిత్ర విచిత్ర అనుభవాలు పొంది ,ఆ అనుభవాలతోమౌలికమైన ‘’సిపాయీల కథలు ‘’రాశాడు .భావ కవిత్వం మొదలు అధి వాస్తవికత వరకు వివిధ కవితా మార్గాలలో ప్రకటిత మైన ప్రేమను ‘’ఉద్భ్రాంత ‘’ప్రేమ అన్నాడు .శిష్ట్లా రాసిన ‘’కాళింది పాటలు ‘’తెలుగు కవిత్వానికి నూతన భా౦డాగారాలుఅని ప్రసిద్ధికెక్కాయి .పిల్లల కథలుగా ‘’గోరింట రాక్షసుడు ‘’రాశాడు .’’మహేశ్వర ,వినాయక పండిత ,ఉమా ,విజయ ,మహేశ్వరం’’ అనే కలం పేర్లతో వివిధ పత్రికలలో వ్యాసాలూ వగైరా రాశాడు .గుంటూరు నుంచి ప్రచురింప బడిన ‘’శాంతిని ‘’పత్రికకు కొంతకాలం సంపాదకుడు గా పని చేశాడు .
శిష్ట్లా కవిత్వాన్ని విశ్వనాథ మెచ్చుకొంటూ –‘’శిష్ట్లా కవి .గొప్ప ప్రతిభా వంతుడు ,మనసులో జరిగే కొన్ని విచారాలను ,ఉన్మేషాలను అంత చక్కగా ,ఆరోపించి చెప్పటం మిక్కిలి కష్టమైన పని ‘’అన్నారు .శ్రీ నోరి నరసింహ శాస్త్రి ‘’శ్రీ శ్రీ ,నారాయణ బాబు వగైరాల లాగ, శిష్ట్లా కవిత్వం విదేశాలనుంచి దిగుమతి అయిన కవిత్వం కాదు .తెలుగు గడ్డలో పుట్టి ,,తెలుగు జీవితం లో పెరిగిన నవ్య కవిత్వం శిష్ట్లా కవిత్వం ‘’అని కితాబిచ్చారు .ఇంతటి కవితా ప్రభావ శీలి శిష్ట్లా ఉమామహేశ్వర రావు కేవలం 41 ఏళ్లకే 1953లో మరణించటం ఆంధ్రుల దురదృష్టం .
సిపాయి కథలు – శిష్ట్లా ఉమామహేశ్వరరావు వ్రాసిన విలక్షణమైన తెలుగు కథలు
ఆధునిక తెలుగు సాహిత్యంలో సైనిక, యుద్ధ వాతావరణాల ప్రస్తావన చాలా అరుదుగా కనిపిస్తుంది. రెండవ ప్రపంచయుద్ధంలో విశాఖపట్నం మీద బాంబులు పడడం వంటి చారిత్రక ఘటనలు ఉన్నా, సరిహద్దులకు దూరంగా ఉండటం, సైన్యంలో చేరే తెలుగువారి సంఖ్య తక్కువ కావడం కారణాలు అనుకోవచ్చేమో. రెండవ ప్రపంచయుద్ధపు మాంద్యపు రోజుల్లో ఆరుద్ర, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖరచయితలు చాలామంది మిలటరీలో కొంతకాలం ఉద్యోగం చేసినవారే. ఐనా మిలటరీ జీవితం కథావస్తువుగా వచ్చిన రచనలు తక్కువే. అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు కొన్నిటిలో నేవీ ఉద్యోగుల జీవితం గురించి ఉన్నట్లు గుర్తు. మునిపల్లె రాజుగారి కొన్ని కథల్లో మిలటరీ జీవితం ఉంటుంది. నాకు గుర్తున్నంతవరకూ, అంగర వేంకట కృష్ణారావుగారి విరామం ఒక్కటే నిజమైన మిలటరీ జీవితం నేపధ్యంగా సాగిన నవల. యద్దనపూడి వంటి రచయితల నవలల్లో, కథల్లో కొన్నిసార్లు మిలటరీ జీవితం నేపథ్యం కనిపించినా, వాటిలో వాస్తవికత తక్కువ.
మిలటరీ జీవితం గురించే ప్రత్యేకంగా కథలు వ్రాసిన వాడు తెలుగులో ఆధునిక కవితా వైతాళికులలో ముఖ్యుడిగా చెప్పబడే కవి కావటం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన కవితలు ఇప్పుడు సకృత్తుగానే లభ్యమౌతున్నా, గత శతాబ్దపు పూర్వార్థపు కవితా చరిత్ర తెలిసినవారు శిష్ట్లా ఉమామహేశ్వరరావుని “అతి నవ్యులలో అతి నవ్యు”నిగా, “వైచిత్రికీ, విచిత్ర ప్రయోగ పరతకీ పేరు మోసిన”వాడుగా కీర్తిస్తారు. ఇప్పుడు లభ్యం కాని శిష్ట్లా కవిత “మారో మారో మారో” (1928) మహాప్రస్థానం కవితకు ప్రోద్బలమని శ్రీశ్రీయే స్వయంగా చెప్పాడు. శిష్ట్లా ఉమామహేశ్వరరావు గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అతను ‘ఉన్మత్త భావశాలి’, “సాహిత్యరంగంలో ‘స్వైర విహార ధీరుడు”. కె.వి.రమణారెడ్డిగారి మాటల్లో, “జీవితంలోనూ, సాహిత్యంలోనూ ‘అరాచకం’ (anarchy) శిష్‌ట్లాకు పర్యాయ వాచకం.”
సిపాయి కథలు 1946లో ‘యువ’ ప్రచురణగా గ్రంథరూపంలో వచ్చాయట. ఇంకొన్ని సిపాయి కథలు 1947-48 మధ్య నెల్లూరునుండి వచ్చే జమీన్‌రైతు పత్రికలో కూడా వచ్చాయట. ఈ కథల్ని మళ్ళీ 1984లో, కె.వి.రమణారెడ్డి గారు సంకలించగా, విజయవాడ నవోదయా పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఈ సంకలనంలో 21 కథలున్నాయి.
ఈ సంకలనంలో మొదటి కథ గురకానందం మార్పు మిలటరీ జీవితానికీ, మిలిటరీ వ్యక్తులకీ సంబంధించిన కథ కాదు. కథా వస్తువులోనూ, శైలిలోనూ మిగతా కథలతో ఏసంబంధమూ లేని ఈ కథను, ఈ సంకలనంలో, అందునా మొదటికథగా ఎందుకు చేర్చారో, నాకు అర్థం కాలేదు. ఆఖరు కథ శాంతమూ, సౌఖ్యమూ కూడా మిలటరీ జీవితపు కథ కాదు. సంకలనకర్త సిపాయికథలకు అటూ ఇటూ అట్టల్లా ఈ కథలు వాడుకున్నారేమో. ఇంకో కథ లెఫ్టినెంట్ తులసి మిలటరీ వ్యక్తుల కథే ఐనా, మిగతా కథల్లా ఒక సిపాయి చెప్పిన కథ గాదు; సిపాయి జీవితపు కథా కాదు; నిడివిలో పెద్దది – ఐదు అధ్యాయాల కథ; ముఖ్యకథా వస్తువు ప్రేమ. లెఫ్టినెంట్
ఈ మూడు కథల్నీ కాసేపు పక్కకి పెట్టేస్తే, మిగతా 18 కథలూ ఒక సిపాయి ఉత్తమ పురుషలో చెప్పినట్లుగా ఉంటాయి. తెలుగు సిపాయిలు ఎక్కువగా ఉన్న పటాలంలో జరిగిన (లేక ఒకరికొకరు చెప్పుకున్న) కథలు. ఒక కథకు మాత్రం కథాస్థలం అరేబియా. మిగతా కథల్లో చాలావరకూ అస్సోం (కొమిల్లా, గౌహతి) ప్రాంతాల్లో బ్రహ్మపుత్రకు అటో ఇటో జరిగిన కథలు. కొన్ని కథలు సిపాయిలు సెలవుల్లో ఉన్నప్పుడు జరిగినవి. చాలాకథల్లో కథ చెప్పే సిపాయి పేరు అబ్బాయిగారి సుబ్బాయి. లమ్డీకే లచ్చన్న చాలా కథల్లో ముఖ్య పాత్రధారి. ఇంకా పెదబొండాయి, గన్నరు గుర్నాధం, గూబ గోసాయి చాలా కథల్లో కనిపిస్తారు. ఈ అబ్బాయిగారి సుబ్బాయికే అగ్రహారబ్బడితె అని కూడా పేరు ఉన్నట్టుంది.

