అలనాటి ఆంధ్ర మహాను భావులు-10
· 10- దక్షిణాఫ్రికా భారత ప్రతినిధి వర్గ నాయకులు ,మద్రాస్ రాష్ట్ర ప్రధాని ,గవర్నర్ ,అన్నామలై యూనివర్సిటి వైస్ చాన్సలర్ -రావుబహదూర్ సర్ కూర్మా వేంకట రెడ్ది నాయుడు గారు
· నల్లగా ఉన్నా మంచి ముఖ వర్చస్సు ,ఆంధ్ర,ఆంగ్లాలలో ధారాళంగా మాట్లాడే నేర్పు ,బంగారు చట్రం కళ్ళజోడు ,ప్రకాశవంతమైన కళ్ళు ,నిడివిన దేహం తొ చూపరులకు ఆకర్షణగా ఉండేవారు రావు బహదూర్ సర్ కూర్మా వేంకట రెడ్ది నాయుడు గారు.పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రముఖ న్యాయవాది .స్థానిక సంస్థలలో పాలనానుభావం ,దేశ హిఅతికకార్యాలపైఅమితాసక్తి ఉన్నవారు .ఆకాలం లో డాక్టర్ నాయర్ ,సర్ పిటి త్యాగరాయ శెట్టి గార్లు లేవ దీసిన బ్రాహ్మణేతర ఉద్యమం జస్టిస్ పార్టీ లు దేశంలో ఇరవైయేళ్ళు తీవ్ర అలజడి సృష్టించాయి .కులతత్వాలు తారాస్థాయిలో విజ్రుమ్భించాయి .జాతీయ వాదులైన పానగల్లు రాజా ,పాత్రో, కూర్మాలుకులతత్వ వాదులుగా మారిపోయారు .బ్రాహ్మణులకు తీవ్ర నష్టం కలిగింది .సామాన్య బ్రాహ్మణేతరులు కూడా బాగా దెబ్బ తిన్నారు .
· అప్పుడే వచ్చిన మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ ల సంస్కరణలు ఈవిభేదాలను పూర్తిగా అణచి వేసి ఎన్నికలలో సమైక్యత ఏర్పడింది .ప్రజలు ఉద్యోగాన్వేషణలో పడ్డారు .మంచి వక్త అయిన కూర్మా నాయుడుగారు 1920లో పానుగల్లు రాజా మంత్రివర్గం లో స్థానం సంపాదించి ఆంధ్రులకు గర్వ కారణమయ్యారు .అయినా కులం బాగా పని చేసి ఆయన కు మంత్రివర్గంలో నామమాత్రం అయ్యారు .లాభం లేదని ప్రతిపక్షంలో చేరి సమర్ధతచాటి ఒక ఊపు ఊపారు నాయుడుగారు .మంత్రి వర్గం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు యే వైపుకు మొగ్గక తటస్థంగా ఉన్నారు .సమయం కోసం ఎదురు చూస్తున్న నాయుడుగారికి ,కోయంబత్తూరు బ్రాహ్మణేతర మహా సభ వారు గోషెన్ ప్రభువుపై నిరసన చూపితే కొమ్ముకాశారు .అందరూ కాదన్న సైమన్ కమీషన్ ను సమర్ధించారు .ఇంగ్లాండ్ లో సైమన్ కు విందు జరుగుతుంటే సందు చూసుకొని వెళ్ళి బ్రిటీష ప్రభుత్వం చేసిన మేళ్ళ ను బాకా బజాయించి మహాబాగా ఊదారు .స్తోత్ర పాఠకుని మించిపోయారు .వీరి ప్రభు భక్తీ గమనించి ఆంగ్లప్రభుత్వం నాయుడుగారిని జెనీవా లో అంతర్జాతీయ సమావేశానికి ,రైటానరబుల్ శ్రీని వాస శాస్త్రి గారి తర్వాత భారత ప్రతినిధిగా పంపింది.1933-34 స్టేట్ కౌన్సిల్ సభ్యునిగా నియమింపబడ్డారు .మద్రాస్ ప్రభుత్వ లా మెంబర్ సర్ ఎం కృష్ణ నాయర్ మరణించాక ,నాయుడు గారికి ఆచాన్స్ దక్కించింది ప్రభుత్వం.వీర విధేయతకు వీర తాడు వేసింది .ఆయన ఆంధ్రుడు అని మనం గర్వంగా కాలరు ఎగరేసినా కొల్లాయి గుడ్డ స్వరాజ్య గాళ్లను నాయుడు గారు ‘’ఖైదీలకు మజ్జిగ అడిగేరు సుమా .నేను లేదనాల్సి వస్తుంది ‘’లాంటి లేకిమాటలు మాట్లాడి హృదయాలను గాయ పరచారు .
· నాయుడుగారిజీవితం నల్లెరుమీద బండిలా సాగింది .సర్ హోప్ టన్ స్టోక్స్ పదవి నుంచి విరమించుకోన్నాక ప్రభుత్వ కార్య నిర్వాహక సంఘ ఉపాధ్యక్షులై ,శాసన సభ నాయకుడు కూడా అయ్యారు నాయుడు గారు .గవర్నర్ ఎర్కిన్సన్ సెలవుపై వెళ్ళటంతో గవర్నర్ హోదాకూడా పొందారు .ఠీవిగా దర్జాగా ఉన్నతంగా,సామర్ధ్యంగా పదవిని నిర్వహించి మంచిపేరు తెచ్చుకొన్నారు .బ్రిటీష ప్రభుత్వ గవర్నర్ ,కార్య దర్శి మంత్రి,అయిన ఆనాటి మేటి ఆంధ్రులలో పానగల్లురాజా ,సర్ బి ఎన్ శర్మ ,సర్ కూర్మా నాయుడు,ఈడుపుగంటి రాఘవేంద్రరావు గార్లున్నారు .
· ఇరవై ఏళ్ళు కులరాజకీయాలతో లాభం పొందిన జస్టిస్ పార్టి 1936ఎన్నికలలో ఇక ఎన్నడూ కోలుకోలేని చావుదేబ్బతిన్నది .నాయకులు ,మంత్రులు జమీందార్లు మట్టి కరిచిపోయారు .కాంగ్రెస్ వారు మంత్రి పదవులు తీసుకోవాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు .బొబ్బిలిరాజా ,శ్రీనివాసశాస్త్రి సర్ మహమ్మద్ ఉస్మాన్ వంటి వారు భారం మోయటానికి వెనక్కి తగ్గారు .దక్షిణాఫ్రికాలో ప్రభుత్వఏజేంట్ గాఉన్న కూర్మా నాయుడు గారు ముందుకు వచ్చి ఆనడ మంత్రపు సిరిని నెత్త కెత్తుకున్నారు .కానీ కొల్లాయి మూకల శివ తాండవం ముందు నిలవలేక పోయారు .
· అయినా బ్రాహ్మణేతరుల పక్షాన నాయుడుగారు పొందాల్సిన రాచ మర్యాదలన్నీ పొందారు .జాయింట్ కమిటీ పార్లమెంటరి వర్గానికి నాయకుడు గా లండన్ వెళ్లారు ‘’మద్రాస్ కాన్ష్టి ట్యూషనల్ లా’’ లో లెక్చరర్ అయ్యారు .ఆంధ్రయూని వర్సిటి స్నాతకోత్సవంలో ఉపన్యసించారు .నాట్యకళ ,కళాపరిషత్ లను ప్రోత్సహించారు .ఇప్పుడు వారి జనన ,విద్యాది విషయాలు తెలుసుకొందాం.
· కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు (1875 – 1942) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ప్రొఫెసర్, రాజకీయవేత్త ప్రజా సేవకులు. మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు.
· వీరు రాజమండ్రిలో ప్రఖ్యాత తెలగ సైనిక యోధుల కుటుంబీకులగు బాపనయ్య నాయుడు దంపతులకు జన్మించారు. వీరు యునైటెడ్ హైస్కూలులో చదివి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో బి.ఎ.పరీక్షలో 1894లో కృతార్థులయ్యారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకునిగాను, అమలాపురం బోర్డు హైస్కూలులో ఉపాధ్యాయునిగా కొంతకాలం పనిచేసి, వీరు 1900 సంవత్సరంలో బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అచిరకాలంలోనే మంచి పేరుతెచ్చుకున్నారు. గోదావరి జిల్లా విభజన తర్వాత ఏలూరుకు నివాసాన్ని మార్చి అక్కడి న్యాయవాదులలో అగ్రశ్రేణికి అందుకున్నారు. కొంతకాలం రాజమండ్రి, ఏలూరు పురపాలక సంఘాలకు అధ్యక్షులుగా పనిచేశారు.
· గ్రామ ప్రజల శ్రేయోభివృద్ధికి, వారి ఇబ్బందులను తొలగించడానికి, ప్రారంభ విద్యా వ్యాప్తికి మిక్కిలి కృషిచేస్తూ స్థానిక సంస్థలలో తన పలుకుబడిని వినియోగించి ప్రజల ఆదరానికి పాత్రులయ్యారు.
· వీరు 1929లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ మహాసభా సమావేశానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్ళారు. దక్షిణాఫ్రికాలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. తరువాత మద్రాసు ప్రభుత్వ లా మెంబరుగా నియమించబడ్డారు. ప్రభుత్వ కార్యనిర్వహక సభ్యులై శాసనసభకు నాయకులయ్యారు. మద్రాసు గవర్నరు ఎర్ స్కిన్ సెలవు పుచ్చుకున్నప్పుడు వీరు మద్రాసు గవర్నరు పదవిని అలంకరించారు.
· 1936లో ఎన్నికలకు తరువాత, కాంగ్రెస్ పరిపాలన నిరాకరించిన రోజులలో ఉమ్మడి మద్రాసు మధ్యంతర మంత్రి మండలిని ఏర్పరచి మూడు నెలలు ప్రధానిగా పరిపాలన నిర్వహించారు.
· 1940లో చిదంబరంలో అన్నామలై విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులయ్యారు. సుప్రసిద్ధ నాటక విమర్శకులు, న్యాయవాది కూర్మా వేణుగోపాల స్వామి వీరి కుమారుడు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-23-ఉయ్యూరు

