ఆ జంట ఆదర్శ పరుగు ‘’ స్వర్ణ’’ కా౦తులే-పరువు
ఒక వారం క్రితం శ్రీ పూర్ణ చ౦ ద్ నాకు రెండు పుస్తకాలు –పరువు ,మక్కాలు పంపారు .ముందు బరువైన’’ పరువు’’ను దింపుకొని తర్వాత ,ఆరు అంచుల ముక్కాలి పీట ఎక్కుతాను .
కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు డా జి.వి . పూర్ణ చందు గార్ల స్నేహ స్వర్ణోత్సవ సందర్భంగా డాక్టరు గారు రాసి ,గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ఈ నవంబర్ లో ప్రచురించిన పుస్తకమే ‘’పరువు ‘’ స్నేహ బరువుతో మురిసి మెరిసింది . స్వర్ణ కాంతు లీనింది .అమెరికాకు చెందిన శ్రీ చిట్టెన్ రాజు శ్రీ బాపు ,శ్రీ ముళ్ళపూడి రమణ ల స్నేహ షష్టి పూర్తి హైదరాబాద్ లోసుమారు పది హేనేళ్ళక్రితం రెండు రోజులు ఘనం గా జరిపారు .మళ్లీ ఇప్పుడు ఈ సాహితీ కృష్ణార్జునుల స్నేహ స్వర్ణోత్సవం బందర్లో ఈ నవంబర్ లో జరిగి ఈ పుస్తకం వెలువడింది .ఈ పుస్తకం సుబ్బారావు గారి అర్ధాంగి కీ .శే .శ్రీమతి గుత్తికొండ రామరత్నం గారికి ఆమె జ్ఞాపకాలకు స్పూర్తికి మార్గదర్శనానికి కృతజ్ఞతగా అంకితమిచ్చి ఋణం తీర్చుకొన్నారు .64 పేజీల ఈ పుస్తకం లో అన్నీ కోటబుల్ కోట్స్ ఉన్న పేజీలే అంటే అతిశాయోక్తి కాదు .విలువైన మన జిల్లా సాహితీ ప్రస్తానమే .మరువరాని అపురూప యదార్ధ సంఘటన సమాహారమే .సాహితీ విజ్ఞాన సర్వస్వమే .
రచయిత పూర్ణ చ౦ద్ తన సాహితీ మిత్రుడు సారధి సచివుడు సుబ్బారావు తొ జరిగిన తొలి పరిచయం .సాహితీద్వయమై ఆతర్వాత మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి పరిచయంతో సాహితీ త్రయమై ,శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చేరికతో చతుష్టయ మవటం మనం చూస్తాం .ఉప్పొంగి పోయిన మనసుతో పూర్ణ శ్రీ సుబ్బారావు వ్యక్తిత్వాన్ని గొప్పగా ఆవిష్కరించారు .’’నాలో పెద్ద చెట్టుగా ఎదిగే మర్రి గిన్జలనే సాహిత్య బీజాలు నాటింది సుబ్బారావు గారే ‘’అన్నారు .విహారి సుబ్బారావు గార్లతో సాన్నిహిత్యమే లేకపోతె పూర్ణ చంద్రుడు ఇంకా నెలబాలుడు గానే ఉండిపోయే వాడు,సాహితే పూర్ణోదయం జరిగి ఉండేదికాదు అని నిండు మనసుతో చెప్పారు .’’గుత్తికొండ బంగారు కొండ ,సాహితీ నిర్వహణ వేత్త ‘’అన్న నానీల నాన్న డా గోపి మాట గుర్తుకు తెచ్చారు. శ్రీ బుద్ధ ప్రసాద్ ఒకసారి బందరుఎల్ ఐ సి ఆఫీస్ కు వెళ్ళి శ్రీ విడియాల చంద్ర శేఖరరావు గారిని ’’ఇక్కడ గుత్తికొండ సుబ్బారావు గారు పని చేస్తున్నారా ??అని అడిగితె ఆయన యూనియన్ లీడర్ అని రావు గారంటే తనకు రచయిత గుత్తికొండ కావాలి అన్నారట .అప్పటికే 1975లో స్పందన సాహితీ సమాఖ్య పక్షాన 4వ కృష్ణాజిల్లారచయితల మహా సభల ప్రత్యేక సంచిక ప్రసాద్ గారు చూసే ఉన్నారు .దాన్ని చూసే అవనిగడ్డలో అలాంటి సభ జరిపితే బాగుండు అని చెప్పటానికి వచ్చారు .ఒక సాహితీ సహాయకుడు దొరికాడు కదా అని సంతోషించి 1979లో బందరు టౌన్ హాల్ లో జరుపబోయేసభలకు రావలసినదని ఆహ్వానించటం ఆయన రావటం జరిగి సాహితీ స్నేహం పెరిగింది .దానితో అవనిగడ్డలో 1982జులై 10,11 తేదీలలో గాంధీ క్షేత్రంలో కృష్ణా రచయితల 5 వ మహా సభలు ఘనం గా జరిపారు అందరూకలిసి .అప్పుడే మాజీ మంత్రి మండలి వేంకట కృష్ణారావు , ఏం.ఆర్ . అప్పారావు గార్లతో పనిచేసే సౌభాగ్యం కలిగింది .సాహిత్యానికి ఒక సంస్థ అవసరం అని అప్పారావు గారు సూచించి తను వెన్నుదన్నుగా ఉంటానని ప్రోత్సహించారు .బెజవాడలో పూర్ణ తన వైద్య వృత్తిని విద్యాధర పురంలో శ్రీ మైత్రేయ అనే నాటక రచయితా, ప్రయోక్త ప్రోత్సాహంతో ప్రారంభించారు. అప్పుడే శ్రీ ముక్కామల నాగభూషణం గారు అనే కమ్యూనిస్ట్ నాయకుడు పరిచయమయ్యారు .ఈయన విశ్వనాథ వేయి పడగలు నవలకు వ్యతిరేకంగా ‘’వెర్రి పడగలు ‘’రాశారు .లయోలా, మేరీ స్టెల్లా ,మాంటిస్సోరి , గాంధీ హిల్ ప్లానిటోరియం ,విశాలాంధ్ర భవనం నిర్మాణాలు ఆయన చేసినవే .ఈల చెట్ల దిబ్బ చుట్టు పక్కల దీవులకు సముద్రం అడుగు నుంచి పైపు లైన్లు వేసి మంచి నీటి సౌకర్యం కలిగించిందీ ఆయనే .ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ..ప్రగతి వారపత్రిక నిర్వాహకుడు .యద్దనపూడి సులోచనారాణి వంటి రచయిత్రులను సాహితీ లోకానికి పరిచయం చేసి౦ది కూడా ఆయనే .ఆయన అసామాన్యులలో అసామాన్యుడు .కనుక మనజంటకు మరో సాహితీ పిపాసి పరిచయం అయ్యాడన్నమాట .సుబ్బారావు సహకరిస్తే కృష్ణాజిల్లా రచయితల సంఘం ఏర్పాటు బాధ్యత తీసుకొంటానని ముందుకు రావటం వీళ్ళకు ఆశ్చర్యమేసింది .సుబ్బారావు ఓ పట్టాన తల ఊపరు .ఆలోచిస్తుంటే భూషణంగారే ముందుకు వచ్చి తాను అధ్యక్షుడుగా బుద్ధప్రసాద్ గౌరవాధ్యక్షుడుగా ,సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా అప్పారావు గారు సలహాదారుగా సంఘం ఏర్పాటు జరిగింది .
శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ 70 వ జన్మ దినోత్సవం నాడు విశాఖ వెళ్ళి సభలో ఈ జంట అభినందించింది .2006లో బెజవాడలో జరిగిన జాతీయ తెలుగు రచయితల సభ కు లక్ష్మీ ప్రసాద్ రాగా ,మాటల సందర్భంగా ప్రపంచ తెలుగు రచయితల సభలు జరిపే ప్రస్తావన రాగా మండలి గౌరవాధ్యక్షుడుగా యార్లగడ్డ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షుడు పూర్ణచంద్ కార్యదర్శిగా సంఘ నిర్వహణ సభ ఏర్పడింది .యార్లగడ్డ తన అభిమాన కవి ఆలూరి బైరాగి పేరిట ఒక అవార్డ్ ఇస్తాననటం జరిగింది .యార్లగడ్డ ఆలోచనతోనే రచయితల పాదయాత్ర మచిలీ బందరునుంచి నెల్లూరుదాకా గొప్పగా జరిగింది .తెలుగుకు ప్రాచీనహోదా కు కూడా ఢిల్లీ లెవేల్ లో చక్రం త్రిప్పిందీ ఆయనే .
బందరులో కృష్ణా విశ్వ విద్యాలయం ఏర్పడటం ,అందులో తెలుగు శాఖలో ఎవరూ చేరకపోవటం ,చూసి లక్ష్మీప్రసాద్ 15మంది తెలుగు చదివే పేద విద్యార్ధులకు రచయితల సంఘం ఫీజులు కడుతుందని హామీ ఇచ్చి కట్టి తెలుగు శాఖ కు పురుడు పోశారు ఈపెద్దలు .ఆయన ‘’డు’’అంతే ఈజంట దూడూ బసవన్న లాగాకాక ‘’డన్’’అంటూ కార్యక్రమాలు నిర్వహించారు .వీరికి యువభారతి నిర్వాహకుడు ఆచార్య వంగపల్లి విశ్వనాథం ఆదర్శం .ఫ్రీ వెర్స్ పితామహుడు కుందుర్తి ఆంజనేయులు గారి శిష్యుడుగా గుత్తికొండ ఎన్నో విషయాలు ఆకలింపు చేసుకొన్నారు .కేంద్రమంత్రి తెలుగు అకాడెమి అధ్యక్షుడు ,రవీంద్రభారతి రూప శిల్పి శ్రీ బెజవాడ గోపాల రెడ్ది కూడా అంతరంగికులయ్యారు .1975-85 దశకం లో బందరులో స్పందన పేరు ప్రతివారినోటా నానినపేరు .బందరు +స్పందన =స్పందరు అన్నాడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ సరదాగా .బందరు బెజవాడలలో ఎక్జీబిషన్ సమయంలో స్పందన సంస్థ రచయితల పుస్తకాల స్టాల్ నిర్వహించి 50శాతం డిస్కౌంట్ ఇచ్చి అమ్మగా వచ్చిన డబ్బు రచయితలకు పంచేశారు. స్పందన 60పుస్తకాలు స్వయంగా ప్రచురించింది .
సాహిత్య అకాడెమి సభ్యుడు అయిన శ్రీ సుబ్బారావు బందరులో 1980లో అకాడెమి తరగున సభలు జరిపారు .ఆయన చేతులమీదుగా పూర్ణగారి పుస్తకాలు చాలా వెలుగు లోకి వచ్చాయి .’’పచ్చని జీవితానికి నచ్చిన రూలు ‘’రాసిన డా పెళ్ళూరి జయప్రదను పుస్తకలోకానికి పరిచయం చేస్తూ గోపాల రెడ్దిగారి చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు డా .ద్వా ,నా శాస్త్రి మొదటిపుస్తకం ను ఈయనకు అంకితమిచ్చారు .అప్పటిదాకా హైదరాబాద్ లో పోస్టల్ ఉద్యోగం చేసిన సుబ్బారావు రాజీనామా చేసి ,బందరు వచ్చి భద్రమైన జీవిత బీమా సంస్థలో చేరి రిటైరయ్యారు
బందరులో సారస్వత సమితి విహారి శాలివాహన ,పువ్వాడ తిక్కన సోమయాజి బూదరాజు శ్యామ సుందర్ ,జిసనారా కొట్టి రామారావు నిర్వహణలో బాగా ఉండేది ఉత్సాహంగా చేరిన సుబ్బారావు అక్కడి’’ ఉక్కకు ‘’తట్టుకోలేక పదకొండుమంది కార్యవర్గ సభ్యులతో బయటికి వచ్చి స్పందన సాహితీ సమాఖ్యకు ప్రాణం పోశారు .1976లో స్పందన లో పూర్ణ చ౦ద్ద్ ను కార్య వర్గ సభ్యునిగా తీసుకొన్నారు .పూర్ణ చ౦ద్ హైస్కూల్ చదివే రోజుల్లోనే ‘’మేఘమాల ‘’అనే లిఖిత మాసపత్రిక నూజివీడులో నడిపారు .కవి దుర్గానంద్ గారబ్బాయి అ౦బికానాథ్ సంచాలకుడు ఈయన సంపాదకుడు .
బెజవాడలో ఇంటర్ చదివేటప్పుడు కూడా మేఘమాలను వదల్లేదు కృష్ణాజిల్లా రచయితల సభలో విశ్వనాథ ముఖ చిత్రంతో ఆ సభల ప్రత్యెక సంచిక తెచ్చారు .సుబ్బారావు బందరులో స్పందన సాహితీ సమాఖ్య పక్షాన ఒక మాస పత్రిక మొదలుపెట్టారు అందులో పూర్ణ మొదటి సారిగా శ్యాం బెనెగల్ నిర్మించిన అనుగ్రహం సినిమాపై రివ్యు ను సుబ్బారావు గారి కోరికపై రాశారు. అది ఆపత్రికలో వచ్చింది .ఆతర్వాత చాలాసినిమాలాను రివ్యు చేశారు తనదైన కోణంలో .పత్రిక నడపటం కష్టమైంది .ప్రిస్టేజికి పోయి భార్య రమగారి తాళి అమ్మటానికి కూడా సిద్ధమయ్యారు .’’ఇంట్లో వాళ్ళను ఏడ్పించి మనం చేసే సాహిత్య సీవ కు ప్రయోజనం ఏమిటి ?’’అని ముద్దుగా మెత్తగా మందలించిన విహారి మాట వేదవాక్కుగా శిరసావహించి పత్రిక ఆపేశారు .పిల్లల బాధ్యతలు తీరి ముగ్గురమ్మాయిలు విద్యావంతులై అమెరికాలో స్థిరపడటానికి రమగారి కృషి మాటలతో చెప్పలేనిది .వారిని తీర్చిదిద్దారు .ఇదే ఆమెను పారిశ్రామిక వేత్తను చేసింది ‘’స్పందన ప్రింటర్స్ ‘’స్థాపించి ‘’రమగారి ప్రెస్ ‘’ గా పేరు తెచ్చుకొని బందరు లయన్స్ క్లబ్ వారి ఉత్తమ ముద్రణాలయ అధిపతి అవార్డ్ పొందారు .ఆమెకు సుబ్బారావు గారిచ్చిన తోడ్పాటు మరువలేనిది . పదేళ్లు విజయవంతంగా నడిపారు. పేద ఇంటి పెళ్ళి కార్డుల ప్రింటింగ్ కు రమగారు డబ్బు తీసుకొనే వారు కాదు .సుబ్బారావు గారు రచయితల దగ్గర డబ్బు తీసుకొనేవారు కాదు .ఇలాంటి ఔదార్యం వితరణ లతో దశాబ్ద కాలం నడిపారంటే’’ ఎయిత్ వండర్ ‘’అని పిస్తుంది .’’అచ్చుపని నుంచి అప్పచ్చుల పని ‘’అంటే ‘’గృహ ప్రియ ఫుడ్స్ ‘’1993లో తమ స్వగృహంలో ప్రారంభించి దిగ్విజయంగా నడుపుతున్నారు .బందరులో ఎన్ని స్వీట్ షాప్ లు వున్నా వీరి నాణ్యత వీరిదే .రమగారు దీర్ఘ వ్యాధితో అనుక్షణ నరకాన్ని అనుభవిస్తూ కూడా ఇలా నడిపారు .స్వర్గస్తులయ్యారు .
‘’కార్య కర్తృత్వాన్ని ఒక విగ్రహం లా పోతపోస్తే సుబ్బారావు ఆకారమే ఏర్పడుతుంది ‘’అన్న పూర్ణమాటలు సంపూర్ణ సత్యాలు . గుంటూరులోగుంటూరు జిల్లా అరసం అధ్యక్షులుగా ఉంటూ చనిపోయిన శ్రీ పులుపుల వేంకట శివయ్య పేరిట స్థాపించిన సాహితీ పురస్కారాన్ని స్పందన కార్యదర్శి సుబ్బారావు గారికి 1981లో అందజేసింది .
కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్య దర్శులుగా మన జంట అయిదు ప్రపంచ మహా సభలు నభూతో గా నిర్వహించింది .ఈ రెండు స్తంభాలకు మండలి, యార్లగడ్డ మరో రెండు స్తంభాలుగా నిలిచి సాహితీ సౌధం మహా స్ట్రాంగ్ పునాదులపై నిలబడింది .సుబ్బారావు హార్డ్ వేర్ అయితే పూర్ణ సాఫ్ట్ వేర్ .సుబ్బారావు గురించి నారాయణ రెడ్ది గారు ‘’సభ యావత్తూ ఒక ఉత్తరం అనుకొంటే సుబ్బారావు ఉత్తరం కింద సంతకం వంటి వాడు ‘’అన్నారు .లత అనే తెన్నేటిహేమలత ప్రోత్సాహంతో ఆంధ్ర ప్రదేశ్ అకాడమికి కార్యవర్గ సభ్యుడిగా పోటీ చేసిగేలుపొండిన ఘనత ఆయనది .పూర్ణ చ౦ద్ కూడా సభ్యుడయ్యారు అయినా రామారావు ప్రభుత్వంలో,నార్లవారి సిఫార్సుతో అకాడమీలు రద్దు అవటంతో మూన్నాళ్ళ ముచ్చటే అయింది .
సుబ్బారావు చేతులు ,బుర్రా చాలా’’పవర్ఫుల్ ‘’.పూర్ణ రోజులో కనీసం 16గంటలైనా కదలకుండా కూర్చోగల సమర్ధుడు ఇద్దరూ పని రాక్షసులే .కొంచెం ఆవేశం ఉన్న సుబ్బారావు ‘’లాజికల్ రేషనలిస్ట్ ‘’అన్నారు పూర్ణ .1970కి ముందు సుబ్బారావు ‘’వేకువ ‘’పత్రికకు బాధ్యుడుగా ఉన్నారు .సభాధ్యక్షులుగా సుబ్బారావు నూటికి వెయ్యి పాళ్ళు సర్వ సమర్ధులు .సభలో విషయాలు ఎవరికీ ఏపని అప్పగించాలి ప్రత్యెక సంచికలు సభల సందర్భంగా తీసుకు వచ్చే స్పెషల్ గ్రంథాలు వాటిలోని విషయాలు అవి ఎవరు రాస్తే బాగుంటాయి వక్తలు ఎవరు వగైరాలలో పూర్ణ స్పెషలిస్ట్ .కార్యకర్తల కళాశాల ఏర్పాటు చేస్తేదానికి ప్రిన్సిపాల్ గా ఉండదగిన వ్యక్తి సుబ్బారావు మాత్రమె అన్నాడు పూర్ణ .శ్రీ పైడిపాటి సుబ్బరామయ్యగారుతాను రాసిన ‘’త్రిలింగ దేశం మనదేనోయ్ –తెలు౦గు లంటే మనమేనోయ్ ;అనే గీతాన్ని ఎవరి తోనైనా సభలో పాడించమని ఫోన్ చేస్తే అలానే చేశారు పూర్ణ .కానీ అప్పటికి ఆయన స్వర్గస్తులయ్యారు
ఇంతటి సాహితీ కృషి చేసినా తెలుగు భాషోద్యమంలో రచయితలు స్పందించటం లేదని బాధపడ్డారు .సభా నిర్వహణ సంతృప్తి మా విజయ రహస్యం అంటుంది ఈ జంట . ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించటమే లక్ష్యం .మిలిటరి జుంటా గా వ్యవహరించరు . పూర్ణ చ౦ద్ శతాధిక గ్రంథ కర్త .సుబ్బారావు ఒకే ఒక కవితా సంపుటితో రచనకు ఫుల్ స్టాప్ పెట్టారు .సాహితీ పిచ్ మీద ఈఇద్దరూ చెరో వైపు నిలబడి50 ఏళ్ళు నాటౌట్ గా బాటింగ్ చేశారు ,చేస్తున్నారు చేస్తారు .ఎన్నో హిట్లు, సెంచరీలు, రికార్డ్ లు స్వంతం చేసుకొన్నారు .నడక నేర్పిన గురువులు అనేకులు అయినా ‘’పరుగు నేర్పింది సుబ్బారావే ‘’అంటాడు పూర్ణ .పరువు అనే మాటకుప్రతిష్ట ,వేగం ,పరిపక్వత అనే అర్ధాలకు వీరిద్దరూ నిలువు ట+ద్దాలు . ఒకరికొకరు నువ్వు అని పిలుచుకొనే స్నేహమూర్తులు వారు .ఇలాగే స్నేహ షష్టిపూర్తి , డైమండ్ జుబిలీ జరుపుకోవాలని కోరుతున్నాను .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -20-12-23-ఉయ్యూరు.

