ఊసుల్లో జారిపోయిన పెద్దలు-2
2-కెసిపి ఉద్యోగంతోపాటు వడ్లమిల్లు నూ నిర్వహించిన శ్రీలోకేశ్వరావు
దాదాపు రావు గోపాలరావు అంతటి భారీ పర్సనాలిటి ,తెల్లని మల్లు పంచ ,పైన తెల్ల చొక్కా ,వెడల్పు ముఖం పళ్ళమధ్య కొంచ౦ ఎడం ,చొక్కా పై గుండీలు పెట్టుకోని వైనం తో కొంచెం నవ్వుముఖంతో ఉయ్యూరు షుగర్ ఫాక్టరిలో ఆఫీసు లో ఉద్యోగం ఉన్న పెద్దమనిషి శ్రీ లోకేశ్వరరావు గారు .యాకమూరు నివాసం పుల్లేరు కాలువ గట్టుపై డాబా ఇంట్లో నివాసం .ప్రక్కన వడ్లమిల్లు యజమానికూడా .ఆమిల్లును మేమంతా యాకమూరు మిల్లు అనే వాళ్ళం లేకపోతె లోకేశ్వరావు గారి మిల్లు అనే వాళ్ళం .నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మేస్టర్ గా పని చేస్తున్నప్పుడుఆయన కుమార్తె కుసుమ అని జ్ఞాపకం నాదగ్గర ట్యూషన్ చదివేది . మహా నాజూగ్గా లేత తమల పాకులా ఉండేది. వంచిన తలా ఎత్తేదికాదు.వినయ విధేయతలు ఆమె ఆభరణం .నాదగ్గర ఎందుకు ట్యూషన్ కు చేరిందో నాకు తెలీదు బహుశా అక్కడి ఆడపిల్లలు నాదగ్గర చదువు తుంటే వచ్చి చేరిందేమో తండ్రి వచ్చి నన్ను అడిగిన జ్ఞాపకం లేదునాకు .లోకేశ్వరరావు గారు ఫాక్టరీలో పెద్దమనిషిగా మంచి పేరు తెచ్చుకోన్నట్లు గుర్తు .
ఆయన మేనల్లుడే ముత్యాలముగ్గు హీరో ,కుమ్మమూరు నివాసి శ్రీధర్ అని తర్వాత ఎప్పుడో తెలిసింది?? .అప్పటికి రావు గారికి స్కూటర్ లేదనే గుర్తు సైకిల్ మీదే ఫాక్టరి ఉద్యోగానికి వెళ్ళి వచ్చేవారు .ధాన్యం మిల్లు నిర్వహించేవారు .బియ్యం దిగుబడి బాగా వచ్చది. చిట్టూ,తవుడు మిగిలిన మిల్లులకంటే తక్కువ రేటుకే అక్కడ లభించేవి .అప్పటికి కాటూరు రోడ్డులో పొగాకు ముసలయ్య గారి మిల్లు రాలేదని అనుకొంటా .మేము మాత్రం ఆదిరాజు చంద్రమౌలీశ్వరావు గారి మిల్లు లోనో లేక కంతేటి విశ్వనాధం గారి మిల్లు లోనో మా ధాన్యం ఆడించే వాళ్ళం .లోకేశ్వర రావు గారిమిల్లులో ‘’ముసలయ్య ‘’అనే ఆతను ధాన్యం ఆడటానికి ఇన్చార్జి గా ఉండేవాడు బక్కపలచగా ,కాఖినిక్కరు తెల్ల చొక్కాతో ఉండేవాడు మిల్లు పని చేస్తున్నప్పుడు చొక్కా తీసేసి చేతుల్లేని బనీనుతో ఉండేవాడు .నవ్వుముఖం నెమ్మదిగా మాట్లాడే వాడు .చాలా మంచి వాడు గొప్ప నమ్మకస్తుడు అటు ఓనరుకు ఇటు కస్టమర్లకు కూడా .ఎక్కడా నొక్కేయటం జరిగేదికాదు .ఈ ముసలయ్యే ఆతరవాత కాటూరు రోడ్డులో పెట్టిన పొగాకు ముసలయ్యగారి మిల్లులో పని చేశాడు .అక్కడా అంతే నమ్మకం తో పని చేసేవాడు .అతడు మిల్లు లో ఉంటే మన సరుక్కు ఢోకాలేదు.గుండెపై చేయి వేసుకొని ఇంటికి రావచ్చు మనం వెళ్ళేటప్పటికి చక్కాగా వడ్లు మరపట్టి బియ్యం నూకలు వేరుగా చిట్టూ తౌడు వేరుగా మనం వేసిన బియ్యానికి తగినట్లు ఇచ్చేవాడు .
ఓనర్ పొగాకు ముసలయ్యగారు అంతకుముందు పొగాకు అమ్మేవారు అందుకని ఆపేరు వచ్చింది ఎర్రని నీరుకావి పంచ చొక్కా బుర్రమీసాలు నుదుట పొడవైన ఎర్రని తిరునామ౦ ఆయన ప్రత్యేకత .గంభీరంగా ఉండేవారు ఆయన కొడుకు లిద్దరూ ఉయ్యూరు హై స్కూల్ లో చదువుతూ నాదగ్గరే ట్యూషన్ చదివేవారు .అందులో తమ్ముడిపేరు వెంకటేశ్వరరావు .నవ్వుముఖం .పొట్టిగా ఉండేవాడు మాంచి ఇంటలిజెంట్. నాకు బాగా నచ్చిన శిష్యుడు .వాడికి బాగా నచ్చిన గురువు నేను అని చెప్పేవాడు .తండ్రి తర్వాత మిల్లు చాలా ఏళ్ళు నడిపి వదిలేశారు వెంకటేశ్వరావు ఇంజినీరింగ్ పాసయ్యాడు .జ్యోతిషం లో మంచి ప్రవేశం సంపాదించాడు .ఎక్కడ ఎప్పుడు కనబడినా అదే వినయం ప్రదర్శించేవాడు .ఆతర్వాత ఆమిల్లు, స్థలం అమ్మేశారు
లోకేశ్వరావు గారి ప్రక్కన ఆతర్వాత సుధీర్ టింబర్ డిపో వచ్చింది దీని ఓనరు నూకల లింగమూర్తి గారు .వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు పామర్రులో నాకు శిష్యులు .అప్పుడు వాళ్ళు తాడంకి పక్కన కనుమూరులో ఉండేవారు .ఇప్పుడు సుధీర్ టింబర్ డిపో మన ఉభయ రాస్ష్ట్రాలలో గొప్ప పేరు పొందింది .సరసమైన రేట్లకు ఆతిధ్యానికి మర్యాద మన్ననలకు మంచిపేరు .లింగమూర్తి గారబ్బాయిలు శేషగిరి రావు సాంబ శివరావు లు తండ్రి మాట జవదాటకుండా బిజినెస్ ను ఎంతో వృద్ధి చేశారు .ఒకప్పుడు ఆంధ్రాలో అక్కినేని నాగేశ్వరావు గారి టింబర్ డిపో హైదరాబాద్ లో నంబర్ వన్ అయితే ,సుధీర్ డిపో నంబర్ టు.ఇటీ వలపదేల్లలో సుధీర్ నంబర్ వన్ స్థానం సాధించింది .
సుధీర్ బాగా పెరిగే దాకా లోకేశ్వరావు గారి మిల్లు పని చేస్తోనే ఉంది ఎప్పుడైతే సుధీర్ బిజినెస్ పెరిగిందో లోకేశ్వరావు గారు మిల్లును సుధీర్ కు ఇచ్చేశారు వీళ్ళు కొద్దికాలం నడిపి తీసేశారు .లోకేశ్వరావు గారు ఇల్లు ఏమయిందో లోకేశ్వరావు గారు ఎప్పుడు చనిపోయారో నాకు వివరాలు తెలీదు. గుర్తున్నంతవరకు పేపర్ పై పెట్టాను .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-23-ఉయ్యూరు

