పూర్ణ చ౦ద్ ‘’రెండో ముక్కాలు’’కు షడ్భాషారుచులు (కాంతులు )
కృష్ణా జిల్లా రచయితలసంఘం ప్రధాన కార్యదర్శి ,శతాధిక గ్రంథ రచయిత డా.జివి పూర్ణ చ౦ద్ లొ కవి దాగి ఉన్నాడని నాకు తెలియదు .మొన్న నవంబర్ లొ ఆయన రాసి ప్రచురించి,నాకు పంపిన ‘’రెండవ ముక్కాలు ‘’చదివాక తెలిసింది ఇవాళ కవులుగా చెలామణి అవుతున్న వారికి ఏమాత్రం తీసిపోని భావుక సాంద్ర కవి ఆయనలో ఉన్నాడని తెలిసింది .ఆయన రాసిన మూడు లైన్ల కవిత లకు ఇంగ్లీష్ సంస్కృతం హిందీ తమిళం మలయాళం బెంగాలీ భాషలలో అను వాదం ఉన్న సంపుటి ఇది . అంటే షడ్భాషా రోచిస్సులతో వెలుగొందిన కవితా సంపుటి .ఆంగ్ల అనువాదం శ్రీ విహారి ,సంస్కృతం డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,తమిళం ప్రొఫెసర్ జె. సత్యవతి ,కన్నడ ప్రొఫెసర్ కొలకలూరి ఆశాజ్యోతి ,మలయాళం శ్రీ ఎల్ ఆర్ స్వామి ,హిందీ శ్రీమతి హేమలత చేశారు .అందరూ లబ్ధ ప్రతిష్టులే .కనుక పూర్ణ చ౦ద్ హృదయాన్ని బాగానే ఆవిష్కరించి ఉంటారు .ఆంగ్లానువాదం మాత్రం ముక్కస్య ముక్క గా సాగిందని అనిపించింది .కవిత్వ ఛాయ గోచరించలేదు .మిగిలిన భాష లలోని అనువాదం కవితలు ఆభాషా లిపిలో ప్రచురించటం మరో ప్రత్యేకత .అది మనకు గ్రీక్ అండ్ లాటిన్ అని పిస్తుంది ,’’పంగులూరి’’ ద్వయం కబీర్ దోహాలను ,తిరుక్కురల్ కవితలను అనువాదం చేసినప్పుడు మూలాన్ని తెలుగు లిపిలో లోనే ఇచ్చారు. అలాఉంటే ఆభాష తెలియకపోయినా చదివే వీలు ఉండేది .శతానికి పదమూడు తక్కువే అయినా శతకం గానేదీన్ని భావించ వచ్చు . అయతే ఇవి దేనికది విడిగా ముక్తక ఛాయా కలిగి ఉండటం ప్రత్యేకత .అప్పుడెప్పుడో ఈకవి దీర్ఘ కవిత ఒకటి రాశాడని ,తర్వాత ముక్కాలు మొదటి భాగం 2017లొ శ్రీ విహారి, డా మాదిరాజు రామలింగేశ్వర రావు గారి అనువాదాలతో ప్రచురించారని తెలిసింది .ఈ ముక్కాలు-2ను కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి సతీమణి శ్రీమతి స్వర్గీయ రామరత్నం గారికి కవి ‘’నీ ఆలోచనలకు నేనిచ్చేగౌరవం ,నీ ఆశయానికి అన్కితమౌతూ నేనిచ్చే అంకితం ‘’అంటూ సభక్తికంగా,ఆరాధనా భావం గా ‘’ఆ ఆక్కయ్య’’కు అంకితం చేయటం సముచితం అనిపిస్తుంది .
అప్పుడెప్పుడో బందరు స్పందన సాహితీ సమాఖ్య వారు ‘’వినరా సుమతీ ‘’అనే సుమతీ శతకానికి డా..వి.వి .ఎల్. నరసింహారావు గారి సుజన రంజని వ్యాఖ్యను ప్రచురించినప్పుడు ముందుమాట రాసిన డా.జివి సుబ్రహ్మణ్యం గారు అందులోని ప్రక్రియ నవ్యతను ప్రస్తుతిస్తూ ‘’చప్పిడి, చప్పుడుమాటలు కావని ఒప్పెడి మాటలు ఇవి ‘’అన్నారు .’ శతకానికి ఉన్న నాలువ చరణం మకుటం తీసేస్తే మూడు పాదాల్లోనే కవి తన హృదయం ఆవిష్కరిస్తాడు .కనుక మూడు పాదాలనే తీసుకొని ‘’ముక్కాలు ‘’అని పెద్దలు దీవించిన పేరునే సార్ధకంగా పెట్టాడు కవి .పూర్వం లాంతరు, బుడ్డి దీపాలు కు ముక్కాలి పీట వాడే వారు.లేబరేటరీలలో త్రిపాద్(tripad ) స్టాండ్స్ వాడటం మనకు తెలుసు .మూడే కాళ్ళున్నా ధృడత్వానికి లోటు ఉండదు .కనుక ముక్కాలు పేరు సమర్ధనీయమే .అంతే కాక ఆరు భాషల మేకు బందీ కూడా ఉండటం మరింత దృఢత్వాన్నిచ్చింది .
’జీవితంలో చెలరేగే అశాంతి కాంతికి హేతువు –మన ఆదర్శాల శివ తా౦డవమే –సరికొత్తశబ్దాల హేతువు ‘’అన్న కుందుర్తి మాటలు మనకవికి ఆదర్శమే అనిపిస్తుంది .కలానికి వాడి, ఉక్తిలో శక్తి తో ఆధునిక వచన సాహిత్యం నిర్మించిన వాడు గోరా శాస్త్రి.అలాగే ఆస్వాద శక్తి కలిగించాడు ఈకవి .సి౦దువు లో బిందువును, వటవృక్షం లొ విత్తనాన్ని దర్శిస్తాడు కవి .తాను చూసి మనకు ఆ అనుభూతి కలిగిస్తాడు తనకవితలో .అందుకే ‘’సముద్రమంత చెప్పాలని ఉన్నా చెప్పింది చుక్కలే కన్నీరులా ‘’అంటాడు,మబ్బులూ మెరుపులూ మంచివే –ఆకాశాన్ని దీనంగా చూసే శ్రమ తప్పిస్తూ –వేడి గుర్తుల్ని మరిపించేనీళ్ళ నాట్యం ‘’అంటాడు పూర్ణ . ‘’ఇక్కడ ఎండు గుండె తడిని పిండుతూ అన్నీ మాజీ జలాలుగా కనిపించాయి జపాన్ లొ మాత్రం కవితలు జీవనదులుగా భాసించాయి .ఉమ్మ నీటిలో ఇసుకపాయలు –చీకట్లో పురుడు పోస్తున్న దొంగలారీలు ‘’ఇసుకాసుర భస్మాసుర హస్తాలు .’’మకిలి తుడిచే ముగ్గు పొడే అర్ధ శాస్త్రం’’మంచి నిర్వచనం .ఆలోచనలని తెగకాల్చిన సెగ –తడిసిన కట్టే మీద ఉడకని వంటకంగా అసంపూర్తిగానే అరుచిగానే మిగిలాయి ..’’జీవిత వైతరిణిలో నీరు ని౦డుకున్నది ‘’గొప్ప ప్రయోగం . ఏటిలోనూ రాతి లోనూ గంతులు నేర్పిన కప్ప కవికి ఆదర్శం ట .అమరణ౦ కవిత పేరు .అంటే చిరంజీవి కప్ప .గడ తోపుడుతో సాగే పడవప్రయాణ౦ లొ భూమి వెనక్కీ ,స్వర్గం ముందుకూ సాగటం అనుభవ సారమే .తెలుగు మాటలు పులుసులో ముక్కలయ్యాయి .పొగిడే వాళ్ళుంటే కవి తోక నెక్కి కూర్చుని ప్రగల్భాలు పలుకుతాడట .ఇవాల్టి సత్యమే .పుడితే మంచం మీదకి- చస్తే మంచం నుంచి నేలకూ – అందుకే ‘’మంచం మీద ఉన్నంత సేపే జీవితం ‘’అన్నాడు తాత్వికంగా .’’పాపాయి పెదిమ నంటిన మెతుకు కవిత ‘’అంటే అంత మాధుర్యం అంతటి సంతృప్తి అని .రాజు బట్టలు, మంత్రి మంత్ర దండం వదిలి పారేస్తే –‘’ఇదే అదను అని తెలుగు వదిలేశారంతా ‘’అంటూ నేటి తెలుగు హీన దీన స్థితిని నగ్నంగా ఆవిష్కరించాడు .సమూహ శక్తుల ఏకీకరణమే చీపురు –కుళ్ళు నంతా కడిగేస్తుంది ‘’ఆం ఆద్మీ’’ లాగా .’’
‘’తానొవ్వుతూ రోకలి ,రోలు మీద మద్దెల మోత –పచ్చడి కోసమే ఇంత రచ్చడి’’ రచ్చడి గొప్ప కాయినేజ్ వర్డ్ .బిడ్డ పైకి ఎదిగాకే –ప్రతాప ప్రదర్శనం తో –సన్ స్ట్రోక్ ఇస్తాడు ‘’.ఆటపాటలే జీవితానికి ఆనందం .అలల్ని అల్లే సముద్రంలా –మనసు చేరదీసే కలల్లా –మనిషితనం కలతల్ని దాటిస్తుంది .మనసులన్నీ మైదానం లొ క్రికెట్ ఆడుతూ –తనువులన్నీ ఆశగా దిక్కులు చూస్తుంటే –వందేళ్ళ క్రికెట్ మాచ్ లొ గెలుపెవరిది అని ప్రశ్నిస్తాడు .చెట్టు నుంచి పండునేల రాలి –అంకురం నేలనుంచి నింగికి ఎగురుతుంది –ఎదగాలనే వారికి ‘’ఆకాశ ఆకర్షణ ‘’గా నిలుస్తు౦దన్నాడు . ‘’నిద్రలో డ్రైవర్- ,తనదారి తాను చూసుకొంటూ కార్ – దైవదీనంగా ఉంటే –నెత్తి నెక్కి తోక్కేవాడు లేడని సంబర పడుతుందట బ్రేక్ ‘’ప్రమాదం ముంచుకొనివచ్చి శాల్తీలు గల్లంతు .
ఇలా ప్రతికవిత మనసును తాకేదే .ప్రతిదీ ఉదాహరించాల్సిన కవితే . కవిత శీర్షికలుకూడా ముక్కాలు ,ప్రతి బి౦బి సారుడు ,తృష్ణుడు ,ఖుషీ వలుడు ,అమరణ౦ అర్ధయానం ,ఒడిసెల ,శోభనం వాట్సాప్ ,ఉపరిపాలన ,చిరం జీవితం అంటూ సార్ధక నామాలే .ఈ శీర్షికలు చూస్తుంటే అలనాడేప్పుడో న. పా.సా .అంటే నండూరి పార్ధ సారధి పెట్టిన హెడ్డింగులు జ్ఞాపకం వచ్చాయి .,’’నాన్న గారూ ‘’అని నన్ను ఆప్యాయంగా ,గౌరవంగా పిలిచే’’ అబ్బాయి’’ పూర్ణ చ౦ద్ సామాన్యకవి కాదు ,లోకం గర్వించదగిన సుకవి అని మెచ్చుతూ మనః పూర్వక ఆశీస్సులు అందిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-1-24-ఉయ్యూరు .

