బాల పత్రిక స్థాపించి , రేడియో అక్కయ్య ,మాతా శిశు సంక్షేమ కమిటీ కన్వీనర్ –శ్రీమతి న్యాయపతి కామేశ్వరమ్మ (వ్యాసం)- –గబ్బిట దుర్గాప్రసాద్.-విహంగ -ఫిబ్రవరి 

బాల పత్రిక స్థాపించి , రేడియో అక్కయ్య ,మాతా శిశు సంక్షేమ కమిటీ కన్వీనర్ –శ్రీమతి న్యాయపతి కామేశ్వరమ్మ (వ్యాసం)- –గబ్బిట దుర్గాప్రసాద్.-విహంగ -ఫిబ్రవరి 

01/02/2024

గబ్బిట దుర్గాప్రసాద్

1908 డిసెంబర్ లో విజయనగరంలో శ్రీ పేరి రామమూర్తి శ్రీమతి సత్య లక్ష్మమ్మ అనే విద్వద్దంపతులకు కామేశ్వరమ్మ జన్మించింది .ప్రాధమిక విద్య విజయనగరం లో పూర్తి చేసి ,విశాఖపట్నం క్వీన్ మేరీ బాలికా పాఠశాలలో చేరి హాస్టల్ లో ఉంటూ 1920నుంచి 1926వరకు చదివి స్కూల్ ఫైనల్ పాసైంది .విజయనగరం మహారాజ కాలేజిలో చేరి  , అప్పుడు సంస్థానం దివాన్ గా ఉన్న ఆచార్య మామిడిపూడి వెంకతరంగయ్యగారు ఆడపిల్లలకు జీతం కట్టక్కరలేకుండా చదువుకొనే అవకాశం కల్పించారు .రాజమాత స్కాలర్షిప్ లనిచ్చి ప్రోత్సహించారు .ఈ ప్రోత్సాహాలతో చదువు పూర్తి చేసి డిగ్రీ పాసై ,ఆకాలేజిలో డిగ్రీ పొందిన ప్రధమ మహిళగా రికార్డ్ సాధించింది .కుటుంబ ఆర్ధిక పరిస్థితులు సహకరించనందు వలన  బిఎడ్ ట్రెయినింగ్ చేయలేక పోయింది .స్నేహితురాలు శ్రీమతి పెరంబుదూరు సుభద్రమ సలహాతో ఒక జమీన్దారిణికి ఇంగ్లీష్ ట్యూటర్ గా పని చేసింది .

 1935లో శ్రీ న్యాయపతి  రాఘవ రావు తో కామేశ్వరమ్మ వివాహం జరిగి ఉద్యోగాన్వేషణ కోసం దంపతులు మద్రాస్ చేరారు .భర్తకు హిందూ పత్రికలో ఉద్యోగం దొరికింది .ఆమె లేడీ ఇల్లి౦గ్టన్ ట్రెయినింగ్  కాలేజిలో  ఎ.ల్టి. క్లాసులో చేరింది .తర్వాత మైలాపూర్ లోని నేషనల్ గరల్స్ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా 1937-1945వరకు ఎనిమిదేళ్ళు పని చేసింది .బోధన అంతా ఇంగ్లీష్ లోనే .తెలుగు, తమిళం మాతృ భాషలు .కొంతకాలానికి తమిళ మీడియం  ప్రవేశ పెట్టి ,తెలుగు వారికి అన్యాయం చేశారు .తెలుగు వారికి జరిగిన అన్యాయాన్ని భరించలేక మరో ఉద్యోగం దొరుకు తుందో లేదో అనే భయం లేకుండా ఆత్మాభిమానంతో రాజీనామా చేసింది కామేశ్వరమ్మ .

  భార్య రాఘవరావు గారికీ ఈ అభిప్రాయం ఉండటంతో దంపతులు తెలుగు పిల్లల కోసం ‘’బాల ‘’అనే బొమ్మల మాస పత్రిక స్థాపించి నడిపారు .విద్యా వినోద విజ్ఞానాత్మ క విషయాలు అందిస్తూ దంపతులు సంపాదకులుగా బాలవాజ్మయం గొప్పగా అభి వృద్ధి చేశారు .మార్గదర్శకులయ్యారు .అప్పుడే సినీ డైరెక్టర్ శ్రీ కె.ఎస్ ప్రకాశ రావు పిల్లలకోసం బూరలమూకుడు ,కొంటె కిష్టయ్య ,రాజయోగం సినిమాలు నిర్మించగా  సహకరించి , కామేశ్వరమ్మ పిల్లలతోపాటు తానూ నటించింది .పిల్లలకు ఉపయోగపడే పాటలు పద్యాలు కాలక్షేపం కబుర్లతో గ్రామఫోన్ రికార్డ్ లకు సహకరించింది .1935నుంచి 1956వరకు 21 సంవత్సరాలు మద్రాస్ రేడియో కేంద్రంలో తెలుగు బడిపిల్లల కార్యక్రమాలు .స్త్రీల కార్యకార్యక్రమాలు ,శని ఆది వారాలలో ఆటవిడుపు ,బాలానందం కార్యక్రమాలు పరమ ఆకర్షణీయంగా,విజ్ఞాన వినోద దాయకంగా నభూతో గా నిర్వహించింది .తర్వాత భర్త రాఘవ రావు కూడా చేరి ఇద్దరూ బాలల కార్యక్రమాలు సంయుక్తంగా నిర్వహించి ‘’రేడియో’అక్కయ్య, అన్నయ్య ‘’లుగా గుర్తింపు పొందారు .1956లో హైదరాబాద్ రేడియో స్టేషన్ లో చేరి 1969 వరకు 13 ఏళ్ళు నిరాఘాటంగా కామేశ్వరమ్మ స్త్రీల కార్యక్రమాలను అన్నయ్య పిల్లల ప్రోగ్రాముల ప్రొడ్యూసర్ గా సేవలందించారు .తెలుగు పిల్లలకోసం’’ ఆంధ్ర బాలానంద సంఘం’’స్థాపించారు .శ్రీ కందా భీమ శంకరం ,దువ్వూరి నరసరాజు గార్లు నియమ నిబంధనలు ఏర్పరచి 1947లో రిజిస్టర్ చేయించారు .ఇదే దేశం లో మొట్టమొదట రిజిస్టర్ అయిన పిల్లల సంఘం .తర్వాత దేశమంతా బాలానంద సంఘాలు ఏర్పరచి దీనికి అనుబంధంగా మార్చారు .

  ఈ జంట హైదరాబాద్ సికందరాబాద్ జంటనగరాలలో 50 రేడియో సంఘాలు ఏర్పాటు చేశారు .మహిళలకు వాళ్ళవాళ్ళ అభిరుచులను బట్టి ప్రోగ్రాములు రూపొందించే’’కదంబ మాల ‘’లో  అవకాశాలు కల్పించి వారి సృజనకు నిర్వహణ సామర్ధ్యానికి గొప్ప అవకాశం కల్పించారు .ఇదొక వినూత్న పంధా గా గుర్తిపు పొందింది .జంటనగరాలలో అనేక మహిళా సంఘాలు బాల సంఘాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఈ దంపతుల ప్రోత్సాహ సహాయ సహకార ఫలితమే .తరచుగా ఈ దంపతులు గ్రామాలు సందర్శించి అక్కడి వారి అభి వృద్ధికి తగిన ప్రోగ్రాములు చేసేవారు .ఇలా  మద్రాస్ ,హైదరాబాద్ రేడియోలో 1937 నుంచి 1969 వరకు 32 ఏళ్ళు సుదీర్ఘ సేవ లు అందించారు .

  రేడియో అక్కయ్య అన్నయ్యలు రాష్ట్ర స్థాయిలో మొదటి సారిగా మద్రాస్ లో మొదటి బాలమహాసభ 1950లో నిర్వహించి ,1954లో రెండవ సభ కర్నూల్ లో ,1955లో మూడవ సభ గుంటూరులో ,నాలుగవ సభ 1957లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ లో జరిపి అత్యంత ఉత్సాహాన్ని బాలబాలికలో కలిగించారు .రాష్ట్రం నలుమూలలనుంచి బాల సంఘాలు ప్రతినిధులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేశారు .

  అప్పట్లో కేంద్ర సంఘ సంక్షేమ  సమితికి  శ్రీమతి దుర్గాబాయ్ దేశముఖ్  అధ్యక్షురాలుగా ఉండేది .కామేశ్వరమ్మ దంపతులు చేస్తున్న బాలసాహిత్య సేవను గుర్తించి ఆంధ్ర బాలానంద సంఘానికి ప్రతి ఏటా గ్రాంట్ మంజూరుచేశారు .పిల్లల సంచార గ్రంథాలయం కోసం ఒక వాను ,పిల్లల సినిమాలు ప్రదర్శించటానికి ఒక ప్రొజెక్టర్ కూడా బహూకరించారు .పౌరులు కూడా స్పందించి ఉదారంగా విరాళాలు అందించి బహువిధాలుగా తోడ్పడ్డారు .మద్రాస్ లోని ఆంధ్ర మహిళాసభ పల్లెప్రాంత  ప్రజలకోసం ఒకప్రాజేక్ట్ చేబట్టి ,ఆప్రాజేక్ట్ తరఫున సూళ్ళూరుపేట తాలూకాలో అనేక గ్రామాలలో మాతా శిశు సంక్షేమం  కేంద్ర కమిటీకి కామేశ్వరమ్మ ను  కన్వీనర్ గా నియమించారు .మారుమూలకుగ్రామమాలలో ఆమె ప్రసూతి కేంద్రాలు ,బాలవాడి కేంద్రాలు నెలకొల్ప టానికి  అహర్నిశలు కష్ట పడింది .మహిళాసభ కార్యకర్తలు శ్రీమతి సుగుణమణి,హైమవతి, గజ్జల లీల లతో కలిసి పడవలలో చేలగట్లపైనా నడిచి మారుమూల గ్రామాలకు చేరేది .అక్కడి గ్రామీణ ప్రజల మూఢ నమ్మకాలను తొలగించటానికి ఎంతో సహనంతో చాకచక్యంగా ప్రవర్తించేది .’’ఇరకం’’ అనే చిన్న ద్వీపం లో ప్రసూతి కేంద్రం ఏర్పరచటానికి ఆమె పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు .అక్కడ మంత్రసాని బదులు ఏకంగా ఒక నర్సునే ఏర్పాటు చేసింది .ఆనర్సు చెట్టూ పుట్ట వాగూ వంకా దాటి రావటానికి భయపడి పారిపోబోతుంటే నాలుగు రోజులు అక్కడే ఉండి ఆమెకు ధైర్యం చెప్పి డ్యూటీలో చేరేట్లు చేసింది .

  ఈ దంపతులు మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చేసినప్పుడు బాలానంద సంఘం ప్రధాన కార్యాలయం కూడా మద్రాస్ నుంచి వీరితో హైదరాబాద్ చేరింది .హైదరాబాద్ బాలానంద సంఘాన్ని శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ ముఖ ప్రారంభించింది .71వ ఏట రేడియో నుంచి రిటైర్ అయి ,ఆంధ్రప్రదేశ్ బాలల అకాడెమి నడుపుతున్న ‘’బాల ‘’పత్రికకు సంపదకురాలుగా ఉంటూ బాలానంద కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా నిర్వహించింది .1980లో రేడియో అక్కయ్య కామేశ్వరమ్మ 72వ ఏట మరణించింది . రేడియో అన్నయ్య కామేశ్వరరావు గారు ఏప్రిల్ 131905 లో జన్మించి – ఫిబ్రవరి 241984.న 79వ ఏట మరణించారు .వారిసేవాలు చిరస్మరణీయం .

 రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు బిఎన్ రెడ్ది గారి మల్లీశ్వరి సినిమాలో ‘’పెద్దన కవి ‘’పాత్ర పోషించారు .ఆంధ్ర దేశం లో న్యాపతి ,న్యాయపతిఅని రెండు రకాల ఇంటిపెర్లున్నవారున్నారు .న్యాపతి సుబ్బారావు గారు  రాజకీయ కురువృద్ధులు .న్యాయపతిరాఘవరావు గారు రేడియో అన్నయ్య  బాలనదం ‘’ఫేమసులు’’. ఈ తేడా గమనించాలి .

 –గబ్బిట దుర్గాప్రసాద్.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.