వేకువ పుష్పం ,వెలుతురు చూడని ఎన్నియలు డా.సుజాత కవితా,కథా సవ్యసాచిత్వ ప్రతీకలు
సుమారు అయిదారు రోజుల క్రితం నాకు పై రెండు పుస్తకాలు పోస్ట్ లో వచ్చాయి. సుజాత గారెవరో నాకు తెలీదు.పుస్తకాలు అందాయని ఫోన్ చేసి, నేనెలా తెలుసు అని అడిగితె డా .శ్రీరంగస్వామిగారు చెప్పగా పంపానన్నారు .అంతకు ముందు రెండు రోజులకు ముందు హసన్పర్తి రంగస్వామిగారు ఫోన్ చేసి తనవీ మరొకరివి పుస్తకాలు నాకు పంపుతున్నామన్నారు .ఆయన నాకు ‘’పాతకాపే’’ . ఆయన పుస్తకాలు ఇంత వరకు అందకపోవటం కొసమెరుపు .ఇవాళే పై రెండు పుస్తకాలు చదివా .నా స్పందన తెలియ జేస్తున్నా .డా. బండారి సుజాత ములుగు గ్రామస్తులు .పబ్లిక్ అడ్మినిష్ట్రే ష న్ లో ఎం .ఎ ,తెలుగు ఎం .ఎ,బి ఎడ్ .చేసిన విదుషీమణి .తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పని చేసి రిటైర్ అయ్యారు .సత్యవతి నవలలు-స్త్రీ జీవిత సంవేదనలు పై సిద్ధాంత వ్యాసం రాసి పిహెచ్ డి పొందారు .అనేక పురస్కారాలు పొందారు .బహు వేదికలపై తమ అభిప్రాయ ప్రకటనలు చేశారు .
1-వేకువ పుష్పం –కవితా సంపుటి
83 కవితలున్న ఈపుస్తకం లో మొదటికవిత –‘’విముక్తి ‘’-అమ్మ ఉదరం లో ఆడపిల్ల ఉన్నదని తెలియగానే-కట్నాలు కన్నీళ్లు తోడవుతాయని-అయ్య చేతిలో పెట్టినా –ఆగమాగమౌతామవటం తప్పదని –‘’దశమ గ్రహానికి చచ్చే వరకు దండోరా వేయకతప్పదని –నివురు కప్పిన నిప్పులాంటి మగవాడి నుంచి ‘’విముక్తి ‘’ఎన్నడో అని ప్రశ్నించారు .మానోధైర్యమే ఆలంబన గా సాగాలని హితవు చెప్పారు .సమన్యాయమిస్తే సమస్యలు పరిష్కారమౌతాయన్నారు .భావి విజ్ఞులు –పరచిన పండు వెన్నెలలో –పరవశమౌ సిరిమల్లెలు ‘’అన్నారు అందంగా .రాజీలతో రంజిల్లె కుటుంబాలే రాణిస్తాయని ఆమె ఉద్దేశ్యం .బ్రహ్మ చేసిన బొమ్మ అని భ్రమ తొలగించుకొని తెగిన గాలిపటం కాకుండా –‘’జీవితం చక్క దిద్దుకోవాలని సూచన చేశారు .మానవీయ విలువల నందించే మనుషులుగా నిలిపే మదికి ‘’చిరునామా ‘’కావాలి జనం . స్త్రీ అభ్యుదయ వ్యోమగామి అని కితాబిచ్చారు .కపట మిత్ర వారసులు –తేనె పూసిన కత్తికన్నా మిన్న ‘’కనుక జర భద్రం అన్నారు.తాను ఆకుపచ్చని ,అగ్నికి ఆహుతయ్యే నేస్తాన్నని భరోసా ఇచ్చారు ,
ఒంటి కోర్కేలమ్మ రొ౦టికి ఓర్పదు’’ అన్నదాన్ని దూరం చేసి ఐకమత్యాల సుమధురులం అవ్వాలి అని ఆశించారు .బతుకు ఆలంబన నిలువెత్తు నిజాయితీ .పోరాటమే న్యాయం .ఆతిధ్యమిచ్చే భారతీయ సంస్కారం మనది –జనగణమన జగతిలో నించి చైతన్యం పెంచాలి .బతుకు బందీలైన బహుజన స్త్రీల మనో వేదనకు అక్షర మణులు కూర్చారు .ప్రపంచ వారసత్వ సంపదగా తమ ములుగు దగ్గరున్న రామప్ప దేవాలయాన్ని పరిచయం చేశారు .కుటుంబలో అందరికి’’ ఎనగర్ర ‘’నాన్న వాక్యం అద్భుతం .వర్ణమాలతో వరం అందించారు .’’నిన్నటికి నీరాజనమిచ్చి –బతుకు పయనం కొనసాగించాలని –ఊతమందిస్తున్న రవికిరణాలు – కవయిత్రికి –వేకువ పుష్పాలుగా భాసి౦ చాయి.ఇదే కవితా సంపుటికి శీర్షిక కూడా .ఇలా వైవిధ్య కవితలతో సంపుటి కళకళ లాడింది .
వెలుతురు చూడని ఎన్నియలు –కథా సంపుటి .ఇందులోనికతలు బహు బహుమతులదుకున్నవే .
30 కథల మందారమాల ఇది.
జగతికి వెలుగు అమ్మ మొదటి కథ తల్లిపాల సౌభాగ్యం తెలిపేది .అందరికి మంచిమార్గం చూపించే లాస్య కత .కలిసి అడుగేస్తే అందరి కలలకూ,కళ్ళకూ వెలుగే .పెద్దమనసుతో చిన్నవారిని ఆశీర్వదించి అక్కున చేర్చుకోవటం కుటుంబ ఆనంద హేతువు ‘’ఊహించని మలుపు’’.మట్టినమూనా సేకరించి తగినపంటవేసి నేలలో బంగారం పండించే విషయమే ‘’కర్ష కుని వెతలు కత .పెద్ద ఉద్యోగాలు చేస్తూ ,తమ సంపాదనతో కుటుంబాలు గడుపుకొంటూ మాటపట్టి౦పుతో ,క్షణికావేశంతో బతుకులను బలి చేసుకొనే వారిని ఆప్యాయంగా ఆహ్వానించి పెద్దరికం నిల్పుకొనే అరిటాకు కథ.
తనబాధ్యత తెలిసి తెల్లవారు ఝామునే లేచి అందరికి అన్నీ చిలిపి సరదాలతో అందిస్తూ జీవితాన్ని మూడు పగళ్ళు ఆరు రాత్రులు గా తీర్చి దిద్దుకొంటున్న కోడల్ని చూసి మురిసిపోయిన అత్తమ్మ వర్ధనమ్మ మంచి అత్తాకోడళ్ళు .ట్రంకు పెట్టె లోని బట్టల ఆత్మ ఘోష ‘’వెలుతురు చూడని ఎన్నియలు ‘’ఇదే సంపుటి శీర్షికకూడా .ఎందరెందరో గురువుల శ్రమ ఫలితాలే సమాజ సరిగమలు ‘’అని గురుభ్యో ౦ నమః .ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్చే ప్రయత్నమే ‘’ఊరికి పోదాం ‘’ఆదర్శానికి ఊతం .సైబర్ నేరగాథ కనువిప్పు కల్పించే కత .’’బస్తీకి పోవొద్దు రో డింగరీ డాంబికాలు పలకొద్దురో ‘’ ‘ ‘’అనే పాత సినిమా పాటకు కథనమే పల్లె బడి.అడవి జంతువులే స్వార్ధం పక్కకు పెట్టి తామే అడవిని కాపాడుకొందామని ‘’తీర్మాని౦చు కొంటే ,మనిషి మృగాలకేమొచ్చింది ?అనే ప్రశ్నఅందర్నీ ఆలోచింప జేస్తుంది .ఆశించని ఫలితంతో అనాధలను ,దివ్యా౦గులను, ఒంటరి వాళ్లకు ధైర్యం చెప్పి అందరి అవసరాలు తీరుస్తూ ముందుకు వెడుతున్న ‘’అమ్మ ఫౌండేషన్ ‘’సేవా వృత్తాంతం తో సంపుటి సమాప్తం .
సుజాతగారు టీచర్ అవటంతో ,ప్రజా సంబంధ విషయాలో నిష్ణాతులవటం ,సామాజిక బాధ్యత ప్రతి కవితలో, కథలో స్పష్టంగా కనిపిస్తుంది .నేర్వటం నేర్పించటం కు పట్టం కట్టాయి అన్నీ .ఎక్కడా కృత్రిమత లేదు. అత్యంత సహజ సుందరాలు .తెచ్చిపెట్టుకున్నట్లు ఉండదు .పాతతరం వ్వ అమ్మమ్మా గోరుముద్దలు తినిపిస్తూ కతలు చెబుతున్నట్లున్నాయి .ఫీలింగ్ కు ప్రాధాన్యం ఉంది .సహవేదన, సానుభూతి నిండిన విషయాలే .ఆమెను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను .ప్రకృతికి కైమోడ్పు గా మంచి ముఖచిత్రాలు ఉండటం పుస్తక శోభను ద్విగుణీకృతం చేశాయి . ’’ములుగు ‘’నుంచి గొప్ప’’ వెలుగు’’ప్రసారం చేసిన౦దుకు ఈ క్రోధి ఉగాది సందర్భంగా శుభా కాంక్షలతో డా.సుజాత గార్ని ,కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-4-24 –ఉయ్యూరు

