శృంగార నైషధం లొ శ్రీనాథ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం -3
‘’నభ మెల్లం గలయంగ నిండ బొడిచెన్సంధ్యావశేషాద్రుతా-రభటి డంబర తాండవ భ్రమరికా రంభంబునన్ ,శాంభవీ –ప్రభు పాదాహతి మీదికి న్నె గయుచున్ ,బ్రహ్మాండ గోళ౦బు తో –నభి సంబద్ధము లయ్యే నోరజత శైలాశ్మంబు లన్నట్టుడుల్ ‘’
సంధ్యాకాలం చివరలో , ఎక్కువ నేర్పుతో తా౦డవంలో తిరగటం మొదలవగా ,శంకరుని కాలి దెబ్బలచే మీదికి వస్తున్నవెండికొండ రాళ్ళు ,బ్రహ్మాండ గోళం లో అ౦టుకొన్నాఏమో అన్నట్లు చుక్కలు ఆక్షమంతా పొడిచాయి .
‘’చుక్కలో ఇవి గావు సురలోక వాహినీ –విమలాంబు కణ కదంబములు గాని –తారలో యివి గావు ,తారాపధాంబోధి –కమనీయ పులిన సంఘములు గాని –యుడువువు లో యివి –మృడు నంబరంబున –దాపించి నట్టిముత్యాలుగాని –రెక్కలో యివి గావు రేచామ తురుము పై –జెరివిన మల్లె క్రోవ్విరులు గాని –యనుచు లోకంబు సందేహ మందు చుండ –బొడిచె బ్రహ్మాండ పెటికా పుట కుటీర –చారు కర్పూర ఫాలికా సంచయములు –మెండు కొని యోలి నక్షత్ర నక్షత్ర మండలములు ‘’
అవి నక్షత్రాలు కావు గంగానది స్వచ్చమైన నీటి బిందువుల సమూహాలు .చుక్కలు కావు ఇవి ఆకాశ మనే మనోహరమైన ఇసుక సముదాయాలు .నక్షత్రాలు కావు ఇవి శంకరుని వస్త్రాలలో ముత్యాలు .రిక్కలు అంటే నక్షత్రాలు కావు ఇవి రాత్రి అనే స్త్రీ సిగపైన ఉన్న మల్లె పూలు అని జనులు భ్రమపడుతున్నారు .నక్షత్రాలు బ్రహ్మాండం అనే పెట్టె పైభాగంలో గుడిసె లాగా ఉన్న కర్పూర ఖండం యొక్క సమూహాలు అన్నట్లు తారలు ఉదయించాయి .
‘’హాట దురు లీల నిర్జరులు నచ్చర లేమలు వేల్పు టేటనొ-క్కట విహరింప ,సందడికి గాక తొలంగి చరించు మీనక-ర్కట మకరంబు లొక్కొ యన గా గగనాగ్రము నందు మీనా క-ర్కట మకరంబు లెంతయు బ్రకాశము నొందెనిశా ప్రసంగతిన్ ‘’.
దేవతలు దేవతాస్త్రీలు గొప్ప ఆసక్తితో ,తొందరపాటుతో గంగానదిలో విహరిస్తుంటే ,వారి రాపిడికి భరించ లేని అందులోని మీనాలు కర్కటాలు అంటే ఎండ్రకాయలు మకరాలు అంటే మొసళ్ళు పారిపోయి ఆకాశంలో తలదాచుకోన్నాయా అన్నట్లుగా మీన, కర్కట ,మకర నక్షత్ర రాశులు రాత్రివేళ ఆకాశంలో కనిపించాయట .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-2-24-ఉయ్యూరు

