శృంగార నైషధం లొ శ్రీనాథ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం -3
‘’విపులాకాశ నిపాతభీతి కలనా విన్యస్త దుర్వర్ణ కీ-ల పరిస్పూర్తి నిశాలతా కుసుమముల్ భాసిల్లె ,బ్రహ్మాండమం-టటప కాష్టామల కీట రంద్ర రాజముల్ ,నాకాపగా చక్ర వా –క పురంద్రీ నాయనాశ్రు బిందువులు నక్షత్ర గ్రహగ్రాహముల్ ‘’
ఆకాశం పడిపోకుండా ,గట్టిగా మేకు బందీ చేసినట్లు వెండి మేకులలాగా నక్షత్రాలున్నాయి ,రాత్రి అనే లత యొక్క పువ్వుల్లాగా ,బ్రహ్మాండ మండపానికి అమర్చిన దిక్కులు అనే దూలాలో ఉన్న పురుగులు కొట్టి రాలుస్తున్న తెల్లనిపొట్టు పరాగం లాగా ,గంగానదిలోని భర్త వియోగం సహించలేక చక్రవాకపిట్టల కళ్ళ నుండి జారుతున్న నీటి బిందువులు లా నక్షత్రాలు ప్రకాశించాయి .
‘’కాలకిరాత పాద తల ఘట్టన జేసి వియద్వనీ మహా – కాలఫలంబు భాస్కరుడు గ్రక్కున ,నస్త మహా మహీధర –స్థూల శిఖా స్థలిం బడియె,దొరములైన తదీయ బీజముల్ –నీల రుచుల్ వడింజెదరె నింగి ,ననచ్చ తమశ్చలంబునన్ ‘’
కాలం అనే కిరాతకుని పాద తాడనం చేత ఆకాశం అనే వనం లోని బంగారు పండు అనే సూర్యుడు ,వేగంగా అస్తాచలం లొ ఉన్న శిలాతలం పైన పడి ,శిధిలం కాగా ,ఆ పండులోని నల్లని గింజలు ఆకాశం లొ చీకట్లు అనే నెపం తో వ్యాపించాయి .
‘’పగలు బ్రహ్మాండ భాండ కర్పురము నందు –గగన మణి దీపమున నైన కజ్జలంబు –రాలెనో కాక అందకారంబు పేర-గాలవాతూల హతి నిశా వేళ లందు ‘’
పగటి పూట సూర్యుడు అనే దీపం కొన వలన ,బ్రహ్మాండం అనే కర్పూరానికి పట్టిన కాటుక ,రాత్రి వేళ కాలం అనే మహా వాయువు వీచగా ,చీకటి అనే పేరుతొ రాలింది కాబోలు .
ఇప్పటి వరకు శ్రీనాధుడు సాయం సంధ్యను ,ఆతర్వాత నక్షత్ర ఉదయాన్ని ఇంపుగా వర్ణించాడు .తర్వాత భార్య దమయంతికి చంద్రోదయ సౌందర్యాన్ని ఎలా వర్ణించి చెప్పాడో రేపు తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-2-24-ఉయ్యూరు

