చలపాక చూపు పరిశీలన అనుభవం పరిపక్వతలకు నిదర్శనమైన ‘’అప్పగింతలు ‘’

చలపాక చూపు పరిశీలన అనుభవం పరిపక్వతలకు నిదర్శనమైన ‘’అప్పగింతలు ‘’

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకుడు శ్రీ చలపాక రచించి ఈ డిసెంబర్ లో వెలువరించిన 29 కథ సంపుటి ‘’అప్పగింతలు ‘.ఈ కథలు చాలా పత్రికల ,తానా వంటి సభల బహుమతులనందు కొన్నాయి .దీన్ని ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు మహా మానవతా వాది, సాహితీజీవి ,సాహిత్యపోషకులు ‘’రెండు సార్లు తనకు అనుకొని మలుపులు కల్గించిన ‘’సాహితీ బంధువు ,ఈ డిసెంబర్ లో మరణించిన శ్రీ సోమేపల్లి వేంకట సుబ్బయ్య గారికి ప్రేమతో ప్రకాష్ అంకితమిచ్చి సాహితీ ఋణం తీర్చుకొన్నాడు .ఇప్పటికే మూడు కథా సంపుటాలు రాసి వెలువరించిన అనుభవం ఉన్న ప్రకాష్ ఈ సంపుటిలో తన దృక్కు,పరిశీలన,సునిసితహాస్యం ,సామాజిక స్పృహ లకు అద్దం పట్టే కథలుగా,పరిపక్వతకు నిదర్శనం గా  వీటిని శిల్పించాడు .ఇవి 1921-23మధ్య రెండేళ్ళ వ్యవధిలో రాసినవే .వివిధ సాహిత్యపత్రికలలో ప్రచురితమై పేరు ప్రతిష్ట పురస్కారం తెచ్చినవే .వీటిలో కరోనా,సాహిత్య ,బాంధవ్య ,మానవీయ ,బాధ్యతాయుత  సంబంధిత మినీ, చిన్న, పెద్ద కథలున్నాయి ..ఒక’’ బర్డ్ ఐ వ్యూ ‘’గా వీటిని మీకు పరిచయం చేస్తాను .

 సుజాతా దేవి గొప్ప రచయిత్రి .చాలారచనలు చేసి కీర్తిపొందింది .తన పాతికేళ్ళరచనా పండగను’’జీవితం ‘’పుస్తక ఆవిష్కరణ సభను అక్షర సాహిత్య సభ ఏర్పాటు చేయగా ,ఎప్పుడూ సింపుల్ గా పుస్తకావిష్కరణ చేసే ఆమె ఈసారి మాత్రం   మహా వైభవంగా జరపటానికి చాలామందిని ఆహ్వానించింది .విస్తృత ఏర్పాట్లూ చేయించింది . సభా ప్రాంగణం కిటకిట లాడిపోయింది .ఆమె రావటమే ఆలస్యం .నిర్వాహకులు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారు .ఆమెకూ ఉత్సాహం ఆగటం లేదు. డ్రైవర్ ను స్పీడ్ పెంచమన్నది .ఇంకేముంది ప్రమాడంము౦చుకొచ్చి కారు డివైడర్ ను డీకొట్టి పల్టీ కొట్టి ఆమె అకస్మాత్తుగా నెత్తురు మడుగులో చనిపోయింది .ఆమె ఫోన్ రింగ్ టోన్’’జగమంత కుటుంబం నాది –ఏకాకి జీవితం నాది ‘’అని మొగుతో౦ది పాపం.ఆమె అభినదన సభ సంతాప సభగా మారిపోయింది .ఇవేమీ పట్టని ఆమెకొడుకులు విదేశాలనుంచి వచ్చి అంత్యక్రియలు చేసి చేతులు దులుపుకొన్నారు .తల్లిఎందరికో ఆదర్శంగా ప్రేరణగా నిలిచి రాసిన సాహిత్యం వారికేమీ పట్టలేదు .తల్లి ఆస్తి పంచుకొని ఆమె సాహిత్య పుస్తకాలన్నీ ‘’ఇంట్లో ఎందుకు వేస్ట్ ‘’అనుకొని తూకానికి అమ్మేసి పంచేసుకొని వెళ్ళిపోయారు .అప్పుడు రచయిత  ‘’ఆకాటా సైతం విలపించింది ,గోతాముల్లో కుక్కేసినందుకు ,మసి చేసి ఆమె వద్దకే చేర్చేసామని కన్నీరు కార్చింది ‘’అన్నాడు .సాహితీ వాసన లేని ఆ పుత్రరత్నాల నిర్వాకం తెలియ జేసే ఈ కథ ‘’ జీవితం  .పేరు చక్కగా సరిపోయింది .రాసిన విధానమూ బాగుంది .

అలాగే ‘’అప్పగింతలు ‘’కథలో మనం వదిలేస్తున్న సంప్రదాయాలలోని గొప్పతనాన్ని తెలుసుకొన్న విదేశీ జాన్ కుటుంబం ఇండియాలో పెళ్ళికి వచ్చి పంచ చొక్కా ఉత్తరీయంతో పట్టు చీరతో భార్య మేరి, కూతురు పట్టు పరికిణీతో ,కొదుకు పైజమాలాల్చీ లతో రావటం ,అచ్చమైన తెలుగులో మాట్లాడటం వాళ్ళను రిసీవ్ చేసుకొన్న చంద్రానికి ఎయిత్ వండర్ అనిపించింది.పెళ్ళి లో అన్ని తంతులు ఆసక్తిగా గమనించారు ఆ జాన్ దంపతులు .వివరించి వాటిలోని పరమార్ధం చెప్పాడు చంద్రం. అప్పగింతల సమయం లో వధువు తలిదండ్రులు ఏడవటం వారికి వింత అనిపిస్తే వివరంగా చెప్పాడు . కూలిపోతున్న వివాహాలు తలిదండ్రులను వృద్ధాశ్రమం లో చేరుస్తున్న కొడుకుల తీరు ఆవేశంగా చెప్పిన జాన్ ను చూసి , ‘’జరుగుతున్న సామాజిక తప్పిదం ‘’పై జాన్ పడ్డ ఆవేదన చంద్రం అర్ధం చేసుకొన్నాడు .జాన్ కుటుంబం అమెరికా తిరిగి వెడుతూ తమ పిల్లలిద్దరికీ భారతీయ సంస్కృతీ ,ఆతిధ్యం ,వివాహ విధానం ,ఉమ్మడి కుటుంబం మొదలైన విషయాలను ఆన్ లైన్ క్లాసులు గా నేర్పాలని వాళ్ళిద్దరూ తన మేనల్లుడు మేనకోడలు అని భావించమని ‘’అప్పగింతలు ‘’చేసి వెళ్లారు .’’మీ దేశ సంస్కృతీ సాంప్రదాయాలను మేము కానుకగా తీసుకు వెడుతున్నాం .మానుండి మీకు దిగుమతి అయిన విష సంస్కృతి ని  మీలాంటి వారు బొందపెట్టే ప్రయత్నం చేయాలి ‘’అన్నప్పుడు చంద్రం మనసు ఆర్ద్రమై ,మంచితనం మానవత్వం ఇలా దేశ సరిహద్దులు దాటి అందరికి ప్రేరణగా నిలవటం పరమానందాన్ని కలిగించింది .జగమంత కుటుంబం ‘’కథలో ఒక తండ్రి ఇద్దరు కూతుళ్లమధ్య అనుబంధం ,ఇద్దరూ పెళ్ళిచేసుకొని ముసలాయన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతే ,తమ్ముడికూతురును ఆహ్వానించి ‘’మంచి ఆశయంతో ఉండేవాడు ఎప్పుడూ ఒంటరికాడు .అతనకి జగమంతా కుటుంబమే ‘’అని చెప్పిన అనురాగాల బాంధవ్యాల ఆవశ్యకత చాటి చెప్పిన కథ .

  యమకింకరులు ఒక ప్రాణిని తీసుకు వెళ్ళటానికి వస్తే  ఆజీవిని కార్పోరేట్ హాస్పిటల్ లో చేర్పిస్తే ,అన్ని రకాల టెస్ట్ లు చేసి బైపాస్ మెలిక పెట్టి మందులకు రోజుకు నలభై వేలు ఖర్చు అని కొడుక్కు చెబితే తండ్రిని దక్కించుకోవాలని తలతకట్టు పెట్టి ఖర్చు భరించిన కొడుకు ,తండ్రి బతకాలేక చావా లేక యమ యాతన ఆస్పత్రి ముఠా వల్ల పడుతుంటే తట్టుకోలేక ఇంటికి తీసుకు వెడితే ఆయన ఒకవారం నానాయాతన పడి పుటుక్కుమంటే ,కొడుకు ఆస్తిపాస్తులన్నీ పోయి బికారి అయితే తమకంటే దారుణంగా డాక్టర్లు ప్రవర్తించటం చూసి   యమకింకరుల హృదయం ద్రవించి ఆప్రాణిని   యమ లోకం  తీసుకు వెడితే మిస్టర్ యమా అన్నీ తెలుసుకొని ‘’ఇతడు భూలోకం లో హాస్పిటల్ లో నెలరోజులు నానా నరక యాతనా పడ్డాడు. ఇక శిక్షించక్కర్లేదు స్వర్గానికి తీసుకు  వెళ్ళండి ‘’అని హుకుం జారీ చేసి ‘’మనిషి ప్రాణం ఎప్పుడు తీయాలో మనకంటే ఆ డాక్టర్లకే ఎక్కువగా  తెలుసు ‘’అనటం హైలైట్ .పెళ్ళాం మెడలో గొలుసు తాకట్టుపెట్టి పుస్తకం అచ్చోసి న రామ లింగం, దానిపై సమీక్ష లు చదివి పుస్తకాలు పంపమని ఫోన్లు చేయటంతో చేతి చమురు వదిలించుకొని కక్కాలేక మి౦గా లేక పడిన బాధే ‘’ఉచితం ‘’.సాహితీ ఈర్ష్య గురించిన కథ లో  జాతీయ స్థాయిలో అవార్డ్ లు రివార్డ్ లు పొందుతున్నసంతోష్ ను చూసి , తనను సాహిత్యలోకం గుర్తించకపోవటం వల్ల     అసూయతో కడుపుబ్బరంతో ఈర్ష్యా ఆవేశాలతో గిలగిలా కొట్టుకొ౦ టున్న  సన్నాసిల్రావ్  భార్యమాట వేద వాక్కుగా భావించి తన ప్రత్యర్ధిని రాష్ట్రరచయితల సంఘానికి అధ్యక్షుడిగా ప్రతిపాదించి ఎన్నికయ్యేట్లు చేసి అతడు సభానిర్వహణ కార్యక్రమాలలో బిజీ బిజీ అయిపోయి రాయటానికి తీరికే దొరక్కుండా ఉంటే ,సన్మానాలు ఆవిష్కరణలు పొగడ్తలు లేక గిలగిలలాడుతుంటే వీడు మాత్రం సంతోషంగా హాయిగా నిద్రపోతున్నాడు .’’ఈర్ష్య ద్వేషం పగ కసి ఇప్పుడు హాయిగా సేద తీర్తున్నాయి ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు ప్రకాష్ .’’లైటర్ వీన్’’ తో సాగిన కథనం ఇది .బెజవాడ దగ్గర ఇబ్రహీం పట్నం ఫెర్రీ వద్ద పవిత్ర కృష్ణా గోదావరి సంగమ౦ పై రాసిందే ‘’పవిత్ర సంగమం ‘’.ఇది నెరవేరిన చంద్రబాబు డ్రీం . ఆచుట్టుప్రక్కల సుందరంగా తీర్చి దిద్దటానికి ప్రభుత్వం చేబట్టిన బృహత్తర ప్రణాళికలో యజమానులంతా సహకరించి తోడ్పడుతుంటే  రచయిత తండ్రి మాత్రం ‘’ఈ దేశం నాకేమీ ఇవ్వక్కర్లేదు .ఈకొత్త రాష్ట్ర అభి వృద్ధికి నేనే ఇక్కడి నా ఇల్లు కానుకగా ఇస్తున్నాను ‘’అని ప్రభుత్వానికి అప్పగించి కట్టుబట్టలతో  ఊరు వదిలి వెళ్ళిన త్యాగ మూర్తి కథ.మాసిన బట్టలు గడ్డమూ ఉన్న ప్రతి వాడినీ దొంగ గా అనుమానిస్తే ,అతనిఆకలి తీర్చటానికి భార్యకు తెలీకుండా అరటి పళ్ళు అతని చేతిలో పెట్టి ‘’మాసిన గుడ్డలతో ఉన్న అతని ఆకలి తీర్చిన తానూ దొంగ ఏమో అని మధన పడటం మానవ చిత్త ప్రవృత్తుల ప్రదర్శించే మంచి కథ .’’బ్రెయిన్ డెడ్ ‘’అయిన ఒక కుర్రాడి తండ్రిని ఒప్పించి  అతడి అవయవాలు దానం చేస్తే కొందరికైనా ఉపయోగపడతాయని ‘’నచ్చ చెప్పి చేయించి సంతృప్తి పడ్డ ప్రసాద్ కరోనా తో చనిపోవటం హృదయ విదారకం .అందరికి ఉపకారం చేసే ప్రసాద్ శరీరం ఇప్పుడు ఈమహమ్మారి వలన ఉపయోగ పడకపోవటాన్ని బాధగా,హృదయవిదారకంగా సానుభూతి పరంగా  చిత్రించాడు  చలపాక .కరోన కాలం లో తండ్రిఅంత్యక్రియలు చేసే వీలులేక పోవటంతో దెప్పి పొడుపు మాటల ఈటెలతో సమాజం పోడుస్తుంటే ‘’తాను  ఇన్ని జాగ్రత్తలు తీసుకొన్నానని తెలియక లోకం గ్రహించనందుకు మనస్తాపం చెందాడు తప్పెవరిది లో వ్యక్తి .పెళ్ళిళ్ళు లాక్ డౌన్ లో చేస్తే ఖర్చు బాగా కలిసొస్తుందని సూక్ష్మం తెలిసి ముహూర్తాలకోసం పంతులను ఫోన్ లో ఇబ్బంది పెడుతుంటే ఆ తెలివిఉన్న ఘటం సెల్ ను ‘’స్విచ్ ఆఫ్ చేసి గండం నుంచి బయట పడటం ‘’లాక్ డౌన్ జాక్ పాట్’’.

  బంగారు గొలుసుకోసం భర్తను వత్తిడి చేస్తే చాలీ చాలని జీతంతో ఆకోర్కే తీర్చలేక పొతే అతడు  ఆక్సిడెంట్ లో  చనిపోతే  ఏదో విధంగా తంటాలు పడి అతడి కర్మకాండలు చేయించి ,భర్త కట్టిన ఇన్స్యూరెన్స్ డబ్బు చేతికొస్తే తన చిరకాల కోరిక క౦ఠాభరణం కొనుక్కొని మెడలో వేసుకొని అద్దం లో చూసుకొంటే తన మాంగల్య చిహ్నమైన నుదుటి కుంకుమ లేకపోవటం కు బాధపడి ‘’మనిషి కోరుకున్నవి అన్నీ ఇవ్వడు దేవుడు .ఒకటిచ్చి ఒకటి’’  దూరం చేస్తాడు ‘’అని వేదా౦త౦ గా అనుకొన్నది భార్య ‘’వెలితి ‘’లో .సభలు సమావేశాలు ఏర్పాటు చేసే ఆయనకు కరోనా ,లాక్ డౌన్ కాలం లో చేతిలో పనిలేక కొంతకాలం గిజగిజ కొట్టుకొన్నా ఆతర్వాత ‘’జూం ‘’అంతర్జాతీయ వేదికలు సృష్టించి తక్కువఖర్చుతో ఆనందం పొందినదే’’అన్వేషణ ‘.ముసలమ్మను ఆటోతో డీకొట్టి గాయాలకు  కారకుడై ఆస్పత్రిలో చేర్చిన  ఆటో డ్రైవర్ ,ఆమె బతికి బట్టకట్టి కొంతకాలాని చనిపోతే ఆమెను శ్మశానికి చేర్చటానికి ‘’అనంత శయ్య ‘’తెచ్చి ఆమె ఎవరో తెలిసి డబ్బులు ఇస్తున్నా  తెసుకోకుండా వెళ్ళి పోవటం ‘’విధి విచిత్రం ‘’కథ .పుష్కరాలొస్తే ఆడబడుచులకు చీరా సారే పెట్టాలనే ఆనవాయితీ ఇప్పుడు బాగా పెరిగింది. రేపు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికీ ఇలాగే కొత్త బట్టలు పెట్టాలని ఇప్పటి నుంచే సతాయిస్తున్నారట .ఈమాటలు నావే .ప్రకాష్ వి కావు .రామకోటి అయినా రామరాజ్యం లాంటి రాజధాని అయినా ఆగిపోయినదాన్ని పూర్తి చేయటం మన అందరి కర్తవ్యమ్ అన్నాడు ‘’బాధ్యత’’లో .కేన్సర్ తో బక్క చిక్కి మంచానికి అతుక్కుపోయిన పిల్లాడు కోరితే ఐస్ ముక్కలు ఇచ్చి వాడి ముఖంలో ఆనందం చూసి సంతృప్తి చెందాడు చిన్న దానకర్ణుడు .కవి సమ్మేళనాలలో సన్మానాలలో వేస్తున్న శాలువాలంటే చులకన అయి పోయి చలికాలం లో కప్పుకోటానికి ఇబ్బంది పడుతూ మంకీకాప్ తగిలించుకొనే కాలం లొ ఒక  కవిగారు మాత్రం ‘’ఎంత న్యు ట్రెండ్’’ అయినా తనని వదలకుండా ఉపయోగించు కొంటున్నందుకు ప్రేమగా తన దేహాన్ని వెచ్చగా వాటేసు కొన్నది నాశాలువా ‘’‘’అని ఫీల్ అయ్యాడు పాపంపిచ్చినాయన .

  ఎనభై ఏళ్ళ ముసలాయన దేవుడు కలలో కనిపిస్తే యవ్వనం ప్రసాది౦చ మనికోరితే ‘’కాలం వెనక్కి మళ్లిస్తే సృష్టిలోని జనన మరణాలన్నీ ఆగిపోతాయిరా డింభకా ‘’అని నీతి బోధిస్తాడు ‘’స్వార్ధ బుద్ధి ‘’లో .ఒకపని మనిషి తన యజమాని తనను ఎంతగొప్పగా మానవత్వంతో చూస్తారో  సాటి పనిమనిషికిచెబుతూ’’వాళ్ళ ప్రేమకు బానిసనై పోతానేమో ‘’అని ఆనంద బాష్పాలు రాలిస్తే   ‘’ఈ నాటికాలం లో ఇటు వంటి  నిండు మానవత్వం ఉన్న మనుషులు  ఇంకా ఉన్నారా ‘’అని బోల్డు ఆశ్చర్యపోయింది అవతలి పనిమనిషి .కాదుకాదు ‘’ పని మనీ’’షి’’’’ప్రేమ బానిస ‘’లో .రెండు రూపాయలకరివేపాకు కొని కాగితం పొట్లం లో  తెస్తుంటే ,పోలీసులు అది గంజాయి అని భావించి  వెంట తరిమితే  పారిపోతే పట్టుకొని రెండు వేలు ఫైన్ అంటే వాళ్లకు భయపడి పారిపోతున్నాను అన్నాడు ‘’ఉచితం ‘’లో నాయకుడు .పిల్లలకు తండ్రి స్థానం లో ఉ౦టేకానీ కుటుంబ కష్టాలు తెలిసి రావు అన్న నీతి ‘’తండ్రి కస్టాలు ‘’లో ఉంది .కరోనా కాలం లో ఆపేరు పలికీ పలికీ చివరికి ‘’కరుణ ‘’పేరుకూడా కరోనా అవటం ‘’కరోనా కరుణ కథ బాధ .తల్లికి ఇష్టమైన పులుసు చేసి పెట్టమన్న భర్తకు అది తింటే ఆవిడ విరేచానలపాలౌతుందని సాకు చెప్పి ఆవిడ ఫోటోకు దండ పడ్డాక ఆవిడ ఫోటోకు దండవేసి చేసిన పులుసు నైవేద్యం పెట్ట మన్న భార్య ‘’పనికి మాలిన ప్రేమ ‘’నాయకి .కవి అశా వాదిగా మానవతావాదిగా ఉండాలికానీ ప్రకృతి భీభత్సాలు ప్రమాదాలు ఎప్పుడు వస్తాయా వాటిపై అద్భుతమైన కవిత్వం రాయాలని ఆశ పడే వారికి ‘’మనం అవకాశావాదులుగా  ,వినాశాకారులుగా మారటం సమాజానికి ద్రోహం ‘’అని గడ్డిపెట్టిందే ‘’కవి తత్త్వం’’.కన్న ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయి వెళ్ళిపోతే ముసలి తండ్రి మెడలో గొలుసు వేసుకోవాలనే కోరిక ఎవరు తీరుస్తారు అన్నదే ‘’చమత్కారం లో నిజం .’మంచి వాడు ఎదురు రాబట్టే యాక్సి డెంట్ లో ప్రాణాలు పోకుండా బతికాడు అనుకొన్నాడు ‘’మృత్యు రాయబారి ‘’శకునం లో .ఇద్దరు మగపిల్లలను కనీ ఆడపిల్లకోసం ఎదురు చూసే ఆవిడ ,ఇద్దరు ఆడలని కని, మగనలుసుకోసం ఎదురు చూసే ఇంకో ఆవిడా ,యే బిడ్డపుట్టినా మాకు సంతోషమే అని లేటుగా కడుపుతో ఉన్న మరో ఆవిడా మాటల్ని విని’’ సరసవతి’’ ‘’వీళ్ళ రాతలకు అడ్డ గీత గీసిన బ్రహ్మ ఆనందాన్ని చూసి ఏమనాలో తెలీక తెల్ల మొహమేసింది ‘’ఆనందం ‘’లో .ఫాన్ గాలి పడనీ తాత ఫాన్ వేస్తె నిద్ర లేస్తాడని మనవడు చిట్కా కనిపెట్టిన ‘’అమాయకత్వం ‘’తో ఈ సంపుటి సమాప్తం .  

 అమాయకంగా ,చిన్న పిల్లాడిగా ముసి ముసి నవ్వులతో కనిపించే చలపాక ప్రకాష్ లొ ఎంతటి నిశిత పరిశీలన ఉందొ ఎన్ని మానవత్వపు విలువలకు ఆరాధకుడో ,ఎంతటి వ్యంగ్యాన్ని ఒలకబోయగలడో  నిరూపించిన కథా సంపుటి ‘’అప్పగింతలు ‘’.రాసి మనకు అప్పగించాడు .చదివి మనం ఆయనకు అభినందనలు అప్పగించి మన బాధ్యత నెర వేర్చాలి .  మంచిముఖచిత్రం ,చక్కని ముద్రణ ఈ సంపుటికి వన్నె తెచ్చాయి .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-1-24-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.