ఆదర్శ పత్రికా సంపాదకుడు, ‘’పొప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం’’ రాష్ట్ర మంత్రి ,,రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ప్రతినిధి –శ్రీ సి .వై .చింతామణి
సర్ చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి అంటే ఎవరికీ తెలీదు కాని సి. వై .చింతామణి అంటే అందరికీ బాగా తెలుసు .విజయనగరం మహారాజావారి కాలేజిలో ఆయన విద్యార్ధిగా ఉన్నప్పుడు ఇరవై ఏళ్ళ వాడు .భారతీయ రాజ్యాంగ సమస్య ఏదైనా కానీ ,కొప్పరపు కవుల్లాగా ఏక ధాటిగా ఉపన్యసించి జనాలకు పూనకాలు తెప్పించిన మేధావి .అయ్య కొనేరి గట్టుమీద ,గంటస్తంభం దగ్గర ,పార్కు మీటింగులలో ఎక్కడైనా ఆయన మీటింగులు ఉపన్యాసాలతో మారు మోగేవి .చదువుమీద దృష్టి క్రమంగా తప్పి ,మనసంతా దేశం మీదకు పాకింది ..
1900లో అఖిలభారత కాంగ్రెస్ సభలు లాహోరు లో డిసెంబర్ లో జరిపే సన్నాహం వచ్చింది .ఆసభలకు హాజరవ్వాలని కళలు గన్నాడుచి౦తామణి.దగ్గరా దాపూ కాదు .లాహోర్ చలి హోరుమని పిస్తుంది .చేతిలో చిల్లిగవ్వ లేదు .అప్పో సప్పో చేసి లాహోర్ వెళ్ళి అ చలిలో గజగజ వణకుతూ ఆంధ్రాభోజనం పప్పు పులుసు ,పచ్చడి లేకుండానే ,అక్కడపెట్టిన తిండి తిని తిప్పలు పడి తన కలలు నిజం చేసుకొన్నాడు .అక్కడ వేదిక పై ఉపన్యాసాలతో హోరెత్తిం చాడు .చెణుకులతో ప్రవాహం వంటి శైలితో ,విషయ పరిశీలనతో అందర్నీ మెప్పించి ‘’సెభాష్ చి౦తామణీ ‘’అని పించుకొన్నాడు .ఆనాటి సభలలో స్టార్ అట్రాక్షన్ అయిన సురేంద్రనాథ బెనర్జి ,భూపే౦ద్రనాథ బోస్ ,హిందూపత్రికాధిపతి సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి అతిరధ మహారధులంతా డంగై పోయి భేష్ అని తెగమెచ్చుకొన్నారు .’’ఉపన్యాసమణి చింతామణి ‘’అని ముక్త కంఠంగా శ్లాఘించారు .
సాధారణంగా బాగా మాట్లాడేవారికి కలం సాగదు. కలం బాగా సాగే వారికి మాటలు తడబడతాయి .కానీ చింతామణి ఎంతబాగా మాట్లాడగలడో అంతబాగా వ్రాయ గలడు. సవ్యసాచి అనిపించుకొన్నాడు.మనసంతా దేశ హితైక జీవితం మీదనే ఉండటం తో 1901లో చదువుకు స్వస్తి చెప్పి ,మద్రాస్ చేరి ‘’యునైటెడ్ ఇండియా ‘’పత్రికలో చిన్న ఉద్యోగం సంపాదించాడు .అది పెద్దగా ఉపయోగ పడకపోవటంతో సుబ్రహ్మణ్య అయ్యర్ గారి ‘మద్రాస్ స్టాండర్డ్ ‘’ అనే దిన పత్రికలో చేరి,పనిచేసి తన సత్తా నిరూపించుకొని ,పత్రికాలోకం లో మంచి పేరు ప్రతిష్టలు పొందాడు .
మద్రాస్ ‘’కూం నది ‘’ కంపు నుంచి బయటపడి ,పవిత్ర త్రివేణీ సంగమం అలహాబాద్ చేరాడు .’’లీడర్ ‘’పత్రిక ద్వారా అప్పటి సంయుక్త రాష్ట్ర ప్రజల హితైక జీవనాన్ని పోషించాడు .మద్రాస్ వాళ్ళు ‘’మణి మా వాడు ఇక్కడే పుట్టాడు ‘’అని గర్వంగా చెప్పుకొంటే ,సంయుక్తరాష్ట్రాలవారు ‘’చింతామణి మాకు పెంపుడు వచ్చాడు .మేము దత్తత చేసుకొన్నాం ‘’అని మురిసిపోయారు ‘’అని సర్ తేజబహదూర్ సప్రూ అన్నారు .ఇలా అందరి అభిమానం సంపాదించాడు .ఇలాంటి స్వజాతీయతతో ఇమడలేక ద్రాక్షారామ భీమేశ్వరుడు లాగా సర్వ జనీన జాతీయతలో లయమై పోయి ఆంధ్ర ధీ పరిణామానికి నిదర్శం గా నిలిచాడు .
చింతామణి మితవాది అ౦టారుకానీ , ఆయన చర్యలలో ఆలక్షణాలు కనిపించవు.ఆత్మ గౌరవానికి ,దేశ గౌరవానికి భంగం కలిగినప్పుడు వాదాలతో పనిలేదు .’’మడ్డీ మన్ ‘’కమిటీ ముందు సాక్ష్యమిస్తూ మిదవాదిత్వాన్ని మించి మాటలతో చితగ్గొట్టాడు చింతామణి .సంయుక్తరాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడిన అభిప్రాయ భేదంతో అధికారానికీ జీతానికీ రాజీ పడక మంత్రిపదవికిస్వస్తి చెప్పటానికి మితవాదిత్వం అడ్డు పడలేదు .
తర్వాత బొంబాయి వెళ్ళి ‘’ఇండియన్ డైలి మెయిల్ ‘’ఎడిటర్ అయి,అక్కడా భిన్నాభిప్రాయాలు రాగా ఉద్యోగాన్ని తన్నేసినప్పుడు మితవాదిత్వం అడ్డు రాలేదు .ఇలాంటి స్వాతంత్ర్య లక్షణమే సైమన్ కమీషన్ ఎదుట తెలిపిన ప్రతికూలాభిప్రాయాలే ఆయనకు గవర్నర్ పదవి దక్కలేదు .వక్త ,లేఖకుడు సంస్కర్ర్త ,రాజకీయవేత్త గా విఖ్యాతి చెందిన అయన భారత ప్రజల ఆదరాభిమానాలు విశేషంగా పొందాడు .’’భారతీయ సంస్కరణం ‘’ఫిరోజ్ షా మెహతా ఉపన్యాసాలు ‘’అనే రెండు ఉద్గ్రంధాలు రచించాడు చింతామణి .ఆనాటి రాజకీయ టాప్ హీరోలైన ఫిరోజ్ షా మెహతా ,మహాదేవ గోవింద రానడే,సురేంద్రనాధ బెనర్జీ ,సుబ్రహ్మణ్య అయ్యర్ ల సరసన చేరాడు చింతామణి .ప్రభుత్వం ‘’సర్ ‘’బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది.
10-4- 1880 లో జన్మించి,1-7- 1941లో 62ఏళ్ళ వయసులో మరణించిన సి. వై. చింతామణి ‘’పోప్ఆఫ్ ఇండియన్ జర్నలిజం ‘’గా సుప్రసిద్ధుడు .ఇండియన్ హెరాల్డ్ ,స్టాండర్డ్ పత్రికల వ్యవస్థాపకుడు . 10వ ఏటనే వివాహమైంది .తన అనారోగ్యం ,తల్లి మరణం వలన ఎఫ్ .ఎ .పరీక్ష పాస్ కాలేదు .కానీ అసాధారణ ఆంగ్లపా౦డిత్యాన్ని సంపాదించాడు ,స్వయం కృషితో వైదుష్యం సాధించాడు .మొదట్లో ‘’తెలుగు హార్స్ ‘’పత్రికకు సంపాదకుడు .ఆయన వ్యాసాలు ‘’వైజాగ్ స్పెక్టేటర్’’ వారపత్రిక పత్రికలో అచ్చు అయ్యేవి .18వ ఏటనే ఆపత్రికకు ఎడిటర్ అయ్యాడు .అప్పటికి ఆయననెలజీతం 30రూపాయలు .కళ్ళు తిరిగే పెద్ద జీతం .మూడు వందలరూపాయలకు ఆపత్రికను కొని స్పెక్టేటర్’ పత్రికను విజయనగరానికి తెచ్చాడు .తర్వాత ఆపత్రిక పేరును ‘’ఇండియన్ హెరాల్డ్ ‘’గా మార్చాడు .’’నేను సంపాదకుడినేకాదు,ఫోర్మన్ ,ప్రూఫ్ రీడర్ ,విలేకరి, ఉప సంపాదకుడు ,,యజమాని అన్నీ నేనే’’ ,అని చెప్పుకొనేవాడు .పత్రిక బాగాక్లిక్ అయినా, ఆర్ధిక ఇబ్బందులవలన రెండేళ్లకే మూసేశాడు .భార్యకూడా చనిపోయింది .
మద్రాస్ వెళ్ళి యునైటెడ్ ఇండియా వారపత్రిక ,మద్రాస్ స్టాండర్డ్ దిన పత్రిక లలో పనిచేసి ,1903లో అలహాబాద్ లో నాగే౦ద్ర నాధ గుప్తా ప్రారంభించిన ‘’ఇండియన్ పీపుల్ ‘’పత్రికకు సంపాదకుడయ్యాడు .ఈపత్రిక తర్వాత ‘’లీడర్ ‘’పత్రికలో విలీనమైంది .ఇది లిబరల్ పత్రిక అయినా,అన్ని రాజకీయ పక్షాలవారికీ అభిమాన పత్రిక అయింది .చింతామణి నిష్పక్షపాత విమర్శకుడు గా పేరుపొందాడు .ఆయన సంపాదకీయాలు కరదీపికలుగా జనం భావించేవారు .20 ఏళ్ళ వయసులో లాహోర్ కాంగ్రెస్ కు వెళ్ళి ,ఉపన్యాసాలతోకిర్రెక్కించి పెద్దలమనసు ఆకర్షించాడు .ఆయనవ్యాసాలు హిందూ పత్రికలో ప్రచురితమయ్యేవి .
1916 ,1927లలో రెండు సార్లు ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడయ్యాడు .1921-23మధ్య నేటి ఉత్తరప్రదేశ్ ,అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ కు విద్య ,పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు .1930-31లో లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ప్రతినిధిగా హాజరయ్యాడు .బ్రిటీష్ ప్రభుత్వం1939లో ‘’సర్’’బిరుదు ఇచ్చి సత్కరిస్తే ,బెనారస్ యూని వర్సిటి గౌరవ డాక్టరేట్ ను ,అలహాబాద్ విశ్వవిద్యాలయం డి.లిట్ .అందించి గౌరవించాయి .నిష్పక్షపాత విమర్శలకు అకు౦ఠిత దేశభక్తికి .అసామాన్య సంపాదకత్వానికి ,అనితరసాధ్య వక్త్రుత్వానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి .
ఆధారం –శ్రీ అవటపల్లి నారాయణరావు గారు రచించిన ‘’విశాలాంధ్రము ‘’పుస్తకం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-3-24-ఉయ్యూరు .

