తులనాత్మక భాషా శాస్త్ర బోధకులు ,తిరునాయి మొరి అనువాదకులు ,నిఘంటు చరిత్ర ,ప్రాకృత భాషోత్పత్తి ,సత్యవతి శతకకర్త ,షేక్స్పియర్ నాటకాలను సంస్కృత వచనాను వాదం చేసిన –శ్రీ మేడేపల్లి వేంకట రమణాచార్యులు .
గోల్కొండ వ్యాపారి బ్రాహ్మణులైన శ్రీ మేడేపల్లి వేంకట రమణాచార్యులు1862-లో జన్మించి 1943 లో 82వ ఏట మరణించారు .వైష్ణవమత నిష్ణాతులు .తాతగారు రామాచార్యులు పండిత కవి ,వైష్ణవ ప్రపత్తి ప్రవణులు .ఊరట్ల జమీన్దారులైన సాగి వారి ఆస్థాన పండితులు .కుమారుడు రఘురామ దాసు .వీరికుమారుడే మనకవి గారు అనకాపల్లిలో జన్మించారు .ఉద్యోగం రీత్యా తండ్రి విజయనగరం కి చేరారు .రమణాచార్యులు తండ్రి వద్ద పంచ కావ్యాలు నేర్చారు .మహారాజా హై స్కూల్ లో చదివి 1877లో మెట్రిక్ పాసై ,కూరెళ్ళ సూర్య నారాయణ శాస్త్రి గారి వద్ద ‘’సిద్ధాంత కౌముది ‘’,కాళికా వృత్తీ ‘’,’’తర్క ప్రకరణ ‘’నేర్చి మహా సంస్కృత విద్వాంసు లయ్యారు .
ఎఫ్ ఎ చదువు సాగక రాజాగారి కాలేజిలో గుమాస్తాగా చేరినా, ‘’తపో నిష్టా సమాసాదిత సకల విద్యా తంత్రులు ‘’అయ్యారు .శ్రీమదానంద దంతీన్ద్రా స్థాన ‘’విద్వ దౌగ శిరోమణి’’ ముడు౦ బై నరసింహా చార్యుల వారిని ఆశ్రయించి ,వేదాంత విద్య ,తమ్ముడు వరాహస్వామి వద్ద ద్రావిడ ఆమ్నాయం అభ్యసించారు .1891లో కాలేజిలో సంస్కృత ఉపాధ్యాయులుగా చేరి ,1935వరకు 44 సంవత్సరాలు విద్యాదానం చేశారు .ఇంగ్లీష్ లోకూడా పట్టు ఉండటం తో విద్యార్ధులకు ‘’తులనాత్మక భాషా శాస్త్రం ‘’(కంపారటివ్ ఫైలాలజి )నికూడా సంస్కృతం తో పాటు బోధించారు .చిన్నప్పటి నుంచీ తెలుగులోనూ గొప్ప ప్రావీణ్యం ఉండేది .
ఆనంద గజపతి మహారాజు ‘’సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్ ‘’అనే మకుటంతో ఒక శతకం రాయమని ఆస్థాన విద్వాంసులను కోరగా ,మేడేపల్లి వారు రాసిన ‘’సత్యవతి శతకం ‘’అన్నిటి కన్నా మంచి పేరు తెచ్చుకొని రాజాగారి మనసును ఆకర్షించింది .నమ్మాళ్వారల సహస్ర సంఖ్యాత్మకమైన ‘’తిరువాయి మొరి’’ని అనువాదం చేశారు .వీటికి సంస్కృత శ్లోకాలు తామే కూర్చి ‘’ఆంధ్ర గీర్వాణ శట కోప సహస్రం ‘’పేరుతొ ప్రచురించారు .తెలుగు గ్రంధాలుగా ‘’దేవ వ్రత చరిత్ర ‘’,అనేది ప్రబంధ రచనగా సాగి కవితాలోకాన్ని ఆనంద పరచింది .నాలుగు వేల ద్రావిడ భాషా గాథలు ‘’నాలాయిరం ‘’ను కమ్మని తెలుగు పద్యాలలోకి అనువదించి చిరయశస్సు నార్జించారు .పార్ధ సారధి శతకం ,శ్రీకృష్ణ చరితను వచనం లో రాశారు . ,షేక్స్పియర్ నాటక కథలను సంస్కృత గద్య రచనగా చేశారు .ఆంధ్ర సేతు బంధ మహాకావ్యం రాశారు .ఆంధ్ర హర్ష చరిత్ర ,పాండురంగ మహాత్మ్య విమర్శనం,ప్రాకృత భాషోత్పత్తి ,నిఘంటు చరిత్ర ,ఆర్యభాషా విభాగం ‘’,అలంకార శాస్త్ర చరిత్ర మొదలైన రచనలు ఆచార్యులవారి సర్వతోముఖ పాండిత్యానికి దర్పణాలు .అంతేకాదు 32ఉపనిషత్ విద్యలకు తెలుగులో అత్యద్భుత వ్యాఖ్యానం రాశారు .జీవితం అంతా గ్రంథ రచన ,పఠన ప్రవృత్తి తో సార్ధకం చేసుకొన్నమహామహులు శ్రీమాన్ మేడేపల్లి వేంకట రమణాచార్యుల వారు .వారి విద్వత్తు కు శత సహస్ర వందనాలు .
ఆధారం శ్రీమాన్ మేడేపల్లి వరాహ నరసింహ స్వామి వారి రచన ,
మీ- గబ్బిట దుర్గాప్రసాద్-22-4-24-ఉయ్యూరు

