శృంగార నైషధం లొ శ్రీనాథ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం -9
‘’జనకుడగు దుగ్దవార్దికు చ్చైశ్రవంబు –గలిగెనే రావణ౦ బును గలిగెనట్టి –తనకు గారాబు పట్టికి వనజవైరి-కొక్క కుందేలు కలుగుట యువిద అరుదె ‘’
దమయంతీ !చంద్రునికి తండ్రి పాలసముద్రం కు ఉచ్చైశ్ర్వం అనే గుర్రం, ఐరావతం అనే ఏనుగు పుట్టాయి .ఆసముద్రుడికి ముద్దులకొడుకు ,పద్మాలకు విరోధి అయిన ఈ చంద్రుడికి కుందేలు పుట్టటం ఆశ్చర్యం కాదు .చంద్రునిలోని మచ్చ ను కుందేలుగా భావించి అతడికి పుట్టినట్లుగా కవి భావన .
‘’జ్యోత్స్న నాగ దమిశ్ర నానుభయ భార్య –లుడుపతికి ,నందు నొకతె దెల్పోర్తు,నల్పు –తాను వారికి మెచ్చుగా దాల్ప బోలు –తెలుపు నలుపును నగుమేను నెలత యితడు ‘’
అనుకూలు డైన భర్త భార్యల ఇష్టాన్ని బట్టి నడుచుకొంటాడు .కనుక చంద్రునికి తెల్లనిదైన వెలుగు ,నల్లని చీకటికి ప్రియమైనట్లుగా కొంత నల్ల శరీరం ధరించాడు .లేకపోతె నీల శ్వేత కాంతులు ధరించాల్సిన పనేమి ఉంది ?శుక్ల కృష్ణ పక్షాలను కవి ఇలా వర్ణించి చెప్పాడు .
‘’గణుతి౦పగ నితండు పాల్కడలికిన్ గారాబు పుత్రుండు ,బ్రా- హ్మాణరాజోషధిభర్త నెట్టుకొని సంపాది౦చినన్ బ్రాతియౌ –మణిమంత్రౌషధముల్పురావిహిత కర్మం బెట్టిదో కాక ,ల-క్షణ కాలుష్యము ,రాజ యక్ష్మమును జిక్కం బెట్ట లేదయ్యేడున్’’
క్షీర సముద్రానికి ముద్దుల కొడుకు , బ్రాహ్మణులకు అధిపతి ,ఓషధులకు నెలవు అయిఉండి మణులు మంత్రాలు ఔషధాలు సంపాదించినా ,పాపం పూర్వజన్మ ఖర్మ ఏమిటో తనలో సహజంగా ఉన్న క్షయ జబ్బు ను పోగొట్టుకోలేక పోయాడు .
‘’కాలతమ తిమిర నీలీ-కాళీ దళరస కళ౦క కజ్జల పంక –క్షాళన గోక్షీరములివె-ప్రాలేయ కరా౦శు లంబరము శోది౦చెన్’’
నల్లని చీకట్లు అనే నీలి చెట్టు యొక్క ,సామాన్యమైన నీలి చెట్టు ఆకుల యొక్క రసం తో కలిగిన మచ్చలను ,కాటుక బురదను ,కడగటానికి ఆవుపాల వంటి చంద్ర కిరణాలు ,ఆకాశం అనే వస్త్రాన్ని శుభ్రపరచింది .కాటుక మచ్చలు వగైరా ఆవుపాలతో తొలగిపోతాయి .
‘’జలద కాలిమ బాపంగా జాలె గాని –సహజ కాలిమ బాపంగజాలదయ్యే –శారదారంభ వేళ యీ చందురునకు –నతివయయ్యెడిదౌ గాని ,యదియు గాదు’’
శరత్కాలం వర్షాల మేఘాల నల్లదనాన్నిపోగొడుతుంది .కానీ ఈ చంద్రుని సహజ నల్లదనాన్ని పొగొట్ట లేదు.
‘’అస్తమించి నప్పుడీ అమృత కరుని- -కళలు పడునొక్క డెక్కురుద్రుల శిర౦బు – లసమ బాణుని దొనజొచ్చు నైదు కళలు –కాంత యిది సూవె పదియారు కళల లెక్క ‘’
చంద్రుడు అస్తమించినప్పుడు ఈ అమృత కిరణుడి పదహారు కళలలో పదకొండు ఏకాదశ రుద్రుల శిరాలపైకి ,అయిదు మన్మధుని అమ్ములపొదిలోకి చేరతాయి .అందుచేత విరహుల్ని పీడింఛటానికి బాగా సమర్థాలవుతాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-3-24-ఉయ్యూరు

