రాట్నం రాణి ‘’శ్రీమతి మైనేని బసవ పూర్ణమ్మా దేవి (వ్యాసం) -గబ్బిట దుర్గా ప్రసాద్

1909లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా చాట్ర గడ్డ గ్రామం లో బసవపూర్ణమ్మా దేవి శ్రీ కొత్తపల్లి కుటు౦బయ్య ,శ్రీమతి బుల్లెమ్మ దంపతులకు జన్మించింది .తండ్రి సేద్యం చేస్తూ వ్యాపారం సాగించే సంపన్న రైతు .అయిదవ తరగతి వరకు అక్కడి బడిలోనే చదివింది .తర్వాత ఇంట్లోనే తలిదండ్రులు గురువులచేత భారతభాగవత ,రామాయణాలు నేర్పించారు .12వ ఏట మైనేనిపాలెం వాస్తవ్యుడు మైనేని కోటయ్యగారితో వివాహం జరిగింది .

1930లో మహాత్మా గాంధి ఇచ్చిన ఉప్పు సత్యాగ్రహ నినాదం ఆంధ్రదేశం నాలుగు మూలలకు చేరింది .బసవపూర్ణమ్మ ఖద్దరు వస్త్రాలు ధరించి ,విదేశీ వస్త్ర దుకాణాలవద్ద పికేటి౦గులు నిర్వహించింది .ప్రముఖ దేశ సేవిక శ్రీమతి ప్రత్తిపాటి సాధు సీతమ్మ తో కలిసి చీరాల ,పేరాల గ్రామాలు తిరిగి ,జాతీయగీతాలు పాడుతూ విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం చేసింది .మధురమైన కంఠం తో జాతీయ గీతాలు పాడుతూ ప్రజలను ప్రభావితులను చేసింది .తర్వాత రాష్ట్రభాష హిందీ నేర్చింది .

మొదటి బాచ్ ఉప్పు సత్యాగ్రహులు జైలు శిక్ష అనుభవించి ఇంటికి తిరిగిరాగానే రెండవ బాచ్ సత్యాగ్రహులను తయారు చేసి సిద్ధంగా ఉంచింది .మైనేనివారిపాలెం కూడా సత్యాగ్రహ నినాదాలతోమారుమోగిపోయింది .కొత్తపల్లి వేంకట కృష్ణ వర్మ ,యలమంచిలి వెంకటప్పయ్య గార్లు ఉద్యమంలో కొత్త ఊపు తెచ్చారు .వారిని మించిన ఉత్సాహ ఉద్రేకాలతో బసవపూర్ణ మ్మాదేవి ,యలమంచిలి బసవాయమ్మా దేవి ,కుమారి సరళకుమారి వంటి బాలికలు కూడా ధైర్యంగా ఉత్సాహంగా శాసనోల్లంఘనలు చేశారు .గరిమెళ్ల, దుగ్గిరాల వారి ప్రబోధ గీతాలు పాడుతూ ప్రజలలో జాతీయ చైతన్యం కల్పించారు .’’దండాలు దండాలు భరతమాత – అవి అందుకొని దీవించు భరతమాత ‘’ముప్ఫై కొట్లామంది రాం భజన –పంజర బంధమైనారు రాం భజన –బంధాలు తెంపుకొని రాం భజన –అవతలపడాలి రాం భజన –గాంధీ మంత్రమదేను రాం భజన – స్వరాజ్యమంత్రం రాం భజన –ఒక్కటే మంత్రం రాం భజన ‘’గీతాలుపాడుతూ విదేశీ వస్త్ర దుకాణాలవద్ద కల్లు సారాయి అంగళ్ళ వద్ద కరపత్రాలు పంచుతూ పెద్దపెద్ద ఊరేగింపులు చేస్తూ శాసన ధిక్కారం చేశారు బసవపూర్ణ మ్మా దేవి బృందం .16-1-1932 న ఈమెనూ, యలమంచిలి బసవాయమ్మను ,కుమారి సరళకుమారినీ అరెస్ట్ చేసి ప్రభుత్వం రేపల్లె తాలూకా జైలులో మూడు రోజులు ఉంచి ,విచారణ జరిపి ఆరునెలలు శిక్షవేసి సిక్లాస్ ఖైదీగా రాయవెల్లూరు పంపారు .

అయిదేళ్ళ యేకైకసంతానం ఆడపిల్లస్వరాజ్య లక్ష్మి తల్లితో జైలుకు వెడతానని పట్టుబట్టింది .తల్లి తీసుకు వెళ్ళటానికే , నిశ్చయించు కోగా అంతమంది పోలీసులమధ్య జైలులో ఉన్న తల్లి బసవాపూర్ణమ్మా దేవిని చూసి కూతురు తట్టుకోలేక విపరీతంగా ఏడుస్తూ అమ్మమ్మ చంకనెక్కి హత్తుకు పోయింది. ఈదృశ్యం చూసి అక్కడ కన్నీరు కార్చని వారు లేరు .అప్పుడు రాయవెల్లూరు జైలులో బసవపూర్ణా దేవితోపాటు బెన్నూరి కృష్ణ వేణమ్మ ,తట్టా నరసమ్మ ,సూర్యదేవర రాజ్య లక్ష్మి ,భారతీ రంగా మొదలైన నారీ శిరోమణులున్నారు .రాయవెల్లూరు జైల్లో జన సమ్మర్దం ఎక్కువగా ఉండగా రాజ్యలక్ష్మి బసవపూర్ణమ్మ మొదలైన కొందర్ని కేరళలోని మలబారులోఉన్న కన్ననూరు జైలుకు బదిలీ చేశారు .అక్కడ ఉప్పుడు బియ్యం అన్నమే గతి .వంటనూనె గా కొబ్బరి నూనె వాడేవారు .పచ్చికొబ్బరి పనస ముక్కలు తరచుగా పెట్టేవారు .ఈ భోజనానికి ఆరోగ్యం దెబ్బతిని రక్త విరేచనాలు పట్టుకొని బాధపడుతూ ఆమూడునెలలు ఆస్పత్రి లోనే గడిపింది .

శిక్ష పూర్తి అయి విడుదలయ్యాక బసవపూర్ణమ్మ ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనలేదు .దృష్టిని మహిళాభ్యుదయం వైపు మళ్ళించింది .స్త్రీల అన్ని అనర్ధాలకు ముఖ్యకారణం విద్యాహీనత ,ఆర్ధిక పరాధీనత అని పూర్తిగా అర్ధం చేసుకొని ,తనకూతుర్ను చదివించి రేపల్లె తాలూకా మొత్తం మీద మొట్టమొదటి పట్టభద్రు రాలిని గా చేసి, రికార్డ్ స్థాపించ గలిగింది .ఉద్యోగంలో రెండేళ్లు స్థిరపడ్డాకమాత్రమే కూతురు వివాహం చేసింది .ఆమెకు గొప్పసన్నిహితులు, ఆదర్శం కొండా పార్వతీదేవి, భారతీరంగా, తుమ్మల దుర్గాంబ లు .అనేక మహిళా సభలకు హాజరౌతూ ,గుంటూరు జిల్లా మహిళా సంఘానికి అనుబంధంగా ‘’రేపల్లె తాలూకా మహిళాసంఘం’’ స్థాపించి,కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ నూతనభవనాలు నిర్మించింది .మహిళాసభలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ పెద్దల ఆశీస్సులు ప్రోత్సాహం పొందింది .కావూరు వినయాశ్రమానికి తరచుగా వెడుతూ ఉండేది .కొంతకాలం రేపల్లె బెంచి మేజిష్ట్రేట్ గా పని చేసింది .రాట్నం వడకటం ఖద్దరు బట్టలు కట్టటం మాననే లేదు.రాట్నం రాణి గా పేరు పొందింది . గాంధీజీ సిద్ధాంతాల మీదా , కాంగ్రెస్ సంస్థ పైన అపార నమ్మకం ఉంది ఆమెకు.

స్వగ్రామం మైనేని వారి పాలెం లో శ్రీ దత్తాత్రేయస్వామి దీవాలయ నిర్మాణం కోసం స్వంతస్థలం, వెయ్యి రూపాయలు కానుకగా ఇచ్చి సహకరించింది . .1958లో ఆమెకు రాజకీయ ఖైదీగా ప్రభుత్వం కొంతభూమి ఇచ్చినా, ఆమెకు అది అందకపోవటం శోచనీయం .తామ్రపత్రం మాత్రం ఇచ్చి సరిపెట్టారు.వృద్ధాప్యాన్ని అతి నిబ్బరంగా గడిపింది నాట్న రాణి శ్రీమతి మైనేని బసవపూర్ణా దేవి .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.