శృంగార నైషధం లొ శ్రీనాథ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం -10
‘’ అమృత జంబా లమున సందు లతికి యదికి –వేయు నక్షత్రముల నొక్క విధము వాని –జేర్చి విధి చందురునిగా నొనర్చె నేని –లలన నీమోము సరి సకలంకు డితడు ‘’
ఒకే విధమైన అనేక నక్షత్రాలవాడిని సమకూర్చి అమృత సంబంధమైన బురదతో వాటిమధ్య ఉన్న రంధ్రాలను పూడ్చి ఈ చంద్రుడిని బ్రహ్మ తయారు చేసి నీ ముఖానికి సరిసమానం చేశాడు .లేకపోతె ఒళ్లంతా కళంకం ఉన్న వాడు ,నిష్కళంకమైన నీ వదనంతో సాటి రాలేడు కదా దమయంతీ !
‘’చంద్ర మండలమిది పితృ స్థాన మగుట –జన సమార్జిత స్వధా సలిల తిలలు –మంత్ర బలమున నెక్కె ,నీ మధ్యమునకు –జంద్ర బిమ్బాస్య లాంఛన ఛాయ గాదు ‘’
చంద్ర మండలం పితృ స్థానమని వేద వాక్యం .అందువలన భూలోక జనం పితృదేవతలకు ఆహారమైన తిలోదకాలను ,ఈ చంద్రుని మధ్యభాగానికి మంత్రాల చేత చేరుస్తారు .ఆ నువ్వులే చంద్రునిలో మచ్చ గా కనిపిస్తోంది .అది నిజంగా కళంకం కాదు .
‘’ఇదే వీక్షింపు చకోర శాబక నిభాక్షీ !దీర్ఘికా హంసి ఇ-ప్డుదకాంతప్రతిబిమ్బితున్ ,గగన మధ్యోప స్థితుం జ౦ద్రునిన్ –వది దర్శించి ,నిజాధినాదు డనుచున్ ,వాత్సల్య మేపారగా –జడురొప్ప౦ బరి చుంబన౦ బొనరుచుం జ౦చూ పుటాగ్రంబునన్’’
క్రీడా సరస్సులో ఉన్న ఆడహంస ఈ సమయంలో నీటిలో ప్రతి బిమ్బించిన,ఆకాశం మధ్యలో ఉన్న చంద్రుని చూసి ,తన భర్త అని మనసులో అనుకొంటూ ప్రేమతో నేర్పు తో పుటము వంటి చంచువుల చివరతో ముద్దుపెట్టు కొంటో౦ది .
‘’అకలంకాఖిల దీర్ఘికా జల తపస్య త్కైరవ శ్రేణికా -ముకుళీభావ సమాధి భంగ కలనా ముగ్దాప్సరః కామినీ-వికచాస్యామ్బుజ మీ నిశాకరుడు దేవీ చూడు మీ సాంద్ర చం –ద్రికలేతద్దరహాస చంద్రికలు సందేహమ్బులేద దెంతయున్ ‘’
ఈ చంద్రుడు నిష్కళంకమైన సమస్తమైన సరస్సులలోని నీటిలో తపస్సు చేస్తున్న తెల్లకలువల సమూహాలు ముకుళించి తపో భంగం కలిగించటం లో అందమైన అప్సర యొక్క వికసించిన ముఖపద్మం ఈ దట్టమైన వెన్నెలలు .ఈ ముఖ మందహాసాలు ,మహామునులు మొదలైన వారు తపస్సు చేస్తుంటే ,దేవతలచేత ప్రేరేపి౦పబడి ,అప్సరసలు దిగివచ్చి తమవిలాసాలతో మోహింప చేస్తున్నట్లు గా లేదూ !
‘’నవ లావణ్య రసంబు పళ్ళే రములోన౦ బోసి ,యగ్రంబు నన్ –భవదీయాస్య మొనర్చి ,,యార్చి పిదపం ,బ్రాలేయ రుజ్మండల౦-బు వినిర్మించె విరించి ,యచ్చిలుము వో బూబోడి యా చిహ్నమ౦ –బువులందాతడు ,చే దొలంచు మిసిమిం బుట్టెన్సరోజాతముల్ ‘’
బ్రహ్మ దేవుడు పళ్ళెం లో కొత్త లావణ్యం అనే రసాన్ని పోసి ,ముందుగా నీ ముఖాన్ని సృష్టించి ,తడి ఆర్చి ,తర్వాత చంద్రమందలాన్ని నిర్మించాడు .చంద్రునిలోని చిహ్నం ఆ లావణ్యం లోని మలినం కాబోలు .బ్రహ్మ నీటిలో చేతులు కడుక్కోగా అ చేతులకు అంటిన లావణ్యం చేత పద్మాలు పుట్టాయి .దమయంతీ !బ్రహ్మ సృష్టిలోని ప్రతి వస్తువులోని లావణ్యం తీసి నీ ముఖాన్నిసృష్టించాడు . తర్వాతే చంద్రుడిని సృష్టించాడు .ఈపని అయ్యాక చేతులు కడుక్కోగా ,చేతులకు అంటిన లావణ్యం నీటిలో పడి పద్మాలయ్యాయి .
‘’ఛాయా మార్గ భుజంగ హారమును జ౦చ త్తారకా మండల –స్ఫాయద్దివ్య కపాల భూషణము జ్యోత్శ్నా భస్మ గౌరంబు నై –యీ యాకాశము శంభు మూర్తి యగు తన్నేర్పాటు నం దెల్పెడు౦-ద్రైయక్షా మణి మభూతి సూక్ష్మ తర మధ్యా!దీని వీక్షి౦పుమా ‘’
ముక్కంటికి సంబంధించిన అణుత్వం అనే సిద్ధి కంటే ,మిక్కిలి సూక్ష్మమైన నడుముకల దమయంతీ !ఛాయామార్గం అనే సర్పహారం కలది ,అంటే ఇంద్ర ధనుస్సులాగా ఉత్తర దక్షిణాలకు వ్యాపించి నక్షత్రాలచేదట్టమైన రాజమార్గం లా కనిపించే భూషణ౦తో,నక్షత్ర మండలం అనే పెద్దదైన ,శ్రేష్టమైన కపాలమాల అనేఆభరణం కలది ,వెన్నెల అనే బూడిద తో తెల్లగా ఉన్న ఆకాశం ,శివుని అష్టమూర్తులలో ఒకటి అయిన ఆకాశం అనటం చక్కని ఏర్పాటు చూచిస్తోంది .పంచభూతాలు సూర్యుడు ,చంద్రుడు సోమయాజి శంకరుని అష్టమూర్తులు .ప్రస్తుతం ఈశ్వర శరీరమైన ఆకాశం ,చాయామార్గం అనే సర్పహారం ,నక్షత్ర సమూహం అనే కపాలమాలిక ,నక్షత్ర సమూహం అనే బూడిద పూత కలది అవటంతో తాణు శివమూర్తి అనటాన్ని సార్ధకం చేస్తోంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-3-24-ఉయ్యూరు .

