పేదల పాలిట పెన్నిధి ,ప్రముఖ వైద్యుడు ,శాసన సభ్యుడు ‘’దీన బంధు ‘’-శ్రీ చెన్న కేశవుల రంగా రావు
ప గొ జి తాడేపల్లి గూడెం దగ్గర పెంటపాడు లో శ్రీ చెన్న కేశవుల రంగా రావు 9-8-1911న సామాన్య రైతు కుటుంబం లో వేంకట స్వామి ,మాణిక్యాంబ దంపతులకు జన్మించారు .స్కూల్ ఫైనల్ వరకు స్వగ్రామం లోనే చదివి పాసై ,ఇంటర్ రాజమండ్రి గవర్నమెంట్ కాలేజి లో చదివి ఉత్తీర్ణుడై విశాఖ ఆంధ్రా యూని వర్సిటి లో చదివి ఫస్ట్ క్లాస్ లో పాసై జయపూర్ మహారాజా గోల్డ్ మెడల్ అందుకొన్నారు .
1939లో 28వ ఏట ఏలూరులో డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు .పేద ప్రజలకు ఉచిత వైద్యం చేస్తూ ప్రజాభిమానం చూరగొని పేదల పాలిటి పెన్నిధి అయ్యారు రంగారావు .ఏలూరులో’’ చెన్నకేశవ ఎలెక్ట్రికల్స్ ‘’పరి శ్రమ నెలకొల్పి పారిశ్రామికంగా ఏలూరుకు ప్రాముఖ్యత తెచ్చారు .ఏలూరు కొ ఆపరేటివ్ సొసైటీ స్థాపించి ,డైరెక్టర్ గా చైర్మన్ గా సేవ లందించారు .1972 నుండి 76 వరకు ఆలిండియా మెడికల్ అసోసియేషన్ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు గా ఉన్నారు .ఆలిండియ మెడికల్ అసోసియేషన్ సభలలో ఆంధ్రుల తరఫున ప్రతినిధిగా ఉన్నారు .
శ్రీ నందమూరి తారకరామారావు ఒత్తిడితో రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు దేశం పార్టి తరఫున 1983 లో శాసన సభల ఎన్నికలలో ఏలూరు నియోజక వర్గ ప్రతినిధిగాపోటీ చేసి గెలుపొంది శాసనసభ్యులయ్యారు .ఏలూరు నియోజక వర్గ అభి వృద్ధికి విస్తృత సేవలందించారు .హిందీ భాషాభి వృద్ధికి గొప్ప సేవ చేశారు .నిరు పేదలకు డాక్టర్ రంగారావు గారు అందిస్తున్న విశేష కృషిని గమనించి ‘’హిందీ విద్యార్ధి సంస్కృత సమ్మేళన్ ‘’వారు 1970లో రంగారావు గారికి ‘’దీన బంధు ‘’పురస్కారం అందించి గౌరవించి సన్మానించారు .1975లో ఏలూరు రోటరీ క్లబ్ , 1977లో జేసి క్లబ్ సంస్థలు రావు గారిని ఘనం గా సన్మానించాయి .నిస్వార్ధ ప్రజా సేవకులు పేదలపాలిటి పెన్నిధి డా.చెన్న కేశవుల రంగారావు గారు 11-2-1999 న 84 వ ఏట ఈ వైద్య నారాయణుడు నారాయణ పరమ సన్నిధానం చేరారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-24-ఉయ్యూరు .

