‘’శంకర ‘’నారాయణీయం
శ్రీ శంకర వెంకట నారాయణ రావు గారు పగోజి ఆచంట నుంచి పంపిన ‘’ఎవరికెవరు “”కథా సంపుటి ,హైకూ భావనలు అనే రెండు పుస్తకాలు నిన్న సాయంత్రం అంది ,ఫోన్ చేసి చెప్పి ,నేనెలా తెలుసు అని అడిగితె రమ్యభారతి ద్వారా అని చెప్పి తాను ఏడాదిక్రితం ఒక పుస్తకం పంపానని చెప్పగా అది చదివిన గుర్తు లేదు .పుస్తకం రాగానే చదివి స్పందించే నేను దానిపై ఎందుకు రాయలేదో తెలీదు . నిరుడు బహుశా చాలాపుస్తకాలు లైబ్రరీకి ఇచ్చాను .అందులో ఉండి ఉండచ్చు అని పించింది .కనుక ఈ సారి అలా జరగరాదని ,ఇవాళ మధ్యాహ్నం వెంటనే చదివేసి స్పందిస్తున్నాను .
1-ఎవరికెవరు ?
ఈ కథా సంపుటిలో పది కథలున్నాయి .ముచ్చటగా ఉన్నాయి .మొదటికథ ‘’రాజీ ‘’మొదటివాక్యం ‘’చైతన్య ఎక్వేరియం లో చేపపిల్లలా కదలకుండా ఉన్నాడు ‘’అద్భుతం అనిపించింది .రాజీ పడటం ప్రారంభమైతే ,జీవితాంతం తప్పదు అనే సందేశం .అడ్డంకులు కలిగినా ,కల్పించినా చివరికి ‘’లవ్మారేజ్’’ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు గ్రే హేయిర్స్ .డబ్బు ముందు రక్త సంబంధం ఓడిపోవటం కథనమే ‘’ఎవరికెవరు ?’వంటరాదని చెప్పిన పిల్ల అన్నీ మహా రుచిగా స్వయంగా తయారు చేసి ‘’హబ్బీ’’కి ఆనందం కలిగిస్తుంది మరో కతలో. సరాగాల మురిపాలు ఇందులో బాగున్నాయి .స్నేహితుడి కొడుకులు మాస్టార్ని నిండా ముంచేసి ,చావుకు కారణమై,అంతిమ సంస్కారంలో ‘’మంటలలో నైతిక విలువలు చిటపట లాడాయి’’ .అని నిట్టూరుస్తాం .రేపటి వృద్ధులు ఇవాళే కళ్ళు తెరవాలి అనే సందేశమే ‘’నేను సైతం ‘’.సరదా అయిన ఆధునిక భేతాళ ప్రశ్న కు జవాబే ‘’జిజ్ఞాస ‘’.మంచి మనసున్న వారంతా ప్రాణ దాతలే అయితే అభాగ్యుల కన్నీరు కారదు .ఇంకెప్పుడూ ఇలా జరగదన్న ప్రామిస్ తో ప్రేమికులపెళ్ళి గ్రహణం వీడిపోతుంది. పెంచిన మేకనే కత్తికి ఎరవేసి పండుగ నాడు వండుకు తిని సంబరాలు చేసుకోవటంచూస్తూనే ఉన్నాం..కనుక గొర్రెలేకాదు మేకలూ మనుష్యుల్ని నమ్మి బలౌతాయి .
ఈకథలు అన్నీ రమ్యభారతి వంటి పత్రికలలో ప్రచురితాలే .ప్రముఖుల ప్రశంసలు అందుకొన్నవే .సరదాగా సూటిగా మోతాదు మించని హాస్యంతో ,సామాజిక స్పృహతో ఉన్నాయి.రచయిత పరిచయం ,లబ్ధ ప్రతిష్టులైన సాహితీ ప్రముఖుల అభిప్రాయాలు సంపుటి చివరలో మెండుగా ‘’నిండుగా ‘’ఉన్నాయి .
2-హైకూ భావనలు
2006లో కవి గారు రాసి ప్రచురించిన 108 హైకూల సంపుటిఇది .కవి చెయ్యితిరిగిన హైకూ మాస్టర్ అనిపిస్తాడు .నాకు నచ్చిన ‘’హైకూపూలు’’ మీకోసం.’’వదలలేక -నిలుచుంది –ఆకు కొనపై నీటి బొట్టు’’ . ‘’మంచు తెర-ధ్యానముద్రలో –చెట్లు ‘’పలకరింపుగా –గొళ్ళెం తడుతోంది –గాలి ‘’.’’నేతన్న వెళ్ళి –రైతన్నతో –మొరబెట్టుకొన్నాడు ‘’.అంటే జోగీ జోగీ రాసు కొంటె రాలేది బూడిదే .’’జాతర –వణికి చచ్చింది –కోడి ‘’,దీపం -కొండెక్కింది-తడుములాట ‘’హైహైభజనం అన్నమాట .వేగం –వెర్రి ఎప్పుడు కుదురుతుందో ‘’ చచ్చాక అని భావం ..మనం వేయక పోయినా పడేవి- వోట్లు ‘’సామాజిక దృక్కోణం .’’తోక ఊపుతుంది –గాలిపటం –ఏం వయ్యారం ‘’అనేది’’పదపదవే వయ్యారి గాలిపటమా-పైన పక్షిలాగ ఎగిరిపోయి – పక్క చూపు చూసుకొంటూ –తిరిగెదవే గాలిపటమా ‘’ అనే కులదైవం సినిమాలో పెండ్యాల స్వరపరచగా జూనియర్ సముద్రాల రాయగా ఘంటసాల మాస్టారు పాడిన పాట గుర్తుకొస్తుంది .చివరి హైకు ‘’కర స్పర్శతో –హృదయం విప్పుతుంది –పుస్తకం ‘’అని చదివి మనం మాత్రం ఈపుస్తకం మూసేస్తాం .
మంచి గెటప్ ,అర్ధవంతమైన ముఖ చిత్రాలు స్కాలిత్యరహిత ముద్రణ తో పుస్తకాలు రెండు రమణీయంగా ఉన్నాయి .ఈ రెంటిలో శంకర వేంకట నారాయణ రావు గారి ప్రతిభ జ్యోతకమై ‘’శంకర ‘’నారాయణీయం ‘’అని పిస్తుంది .దాదాపు యాభై అరవై ఏళ్ళ క్రితం శంకర నారాయణ ఇంగ్లిష్ -తెలుగు డిక్షనరి ప్రతి ఇంట్లో ఉండే విషయం గుర్తుకొచ్చింది .మరింత సాహిత్య వ్యాసంగంతో శంకర గారు ,పాఠకజన ‘’వశంకరులు ‘’కావాలని కోరుతున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-5-24-ఉయ్యూరు .

