గతవైభవ౦ , వర్తమాన చరిత,  భవిష్యత్ ఆకాంక్షల కవితా సంకలనం ‘’మన ఆంధ్ర ప్రదేశ్ ‘’

గతవైభవ౦ , వర్తమాన చరిత,  భవిష్యత్ ఆకాంక్షల కవితా సంకలనం ‘’మన ఆంధ్ర ప్రదేశ్ ‘’

ఆంధ్ర ప్రదేశ రచయితల సంఘం వినూత్న దృక్పధంతో భాష ,సంస్కృతీ ,రాష్ట్రం ,దేశం కోసం వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన వారిని ఈతరం ,భావిష్యత్తరాలకోసం పరిచయం చేసే సదుద్దేశం తో 2018 జూన్ 10 న విజయవాడలో నిర్వహించిన  ఏక దిన  కవి సమ్మేళనం లోని కవితలను కరోనా కాటులను తట్టుకొని ,కొత్తజిల్లాల గందరగోళం అధిగమించి ఈ సంవత్సరం లో పుస్తక రూపం దాల్చింది. ఇ౦దులో నిర్వాహకుల ఇబ్బంలెన్నో ఉన్నాయి .కవులు చక్కగా స్పందించారు .ముఖ చిత్ర శిల్పి ‘’చప్ర ‘’  అనే చలపాక ప్రకాష్ పుస్తకానికి గొప్ప వన్నె తెచ్చారు .నిర్వహణ సేకరణ ముద్రణ అనే’’ త్రివ్య సాచిత్వాన్ని’’ సమర్ధంగా నిర్వహించారు .రచయితల సంఘానికి మనస్పూర్తిగా అభినందనలు .ఈ మధ్యనే నాకు ఈపుస్తకం అందింది .ఇప్పుడే చదివాను .77కవితలతో ,రాష్ట్రం నలుమూలల సుప్రసిద్ధులు వర్ధమానులు అయిన కవుల రూప చిత్రం ఈ సంకలనం .కోన సీమ అందాలు ఆరేసిన ,గుంటూరు మిర్చి ఘాటు చూపిన ,రతనాలసీమ రాయల సీమ సాంస్కృతిక వైభవం చూపిన  ,బెజవాడ,బందరు గతవైభవ వర్తమాన కీర్తి బావుటా ఎగరేసిన, పల్నాడు ,నెల్లూరు ,చిత్తూరు కీర్తి కి కిరీటాలు పెట్టిన,ఉత్తరాంధ్ర సాగర నదీ సోయగాలను ,గోదారి అందాలను ,వారి ‘’ఎటకారాన్ని’’చూపిన,కృష్ణా తరంగ నిర్నిద్రగానాన్ని ఆలపించిన కవితలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. పడి లేచిన సంస్కృతీ బాషా తరంగాలను ,పట్టించుకోని పాలనను ,ధ్వంసమైన వ్యవస్థలను కళ్ళకు కట్టించిన కవితలున్నాయి .ఏదికోల్పాయామో ఎక్కడ కోల్పోయామో, మళ్లీ ఎలా తల ఎత్తుకొని నిలబడాలో చెప్పిన కవితలున్నాయి . ఈ కవిసమ్మేళనం నిర్వహించినరాష్ట్ర సంఘం   ,అయిదు ప్రపంచ తెలుగు రచయితల సమావేశాలను ఘనంగా నిర్వహించిన జిల్లా రచయితల సంఘం  బందరు ,నెల్లూరు, గుంటూరు ,రాయలసీమ ఉత్త రాంధ్రసాహితీ సంస్థ లను, నిర్వాహకుల సేవలను కానీ ,గ్రంథాలయాలనుకానీ ఎవరూ ముట్టుకోకపోవటం బాధాకరం .   చాలాభాగం కవితలు చిఠ్ఠా,ఆవర్జాలులాగా ఉన్నాయి .విషయాలు అవే అయినా కవితాత్మకం గా చెప్పక పొతే కవిత్వం కాదు .లిస్టు లవుతాయి . నాకు కనిపించిన కవితా స్పర్శ ఉన్న వాక్యాలు, పదాలు మాత్రమె ఉదహరిస్తాను . 

‘’అఖండ భారతం లో ఋగ్వేద జన్యువు –అనాది జానపదం అడుగుల కామ ధేనువు ‘’  అన్నారు చిల్లర భవానీదేవి .’’జబర్దస్ట్ గా అందాలు చిందిచే డ్రెస్ మెటీరియల్ తయారీలో –వ్యర్ధమైన దారంలా –నేతకార్మికుల వ్యధలు –పురవీధుల్లో ఇంకా వినబడుతూనే ఉన్నాయి.లక్ష్మీ నర సింహుడి గుడి శిఖరం పైకి –అభి వృద్ధి అందల మెక్కుతోంది –‘’ ‘’అన్నారు . పొత్తూరి సుబ్బారావు .పసపల హరి కృష్ణా రెడ్ది –‘’సకల కళల గీర్వాణి -నవరసాల  వాణి ఆకాశ వాణి’’అని కీర్తించారు .’’వరి క౦కి లో జీవం నింపేందుకు-నీటి జాడల్ని ఆపి – ధవళేశ్వరం వద్ద కాటన్ అడ్డు కట్ట అయ్యాడు –రాజమహే౦ద్ర వరం లో –జీవనం ఒక గొప్ప వరం  ‘’.అన్నారు ఎస్ ఆర్ పృథ్వి .ఆరుద్రను గుర్తుకు తెచ్చారు .బెజవాడలో రైల్వే స్టేషన్ గా౦ధీహిల్ నక్షత్ర శాల కోపూరి పుష్పావతిగారికి ‘’ఆ  ఆనంద౦ నన్నే మించిపోయింది ‘’అని పించాయి .మరో చలం గారికి ‘’పసిడి పచ్చని వెలుగుల తెలుగు ఆభరణం మన ఆంధ్రము –ఒక ఆకు పచ్చని అనుభవం ‘’అని పించింది .ఉండవల్లి గోడ మీదిశిలాశాసనం –మంగళగిరి రహస్య మార్గం ‘’అంటూ యురేకా అన్నారు ఎం.ఎస్.సాయిబాబా .ఆంధ్రా పారిస్ తెనాలి –‘’ఆధ్యాత్మిక ఆనందాలకు –మత సామరస్యానికి ,ప్రపంచ శాశ్వత   ఘన కీర్తి’’అనిపించింది రఘునాధరావు గారికి .అది సాంస్కృతిక రాజధాని అని మర్చి పోయారేమో .మాధవీ సనారాకు బొజ్జన్న కొండ వగైరాలు  ‘’బౌద్ధ విహార మేధాకాశం లో చుక్కల్లా మెరిశాయి ‘’ .టి సాంబశివరావు కు ‘’అరకు అందాల ఆరబోత –బొర్రా గుహల చారిత్రకత ‘’విశాఖలో కనిపించి కనువిందు చేశాయి .గుంటూరును  ‘’గర్త పురి’’ చేసింది గీర్వాణ విద్వా౦సు లన్నారు .’’నవ్యాంధ్ర నిర్మాణ పునాది రాళ్ళం-దేనికైనా తెగించే అగ్ని కణ జాలం ‘’గా ఆంధ్రాజనం అనిపించారు ఘంటా విజయ కుమార్ కి .

  ‘’కుల వృత్తే భిక్షాటనమై –వీధుల్లో తిరిగే ఉత్తరాంధ్ర జముకుల భాగవత గాధల్లో-దశావతారాలు’’సాక్షాత్కరించాయి పి లక్ష్మణ రావు కు .సింహపురి నెల్లూరు –‘’శుభం కోరే ,అభయమిచ్చే -అద్భుతసంస్థానం ‘’ గా అనిపించింది .కొమాండూరి కృష్ణాకు ఆంధ్ర వనిత కట్టు బొట్టు జుట్టు పట్టు చీర వాలుకట్టు వాలు జడలో పూల చెండు’’అద్భుతమనిపించాయి .’’ఏం పిల్లడో ఎల్దామొస్తావా ‘’అని పొలికేక పెట్టిన వంగపండు జానపదకవిత్వ పండు అనిపించాడు టివి రెడ్డికి .’’విద్వాన్ పట్టానే ఇంటిపేరుగా చేసుకొన్న-మీసరగండ విశ్వ రూపా చారి –పాట ‘’విశ్వం పాట’’ గా ఎదిగిందన్నారు ఆకుల రఘురామయ్య .కాదంబరికి తేట తెనుగు అనువాదం చేసింది ఈ’పెన్నేటి పాటవిశ్వం’’గారే . అమరావతి –‘’రాజకీయ చైతన్య స్పూర్తికి శ్రీకారం –ఆధునికాంద్రావనికి మణిహారం ‘’అని మురిసిపోయారు అబ్బాస్ ఆలీ -కానీ ఇప్పుడు దాన్ని  జీవచ్చవం చేశారు పైనా కిందా ఉన్న దద్దమ్మలు .అమరావతి భ్రమరావతి అయి –గతించిన జ్ఞాపకం గా మారిపోయిందని విలపించారు వేలూరి కౌండిన్య .ఉమా మహేశ్వరికి –‘’చదువుల వాడగా –పారిశ్రామిక నీడగా –వాణిజ్య  మేడగా-రాజకీయాల క్రీడ గా ‘’ బెజవాడ కనిపిస్తోంది.

   సీనియర్ కవయిత్రి ముదిగొండ సీతారామమ్మ గారికి ‘’పట్ట ణ౦బె కాని –పల్లెలా కనిపించు –హోరు జోరు లేని ఊరు ‘’గా బందరు కనిపిస్తుంది .సోమశేఖర శర్మకు –కోనసీమ –నెరజాణ సీమ ‘’అని పించింది అందాల సీమ ,ఆహితాగ్నుల సీమ అది .చిత్తూరు జిల్లా ‘’అరణియార్ ‘’జలకళ కు ఉప్పొంగి పోయారు రఘుపతి .బహుశా మనలో చాలామందికి తెలియని విషయం తెలపారు .తిలకాష్ట మహిష బంధం ‘’అనే ఉత్తుత్తి కావ్యం పేరు చెప్పి హడలెత్తించాడు మన తెనాలికవి .అచ్చు పొరబాటేమో కవి ఆళ్ళకవితలో   ‘’అలకాష్ట ‘’అని పడింది.పదమూడు జిల్లాల తెలుగు వారి అంతరంగాలను శృతి బద్ధంగా వినిపిస్తున్న సమైక్య సంగీతం –నవ్యాంధ్ర ఇప్పుడు ‘’పడి లేచిన కెరటం ‘’అన్నారు బండికల్లు జమదగ్ని .ఇంకా లేవ లేదు మహానుభావా .ఇంకా వంగుతోంది కు౦గుతోంది కుయుక్తుల పాలకులచే .’’అనేక ఫలి ‘’-అని అనకాపల్లికి పేరు అన్నవిషయం గుర్తుకు తెచ్చారు బిఆర్ సి మూర్తి .’’గ్రంథాలయోద్యమానికి స్వర్ణ భూషణం తొడిగారు పాతూరి నాగభూషణం గారికి ‘’శ్రీ అశోక్ కుమార్  .కన్నయ్యనాయుడు గారికి –‘’చిత్తూరు ఇల్లా –వైభవాల ఖిల్లా ‘’అని పించింది ,’’తోలు బొమ్మలాడించి –ఊరి కష్టాలు తీర్చటమే కాదు –వారి రాక వలన వర్షాలు కురుస్తాయనే నమ్మకం ఉందన్నారు వెంకటరమణ .ఆ బొమ్మలు చిత్రించిన చిత్రబ్రహ్మకు అంటే  చిత్రకారుడికి లాల్ సలాం చేశారు కవి .ఏక చక్రపురం ‘’అనే చంద్రగిరి గుట్ట  కుంతీదేవి వంటశాల ,పాండవులను బిలం నుంచి రక్షించిన చోటు –అదే తూర్పు వాకిట నిలచిన పిష్టపురం ‘’అదేఇప్పుడు పెద్దాపురం అనే గొప్ప చారిత్రిక సత్యాలను వెలుగులోకి తెచ్చారు కృష్ణ దత్తాత్రేయ శర్మ .నెల్లి అంటే వరి అని ,అది బాగా పండే ప్రదేశమే నెల్లూరు అనే విషయం బయటపెట్టారు ములుగు లక్ష్మీ మైధిలి .

 ఇలా తెలిసినవి తెలియనివి మర్చిపోయినవి ఎన్నెన్నో  విషయాలకు ‘’ఆకరం ‘’ఈ కవితా సంకలనం .రాసిన కవులకు ,ముచ్చటైన పుస్తకంగా తెచ్చిన ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘానికి మరో మారు అభినందనలు .

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్- 18-12-23-ఉయ్యూరు   \

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.