మా వదిన గారు -కొన్ని జ్ఞాపకాలు -1
మా వదిన గారు అంటే మా అన్నగారు కీ.శే గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మగారి సతీమణి కమలమ్మ గారు 6-1-2024 శనివారంమధ్యాహ్నం 12-05 గంలకు ఉయ్యూరులో ఏకైక కుమారుడు రామనాథ బాబు స్వగృహం లో శ్రీ శోభకృత్ నామ సంవత్సర మార్గశిర శుద్ధ దశమి –స్వాతి నక్షత్రం లో స్వర్గస్తులయ్యారు .ఆమె గురించి న జ్ఞాపకాలు గుర్తు చేసుకొంటున్నాను .
పుట్టుక ,వివాహం
పశ్చిమ గోదావరిజిల్లా భీమ డోలు –ద్వారకా తిరుమల మార్గం లో ,భీమడోలు కు దగ్గరగా ఉన్న పోలసానిపల్లె లో మా వదిన జన్మించారు .నూజివీడు జమీందార్ గారి వేశ్య’’ పువ్వుల సాని’’పేరు మీదుగా ఏర్పడిన చిన్న గ్రామం.అదే క్రమంగా పోలసానిపల్లె అయింది .పింగాణీ పరిశ్రమకు ఊరగాయ జాడీ తయారీకి భీమడోలు చుట్టూ ప్రక్కల ప్రాంతం బాగా ప్రసిద్ధి .నాణ్యమైన అన్ని సైజుల పింగాణీ జాడీ తయారీ ఇక్కడ ఉంది . ఒక రకంగా పుల్లాభోట్లవారి అగ్రహారం . మా వదిన పుల్లాభోట్ల వారి ఆడపడుచు . వీరింటికి అటు ఇటు పుల్లాభోట్ల నల్ల కృష్ణమూర్తి ఎర్ర కృష్ణమూర్తి అనే అన్నదమ్ములఇళ్ళు ఉన్నట్లు గుర్తు .మా అన్నయ్యగారితో వివాహం జరిగే టప్పటికే ఆమె తండ్రిగారు స్వర్గస్తులయ్యారు . .తల్లి సుబ్బమ్మగారు .ఒక అన్నయ్య శ్రీనివాసమూర్తి, ఒక తమ్ముడు చంటి ఉన్నారు .మాంచి భూ వసతి గల సంపన్నమైన కుటుంబం .సుబ్బమ్మగారికి దళసరి బంగారు గాజులు ,మెడలో బంగారు గొలుసులు తెల్ల చీర తోనాకు బాగాజ్ఞాపకం .పోలాలువ్యవసాయం పాలేళ్లు, ఎడ్లు , బండీ అన్నీ ఉండేవి .ఇల్లు విశాలమైన మందువా లోగిలి వెనకదొడ్డి ముందు విశాలమైన ప్రదేశం .బహుశా తూగుటుయ్యాలకూడా ఉన్నట్లు గుర్తు .సుబ్బమ్మ గారి చెల్లెలు రమణమ్మ గారు .భర్త వారబాసి కృష్ణ మూర్తి గారు బందరులో ఆంధ్రాబాంక్ జనరల్ మేనేజర్ .వీరిల్లు రెండు అంతస్తులమేడ .మా అన్నయ్య గారి పెళ్ళి చూపులు నాకు గుర్తులేదు .వివాహం బందరులో కృష్ణ మూర్తి ,రమణమ్మ దంపతులే అంటే మా వదిన గారి పిన్నీ బాబాయిలే చేశారు .చాలా గ్రాండ్ గా చేసినట్లే జ్ఞాపకం .వారిల్లు ఈడేపల్లి లోనో సర్కిల్ పేటలోనే ఉ౦ డేదనుకొంటా .కట్న కానుకలు నాకు గుర్తులేవు .బాగా ఆడంబరంగానే వివాహం జరిపించారు .కృష్ణమూర్తి గారు ఎర్రగా భారీ పర్సనాలిటి .కళ్ళు చి౦తనిప్పులే.భార్య అణకువగల ఇల్లాలు. చామన ఛాయ. ఆయన తల్లి కృష్ణ వేణమ్మ గారిదే ఇంట్లో పెత్తనం ఆవిడా భారీమనిషె .తెల్లని మల్లు వస్త్రాలతో ఉండేది .కళ్ళు లావు కొంచెం భయం గోల్పేవి .ఆమె అంటే , ,కొడుక్కూ ,కోడలికి సుబ్బమ్మగారికీ అందరికీ హడల్ . అయితే చాలా మంచి మనసున్న ఆవిడ. వివాహం లో ఏలోటూ రానివ్వలేదు .తండ్రిలేని పిల్లకు అన్నీ తామే అయి కృష్ణ మూర్తి దంపతులు వివాహం జరిపించారు .మా అన్నయ్యవాళ్ళ కార్యానికి కూడా మేము వెళ్ళిన గుర్తు ఉంది .పెళ్ళికి వెళ్ళేటప్పుడో,లేక పెళ్ళి నుంచి తిరిగి వచ్చేటప్పుడో మాకారు చాలాసార్లు ట్రబుల్ ఇచ్చిన జ్ఞాపకం బాగా ఉంది .ఆగుతూ సాగుతూ చేసిన ప్రయాణం అది .అదే మొదటిసారి మేము బందరు వెళ్లటం .వివాహం సుమారుగా 1948-50 మధ్యలో జరిగి ఉంటుంది .కృష్ణమూర్తి గారు నిక్కచ్చిమనిషి .ఆంధ్రదేశం లో మంచి పేరు ప్రతిష్టలు పొందినవారు ఎందఱో బ్రాహ్మణయువకులకు ఆంధ్రా బాంక్ లో ఉద్యోగాలు కల్పించి సాయం చేశారని చెప్పుకొనేవారు .అయితే మా వదిన అన్న,తమ్ముడు లకు చదువు అబ్బక పోవటం వలన వారికి ఎక్కడా ఉద్యోగం కల్పించలేక పోయి ఉంటారు .లేక చిన్న చితకా ఉద్యోగాలు చూపించినా ,వీరు ‘’అగ్రహారీకులు ‘’కనుక నచ్చక చేరి ఉండక పోవచ్చు కూడా .
మా వదిన ఉయ్యూరుకు కాపురానికి వచ్చారు .మాన్నయ్య అంతకుముందు జాల్నాలో మిలిటరి సర్వీస్ లో పని చేసి తర్వాత రైల్వేలో ఉద్యోగం సంపాదించి బళ్ళారి దగ్గర హాస్పేట్ లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పని చేశారు .అక్కడ కాపురానికి వెళ్లారు మా వదిన .మా నాన్నగారు హిందూపూర్ లో సీనియర్ తెలుగు పండిట్ గా పని చేస్తున్నందున ,మేము ఎలిమెంటరి స్కూల్ చదువు అక్కడే చదివాం.అప్పుడు ఒకసారి మా కుటుంబం హాస్పేట్ కు వెళ్ళాం .మా అన్నయ్య మమ్మల్ని అందర్ని హంపి విజయనగరం త్రిప్పి చూపించిన గుర్తు .మా అన్నవదిన దంపతులకు మొదట గా వేదవల్లి 1953లో శ్రీరామనవమి వెళ్ళిన దశమి మంగళవారం పునర్వసు నక్షత్రంలో రాత్రి 11గం లకు 24-3-1953 జన్మించింది .ఆమె స్కూల్ రికార్డ్ షీట్ లో మాత్రం పుట్టినతేది 10-8-1952 గా నమోదు చేయబడింది . మాకు ఒక అక్కయ్య ఉండేదట. ఆవిడ పేరు వేదవల్లి .వివాహం చేశారు .ఆమె అకస్మాత్తుగా చనిపోయిందట .ఆ దంపతుల ఫోటో మా పెంకుటిల్లు హాలులో ఉత్తర గోడపై చాలా కాలం ఉండేది .ఆవిడ జ్ఞాపకార్ధం వేదవల్లి అని మా అన్నయ్య కుమార్తెకు మా అమ్మా నాన్న పేరు పెట్టారు .మా అన్నయ్యకు మా అక్కయ్య వేదవల్లి అంటే మహా ఇష్టం అట .కూతురు వేదవల్లి అంటే మా అన్నయ్యకు మహా గారాబం .మా అమ్మా నాన్నలకూ అంతే మాకూ అంతే .కనుక అందరి ఇష్టం మీదనే ఆపేరు పెట్టారు .తర్వాత ఆరేళ్లకు రామనాధ బాబు శ్రీ విలంబి నామ సంవత్సర మాఘ బహుళ పంచమి శుక్రవారం స్వాతి నక్షత్రం లో తెల్లవారుఝామున 5-45గం లకు 28-2-1959జన్మించాడు . మ వాళ్ళు పోలసానిపల్లి వెళ్ళి బాలసార జరిపి ,అక్కడినుంచి రాజమండ్రి వెళ్ళి గోదావరిస్నానం చేసి వచ్చారు .మా మేనమామ గంగయ్యగారు కూడా వారితో ఉన్నారు. అక్కడ తూర్పు యాసలో ‘’ఆయ –నాలుగు న౦(లం)కలు ,ఆరు నా(లా )కులు ‘’అనే అక్కడి పడవవాళ్ళ భాష మా మామయ్యచెప్పి మాకు నవ్వు పుట్టించేవాడు .ఈ ఆనందం ఎక్కువ రోజులు లేదు మా ఇంట్లో. రామనాథ బాబు పుట్టిన నెల రోజుల్లోపే మా అన్నయ్య హాస్పేట్ లో సడన్గా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు .అక్కడ ఆయనకు జెర్సి బళ్ళారి ఆవులు ఉండేవి .రైల్వే వారు కల్పించిన వాగన్లో వాటిని మా మామయ్యా మానాన్న ,అప్పటి నిఖామాన్ మింట సత్యం వెళ్ళి తీసుకొచ్చారు .ఇందుపల్లి స్టేషన్ నుంచి ఉయ్యూరుకు సత్యం తోలుకు వచ్చాడు .అప్పటికే మాకు గేదెలు ,పాడి,వ్యవసాయం ఉండేవి . మా వదిన పిల్లలు మాదగ్గరే ఉన్నారు .మానాన్న అమ్మ వాళ్ళను చాల జాగ్రత్తగా చూసుకొన్నారు .పిల్లల చదువు సంధ్యలు పెంపకం మా అమ్మా నాన్న లే చూసుకొనేవారు .మా వదిన తల్లి సుబ్బమ్మగారి పోలసానిపల్లి ఆస్తులన్నీ హారతి కర్పూరం అయిపోయాయి .ఒక్క ఇల్లు మాత్రమె మిగిలింది .కొడుకు శ్రీనివాసమూర్తి సినిమా రిప్రజెంటటివ్ గాకొంతకాలం పనిచేసి ఏలూరులో వెంకటరామా ధియేటర్ లో టికెట్ బుకింగ్ కౌంటర్ లో పని చేశాడు .తమ్ముడు చంటి కూడా యేవో చిన్న ఉద్యోగాలు చేశాడుకాని నిలబెట్టుకోలేదు . అన్నదమ్ము లిద్దరూ ఉయ్యూరు వచ్చి వెళ్ళేవాళ్ళు .మా పెళ్ళి అయి ,ఒకసారి వేలుపు చర్లనుండి,ఏలూరులో ఉన్న శ్రీనివాసమూర్తి దంపతుల ఇంటికి వెళ్ళి ఆరాత్రి అతడు ఫ్రీగా చూపించిన ‘’మూగమనసులు ‘’సినిమా మా దంపతులం మొదటి సారిగా చూశాం .శ్రీనివాసమూర్తి నిద్రపోతుంటే గుర్రు ‘’బుల్ డోజర్ ‘’శబ్డంలాగా భయ౦కరంగా ఉండేది .పెద్ద పొట్ట .ఒళ్లంతా విపరీత మైన చెమటలు పట్టేవి .తమాషా ముక్కు .ముక్కు తూములు విశాలం .సాఫ్ట్ గా మాట్లాడేవాడు చంటి మరీ చిన్న పిల్లాడి లా ఉండేవాడు . ఆతర్వాత సుబ్బమ్మగారు చనిపోవటం ,ఆకుటు౦ తో సంబంధాలు తెగిపోయాయి .అప్పుడప్పుడు రాంబాబు దగ్గరకు వచ్చి వెళ్ళేవాళ్ళుఅన్నదమ్ములు . మా వదిన భర్తను కోల్పోవటమేకాక పుట్టింటి వారూ ,దెబ్బతినటం తో అసహాయ అయింది .మేమే అన్నీ అయి చూసుకోవాల్సి వచ్చింది .ఇక పిల్లలు పెళ్ళిళ్ళు సంగతి తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-1-24-ఉయ్యూరు

