98 గట్టి ‘’కవితా పర’’పిల్ల వేర్లతో, దృఢమైన ‘’తల్లి వేరు ‘’తో అక్షర ఫలాలపంటతో హోసూరు బస్తీ యువక సంఘ సాహితీ క్షేత్రం వెలువరించిన శ్రీ క్రోధి ఉగాది కవితా సంకలనం .
హోసూరు బస్తీ యువక బృందం అధ్యక్షులు డా అగరం వసంత్ ప్రతి ఏడాది లాగానే ఈ ఏడూ శ్రీ క్రోధి ఉగాదికి దేశంలోని వివిధ ప్రాంతాల 98 తెలుగుకవుల చే కవితలు వ్రాయించి ‘’తల్లివేరు ‘’శీర్షికతో అర్ధవంతమైన ముఖచిత్రంతో వెలువరించి నాకు పంపగా ఇవాళే చేరి , చదివి అందులోని కవితాత్మను మీకు పరిచయం చేస్తున్నాను .ఇందులో లబ్ధ ప్రతిష్టులూ ఉన్నారు వర్ధిష్ణులూ ఉన్నారు .అందరికి అభినందనలు ,ఉగాది శుభాకాంక్షలు .
‘’అమ్మ చీర సి౦గులుపట్టినడిచిన ఇల్లు –నాన్న అడుగుల్ని అనుసరించి నేర్చిన ప్రకృతి పాఠం –ఎంతిష్టమో –బాల్యపు మడుగులో మునకేసి –జ్ఞాపకాల తామర్లను తడవటమంటే ‘’అంతిష్టం .వలసపోయినకోయిల –వసంతంలో తిరిగొచ్చినట్టు –ఉనికిని ఉగాది తోరణ౦ లా –ఊరి గుమ్మానికి కట్టాలి ‘’అని మురిశాడు కరీం నగర్ దామరకుంట శంకరయ్య .’’సదాచారాలు సంప్రదాయాలు అడుగంటి పోయిన ఆధునికత’’ను చూసి నిట్టూర్చాడు పాలకొల్లు హేమ౦త సింగ్ .’’ఆకర్షణల అగడ్తల-అనకొండ నగరపు కౌగిలిలో –ప్రేమను శాసిస్తూ –జోలెలో వేసుకున్నవి ఎక్కువా ? విడిచేస్తున్నవి ఎక్కువా “”తేల్చుకోలేకపోతున్నాడు శ్రీనివాస గౌడ్ . ‘’గడచిన కాలం లో తచ్చాడి –పాదముద్రలైనా కరిగిపోకుండా –జ్ఞాపకంగా బంధించాలని చిన్న ఆశ’’ చలపాక ప్రకాష్ ది. ‘’ఓటు ఆయుధంగా- మలచు నీవోటు శరాఘాతంగా –అధర్మ యుద్ధ౦ పై దండెత్తే వోటరు ‘’ను పరశురాముడిని చేశాడు అనుసూరి రాము .’’ఒక్క పిలుపు -ఇంతదగ్గర తనమా ?అని ఆశ్చర్యపోయి మళ్లీ మళ్లీ వినిపిస్తూ తలస్తు ‘’న్న బులుసు సరోజినిది ‘’చిరులేస్తూనే ఉన్న వలపు పూల సంకెల ?’’హరిత విప్ల పితామహుడు స్వామినాధన్ ‘’కు రెడ్ కార్పెట్ వెల్కం పలికాడు ఆకుల రఘురామయ్య .’’నీ నడక ,నడవడిక –నీ జీవిత సోపానాలు ‘’అన్నాడు అనుభావసారంతో అగరం వసంత్ .’’నోరుంటేనే ప్రభుత్వ సాయం-ఏటిలో నావ అవుతుంది –లేకపోతె వరికుప్పల్లో కూరుకుపోయి –అప్పుల తాడు మెడకు ఉరి అవుతుంది ‘’అని రైతు జీవిత సత్యం బయట పెట్టాడు ఎస్ ఆర్ పృథ్వి .’’పసిపిల్లల కంటి భాషద్వారా దైవంతో సంభాషించ వచ్చు-మహనీయుల చూపు కాంతి తో మహత్తర దృశ్యాలు చూడవచ్చు ‘’అన్న ధర్మ సూక్ష్మం చెప్పాడు బొగ్గవరపు రాధాకృష్ణమూర్తి .’’భూగోళం బద్దలవకముందే –కాలుష్యాన్ని నివారించాలని ‘’నెత్తీ నోరూ మొత్తుకున్నది వివివి కామేశ్వరి . –
‘’గుల్లబారిన జీవితాన్ని పద్యం చేసిన టెక్కీ ఎవరోకానీ –పచ్చి వాక్యాల్లో రూపాయి పడి మనిషి కూలిన నొప్పి ‘’అనుభవించి ‘’ఒక యుద్ధం లో అందరికన్నా ముందు గాయపడేది కవిత్వమే –పుండు పడిన సగం దీహంతో –ఎవరీ పాప ?’’అని ప్రశ్నించి ‘’మృతనగర వీధుల్లో- రక్తనదై పారుతోంది’’ఎంతకడిగినా నెత్తురు మరక పోవట్లేదని వ్యధ చెందాడు లండా సాంబమూర్తి .ఆరాధనతోనో ,అవసరాలకో ‘’వీధుల్లో నిలబెట్టే రాతిబోమ్మలు –పిడికెడు ప్రాణవాయువునిస్తాయా ?చిటికెడు చల్లదనాన్నిస్తాయా “’అని ప్రశ్నించాడు ఆలూరు మండలం పెదపళ్ళ గొడవర్తి శ్రీనివాసు . పోష్ పెళ్ళిళ్ళ ఊష్ సాంప్రదాయం లో ‘’తలంబ్రాల వేడుకలో ఆయుక్షీణ ప్రతీకలు –ఊదుకొనే రంగుల చమ్కీలు ‘’బిర్యానీ,మాంసం ముక్కలు భరించలేక –బొబ్బట్లు పప్పన్నం కోసం పాకులాట ‘’స్టేజిపై మిగిలేది నలుగురే ‘’అని ఈసడించాడు హైదరాబాద్ చందన కాశీపురం.పోయినవాడి నేత్రాలు ‘’ తిమిరం పై సమరం సాగించి –కదిలి కదిలించి –మధ్య దూరాన్ని విదిలి౦చేవిగా కనిపించాయి విశాఖ గోవర్ధనరావు కు .గుంటూరు పెనుమాక నాగేశ్వరావు కు ‘’నాగరీకం పేరుతొ నగ్నత్వం అనాగరిక నాట్యం చేస్తున్నట్లు ‘’అనిపించింది .నిర్మల్ ఎర్రోజు వెంకటేశ్వర్లు కు ‘’సమాజానికి వెన్నెముకలైనతన విద్యార్ధుల్ని చూసి ‘’కాలర్ ఎగరేసే అల్ప సంతోషి అయ్యాడు .’’శరీరానికి వ్యాయామ మిచ్చే ఆటలు –అటకెక్కాయని ,చైతన్యం సమసిపోయి సంతోషందూరమైపోయిందిబెంగళూరు పెనుగొండ రామ బ్రహ్మానికి . నామవాచకాల గుట్టుమట్టులు తెలీక తలపట్టుకొంది కరీం నగర్ పెనుగొండ సరసిజ .రేపటి పౌరుని బతుకు –వెలుతురు లిఖించిన చీకటి చిత్రం చీరాల వడలి రాధాకృష్ణకు .తిరుపతి డాక్టర్ మౌని ‘’నేల పచ్చగిల్లాలని –ప్రకృతి పరవశించాలని –జనజీవన జగతి సౌందర్యం –సమతుల్యం కావాలని ‘’ఏడు కొండలంత గొప్ప ఆశ .’’ఉప్పెనలు ఉపద్రవాలకు కారణమైన –మనమేగా సమిధలు ‘’అన్నది ఎరుకతో బెంగళూరు డా .రాజేశ్వరి రాణి .
‘’వ్యవసాయం అనే వ్యసనానికి బలై ,తాకట్టుపెట్టిన ఆలి తాళి సాక్షిగా –పురుగులమందు మత్తులో మునిగిపోయి –ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసు కొనే వాడు ‘’గా కనిపించాడు భూమిని నమ్మిన రైతు పార్వతీపురం పల్లరోహిణీ కుమార్ కు . బెంగుళూరు ఆచంట హైమవతి’’వేదాంతి వై వివేకం పొంది శాంతించు ‘’అని శాంతి వచనాలు పలికింది .తనపోలం నీటిలో సూరీడు –‘’ వ్యోమగానిలా మారుస్తాడు ,చీడపీడల్ని ఏమార్చి ,కష్టాన్నిమరపించి –పంట ఎదుగుదలకు ఆధారమై –పొలమంతా విస్తరిస్తాడు ‘’చిత్తూరు బడబాగ్ని శంకర రాజుకు .’’మాండలికాలు ఎటు పోతాయో యేమౌతాయో’’అని శొంఠి వేంకట రమణమ్మ ఆవేదన చెందింది .’’కాలం ఒక్కో సంవత్సరం ఒక్కో తంత్రిగా ‘’కనిపించింది అనిపించింది విశాఖ విశాలాక్షికి .’’ఇసుక తుఫాను ఉవ్వెత్తున లేస్తుంటే –బాటసారి ఇసుకపరిహాసం విసిరి ,-కోడి తల్లి డేగ నెత్తుటి కళ్ళను తిప్పికొట్టినట్లు –రెండు కళ్ళను కత్తులు చేసి రక్షించుకొంటు౦ది –ముక్కు సూటి విలుకాడౌతుంది –అలాగే మెదడు ఒరల్లో భద్రం చెయ్యటానికి –కవిత్వం తనను తాను నూరు కొంటుంది ‘’అంటూ కొత్తగొంతుకతో చెప్పాడు కరీం నగర్ బూర్ల వెంకటేశ్వర్లు .కరీంనగర్ డా వైరాగ్యం ప్రభాకర్ ‘’కర్మలలో అంకితభావం –కలగాల్సిన రూపం వెజ్జు –కలుపు మొక్కలు పెరిగినా –తులసి వనం పరిమళం తరగదు –ఆగిపోదు సంజీవనుల సేవపరాయణత్వం ‘’అని వైద్య వృత్తికి కైమోడ్పు ఘటించాడు . ‘’కనువిప్పు ,ఓర్పు ,కూర్పు ‘’వస్తే దేశ పౌరులలో మార్పు తధ్యం ‘’అనిపించింది బెంగళూరు డా.మారుతీ దేవికి .‘’ఇప్పుడు నిర్లిప్తత కూడా ఒక కళే-కళ్ళను కాళ్ళను మొలిపించుకొని –చూడకుండా వెళ్ళిపోవటం కూడా ఆత్మ రక్షణే ‘’అని ,వీళ్ళు ‘’ కొత్త లోకులు’’అని పరిహసించాడు లేదాళ్ళరాజేశ్వరావు .’’వాదనకంటే ఆచరణ ,దూరం కంటే దగ్గర ,సుఖం కంటే బాధ ,భావం కంటే భక్తీ ‘’గొప్ప అనిపించాయి పెద్దపల్లి గుండు వేంకట రమణకు .
‘’రాత్రి వాన జల్లుల్లో తలంటు పోసుకొన్నచెట్టు ,తెల్లారి-గోరు వెచ్చని సూర్యుడి కిరణాలతో గోర్ల కొట్టుకొంటో౦ది – ఆకాశం దుబుక్కున దుమికిన వానచినుకులు –చేదబావిలో ఇరుక్కుపోయిన చెలిమ నీటి బ౦దీలు -బొక్కెన ఎక్కి విడతల వారీగా విడుదల ఔతున్నాయి –బిందెలో దూరి కన్నెపిల్ల చంకనెక్కిన కొంటె నీళ్ళు –దారిపొడువునా నాజూకు నడుముని తడుముతున్నాయి – డ్రమ్ములోనిద్దరోతున్న మంచినీళ్ళు పెండ గోలెం లో కలవగానే-మగ్గు నోట్లోంచి జలపాతమై వాకిలంతా పరచుకొన్నాయి-కాలం కలిసొచ్చి నిండుగా నిండిన చెరువులో నీళ్ళు –చేపపిల్లలను చంకనేసుకొని మత్తడిదూకుతున్నాయి-గట్ల వెంట చెట్లను పలకరిస్తూ ప్రవహించే నది – కడుపులో దాచుకున్న రాతిగుండెల తలలు నిమురుతోంది –పూజారితో కలిసి గుట్టమీద గుళ్ళోకి చేరిన నీరు –దేవుడికి అభ్యంగన స్నాన౦ చేయించి అవతారం చాలించింది –చిక్కటి పాలల్లో కలిసి పలుచన చేసిన నీళ్ళు –ఆసామికి కాసులిచ్చినా- బర్రెను మాత్రం బద్నాం చేసినాయ్ –అయ్య పెట్టిన గోసకు అమ్మ కళ్ళల్లో చేరి పొంగిన నీరు –చీరకొంగున ‘’చేరి బొడ్లో దూరి భోరున ఏడ్చేసింది’’ఇదీ ‘’జలదృశ్యం ‘’ .కవితలో కరీం నగర్ పెనుగొండ బసవేశ్వర్ కళ్ళకు కట్టించిన చిత్రం . కాదు కాదు జలోపనిషత్ .కవిత్వం అంటే ఇలా ఉండాలి .నేను ఒక్క లైను కూడా వదలిపెట్టకుండా మీ ముందు ఉంచాను .నేటివిటి అంటే ఇదీ .ప్రతి పదం లో కవిత్వం చి౦దులేసింది .పల్లెసీమ సినిమాలో జాలాది రాసిన ‘’సూరట్టుకు రాలుతుంది సిటుక్కు సిటుక్కు వాన సినుకు’’పాట జ్ఞాపకం వచ్చింది .అక్షరలక్షలు చేసే అరుదైన కవిత్వం .సంకలనానికే బరువూ బంగారు వన్నె తెచ్చిన కవిత్వం .హాట్స్ ఆఫ్ బసవేశ్వర్ .కీపిట్ అప్ .ప్రౌడ్ ఆఫ్ యు .
‘’పండుటాకు బతుకు లిపుడు పండని గోరింటాకులేనా ‘’అనిపించాయి సత్తుపల్లి బత్తిన గీతాకుమారికి .’’శరీరమంతా వివక్ష సబ్బు రాసుకొని-స్నానం చేస్తే మాత్రం కులం కంపు పోతుందా ?’’ఆత్మవంచన మనస్తత్వం ఉన్నవారికి –మానవ కళ్యాణం అంటే తెలుస్తుందా ‘’?అని కరీం నగర్ నుంచి నేరువట్ల చైతన్య సూటి ప్రశ్న .’’మనిషి తెలివి అభి వృద్ధికో ,వినాశాననికో తెలీక ‘’జుట్టు పీక్కోన్నది శ్రీకాకుళం మాధవి దేవీ తనయ .కొండంత అండ కొడుకు వృద్ధాశ్రమానికి దారి తీయిస్తే ‘’తట్టుకోలేకపోయాడు కర్నూలు సయ్యద్ జహీర్ హుస్సేన్ .కరీం నగర్ గజే౦దర్ రెడ్డికి ‘’లాలి పాడుతూఅమ్మ లాల పోసిన భాష –జోలపాడుతూ నాన్న జోకోట్టిన భాష ‘’మన తెలుగు అనిపించింది .నిన్నా మొన్నటి దాకా కొరకొర చూసుకున్నోల్లు –ఓటు జాతర లో ఒక్కటై పోతారు ‘’అనే నగ్న సత్యం బుర్రకు పదును పెట్టమని చెప్పాడు కరీంనగర్ బుర్రా తిరుపతి .కాలం ప్రత్యక్షమయ్యే దాకా –అర చేతి నిండా ఆశని ఒడిసి పట్టు ‘’అని హితోపదేశం పలికాడు కరీం నగర్ గుడికందుల అరుణ్.కరీం నగర్ సివి కుమార్ కు ‘’మరణం ఒక సాధారణ నిత్య నేర కృత్యం ‘’అనిపించి ,’’రెప్పపాటు లో మనిషిని మింగే వాసుకి సర్పంలా తోచి ,ఏదేశం లోనైన చావులు సామాజిక హత్యలే అని నిర్ధారించాడు .’’దుహిత అం టే ఆ యింట్లో ఒకసారి ఈ ఇంట్లో ఒకసారి పుట్టేది ‘’కనుక తనకు ఫాదర్స్ డే వద్దంది .’’డే ఫ్రీ బిడ్డకు అమ్మ నౌతాను ‘’అని తండ్రికి దబాయించి చెప్పి అమ్మాయిని మనముందు ఉంచాడు పలమనేరు జొన్నవిత్తుల శ్రీరామ చంద్ర మూర్తి .చెన్నాపట్నం కుళాయిలలో నీళ్ళు రాకపోతే –జరిగిన విధ్వంసం తెలిసి ‘’చెన్నై ఉప్పలధడియం వెంకటేశ్వర ‘’పొలోమని –చెట్లని పక్షుల్నీ వెతికి తేవటానికి బయల్దేరాడు .’’జనని ఇచ్చిన జీవితాన్ని –తాను మురిసేలా ధన్యం కావించు’’అంటూ మాతృత్వపు మమతతో చెప్పింది హైదరాబాద్ వి రాజేశ్వరి .’’ఒకప్పుడు ఊరి చెరువంతా కలువల సౌందర్యం –యే వ్యాపారి తెచ్చాడో ఇప్పుడు ఆపదార్ధం – చెత్త ,చెరువుతో స్నేహం చేసి ఊరికి తెగులొచ్చింది –కంపు, రోత –అప్పటి చెరువు –ఇప్పటి అచ్చెరువు ‘’అని పించింది హైదరాబాద్ రాయప్రోలు వేంకట రమణ శాస్త్రికి .
‘’చూపు పయనిస్తే –నయనం దృశ్యమౌతుంది –మేఘాలు నీటి రథాలై పరి గెట్టితేనే పుడమి తల్లి పులకిస్తుంది –ప్రయాణం దూరాల్ని దరి చేర్చి కుట్టేదారం –నిన్ను నువ్వు తెలుసుకోవటమే అది‘’ అని కమ్మగా చెప్పాడు హైదరాబాద్ పిన్నం శెట్టి కిషన్ .’’అందరికి ఆనందాన్నిపంచిపెట్టే –ఆకాశ జాణ’’వర్షం అన్నాడు జాణతనంతో కడప ప్రతాపరెడ్డి .తనను ఒంటరి చేసి కనుమరుగైన నేస్తాన్ని ‘’హోసూరు చంద్ర శేఖర్ గుర్తుకు తెచ్చుకొన్నాడు .నేటి సన్మానాలు ‘’ఫోటో షూట్ నిమాయిష్ ‘’అనిపించాయి యదార్ధం తెలుసుకొన్న కరీంనగర్ ఇటిక్యాల రాము కు .’’జీవిత సారాన్ని ప్రతిబింబించే నవ వసంత ఉగాదికి ‘’చిత్తూరు జిల్లా షంషీర్ ఖాన్ స్వాగతించాడు .దంపతులు అనుక్షణం ఆత్మప్రక్షాళన చేసుకోవాలని దా౦పత్యోప నిషత్ చెప్పాడు పలమనేరు బాలాజీ .’’కమ్ముకొచ్చే మబ్బులు కదలకుండా నిలవలేవు-పలకరించే కలతలన్నీ –పట్టుకొని వేలాడబోవు ‘’అని ధైర్య ‘’పన్నం ‘’చదివాడు డా ఈశ్వర రెడ్ది .సుంకోజు దేవేంద్రా చారికి’’అవసరం అభ్యర్ధనై –ఇద్దరిమధ్య కొలువు దీరితే –మాటలు ములుకులై –చూపులు ముల్లులై –నవ్వులు ఎగతాళై-హద్దులు ఆవిర్భవిస్తాయి’’అన్న జీవిత సత్యం సాక్షాత్కరించింది .ఆనాటి నుంచీ నేటి దాకా వనిత,వివక్ష అవహేళన కు గురౌతున్నా –ఇవాళ మణిపూర్ –మహిళను నగ్నంగా ఊరేగి౦చినా –ధర్మ౦ నాలుగుపాదాలా నడుస్తోంది ‘’అని ఘాటుగా బాధగా అవమానంతో కళ్ళ నీరు కుక్కుకొంటూ అలనాటి కౌరవ సభలో వికర్ణుడి లా ధర్మ ప్రశ్న సంధించాడు కరీంనగర్ రవీంద్ర .’’ప్రతి శకలం ఒక జాతి అనిమురిసిపోతూ ,భ్రమసిపోతూ రొమ్ము గుద్దుకొనే దేశాన్ని చూసి జాలిపడ్డాడు డి. కుమారస్వామి రెడ్ది . ‘’నైతిక విలువల నిఘంటువు- సామాజిక వేదికలపై రచ్చ గామారిందని –ఆవిష్కరణలలోపదు నెక్కాల్సిన మేధస్సు –గూగుల్ సెర్చ్ లలో ఘనీ భవిస్తోందని-టెక్నాలజీ దర్పణం లోమనల్ని మనం చూసుకొని రొమ్ము విరుచుకొంటున్న –మనిషి పతనమౌతున్నాడు ‘’అని పించింది వరంగల్ శ్రీధర్ కొమ్మోజు ధర్మ విడురుడికి .’’అరక సువర్ణ లేఖిని –పల్లె నవమోహిని -ఉప్పొంగే జలపాతం రసోత్పత్తి –సుమదళమే కాగితం’’అని రసోవై సః గా మమైకమయ్యాడుభావుక మంకు శ్రీను .అమ్మ ధరణిని వెలసిన దేవత ‘’అని ఉప్పొంగి పోయాడు హసన్ పర్తి డా.టి రంగస్వామి .’’మనిషిని మించినదేదో ఈ విశ్వానికి అవసరమైంది –‘’కనుక గ్లోబుపై కాసిని చనుబాలు చల్లండి ‘’అని తత్వోపదేశం చేశాడు హైదరాబాద్ దేశరాజు .ఖమ్మం జిల్లా పురిమళ్ళ సునందకు ‘’అడవి నుంచి అంతరిక్షందాకా ప్రయాణం అంటే –అనంత జ్ఞానం సొంతం చేసుకోవటం ‘’అని ఎరుక వచ్చింది .’’మనసు పొరల్లో ఊరే నీరసాన్ని నిర్మూలించుకొని –దేశభక్తులమై’’మరణించి మళ్లీ బతికొద్దాం అనే ఆశ విలాసాగారం రవీంద్రది . ‘’మన వీట తెలుగు పూలు పూయి౦చరా ‘’అని వేడికోలు బెంగళూరు గడ్డం దేవి శ్రీ ప్రసాద్ ది .’’కవిత్వం సమాజాన్ని తట్టిలేపి సర్వ సమానత్వాన్ని చాటి –మువ్వన్నెల జండా లా తల ఎగరేస్తుంది ‘’అని ఉప్పొంగి పోయాడు గణపవరం డాక్టర్ యండవల్లి పాండురంగ .’’నాకు ఒకజాతి జెండాకున్నంతపౌరుషం ఉంది ‘’అన్న గుంటూరు శేషేంద్ర గుర్తుకొచ్చాడు . ఇవికాక మోడీ ,అయోధ్య లపై కవితలున్నాయి .
మంచి ప్రయత్నం .తెలుగోడు ఏడ ఉన్నా వసంత్ కోరికకు స్పందించి అందించిన కవితా పుష్పాలు ఇవి తెలుగుతల్లి కి ఉగాది పుష్పహారం .అందరికి మరోమారు అభినందనలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-3-24-ఉయ్యూరు

