పందెం కోళ్ళు
సంక్రాంతి సాయంత్రం మా బామ్మర్ది బ్రహ్మి వగరుస్తూ ,నిట్టూరుస్తూ ,ఈలలేసుంటూ మా ఇంటికి ఊడిపడి కనీసం నన్ను పలకరించకుండా వంటింట్లోకి వెళ్ళి నిన్న ఫన్మోజిలో ఆపెద్దాయన చెప్పాడని మా ఆవిడ చేసిన నువ్వుండలు మెక్కి ఆప్కోరా తో కా ఫీతాగి చొక్కాతో మూతి తుడుచుకొంటూ వచ్చి నా పక్కన వాలాడు కుర్చీలో .’’సంక్రాంతి శుభాకామ్క్షాలు బావా ‘’అన్నాడు తప్పదుగా నేను కూడా ‘షేం టు యు ‘’అన్నా .బావోయ్ దారితప్పావ్ షేం కాదు సేం.అనాలి అన్నాడు అందరికి ఇది. నీకు మాత్రం అది అన్నా .ఏమిట్రా ఊళ్ళో విశేషాలు అని అడిగా .నాకేం తెలుసు బా .నువ్వు ఇంట్లో ఉన్నా అన్నీ కూపీ లాగి తెలుసుకొంటూనే ఉంటావ్ గా .నువ్వే చెప్పాలి అన్నాడు .నాకంత సీన్ లేదురా .నా గొడవే౦టో నాది .నువ్వే చెప్పాలి అన్నా .సంక్రాంతి ,కోడిపందాలు చూశావా ?అంటే లేదన్నాను .నేను చూశాను బా .ఈ ఏడు చాలా స్పెషల్ అండ్ వెరైటీ బా.అన్నాడు .వివరంగా అఘోరించు అన్నా .అదే నీతో వచ్చిన చిక్కు .మంచీ లేదు మర్యాదా లేదూ .మా అక్క ఎలా వేగుతోందో నీతో అన్నాడు .వేగటంకాదు నన్నే వేయిస్తోంది గానీ ,ఏదైనా ఉంటే చెప్పితగలడు అన్నా.నా వా గ్ధోరణినికి అడ్డు రాకుండా ఉంటే వాయిస్తాను .కానీ .నీ మూత్ర ప్రవాహం నువ్వు వెళ్ళాక డెట్టాల్ తో కడుక్కు౦టాన్లే గది అన్నా .సరే కాస్కోబా ‘’అని మొదలెట్టాడు సోది .
బావా ఈ సారి ఎలెక్షన్ సీజన్ లో సంక్రాంతి వచ్చింది కదా .అంతా స్పెషలే మూడు రకాల కోళ్ళు పందెం లో దిగుతున్నాయి .ఒకటి ఫాన్ కోళ్ళు .నిన్నటిదాకా అన్నా అన్నా అంటూ కాకాపట్టి ఆయన అనమంటే ప్రతిపక్షాలపై బండ బూతులు తిడుతూ ఉచ్చనీచాలు ఒదిలి ,నాయకుల శీలాన్ని మంటలో గలిపి ,ఇవాళ ఫాన్ గాలి లేదని తెలిసి ,హవా చల్లారి హవాలా పెరిగిందని గ్రహించి మూకుమ్మడిగా జంప్ జిలానీ లయ్యి ఎదురు తిడుతున్నాయి పందెం కోళ్ళు అధినాయకుడు పుంజును ముక్కులతో చెప్పులతో డొక్కలో గుచ్చి ,ఈకలు పీకేసి ,పందానికి అసలు పనికే రాకుండా పూర్వం తిట్టిన బండబూతులు ఆయనపైనే చానళ్లలో చెరిగి పోస్తున్నాయి .వంద కోట్లు కనీస కప్పం కట్టాలని ఆర్డర్ జారీ చేస్తే ,ఆ వంధా దొబ్బ పెట్టి మరో మూడో నాలుగో వందలకోట్లు ఖర్చు చేసినా బతుకు గ్యారంటీ లేదని రాత్రికి రాత్రి తెగేసిచేప్పేస్తూ గోడలు దూకి మంచి షెల్టర్ చూసుకొంటున్నాయి .ఈ షెల్టర్ లోనైనా పరువు దక్కుతుదేమో అని ఆశగా .దివాలా మొఖం పెట్టిన నాయకుడు సజ్జలతో నూకలతో ,పెద్దలతో కబుర్లు చేసి ‘’కప్పమూ వద్దు ఏమీ వద్దు బరిలో దిగండిచాలు .మీ స్థానాలు పదిలం .మీ కుటుంబాలకూ గ్యారంటీ అందరికి ఎన్నికావాలంటే అన్నీ ఇస్తా ‘’కం కం కం ప్లీజ్’’ ‘’అన్నా ‘’దొబ్బెయ్ .నీకు మాటమీద నిలబడటం చేతకాదు .కోడ్ వస్తే నువ్వు బయట ఉండవ్ అని చువ్వలు లేక్కిన్చాల్సిందే అని ఎలెక్షన్ కమీషన్, ఇ.డి .కోళ్లై కూస్తున్నాయి .ఇప్పటికే ఇరుక్కుపోయాం. ఇక చావలేం చచ్చి బత్కుతున్నాం నీకో దండం నీ సీటుకో దండం .నువ్వూ మీ ఆవిడా అన్ని సీట్లకూ పోటీ చేసి గెలిచి ‘’వైనాట్ 175?అన్నావు గా .మీ చావేదో మీరే చావండి మమ్మల్ని చంపకండి .నీకు మేపిమేపి మేము వట్టి పోయాం .శరీరం మాత్రం ఉంది అందులో ఎముకలకు బలమూ లేదు .మా రక్తమాంసాలు నీకు ధారపోశాం కనుక అవీ లేవిప్పుడు మేము జీవచ్చవాలమయి పోయాం నీకో దండంరా బాబూ అని బరిలోకి దిగకుండా పారిపోతున్నాయి ఫాన్ కోళ్ళు .యమగోల సినిమాలో ఎన్టీ ఓడు రావు గోపాలరావు కోడినే చంపి మాంసం హాయిగా వండుకు తిని కోడిబొచ్చు ఆయనకే పార్సెల్ పంపినట్లు చేస్తున్నారు బా .నాకు చాలా నిర్వేదం గా ఉంది బా .’’అన్నాడు .’’నీకెందుకురా దిగులు ?ఎవడు చేసిన కర్మ వారనుభవిన్చకా ఏరికైనను తప్పదన్నా ‘’అన్న తత్వ సారం తెలుసుకో అన్నా .కొంత ఊరడిల్లాక మళ్లీ వంటింట్లోకి వెళ్ళి పుజీడు అరిసెలు నమిలొచ్చి కూర్చున్నాడు .
సైకిల్ కోళ్ళ సంగతేమిటి అన్నా .సైకిల్ కప్పు తో జత కట్టి౦దిగా .మాంచి ఊపు మీదున్నాయి రెండూ జోరుగా హుషారుగా అంటూ భార్యాభర్తల సినిమాపాట పాడుకొంటూ ఊగిపోతున్నాయి పందెం కోళ్ళు .నమ్మకం ,మంచి మర్యాద అనే పోషకాహారాలు తిని పెరిగిన ఈ కోళ్ళు గెలుపు గుర్రాల్లా బరిలో కవ్విస్తున్నాయి .వీటిని ఢీకొట్టే పుంజులు ఎక్కడా కనుచూపు మేర కనపడటం లేదు.మరీ నాయకుడిని జైలుపాల్జేసి యాభై రెండు రోజులుంచి ,బెయిల్ ఇచ్చాక మోరల్ బూస్ట్ పెరిగి చెలరేగి పోతున్నాయి కోళ్ళు .ఆపటానికి శక్యం కావట్లేదు .రిఫరీలుగా ఉండాల్సిన పంతుళ్ళను తీసేస్తే ఎన్నికల సంఘం మళ్లీ వాళ్లకు విధులు అప్పగించటం వీళ్ళు పొందిన మొదటి ఘన విజయం .వ్యవస్థలన్నీ భ్రస్టు పట్టించి ,మూడు మంత్రం జపించి కోర్టులోనూ ప్రభుత్వం మొట్టికాయలమీద మొట్టికాయలు బొప్పి కట్టేలా కొడుతుంటే వీళ్ళకుమహదానందంగా ఉంది .జయభేరి ఇప్పుడే మోగటం ప్రారంభమైంది. సీన్ రివర్స్ అవుతోందని పాలకలు గ్రహించారు .ప్రజలు తమ గోడు వినే నాయకుడు మళ్లీ వస్తున్నందుకు స్వాగతం పలుకుతున్నారు హారతులిస్తున్నారు .సంక్రాంతి ముందే వచ్చేసిందని సంబర పడుతోంది ఆంధ్రలోకం ‘’అన్నాడు .ఏమో అనుకున్నాన్రా .మాంచి సమాచారం సేకరించావ్ .నువ్వు ఫ్యూచర్ లో ఏ సి వై చింతామణి ,ముట్నూరు కృష్ణారావో అయ్యే చాన్స్ ఉంది అని కొంత జోష్ చేశాను .
ఒరేయ్ అన్నీ బానే ఉన్నాయికానీ ‘’కాషాయం కోళ్ళు ‘’సంగతెందబ్బాయా ?అన్నా .కాస్త తేరు కొని మళ్లీ లంకి౦చు కొన్నాడు బామ్మర్ది బ్రహ్మి .ఏం చెప్పమంటావ్ బా .కర్నాటక ,తెలంగాణా లో బొక్క బోర్ల పడ్డాకా, దక్షిణాదిలో తమకు స్థానం దక్కదని ఖాయం చేసుకొన్నారు .అదీ గాక ఇక్కడ తామే పెంచిపోషించిన అరాజకం ,వ్యవస్థలపతనం రాజధానిపై మట్టి నీళ్ళు కుమ్మరించటం మూడు వంతులు పూర్తయిన పోలవరాన్ని ఎదగకుండా అడ్డంకులు కలిగించటం ఇక్కడి సామంతుల్ని ప్రోత్సహించటం వాళ్ళ కప్పాలతో కాలక్షేపం చేయటం ,ఆర్ధికంగా దివాలా తీయటానికి ప్రత్యక్షంగా ప్రోత్సహించటం ,పెద్దబ్బాయి అంటూ లాలించి బుజ్జగించి ఇప్పుడు మంచోడు అనుకొంటే మంచమంతా చెడగొట్టాడని గ్రహించి పాపం ఆడకూతుర్ని ప్రెసిడెంట్ చేస్తే ఆమె ఏదో తంటాలు పడుతుంటే దానికి పార్టీ పూర్తి అండగా ఉండకుండా ,నెలకోమారు తెల్లపాంటు షర్టు తో రాష్ట్రానికి వచ్చి ఇక్కడి బంటును పొగిడి కానుకలు దండు కొంటూ నాలుగున్నర ఏళ్ళు నిర్వీర్యం చేసిన వాడిని చంకలో పెట్టుకొంటే ఓట్లు ఎలా రాల్తాయి బా .?ఈ కోళ్ళకు ఉన్నదే ‘’అరశాతం’’ ఓట్లు .ధైర్యంగా వేయటానికి ఇవన్నీఆకోళ్ళకు గుది బండలు అయ్యాయి .మానంలో పుండు మామగారి వైద్యం లా ఉంది వాళ్ళ పరిస్థితి ‘’అన్నాడు .అదేంట్రా ‘’గుజరాత్ ద్వయం అత్యున్నత పీఠాలపై కూర్చుని కంటి చూపుతో శాసిస్తుంటే వాళ్లకేం భయం ?’’అన్నాను .మరీ ఇంత అమాయకుడివి ఏంటి బా .ప్రతి గ్రామం లో స్వయం సేవకులున్నారు ,అధ్యక్షుడు పెంచి పోషిస్తున్న బూతు మేనేజర్లున్నారు వేలకొద్దీ ఓటుకు డబ్బు లిచ్చారు .కానీ తమిళనాడు కేరళ ,ఒరిస్సా ,బెంగాల్ ,తెలంగాణా లో ఏమైంది ఆ చారిస్మా ?వట్టి డొల్ల అని తేలిపోలేదా? బిల్డప్ బావా బిల్డప్ .అన్నాడు .సరేరా రామమందిరం ఉంది ,వందే భారత్ రైళ్ళున్నాయి మొన్న కట్టిన ముంబాయి మహా బ్రిడ్జ్ ఉంది .కొత్త పార్లమెంట్ భవనం ఉంది .ఇవన్నీ ఓట్లు రాల్చవా ?అన్నాను .ప్రతిదీ రాజకీయ ఎత్తుగడలతో చేస్తే బెడిసికోట్టదా బా ? ఆధానీ అంబానీలకు నీడనిచ్చి ,సగటు మనిషి ఉసురు తీస్తుంటే ,రైతునోట మట్టి కొడుతుంటే ,అన్యాయం అన్నవాడిని అణచి పారేస్తుంటే ,పత్రికాస్వేచ్చ కు భంగం కలిగిస్తుంటే ఎంతకాలం చూస్తూ ఊరుకొంటారు బా ? విశాఖ రైల్వే జొన్ లేదు .విశాఖ స్టీల్ ఫాక్టరి ప్రైవేట్ పరం చేస్తుంటే ,జెండాలు ఊపినంతమాత్రాన ,దీవుల్లో పైజమా లాల్చీ కోటు నలక్కుండా దర్జాగా కుర్చీపై కూర్చుంటే ఓట్లు రాల్తాయా బా ?పూర్వం దళితులు వెనుకబడినవారు కమ్యూనిస్ట్ లకు ఓటు బ్యాంక్ వాళ్ళు తమస్తిత్వం వదిలి కాంగ్రెస్ లో జతకట్టగానే ఆ వోట్లు గు౦ప మొత్తంగా కాంగ్రెస్ పరమయ్యాయి .చాలా ఏళ్ళు తర్వాత తెలుగు దేశం వంటి ప్రాంతీయ పార్టీల వశం అయ్యాయి .జాతీయ పార్టీల ముఖం చూడటం లేదు.కనుక మన రాష్ట్రంలో కాషాయ కోళ్ళు రెక్కలు ఈకలు పీక్కున్న కోళ్ళు .అవి పందానికి పనికిరావు .గిమ్మిక్కులు ఇక్కడ పని చేయవు .నిలబడ గలిగితేగా పోరాడటం అనేది ఉండేది .లిక్కర్ స్కాం గాళ్ళ ను ఏమీ చేయకుండా కప్పాలు వసూలు చేసుకొంటూ కాలక్షేపం చేసి, ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టు కొంటె జనానికి కాలధా బా ?అన్నాడు రొప్పుతూ .ఓర్నాయనో ఏం అనాలిసిస్ రా అద్భుతం నా బామ్మర్ది అని చెప్పుకోటానికి గర్వంగా ఉందిరా బ్రాహ్మీ ‘’అన్నాను .ధాంక్స్ బా అన్నాడు .మళ్లీ లోపలి వెళ్ళి గారెలు మెక్కి ,దౌడు తీసేశాడు బామ్మర్ది బ్రహ్మి .
సంక్రాంతి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-1-24-ఉయ్యూరు

