అలనాటి ఆంధ్ర మహాను భావులు-8

  అలనాటి ఆంధ్ర మహాను భావులు-8

8-ప్రముఖ న్యాయమూర్తి ,సాంఘిక సేవాకర్త సంస్కర్త ,దాత – సర్ ముత్తా వేంకట సుబ్బారావు గారు

ఎక్కడో ఒరిస్సాలోని కటక్ లో జన్మించి కృష్ణా జిల్లా బందరులో పర్ర మీద పెరిగిన ముత్తా వేంకట సుబ్బారావు గారు ఆ గాలి మహాత్మ్యం ఏమో ‘’ధర్మపాలనలో ఇంతటి వారు లేరు ‘’అని ఆనాటి మద్రాస్ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ,లయోనేల్ లీచ్ ,అడ్వకేట్ జనరల్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ,న్యాయమూర్తి పి వెంకటరమణారావు ,మద్రాస్ న్యాయవాదుల సంఘాధ్యక్షులు ఎస్.శ్రీనివాస అయ్యంగార్ వంటి న్యాయ కోవిదుల చేత ప్రశంసలు పొందారు .

 ముత్తావారు మద్రాస్ చేరి ,ప్రముఖ లాయర్ రాదాకృష్ణయ్యర్ గారితో కలిసి లా ప్రాక్టీస్ చేశారు .తనంత వారు లేరని కొద్దికాలం లోనే నిరూపించుకొన్నారు .అతి కొద్దికాలం లోనే న్యాయమూర్తి పీఠం అధిష్టించారు .’’ధర్మ శాస్త్ర పాలనం అంటే కళ్ళు మూసుకొని,నడిచిన దారిలో నడవటం కాదు .నాగరక సంఘానికి ధర్మ ప్రతిష్టాపనమే ఆధారం ‘’అనే ఉత్కృష్ట భావంతో ప్రతి చర్యలో, వేసిన ప్రతి అడుగులో ఆశయాలను ఆచరణలోకి తెచ్చారు .అనేక మానసిక ప్రవృత్తులు ఉన్న సంఘం లో ,సాధ్యమైనంతవరకు నిజాన్ని గ్రహించి న్యాయం స్థాపించటమే తమ ధ్యేయం అనే వారు .న్యాయ స్థాపన కోసం అధికారుల ప్రాపకాన్ని కోరలేదు ,ఆగ్రహానికి బెదరలేదు .అప్రతిహతమైన స్వాతంత్ర్యాభిలాష ,సర్వ జనాదారణమైన ధర్మానురాగం ,నిరుపమాన మేధాసంపద ఆ న్యాయమూర్తి సుగుణ సంపదలు .

 న్యాయాన్ని తవ్వి న్యాయ ,ధర్మ ప్రతిష్ట చేయటంలోనే  న్యాయమూర్తి గొప్ప తనం ప్రతిఫలిస్తుందని నమ్మారు .ఈ సద్గుణాలన్నీ సుబ్బారావుగారి ప్రతి తీర్పులోనూ స్పష్టంగా రుజువైంది .ఇరు పక్షాలవాదాలు సమగ్రంగా విని ఖచ్చితమైన న్యాయ నిర్ణయం చేసేవారు .హిందూ  ధర్మ శాస్త్రాలు ఈ కాలానికి పనికి రావు అని ఆయన భావించలేదు .వాటిని పూర్తిగా అవలోడనం చేసుకొని, న్యాయ మూర్తిగా రాణించారు .వ్యాపార పరిశ్రమ వలన కలిగే మార్పులను మనసులో పెట్టుకొని హిందూ న్యాయ సూత్రాలకు సంబంధించిన వారసత్వ౦ లో అనుకూల నియమాలు చేస్తూ వచ్చారు .ఆధ్యాత్మిక ఉద్దేశ్యం తొ  దత్తతచేసుకొన్నా ,అది భౌతిక కార్యంగానే ఉండాలన్నారు .స్త్రీల హక్కులను ఎంతవరకు కాపాడాలో అంతవరకూ శక్తి వంచన లేకుండా కాపాడారు .హిందూ మతం వదిలి వేరొక మతం లో చేరి ,మళ్లీ హిందూ మతం లోకి చేర్చుకోవటం శాస్త్ర విరుద్ధం కాదన్నారు .హిందూ మతంలో పంచమ వర్ణం , అస్పృశ్యత లేవన్నారు .సర్ సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి వారు ప్రారంభించిన ‘’రైతు హక్కు రక్షణ ‘’ను మనస్పూర్తిగా కొనసాగించారు .

  ‘’సుబ్బారావు గారి కంటే ఎక్కువ చదివినవారు ,ఎక్కువ తెలివిగలవారు,ఎక్కువ గొప్పతనం ఉన్నవారు  ఉంటే ఉండచ్చు కాని,ఈ మూడు సుగుణాలు సుబ్బారావు గారిలో త్రివేణీ సంగమం గా కలిసి ఉన్న వారు మాత్రం ఎవ్వరూ లేరు ‘’అంటారు .జస్టిస్ వేంకట రమణా రావు  గారు  .గొప్ప న్యాయమూర్తిగా మాత్రమేకాక ,గొప్ప సంఘ సంస్కర్తగా ,,సాంఘిక సేవాకర్తగా ,దాత గా ప్రసిద్ధిపొందారు .మద్రాస్ లో  సుబ్బారావు ,శ్రీమతి ఆండాలమ్మదంపతులు స్థాపించిన ‘’సేవాసదనం ‘’వారి సేవకు దాతృత్వానికి గొప్ప ఉదాహరణ .ఇందులో భర్తలు లేని స్త్రీలు ,దిక్కు లేని వారు హరిజన బాలబాలికలు చక్కని వసతి భోజన ,వస్త్ర సౌకర్యాలతో విద్య ను అభ్యసిస్తున్నారు .వృత్తి విద్య నేరుస్తూ తమ కాళ్ళపై తాము నిలబడుతున్నారు .అన్ని రకాల వినోదకార్య క్రమాలు వారికి మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి .ఆ నాడే ఆ భవననికి వారు సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేశారు .దంపతులు అతి సున్నిత హృదయులు .ఉదారభావం ఉన్నవారు హిందూ ధర్మ శాస్త్రాలపై అపార గౌరవం ఉన్నవారు  .

1903లో మద్రాస్ లో వకీలుగా నమోదై ,1921లో మద్రాస్ హైకోర్ట్ జడ్జి గా నియమింపబడ్డారు .అంత చిన్నవయసులో ఈ పదవి పొందిన వారిలో సుబ్బారావు గారే మొదటి వారు .1936లో ‘’నైట్ హుడ్ ‘’గౌరవం పొందారు ..శ్రీమతి ఆ౦డాలమ్మ ను వివాహమాడారు .’’కాన్సీక్వెంషియల్ ట్రూత్ ‘’కు నిబద్ధులు .ప్రతి విషయంలో పరిపూర్ణత కోరేవారు .ఆయన మరణానంతరం , గౌరవ సూచకంగా మద్రాస్ టి.నగర్ లో ‘’సర్ ఎం .వేంకట సుబ్బారావు మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరి స్కూల్ ‘’ను 1971లో స్థాపించారు .1987లో శ్రీమతి ఆండాల్ స్కూల్ స్థాపించారు .సేవాసదన్ లో సుమారు 1200వందలమంది కూర్చునే ఆడిటోరియం సకల సౌకర్యాలతో నిర్మించారు .ఇంతకంటే వివరాలు లభ్యం కాలేదు .

  మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తిగా 17 సంవత్సరాలు పని చేసి న్యాయ ధర్మాలకు ఆలవాలంగా ఉన్నారు జస్టిస్ ముత్తాసుబ్బారావుగారు.భారతీయ స్కౌట్ సంఘానికి  స్వాతంత్ర్య ,సాహస ,స్వదేశాభిమానాలు నూరిపోసిన మానవీయ మూర్తి వారు .వారిని కీర్తిస్తూ శ్రీ పురాణం సూర్యనారాయణ తీర్ధుల వారు రచించిన పద్యం అక్షర సత్యం .అక్షర లక్షల విలువ కలది –

‘’సీ- ‘’న్యాయశాస్త్రాబ్దిఅంతస్సారము గ్రహించు- తలపుతోలెస్సగా తడిసి నావు – ఆంధ్రు లందరును గా కఖిలదేశము గర్వ –పడన్యాయమూర్తితన్ పడసినావు –తీర్పు చెప్పుట యందు ,మార్పుచేయుట యందు –ధర్మ దేవత కింత దడిసినావు –సచ్చరిత్రాదులౌ సద్గుణమ్ముల చేత –విహితుల మదులలో విడిసి నావు

తే-నీదు యోగ్యత గుర్తించి,నిను నుతించి-సర్ బిరుదమిచ్చికొనలేదె చక్రవర్తి –అశ్రితాప్త విధేయ ,నిరంతరాయ –సూరిజన గేయ వేంకట సుబ్బరాయ ‘’

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-23- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.