అందరినీ వేధిస్తున్న ‘’ఎక్కడుంది న్యాయం ?’’సమస్యనే శ్రీ గుడిమెట్ల చెన్నయ్య కవితాత్మకంగా సంధించిన కవితా సంపుటి
మద్రాస్ లొ జనని సంస్థకు జీవం, జవం కలిగిస్తూ అక్కడి తెలుగు వారి సాహిత్యాభి వృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారు రచించి ప్రచురిస్తున్న ‘’ ’ఎక్కడుంది న్యాయం’’ కవితా సంపుటి నాకు నిన్న పంపి అభిప్రాయం కోరారు .దీన్ని పుస్తకం లో ముద్రిస్తామని చెప్పారు .అంటే పుస్తకముద్రణకు ముందే రాసిన వ్యాసం ఇది.
ఇందులో 56 కవితలున్నాయి .వివిధ పత్రికలలో ఇవి ప్రచురితాలు .బహుజనుల హృదయాకర్షకాలు కూడా . కవి ఇందులో సంధించిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సమాజం చెప్పాలి .ప్రభుత్వాలు చెప్పాలి .కొన్నిటికి మనం మన హృదయాలలో అన్వేషించుకోవాలి .సమాజానికి వ్యక్తికీ దేశానికీ శ్రేయోదాయకాలైనవే ఇవన్నీ.మనమందరం ఆలోచించాలని ప్రజాదర్బారులో పెట్టారు కవి .కవిత్వం లొ స్పష్టత ,మాటలలో పొదుపుతనం ఉన్న కవితా వేశం ఉన్నకవితలివి .చదువుతూ ఆలోచిస్తూ ,ఆన౦దించే కవితలు. జవాబులు చెప్పుకొని ‘’యురేకా ‘’అనదగ్గవి కూడా . వైవిధ్యం నిండుగా ఉన్న కవితలు .
ప్రతిభకు లోటులేకున్నా గుర్తింపుకు ఇవాళ లోటున్నది .అక్షరం ముక్క రానివాడు కవుల తలరాత మారుస్తున్నాడు .డబ్బుపంపితేనే కవిత్వ ప్రకటన .మాతృభాషా విలువ మంటగలిసి పోతున్నదని ఆవేదన చెందారు ఎందరినో ప్రోత్సహించి ,ప్రతిభకు పారితోషికాలు, బిరుదులూ అందించిన చెన్నయ్య ‘’ ప్రతిభకు గుర్తింపు లేదు ‘’అనే మొదటి కవితలో .తాగుడు మైకం ఎంతపని చేసి కొడుకు జీవిత౦ తో ఆడుకొన్నదో కళ్ళు తెరిపించే కవిత ‘’చేతులు కాలాక ‘’.విలువైన సమయాన్ని వృధా ఆలోచనలతో వ్యర్ధం చేస్తూ కార్యరంగంలో కాలుపెట్టని వాడి గురించిన కవిత ‘’మారాలి ఆతను ‘’.,మనం నిద్రపోయినా మనకోసం ,దీన బా౦ధవులకోసం నిద్రించని అంబేద్కర్ వాక్కుల, చేతల సంస్మరణకవిత ‘’దీన బాంధవుడు ‘’.తన మలిన దేహం పై వ్యామోహం మాని రక్తమాంసాల’’ అవతల’’ ఉన్న దాన్ని చూడమని ప్రబోధించే వేశ్య రక్తాక్షరాలే బోధిసత్వ బొధలె ‘’ఇక్కడికి రాకు ‘’కవిత .ఇది భక్త తుకారాం సినిమాలో సీన్ ,వేమన సినిమా దృశ్యం జ్ఞప్తికి తెస్తాయి .
ఒంటరిగా ఉన్న వదినపై వ్యామోహ పడి తప్పుచేయబోయే మరిదిని తల్లిలా ‘’కాముకత్వంతో కీచకుడుగా మారకు. రాముని తమ్ముడు లక్ష్మణుడిలా ప్రవర్తించు ‘’అని ‘’బుద్ధి గడ్డి ‘’పెట్టిన వదినమ్మ అందరి ఆదర్శం అవుతుంది ‘’బుద్ధిగా మసలుకో ‘’లో. రాత్రి వేళ ఒంటరిగా వస్తున్న ఆడపిల్ల వెనక వచ్చే వాడిపై ఆమె ఆలోచనలు అనేకం నెగెటివ్ గా నె ఉంటాయి .కాని అతడు ఆమె మర్చిపోయిన బాగ్ చేతికంది౦చినపుడు తప్పు తెలుసుకొని ‘’తల దించుకొంది’’.తెలుగు భాష కోసం ,నీతి కోసం సేవ చేయకుండా నాటక డైలాగులు చెప్పే స్వార్ధ పరులకు నిస్వార్ధ పరులను కళ్ళున్నా చూడలేరు, చెవులున్నా వినలేరు .’’’’నిన్నే మర్చిపోయిన వారెంత నీ ముందు ‘’?అని ఆత్మగౌరవం నేర్పారు .రెండునుంచి నాల్గవ స్థానానికి జారిన తెలుగు ను గూర్చి దిగులు చెందుతూ ‘’నువ్వైనా చెప్పు చెల్లీ ‘’అని మొత్తుకొన్నారు కవి .కూరగాయలు కూర ‘’గాయాలు’’గా , ధరలు ఆకాశం లో ఉండగా సామాన్యుడు శంకరయ్య గిచ్చిగిచ్చి బేరాలాడుతుంటే ఒక స్థూల కాయుడు మందీ మార్బలంతో వచ్చి కొంత డబ్బు కొట్టువాడి మొగాన విసిరి మొత్తం లేపెశాడని తెలిసి శంకరయ్య అన్నమాటే ‘’ఎక్కడుంది న్యాయం ?’’సంపుటి శీర్షిక అయింది .సార్ధకమూ అయింది . నిత్యం మనం బస్ కండక్టర్ తో చేసే’’ పదనిసలె ‘’నా ప్రశ్నకు బదులేదీ ?’’ఊహల ఉయ్యాలలో ఊగే వో కన్య మనసు ఆరాట, ఎదురుచూపులే ‘’నాలోనేను ‘’కవిత . సాహిత్య సభల్లో పుస్తకాలు అమ్ముకోవాలని ఆరాట పడే రచయితల కు ఎదురయ్యే నిరాశా , నిస్పృహల’’కుఅద్దమే’’పాపం రచయిత.’’.శత జయంతి కానుకగా నందమూరి అందగాని కి ఉపద ‘’తెలుగు భాషా పోషకా ‘’.తమిళనాడు మహిళా ఉచిత బస్ సౌకర్యం విశ్వరూప సందర్శనమే ‘’ఉచితం ‘’కవిత .చేయి అందించి అభి వృద్ధిలోకి తెచ్చాక వాడు లెక్కలేనట్లు ప్రవర్తించి ఈయనకు ‘’హాండ్ ఇవ్వట౦ ‘’కవిత ‘’మంచితనానికి ఫలితం’’ .అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రుద్రమ చెన్నమ లను స్మరించి ‘’స్త్రీలకు నమస్కరించి తల్లినీ చెల్లినీ మోసగించద్దు’’అన్న ప్రబోధమే ‘’ఊరికి ఉపదేశం .’’ ద్విచక్రవాహనం నడుపుతూ సెల్ సొల్లు చెబుతూ మరణం కొనితెచ్చుకొనే వారికి కనువిప్పు కవిత ‘’ప్రాణాలు తీసిన సెల్ ‘’. ముసలాయన వాళ్ళు తింటున్న అన్నం కొంచెం పెట్టమని ఆకలితో అడిగితే, నిరాకరించిన ఇద్దరు యువకులు పొరబాటున ఊటబావిలో పడితే వారిని రక్షించిన ముసలాయనది అసలైన ‘’మానవత్వం ‘’.సాహితీ సంస్థను నిర్వహించే వారు ఒక రచయితను నిర్వహణ విధానం అడిగి తెల్సుకొని చివరికి ఆహ్వానపత్రంలో ‘’తొంటి ‘’ చూపటానికి నిదర్శనమే ‘’కరివేపాకు ‘’వాడుకొని ఏరిపారేయటానికే అది అని చెప్పే నీతి . విద్యాలయాలకు పిల్లల్ని పంపే తలిదండ్రులు వారి చదువుతోపాటు ప్రవర్తన , ‘’ఎటో వెళ్ళి పోయే మనసు’’ లపైనా’’కూడా’’ సీసి కెమెరాలు ‘’పెట్టకపోతే ఆ అనర్ధం అంతా ఇంతాకాదని చెప్పే కవిత ‘’ఎటో వెళ్ళి పోతోంది యువత ‘’. డ్రంక్ అండ్ డ్రైవ్ ‘’లో రోడ్డుపై నడుస్తున్న స్కూలు పిల్ల మరణం చూసి కవి ‘’ఒక గొంతు తడుపు కున్నందున –ఆరి పోయింది మరో గొంతు తడి ‘’అని వ్యధ చెంది అందరికీ కన్నీళ్లు తెప్పిస్తాడు ‘’గొంతు తడి ఆరిపోయింది ‘’లో .’చంద్రయాన్ లో అడుగిడినా –కదలిక లేదు చాదస్తాలలో ‘’అని వాపోయాడు ‘’ఆడపిల్ల అగచాట్ల లో ‘’బాగా ఉన్నత విద్య నేర్చిన అమ్మాయిలకూ అధికకట్నం కావాలనే ఈనాటి యువకులను చూసి .సమాజంలో ఒకరికొకరి సాయ౦ అత్యంత అవసరం .అదిలేనిది ప్రజా జీవనం సాగదు .అని చెప్పెకవిత ‘’మరో మార్గం లేదు’’..కాళోజి ‘’యాది’’ లో ‘అల్పపదాలలో అనల్ప భావాలు పొదిగిన వాడు –అన్యభాషలు నేర్చి,ఆంధ్రమ్ము రాదు’’అనే వాడిని ‘’చావవెందుకురా ?’’అని ఈసడించిన ఆంధ్రభాషాభిమాని ‘’అన్నారు .డెబ్బై అయిదేళ్ళ స్వతంత్ర భారతం లో’’సామాన్యుడికి ‘’ రోటీ,కపడా ,మకాన్ ‘’నహీ .’’నీడ దొరికే దెన్నడో?”’ అని సానుభూతి తో అన్నారు కవి సాశ్రు నయనాలతో .
తాగుడు వ్యసనంతో బిచ్చ గాని జేబు కొట్టేసే చదువుకొన్న వాడు అలావటానికి కన్నవారి’’ నిర్లక్ష్యమే’’ అని నిర్మొహమాటంగా చెప్పారు .గుప్పెడు కూడు కోసం ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి శీలం దోచుకొనే ప్రయత్నాన్ని చూసిన అర్ధాంగి ‘’మన బిడ్డలాంటి బిడ్డపై ఏమిటీ అఘాయిత్యం ?’’అమానుషం ‘’’’అని తిట్టి ,తోసేసి ,కాపాడి , ఆ అమ్మాయిని కన్నబిద్దలా ఒడిలో పడుకోబెట్టుకొని ఓదార్చిన ఉత్తమాయిల్లాలు కు హేట్సాఫ్ ‘’.అంతరించి పోతున్న మానవత్వాలు ,అధికమౌతున్నకుట్రా కుతంత్రాలకు క్షోభిస్తూ ‘’నిన్ను నీవు తెలుసుకో అప్పుడే దర్జాగా తల ఎత్తుకు నిలబడగలవు .’’అనే ‘’ఎరుకయే’’తలెత్తుకు తిరగవచ్చు ‘’కవితా మర్మం .అన్నిటా కల్తీ .ఫిర్యాదు చేస్తే’’ లైట్ ‘’తీసుకొనే వారే అందరూ .అందుకే ‘’దుష్టులు రక్షింప బడుతారు .శిష్టులు శిక్షింప బడుతారు’’అని కొత్త నీతి వాక్యం బోధించారు కవి ‘’మనస్సాక్షి ‘’లో .తనను గౌరవించే వారిని లక్ష్యం చేయక ,తిరస్కరించేవారి వెంటబడే మూర్ఖ రచయితలను చూసి –‘’ఇదాలోకం’’ –ఇదే లోకం ‘’ అని విస్తుపోతారు .కోరికలే గుర్రాలైతే ధర్మం అదుపు తప్పుతుంది –అవే హంసలైతే వివేకాన్ని కలిగిస్తుంది’’అన్నారు ‘’తగని పని ‘’వద్దని చెబుతూ .మంచిగా మనపని మనం చేసుకు పోతుంటే సన్మానాలు సత్కారాలు అవే వచ్చి మీద పడతాయి ‘’ నిరుత్సాహం వద్దు అని ‘’ఉచితం ‘’లో ఉద్బోధ . మనిషిని మనిషిగా చూడమని ,అశా౦తికాక శాంతిని కలిగించమన్న ‘’వేడికోలు’’ కవిత ‘’మనుషులు మారాలి ‘’..
తనకన్నా గొప్పవాడిని గౌరవిస్తుంటే చూసి సహించలేని రచయితకుహనా సమతా వాదాన్ని ఎండగట్టిన కవిత ‘’న్యూనతాభావం .’’ఆహారం ,కనీసం మంచి నీళ్ళు అయినా ఇవ్వమని ప్రార్ధించిన భిక్ష గాడి మాటను లెక్కపెట్టకుండా ముందుకు సాగి ,అతడు అఆరుపులతోనే చనిపోయాడని తెలుసుకొని బిక్క చచ్చిపోయిన కుటుంబం ‘’దయా దాక్షిణ్యాలు ‘’లో కనిపిస్తారు ..విషయ పరిజ్ఞానమున్న వారికి అందలం దక్కదు .కల్లబొల్లి మాటలకే గౌరవం ,కీర్తి ‘’.ఆకవి గొప్పతనమేమిటో ఎవరికీ తెలీదు కాని ఆయన జయంతి ఉత్సవం మాత్రం రంగరంగా వైభవంగా జరిపే వారి గురించి ‘’ఇది’’ ఉత్తర,’’ ‘’దక్షిణ’’ కాలం –ఫలిత౦ ఆవ గింజంత ‘’అని తేల్చారు ‘’కొలువు కూటం ‘’కవితలో .అమ్మా అంటే మొహం మాడ్చి ,మేడం అంటే వికసించి ,శుభోదయం అంతే చీదరించి గుడ్ మార్నింగ్ అంటేపొంగిపోయిన ఆవిడ ను చూసి ‘’సన్నగిలుతోంది తెలుగు భాషపై మమకారం గౌరవం ‘’అని బాధ పడ్డారుకవి .బస్సులు రైళ్ళలో పెద్దలకు స్థానం కల్పించాల్సిన బాధ్యత గుర్తి౦పజేసే కవిత , మగాడికి లేనితప్పు ఆడదానికి ఎందుకని నిలదీసిన ఆధునిక స్త్రీ –తప్పు ఎవరు చేసినా తప్పే అనే నీతికి ఉదాహరణ .ఇంట్లో ఎలుక దూరిందని కొంప తగలబెట్టుకోకు .అల్లరీ ఆగం చేయక బుద్ధిగా ప్రవర్తించు ‘’అని ఇంటాయన మూషికానికి చేసే విన్నపమే‘’నీవైనా విను ‘పారవేయబోయిన అన్నాన్ని ఒక ఇల్లాలిని అడుక్కొని ,ఆబగా తిని తాగటానికి నీరు లేక నికృష్ట చావు చచ్చిన బిచ్చగాడిని ‘’ఆకలి ‘’లో ఆవిష్కరించారు .తనపల్లెటూరు ధర్మక్షేత్రం .మమతానురాగాల’’ పుణ్యక్షేత్రం’’ ‘’అని ఎలుగెత్తి కీర్తించారు .కలలరారాజు కనిపించి కలలు నిజం చేసి కరగ్రహణం చేస్తే ఆమెకు పండగే ప౦డుగ.. పంపు కొడితే ఉబ్బని ‘’నాయాల’’ లోకం లో లేడని ‘’మనిషి ‘’లో చూపించారు . దాంపత్య సరసం నాలుగు గోడలమధ్య రమ్యం .దానికి ‘’ఎక్సి బిషన్’’ అక్కర్లేదని మునిమాణిక్యం కాంతం గారి లాంటి ఆమె ‘’వలదంటి కాని ఇష్టంలేక కాదు ‘’అంటూ దీపాలు ఆర్పి ,అతనిలో ఒదిగిపోయింది ‘’సుగుణ శీలి’’ భార్య .పొట్టివాడైనా గట్టివాడు అమరజీవి శ్రీరాములు .మనలో నిలిచి పోయాడు ‘’అని కీర్తించారు చివరి 56 వ కవితలో .
ఇలా చెన్నయ్యగారు భట్ట బాణ మహాకవిలాగా ‘’స్పృశించని ‘’విషయం లేదు . ఇవన్నీ ఆయన ఇన్నేళ్ళ సాహిత్య ర౦గం లో చూసిన ,ఎదుర్కొన్న విషయాలే .అన్నిటికి అక్షరాభిషేకం చేశారు .అయితే మంచి కవిత్వానికి క్లుప్తత ,కవితా తత్త్వం మాత్రం ఉండాలి .మనసారా గుడిమెట్ల చెన్నయ్య గారిని అభినందిస్తూ ,మరిన్ని రచనలతో సాహితీ ‘’మెట్లు’’ ఎక్కి ‘’చెన్న’’ గా కవిత్వం ‘’రాస్తారు చెన్నయ్య అని పించుకోవాలని అభిలషిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-24-ఉయ్యూరు .

