ఉయ్యూరు ఊసులు – 17
మా మేనమామ గుండు గంగాధరశాస్త్రి (అందరికీ గంగయ్య గారు) గారి ఇల్లు, మా ఇల్లు పక్కపక్కనే. తరతరాలుగా అతిథి, (అతిథి మాట రాగానే మా తెలుగు మాస్టారు లక్ష్మయ్య చౌదరి గారు గుర్తుకొచ్చారు. అ-తిథి అనగా తిథి వార నక్షత్రాలు లేకుండా వచ్చేవాడు అని చెప్పేవారాయన). అభ్యాగతులకి వారి ఇల్లే ఆశ్రయం. వారి ఇంటిపేరు అసలు కొలచల వారట. ఇంటి ముందు పెద్ద గుండు ఉండేదట. పొరుగూరు నించి వచ్చే అభ్యాగతులకి ఊరి వారు కొండ గుర్తుగా ఆ పెద్ద గుండు ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్ళమని చెప్పేవారట. అలా వారి ఇంటిపేరే మారింది. మా అత్తయ్య కూడా ఎవరు ఏవేళ వచ్చినా వెంటనే ముడి కట్టుకుని వారికి వంట చేసేది.
గంగయ్య గారికి 30 ఎకరాల మాగాణి భూమితోపాటు పది ఎకరాల మామిడి తోట. ఆ తోటలో ఎన్నెన్నో తాడి చెట్లు. వేసవిలో పాలేర్లు ముంజకాయలు కోసి మాచేత తినిపించేవారు. ఆయనతో కలిసి ఊరు వెడితే ముందు విజయవాడ అజంతా హోటల్లో రవ్వ దోసె తినిపించిన తరవాతే వేరే పని.
మా తాతగారి పేరు నరసింహ శాస్త్రి. గాంధీగారిలా మోకాలి పైకి కట్టిన కొల్లాయి గుడ్డ, ఉత్తరీయం. పొద్దున్నే నూతి గట్టున స్నానం చేస్తూ
బ్రహ్మయివాహం, అహం బ్రహ్మాస్మి అంటూ మంత్రాలు వినిపిస్తే ఆయన ఊర్లో ఉన్నట్టు లెక్క. ఊరందరి లిటిగేషన్లన్నీ నెత్తిన వేసుకుని చెన్నపట్నం (మద్రాసు, చెన్నై)లో నటరాజన్ అనే అడ్వకేట్ గారి ఇంట్లో నెలల తరబడి మకాం చేసి హైకోర్టులో నడుస్తున్న ఉయ్యూరుకి చెందిన కేసులు పర్యవేక్షించేవారు. గ్రామదేవత ఉయ్యూరు వీరమ్మ గుడి విషయంలో ఏదో లిటిగేషన్ వస్తే మద్రాసులోనే ఉండి పరిష్కరించారట. అప్పటినించి వీరమ్మతల్లిని పల్లకీలో ఊరేగించే రోజున ఆ పల్లకిని మా సందు వైపు తిప్పి “గుండు నర్సయ్య గారికి జై” అంటూ వెళ్ళేవారట.
భోజనం విషయంలో “ఏముందిరా, నటరాజన్ గారింట్లో కుంపటి తీసుకుని నాలుగు గింజలు ఉడకేసుకుని తినేవాడినిరా” అనేవారు. (ముళ్ళపూడి వారు ‘కోతికొమ్మచ్చి’ లో సరిగ్గా ఇలాంటి ఉదంతమే బాపుగారి తండ్రి అడ్వకేట్ వేణుగోపాలరావు గారి గురించి చెప్పారు. మద్రాసులో ఆ కాలంలో అడ్వకేట్లు క్లయింట్లకి భోజన వసతులు ఏర్పాటు చెయ్యడం మామూలేనని, కేసు గెలిస్తే క్లయింటు చెప్పాపెట్టకుండా రైలు ఎక్కేసి ఉడాయించేవారని, ఓడిపోతే రైలు ఛార్జీలు అడ్వకేటు నించి అప్పు తీసుకుని వెళ్ళేవారని చమత్కరించారు.)
సశేషం
