ఊసుల్లో జారిపోయిన పెద్దలు-1
నేను రాసిన ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’లో కొందరుపెద్దలు నా కళ్ళు కప్పి జారిపోయారు .వారిని ఇప్పుడుజ్ఞాపకం చేసుకొని ఆలస్యంగానైనా పరిచయం చేసి ధన్యుణ్ని అవుదామనుకొంటున్నాను .
1-నిబద్ధతకు నిలువెత్తు మనిషి -శ్రీ ‘’ఏలాల? అప్పారావు
అవి నేను ఎనిమిదవ తరగతి చదివే రోజులు అంటే 1953కాలం .అప్పుడు మా ఉయ్యూరు శివాలయం లో ఆర్ .ఎస్ .ఎస్ .అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శాఖ ఉజ్వలంగా వెలుగు తున్న రోజులు .శివాలయం ఆవరణ అంతా స్వయం సేవకులతో నిండి ఉండేది .బాల ,తరుణ మొదలైన విభాగాలు౦డేవి .అపుడు ఉయ్యూరులో పాలిటెక్నిక్ కాలేజి ఉండేది .అందులోని విద్యార్దులైన శ్రీమహేశ్వర రావు గారు మొదలైన వారుచాలా చలాకీగా కార్యక్రమాలు నిర్వహించేవారు .నేను అప్పటి నుంచి 1956లో ఎస్ .ఎస్ .ఎల్సి .పూర్తయ్యేదాకా నిత్యం శాఖకు వెడుతూ ఉండేవాడిని .ఖాఖి నిక్కర్ తెల్లషర్ట్ చేతిలో నాలుగైదు అడుగుల లాఠీ ,సాక్స్ ,బూట్లు,నెత్తిన నల్ల టోపీ అప్పటి డ్రెస్కోడ్ .వాటితోనే వెళ్ళేవాడిని .బాల శాఖలో ఉండేవాడిని .అప్పుడు బాలశాఖకు ఇన్చార్జి గా శ్రీ అప్పారావు ఉండేవారు ఇంటిపేరు ఏలాల అని జ్ఞాపకం .చాలా హుషారుగా ,ఎంతో చనువుగా బాలలను ఆత్మీయంగా చూస్తూ నేర్పిస్తూ పాటలు పాడుతూ పాడిస్తూ ఆటలు ఆడుతో ఆడిస్తూ గొప్ప సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేవారు .వెడల్పైన ముఖం ,మంచి దేహ సౌష్టవం .మరీపోడుగూ కాదు పొట్టీ కాదు .నవ్వులోలికే ముఖం .ఆముఖం లో స్వచ్చత ప్రతి ఫలించేది .మాట నెమ్మది .క్రమ శిక్షణకు మారుపేరు .ఆనాటి సంఘ పెద్దలకు తలలో నాలుక .భగవాధ్వజ౦ తీసుకు రావటం ,ప్రతిష్ఠించటం అయన నిత్యకృత్యం .శాఖ’’ నమస్తేసదా వత్సలే ‘’గీతం తో ముగిసేది .ఆతరవాత మళ్లీ ఆధ్వజాన్ని జాగ్రత్త చేసిఆఫీసులో ఉంచటం ఆయన డ్యూటీ .ఎక్కడాఎప్పుడూ ఏమరుపాటు ఉండేదికాదు .మా అందరికి పెద్దన్నయ్య లా ఉండేవారు .’’దగ్గరికి పిల్చి ‘’నాన్నా !బాగున్నావా ?’’అంటూఅందర్నీ ఆప్యాయంగా పలక రించే వారు .అందుకే అందరి హృదయాలలో నిండిపోయి ఉండేవారు .ఆయన ఏ కులమో ఏం చదివారో ఎక్కడి వారో మాకు తెలీదు .కాని కార్య దీక్షగల నాయకుడుగా మాకు కనిపించేవారు .
ఆతర్వాత తరుణ కు ఇన్చార్జి గా ఉ౦డేవారని గుర్తు .అప్పుడు శ్రీ సాగర్ బాల కు ఇన్చార్జి అని జ్ఞాపకం .అలాంటి అప్పారావు గారిని ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’లో ఎలా మర్చిపోయానో నాకు ఆశ్చర్యం వేస్తోంది .మొన్నరాత్రి ఎందుకో నిద్ర పట్టక అటుఇటు పక్కపై దొరలు తుంటే, ఆకస్మాత్తుగా అప్పారావు గారు మదిలో మెదిలారు .అప్పుడు రీళ్లు వెనక్కి తిప్పి చూశా .ఈమాత్రం జ్ఞాపకాలే మిగిలాయి .ఆతర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో నాకు తెలీదు .నేనుకూడా కాలేజి లో బెజవాడలో చదవటం తో శాఖ కు కొంత దూరమయ్యాను .మళ్లీ సైన్స్ మాస్టర్ గా పని చేసినప్పుడు శాఖకు వెళ్ళేవాడిని .అప్పుడు శ్రీ రొంపిచర్ల ఆచార్యులు గారు పసుమర్రు నుంచి వచ్చి సెకండరి టీచర్ ఉన్నారు .ఆయనా నిబద్ధత కల కార్యకర్త .నాకంటే పెద్దవారు . డ్రెస్ కోడ్ పాటించి శాఖకు వచ్చి నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేవారు .మా విష్ణ్వాలయం అర్చకుడు వేదాంతం రమణ కు కన్నతండ్రి . ఆచార్యులగారి తోడల్లుడు శ్రీ వేదాంతం రామ చంద్రా చార్యులు గారికి ఈ రమణ దత్త పుత్రుడై, ఉయ్యూరు విష్ణ్వాలయం అర్చకత్వాన్ని పె౦పుడు తండ్రిగారి తర్వాత నిర్వహిస్తున్నాడు .రమణ హైస్కూల్ లో నా శిష్యుడే .
ఇంకా ఎవరైనా ఇలాగే గుర్తుకు వస్తే వారిని గురించి రాస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-12-23-ఉయ్యూరు

